సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

15 నెలల చిన్నారిపై బాబా అనుగ్రహం


బాబా భక్తురాలు సంజీవని డోంగ్రే చౌహాన్ గారు తనకి బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం.
ముందుగా నా సాయికి కృతజ్ఞతలు. పిలచినంతనే పలికే మన సాయి తనపై నాకున్న నమ్మకాన్ని రోజురోజుకీ రెట్టింపు చేస్తున్నారు. నేను అసలు మహాపారాయణ యాత్ర చేయగలనా, లేదా అని అనుకునేదాన్ని. ఎందుకంటే మాకు సాయి దీవెనలతో పుట్టిన 15 నెలల బాబు ఉన్నాడు. బాబు నాకు సాయి ఇచ్చిన అమూల్యమైన కానుక.

మేము విదేశాలలో నివసిస్తూ ఉండటం వలన అక్కడ నాకు సహాయం చేసే వారు ఎవరూ లేరు. రోజంతా అన్ని పనులూ నేను ఒక్కదాన్నే చూసుకోవాలి. అందుకే నేను మహాపారాయణ గ్రూపులో చేరడానికి చాలా ఆలోచించాను. కానీ, పారాయణ చేయడానికి బాబా నాకు ధైర్యం ఇచ్చారు. ప్రతివారం నాకు ఇచ్చిన అధ్యాయాలు నిర్ణయించిన సమయంలో చదివేదాన్ని. మా బాబుని కూడా నాతో కూర్చోపెట్టుకొని తనని కూడా పారాయణలో భాగస్వామి అయ్యేలా నేను ప్రయత్నం చేసేదాన్ని. వాడు అప్పటికే, “బాబా, బాబా” అని ముద్దుగా పలుకుతూ ఉండేవాడు. అంతేకాకుండా, ఇంట్లో ఎక్కడ సాయి ఫోటో చూసినా తన రెండు చేతులు జోడించి “జై!” అని పలుకుతూ ఉండేవాడు.

ఒక వారం మహాపారాయణ చేసే సమయంలో సాయి నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చారు. ఆరోజు నాకు సాయి మహాసమాధి చెందే అధ్యాయాలు ఇచ్చారు. నేను పారాయణ మొదలుపెట్టే సమయానికి మా బాబు పడుకొని ఉన్నాడు. చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నాడు. కాబట్టి నేను బాబు పక్కన కూర్చొని, తన చేయి పట్టుకొని చదవడం ప్రారంభించాను. సాయి మహాసమాధి చెందిన అధ్యాయాలు కదా, చదివేటప్పుడు నా మనసు చాలా భారంగా అయిపోయింది. అంతలో అకస్మాత్తుగా బాబు “బాబా, బాబా” అంటూ ఏడుస్తూ లేచాడు. నేను ఉలిక్కి పడ్డాను. ఎంత ఆశ్చర్యం! నా బాబుకి నేను చదువుతున్నది అర్థం అవుతుంది. హాయిగా నిద్రపోతున్న వాడు 'బాబా, బాబా' అని ఏడుస్తూ లేచాడంటే, సాయి దేహత్యాగం చేసిన ఆ కథ వాడికి బాధ కలిగించిందన్న మాట. నిద్రావస్థలో కూడా బాబా ప్రేమని పొందుతున్నాడు వాడు. ఎంతటి అదృష్టం నా బాబుని బాబా అంతలా అనుగ్రహిస్తున్నారు. బాబా మీకు నా కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ వాడిపై ఇలాగే మీ చల్లని ప్రేమను కురిపిస్తూ ఉండండి. అంత చిన్న వయస్సు నుండే వాడిలో బాబాపై అంత ఇష్టం ఏర్పడుతూ ఉంటే ఒక తల్లిగా నాకు అంతకంటే ఏమి కావాలి.

“విశ్వాసం మరియు సహనం కలిగి ఉండండి. అంతా బాబా చూసుకుంటారు”. కష్ట సమయాల్లో నాకు నేను ఈ మాటలే చెప్పుకుంటూ ఉంటాను. సాయి దీవెనలు సదా అద్భుతాలు చేసి చూపిస్తాయి సాయి భక్తులకు.

ఓం సాయిరాం!!!

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo