సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కర్మఫలాన్ని కాలరాసే కరుణామయుడు


చేతులు జోడించి, మీ దివ్య చరణాలపై నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను బాబా. నాకు ఎల్లవేళలా తోడుగా ఉండి, ఎప్పటికప్పుడు రక్షణనిస్తున్న మీకు నా మనఃపూర్వకమైన కృతజ్ఞతా సుమాంజలి. సాయిబంధువులందరికీ నమస్కారం.

నా పేరు నిడిగొండ జనార్దన్ సులోచనాబాయి. మాది యాదగిరిగుట్ట దగ్గర రాజపేట్. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను ప్రతిరోజూ హారతులకు హాజరవుతూ ఉంటాను. బాబా దయవలన నాకు ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రాలేదు. ఇది కేవలం నాపైన, నా కుటుంబంపైన ఉన్న "సాయి కృప” మాత్రమే. ఇప్పుడు నేను నా భార్యకు జరిగిన ఒక అనుభవాన్ని "సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు" ద్వారా సాయిబంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను.

ఈమధ్యనే, అనగా 2017 జనవరి నెలలో హఠాత్తుగా నా భార్య అనారోగ్యానికి గురైంది. హాస్పిటల్ లో అడ్మిట్ చేసాము. వారం రోజులయినా షుగర్ తగ్గట్లేదు. షుగర్ "480" చూపిస్తుండేది. డాక్టర్లు, "ఏమి చేసినా షుగర్ కంట్రోల్ కావట్లేదు, రోజుకు మూడు ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు" అన్నారు. నేను బాబా దగ్గరికి వెళ్లి హారతి సమయంలో, "బాబా! నాకు ఇంజక్షన్లు ఇవ్వడం రాదు. డాక్టర్లేమో నా భార్యకు మూడుపూటలా ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇవ్వాలంటున్నారు. ఈ వయసులో నా భార్య హాస్పిటల్లో ఉండి బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఏంచేస్తావో ఏమో నాకు తెలియదు. నువ్వే తన సంగతి చూసుకోవాలి" అని మనస్ఫూర్తిగా నా మనసులోని బాధను ఆ సాయీశ్వరుడికి చెప్పుకున్నాను. ఆరోజు రాత్రి తెల్లవారుఝామున నాకు ఒక స్వప్నం వచ్చింది. కాషాయవస్త్రాలు ధరించి, భుజముకు జోలెతో, చేతిలో సటకాతో బాబా నా దగ్గరకు వచ్చారు. నేను బాబాకు నమస్కారం చేశాను. అప్పుడు బాబా, “ఏమీ బాధపడకు! నీ భార్యకు ఏమీ కాదు. తను కర్మఫలం అనుభవిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. నేనున్నాను కదా! దిగులుపడకు” అని చెప్పి మాయమయ్యారు. వెంటనే నాకు మెలకువ వచ్చింది.

తెల్లవారిన తరువాత బాబాను స్మరించుకుంటూ హాస్పిటల్ కు వెళ్ళాను. ఆశ్చర్యం ఏమిటంటే, నా భార్య షుగర్ 480 నుండి 180కు వచ్చేసింది. "ఇది ఎలా సాధ్యం? ఒక్కరోజులో ఇది ఎలా జరిగింది?" అని డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇన్సులిన్ ఇంజక్షన్ అవసరం లేకుండా నా భార్య సంతోషంగా, ఆరోగ్యంగా ఉంది. ఈ వయసులో ఆరోగ్యం కన్నా ఇంకేం కావాలి? అంతా ఆయన "కృప".

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo