సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తాత్యాకోతేపాటిల్ - మొదటి భాగం...



శ్రీసాయిబాబా చరిత్రలో శిరిడీ నివాసి శ్రీతాత్యాకోతేపాటిల్ స్థానం ప్రత్యేకమైనది. తాత్యా బాబాకు ప్రియభక్తుడు. అతనికి బాబాతో ప్రత్యేక అనుబంధముండేది. తాత్యా సుమారు ఏడేళ్ల వయస్సు నుండి బాబా సంరక్షణలో పెరిగాడు. చాలామంది భక్తులు బాబా మహిమను, వారిచ్చే కానుకలను ఆశించే బాబా వైపు ఆకర్షితులయ్యారు. కానీ తాత్యా, అతని కుటుంబం మాత్రం బాబా మహిమతో సంబంధం లేకుండా, వారినుండి దేనినీ ఆశించక, బాబాను బాబాగా ప్రేమించి, మమతానుబంధంతో తమను తాము బాబాతో ముడివేసుకున్నారు.
లోకకళ్యాణార్థం శ్రీసాయిబాబా శిరిడీలో ప్రకటమైన తొలినాళ్ళలో ఆ గ్రామ ప్రజలకు శ్రీసాయి అంటే ఒక పిచ్చి ఫకీరు, ఒక సామాన్య భిక్షకుడు మాత్రమే. శ్రీసాయి మహిమ ఏ మాత్రం ప్రకటంకాని ఆ రోజులలోనే ఒకనాడు శ్రీగణపతికోతేపాటిల్ తన భార్య శ్రీమతి బయజాబాయితో కలిసి మొదటిసారి బాబా వద్దకు వెళ్లారు. వారిని చూస్తూనే బాబా తమ ఆసనం నుండి లేచి నిలబడి వారిని సాదరంగా ఆహ్వానించి, శ్రీమతి బయజాబాయితో, “అమ్మా! నీవు నిజంగా నా సోదరివి” అని అన్నారు. ఆమెకి గూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తిశ్రద్ధలు కలిగి, బాబాకు భిక్ష పెట్టకుండా తాను భోజనం చేయకూడదని నిశ్చయించుకుంది. తనకై తాను పెట్టుకున్న ఆ నియమానికి కట్టుబడి ఆమె తాను చేసిన వంటకాలన్నీ ఒక గంపలో పెట్టుకొని, దానిని తలకెత్తుకొని, తన ఒక్కగానొక్క సంతానమైన తాత్యాను వెంటబెట్టుకొని, సమీప చిట్టడవుల్లో సంచరిస్తున్న బాబాను గాలించి పట్టుకొని, ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చొని వుంటే వారి ముందు ఆకు వేసి భోజనం వడ్డించి, కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. బాబా భోజనం చేసిన తరువాతే ఇంటికి తిరిగి వచ్చి తాను భోజనం చేసేది. తొలిరోజుల్లో బాబా భిక్షకోసం గ్రామంలోకి పది పదిహేనుసార్లు వెళ్లేవారు. బయజాబాయి ఏనాడూ ఆయనను వట్టిచేతులతో వెనక్కి త్రిప్పిపంపేది కాదు. సహజంగానే ఆ భక్తి యొక్క ఫలాలను ఆమె, ఆమె కుటుంబం అందుకుంది. ప్రత్యేకించి తాత్యా ఎంతో లబ్దిపొందాడు. బయజాబాయి సేవను బాబా ఎన్నడూ మరువక ఆమె బిడ్డడైన తాత్యాను తమ సొంత మేనల్లుడిలా ఎంతో ప్రేమగా చూసుకొనేవారు. చిన్నపిల్లవాడైన తాత్యా బాబాను 'మామా' అని పిలిచేవాడు. బాబా అతనిని ప్రేమగా ‘తాత్యా’ అనీ, ‘కోత్యా’ అనీ, ‘గుఱ్ఱంముఖంవాడా’ అనీ పిలిచేవారు.

శ్రీసాయి శిరిడీలో అడుగుపెట్టేనాటికి ఆరేడేళ్ల వయస్సున్న తాత్యా మొదట మారుతి మందిరంలో, ఆ తరువాత గుఱ్ఱాలశాలలోని ప్రభుత్వ మరాఠీ పాఠశాలలో చదువుతుండేవాడు. శ్రీమాధవరావు దేశ్‌పాండే(షామా) ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండేవాడు. తాత్యాకు, రఘుపాటిల్‌కు మంచి స్నేహం. ఇద్దరూ కలిసి రోజూ పాఠశాలకు వెళ్లి వస్తుండేవారు. వారివురు మరో ముగ్గురు, నలుగురు పిల్లలతో కలిసి పాఠశాల నుండి తిరిగి వచ్చేటప్పుడు మశీదు ముంగిట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారు. అప్పటికి బాబా వయస్సు సుమారు 18 లేక 19 సంవత్సరాలుండేవి. ఆయనకు సన్నని మీసముండేది. ఆయనెప్పుడూ మశీదులో ఒక స్తంభం ప్రక్కనే మౌనంగా కూర్చొని వుండేవారు. రఘుపాటిల్ రోజూ మశీదు గేటు వద్ద నిలచి ఆయనపై రాళ్ళు రువ్వేవాడు. ఒక్కొక్కప్పుడు బాబా వాళ్ళని తిట్టేవారు. వాళ్ళు పెద్దగా నవ్వి, బాబా సట్కా చేతిలోకి తీసుకోగానే పరిగెత్తేవాళ్ళు. తరువాత తాత్యా మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్ళేవాడు.

తాత్యా భోజనానికి కూర్చొనే సమయానికి బాబా బయజాబాయి ఇంటికి వచ్చి, "ఆబాదే ఆబాద్, బయజామామీ, రోటీ లావ్!" అని కేకవేసేవారు. బాబా కేక వినగానే ఆ తల్లి పనులన్నీ ఆపివేసి, ఆయనను లోపలికి రమ్మని సాదరంగా ఆహ్వానించేది. కానీ బాబా ఎన్నడూ వారి ఇంటిలోకి అడుగుపెట్టేవారు కాదు. ఎప్పుడైనా వారి ఇంటి గుమ్మం ముందున్న పంచలో మాత్రం కూర్చునేవారు. బయజాబాయి లోపలకి వెళ్లి, తాజాగా భాక్రీ(రొట్టె), కూర తయారుచేసి బాబాకి సమర్పించి ఆయన ఎదుటనే కూర్చునేది. బాబా ఆమె ప్రేమకి మరియు భక్తికి ఎంతో ఆనందించేవారు. అప్పుడు 7, 8 సంవత్సరాల వయస్సు గల తాత్యా ఎంతో చనువుగా బాబా భుజాలపైన ఎక్కడమో, ఆయన ఒడిలో పొర్లడమో చేసేవాడు. బాబా చిరునవ్వుతో తాత్యాకు నచ్చినట్లు చేయనిచ్చేవారు. తాత్యా ప్రవర్తనతో బాబాకు ఇబ్బంది కలుగుతుందేమోననే భావనతో బయజాబాయి ఎప్పుడైనా తాత్యాను కసిరినా, ఆమె ముఖంలో ఏ మాత్రం చికాకు వ్యక్తమైనా బాబా ఆమెతో, “ఎందుకమ్మా వాణ్ణి కోప్పడతావు? వాడి ఇష్టం వచ్చినట్లు వాణ్ణి చేయనివ్వు” అని అనేవారు. బాబా మశీదులో 2, 3 సంవత్సరాలు నివసించాక లెండీ మరియు శిర అను ఉపనదుల మధ్యనున్న చెట్లతోపులో సుమారు 2 సంవత్సరాల 6 మాసాలు వున్నారు. ఆ సమయంలో భక్తులలో ఎవరో ఒకరు నిత్యమూ ఆయనకు భిక్ష ఇచ్చేవారు. తాత్యా, రఘుపాటిల్ మరిద్దరి ముగ్గురితో కలసి బాబాను అక్కడ దర్శించేవాళ్ళు. అప్పటికి వాళ్ళు తమ పిల్లచేష్టలు మానుకున్నారు. ఆ రోజులలో నీంగాఁవ్ వాస్తవ్యులైన నానాసాహెబ్ డేంగ్లే, ఇంకా చాలామంది గ్రామస్థులు కూడా బాబా దర్శనానికి అక్కడికి వస్తుండేవారు. తొలిరోజుల్లో శిరిడీలో కొంతకాలమున్న దేవీదాసు అనే సత్పురుషుని తాత్యా తన గురువుగా భావించేవాడు.

తాత్యాకు 17, 18 సంవత్సరాల వయస్సున్నప్పుడు గంగగిర్ మహరాజ్ అనే సత్పురుషుడు నామసప్తాహం చేయాలనే తలంపుతో శిరిడీ వచ్చారు. అయితే, ఎవరో కొద్దిమంది తప్ప శిరిడీ గ్రామస్థులెవ్వరూ ఆ నామసప్తాహంలో పాల్గొనలేదు. గ్రామస్థుల ప్రవర్తన గంగగిర్ మహరాజ్‌కి కోపం తెప్పించింది. తరువాత ఆయన మసీదుకు వెళ్లి బాబాను దర్శించుకుని, "ఈయన ఒక అమూల్యమైన రత్నం. నేను చెప్పే మాటలు గుర్తుంచుకోండి! ఈయన శిరిడీ రూపురేఖలనే మార్చేస్తారు!" అని చెప్పి శిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. తాత్యా ఎంతో బాధపడి వారిననుసరిస్తూ రూయీ గ్రామానికి వెళ్లి, "గ్రామస్థులను క్షమించి తిరిగి శిరిడీ వచ్చి నామసప్తాహం నిర్వహించమ"ని గంగగిర్ మహరాజ్‌ను అర్థించాడు. అందుకు గంగగిర్ మహరాజ్ ‘తాము శిరిడీ రాము’ అని స్పష్టంగా చెప్పేశారు. కానీ తాత్యా తన పట్టు విడవలేదు. అతను క్రమం తప్పకుండా గంగగిర్ మహరాజ్‌ను దర్శిస్తూ, తన అభ్యర్థనను అంగీకరించేలా చేయమని వారి శిష్యులతో చెప్తుండేవాడు. చివరికి తాత్యా ఒకసారి గంగగర్ మహరాజ్‌ను, అతని శిష్యులను శిరిడీ వచ్చి నామసప్తాహం చేయమని అభ్యర్థించి, తన వద్ద 7 బస్తాల గోధుమలు ఉన్నాయనీ, వారిని ఏ లోటూ లేకుండా వారంరోజులూ సేవించుకుంటాననీ చెప్పినప్పుడు, గంగగిర్ మహరాజ్‌ శిరిడీ రావడానికి అంగీకరించారు. తాత్యా తన తండ్రిని నామసప్తాహానికి తీసుకొని వెళ్లి, సప్తాహం జరిగే వారంరోజులూ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. నామసప్తాహం బాగా జరిగింది. గ్రామస్థులు కూడా తమ తప్పు తెలుసుకొని పద్నాలుగు వందల రూపాయలు సేకరించి తాత్యాకు ఇచ్చారు. నామసప్తాహం పూర్తయిన తర్వాత కూడా గంగగిర్ మహరాజ్‌ ఎక్కడికి వెళ్లినా తాత్యా కూడా ఆయనతోపాటు వెళ్తుండేవాడు. సమీప గ్రామాలలో అనేక నామసప్తాహాలకు హాజరైన తరువాత, దసరా రోజుల్లో తాత్యా శిరిడీ తిరిగి వచ్చి, నేరుగా బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్లాడు. బాబాను దర్శించి నామసప్తాహాల గురించి ఎంతో సంతోషంగా బాబాకు తెలియజేశాడు. అది విన్న బాబా కూడా చాలా సంతోషించారు. ఆరోజునుండి తాత్యా తరచూ మశీదుకు వెళ్ళనారంభించాడు. బాబా అతనిని ఎంతగానో ఆదరించేవారు. క్రమంగా వారివురి మధ్య అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది.
సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
సాయిలీల మ్యాగజైన్ అక్టోబర్, 1960 సంచిక,
Ambrosia in Shirdi & Baba's Gurukul by విన్నీ చిట్లూరి,
Ref : శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ.

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

7 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH

    Om Sai Ram

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😊🌸😃🌼🤗🌺😀🌹🥰

    ReplyDelete
  4. Very nice story❤❤❤

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo