సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తాత్యాకోతేపాటిల్ - రెండవ భాగం..



బాబా ప్రేమ భక్తులందరిపై సమంగా వర్షించినప్పటికీ తాత్యాపై ఆయన చూపిన ప్రేమ మాత్రం అత్యంత ప్రత్యేకమైనదనే చెప్పాలి. ప్రతిరోజూ తాత్యా మశీదుకి వెళ్లినప్పుడు ఆ మేనమామ, మేనల్లుళ్ళ మధ్య చోటుచేసుకొనే ప్రేమపూర్వకమైన సన్నివేశాలు చూడముచ్చటగానూ, వారిమధ్య జరిగే సంభాషణలు బహు శ్రావ్యంగానూ ఉండేవి.

కొన్నిసార్లు బాబా తాత్యాతో సరదాగా కుస్తీ పట్టేవారు, హాస్యమాడేవారు, ఒక్కోసారి అతని చేతులు నొక్కేవారు. బదులుగా అతనలా చేస్తే బాబా, "నువ్వు నా ఎముకలు విరిచేస్తావా?" అని అనేవారు. అలాగే, ఒక్కోసారి తాత్యా సరదాగా బాబా వేళ్ళు నొక్కేవాడు. అప్పుడు బాబా, "నువ్వు నా వేళ్ళు విరిచేస్తున్నావ్" అంటూ కేకలు వేసేవారు. తాత్యా మసీదులో సేదతీరడానికి కూర్చున్నప్పుడల్లా బాబా అతనిని సరదాగా ఆటపట్టించేవారు. బాబా ఒక్కోసారి వెనుకనుండి వచ్చి తాత్యా వీపుపై తట్టడమో, అతని కళ్ళను తమ చేతులతో మూయడమో చేసి, ఆపై మసీదులో ఓ మూలన దాక్కునేవారు. "ఎవరది? నన్ను తట్టిందెవరు?" అని తాత్యా అడుగుతుంటే, బాబా నవ్వుతూ బయటకు వచ్చేవారు. ఇలా బాబా అతనితో సరదాగా దాగుడుమూతలాడేవారు.

బాబా తరచూ తాత్యా పైపంచెను తీసి మసీదులోని గోధుమల బస్తా వెనుక దాచిపెట్టేవారు. తాత్యా తన పైపంచె కోసం వెతుకుతూ, "నా పైపంచె ఏది?" అని బాబాను అడిగితే, బాబా కోపాన్ని నటిస్తూ, "నాకేం తెలుసు? నేనేమైనా అందరి పైపంచెలు దొంగిలించేవాడినా?" అని అనేవారు. అయితే బాబా మాత్రమే తననలా ఆటపట్టిస్తారని తాత్యాకు తెలిసినందువల్ల తన మానాన తను తన పైపంచె కోసం వెతుక్కుంటున్నట్లు నటించేవాడు. బాబా కూడా ఏమీ ఎరగనట్లు దాన్ని వెతకడంలో అతనికి సహాయం చేస్తున్నట్టు నటించేవారు. కొంతసేపటికి ఆయనే ఆ పైపంచను బయటకు తీసి తాత్యాకు ఇచ్చేవారు. బాబా ఒక్కొక్కప్పుడు తాత్యా పైపంచెను తమ భుజాలపై వేసుకొని తాత్యాలా కూర్చోవడం వంటివి చేస్తూ అతని ప్రతి కదలికన అనుకరించేవారు.

తాత్యా చాలాసార్లు బాబా తలపైని వస్త్రాన్ని తీసేసి తన షిండేషి పగిడీ ఉంచేవాడు. ఆపై తన ఉత్తరీయాన్ని వారిపై కప్పి, అద్దం తెచ్చి ఇచ్చేవాడు. అప్పుడు బాబా అద్దంలో తమ రూపాన్ని చూసుకుంటూ భుజాలెగరేసి, కనుగుడ్లు మిటకరిస్తూ, ముఖకవళికలు పలురకాలుగా మార్చి నవ్వుతూ, "ఏం అద్దమా! నేను అచ్చం ఈ కోత్యాలా కనిపిస్తున్నాను కదూ? అతనిలాగే చేస్తుంటాడు కదూ?" ఆంటూ అద్దంతో మాట్లాడుతున్నట్లు అభినయించేవారు. తరువాత ఆ పగిడీ, ఉత్తరీయం, అద్దాలను తాత్యాకు ఇచ్చేసేవారు. ఇదంతా వారివురే మశీదులో ఉన్నప్పుడు జరిగేది.

ఒడ్డు, పొడుగు, బలిష్ఠమైన దేహసౌష్ఠవాన్ని కలిగివుండే తాత్యా ఒక్కోసారి తన చేతులను బాబా నడుము క్రిందగా ఉంచి ఒక్క చేత్తో ఆయన్ను తన భుజాలపైకెత్తుకొనేవాడు. అప్పుడు బాబా, "అరే, అరే, నేను పడిపోతాను, నేను పడిపోతాను. నీకు దెబ్బ తగులుతుంది" అని అనేవారు. అప్పుడు తాత్యా బాబాను క్రిందికి దించగా ఆయన నవ్వేవారు. ఒక హోలీ పండుగనాడు నందూమార్వాడీ దుకాణం దగ్గర నిలబడివున్న తాత్యా ఎంతో ఉల్లాసంగా ఉన్న బాబాను చూసి అమాంతంగా ఆయనను తన భుజాలపైకెత్తుకొని మసీదు వైపు అడుగులు వేయసాగాడు. బాబా దారిపొడవునా, "అరే తాత్యా! అరే కోత్యా! నన్ను క్రిందికి దించు. నీ కడుపు నొప్పి పెడుతుంది" అని అరుస్తున్నా తాత్యా పట్టించుకోకుండా బాబాను అలాగే మసీదు వరకు తీసుకొని వెళ్లి అక్కడ వారిని క్రిందికి దించాడు. అలా రెండుసార్లు చేశాక తన మొరటు పనివల్ల బాబాకు బాధకలుగుతుందేమోనని అలా చేయడం మానుకున్నాడు తాత్యా.

బాబా కొన్నిసార్లు తాత్యా ఎదుట తమ రెండు చేతులూ జోడించి, "జై దేవా! జై దేవా!" అనేవారు. బదులుగా తాత్యా, "సలామాలేకుం బాబా! సలామాలేకుం" అంటూ సలాం చేస్తున్నట్టుగా తన చేతులను నుదుటి వద్దకు తెచ్చేవాడు. బాబా కూడా తమ చేతిని నుదుటిపై ఉంచి, "సలామాలేకుం, సలామాలేకుం" అని అనేవారు. ఒకసారి మరీ విడ్డూరంగా బాబా అకస్మాత్తుగా లేచి, తాత్యా పాదాలను తాకారు. బాబా చర్యకు తాత్యా ఒక్కసారిగా నివ్వెరబోయి, బాబా చేతులు పట్టుకొని బాధగా, "బాబా! మీరేం చేస్తున్నారు? ఇదేమైనా బాగుందా?" అని అడిగాడు. అంతలోనే బాబా తమ చేతులు విడిపించుకొని మళ్ళీ తాత్యా పాదాలను తాకి నమస్కరించారు. తాత్యా ఎంతగానో బాధపడి, "బాబా! మీరెందుకిలా చేస్తున్నారు?" అని అడిగాడు. అందుకు బాబా, "నోర్ముయ్, నీకేం తెలుసు?" అని గద్దించారు.  ఆ చర్యలలోని మర్మమేమిటో బాబాకే ఎఱుక!

బాబా ప్రతిరోజూ పది, పదిహేను రూపాయలతో బర్ఫీ, పేడాలు, రేవడి, వేరుశెనగపప్పు, పంచదార బిళ్ళలు మొదలైన వాటిని దుకాణం నుండి కొని తెప్పించి తాత్యాతోపాటు భక్తులందరికీ పంచిపెట్టేవారు. అప్పుడప్పుడు వచ్చినవారందరికీ బాబా స్వయంగా వంటచేసేవారు. బజారు నుండి దినుసులు కొనుక్కొని రావటం, పొయ్యి వెలిగించి ఎసరు పెట్టడం, ఉప్పు, మిరియాలు వంటివి నూరడం మొదలైన పనులన్నీ ఆయన స్వయంగా చేసుకునేవారు. ఒక్కోసారి పరమాన్నము, ఒక్కోసారి మాంసపు పులావు వండేవారు. పులుసు కాచి, అందులో గోధుమ రొట్టెలు, మిరియాలపొడి వేసేవారు. తర్వాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు. ఉడుకుతున్న గుండిగలో చెయ్యిపెట్టి బాగా కలిపేవారు. అయినప్పటికీ ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేది కాదు. వంట పూర్తికాగానే భోజనపదార్థాలను మౌల్వీచేత నివేదన చేయించేవారు. మొదట కొంచెం మహల్సాపతికి, తాత్యాపాటిల్‌కి పంపి తర్వాత అందరికీ వడ్డన చేసేవారు.

ఒక్కోసారి బాబా, "వణీతేలీలు (నూనెవ్యాపారస్థులు) నన్నెంతో బాధిస్తున్నారు. నేనీ మశీదులో వుండను" అని చెప్పి అప్పటికప్పుడే అక్కడనుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యేవారు. అప్పుడు తాత్యా పరుగున వచ్చి, "నేను వాళ్ళను దండిస్తాను. ఇప్పుడు శాంతించండి, మరోరోజు వెళ్దాం" అని బుజ్జగించాకనే బాబా శాంతించేవారు. బాబా తాము ధరించే కఫ్నీని, తలగుడ్డని కొన్ని నెలలదాకా మార్చేవారుకాదు. ఆయన కఫ్నీ మార్చడం మరీ ఆలస్యమై, పాతది చిరిగిపోయేది. అయినప్పటికీ బాబా క్రొత్త కఫ్నీ వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముల్లును సూదిగా చేసుకొని, ఆ చిరుగులన్నింటికీ మాసికలు వేసుకునేవారు. అప్పుడు తాత్యా ఆయన దగ్గరజేరి, దానిని చూచే మిషమీద ఆ చిరుగులనింకా పెద్దవి చేసేవాడు. అప్పుడిక క్రొత్త కఫ్నీ వేసుకోక తప్పేదికాదు బాబాకు.

ఏ సత్పురుషుని హృదయంలో వాసుదేవుడు సదా వసిస్తాడో వారు ధన్యులు. వారి సహవాస సౌఖ్యాన్ని పొందిన భక్తులు అదృష్టవంతులు. తాత్యా, మహల్సాపతి అటువంటి మహాభాగ్యవంతులు. వీరిద్దరూ బాబాతో కలిసి మశీదులో శయనిస్తూ వారి సహచర్యాన్ని సమానంగా అనుభవించారు. బాబాకు వాళ్ళిద్దరిపై అనుపమానమైన ప్రేమ. వీరు ముగ్గురూ మశీదులో నేలపై పక్కలు పరచుకుని, తమ తలలను పడమర, దక్షిణ, ఉత్తర దిక్కులలో పెట్టుకొని, మధ్యన ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా పడుకుని సరదాగా పిచ్చాపాటీ మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటుండేవారు. వీరిలో ఎవరైనా నిద్రలోకి జారితే మిగిలిన ఇద్దరూ వారిని మేల్కొలిపేవారు. తాత్యాకు నిద్రతూగి గుఱ్ఱుపెడితే బాబా మహల్సాపతితో కలిసి తాత్యాను అటు ఇటు దొర్లించి, అతని తల, కాళ్ళు, వీపు గట్టిగా నొక్కేవారు. వేసవికాలంలో మసీదు లోపల చాలా వేడిగా ఉండేది. పైగా తాత్యా పడక ధునికి దగ్గరగా ఉండేది. సరదానిష్టపడే బాబా అర్థరాత్రి నిద్రలేచి తాత్యాపై ఒక దుప్పటి కప్పేవారు. దాంతో తాత్యాకు విపరీతంగా చెమటలు పట్టి, మెలకువ వచ్చి లేచి వెళ్లి మశీదు మెట్లపై కూర్చునేవాడు. కొన్నిసార్లు గాఢనిద్రలో ఉన్న తాత్యాను బాబా మరో దిక్కుకి తిప్పేవారు. మరికొన్నిసార్లు గాఢంగా నిద్రపోతున్న తాత్యాను మశీదు బయటకు నెట్టేసి అతనెలా స్పందిస్తాడోనని సరదాగా గమనిస్తూ ఉండేవారు బాబా. తాత్యాకి మెలకువ వచ్చాక ‘తనక్కడికి ఎలా వచ్చానా?’ అని ఆశ్చర్యపోయేవాడు. కొన్నిసార్లు, పగలంతా కష్టపడి పనిచేయడం వలన తాత్యాకు ఒళ్ళునొప్పులుగా వుంటుందని గమనించి, అతనికి నిద్రపట్టాక మహల్సాపతితో కలిసి బాబా అతని ఒళ్ళు, కాళ్ళు, చేతులు పిసికేవారు. అది అతనికెంతో బాధనిపించేది. ఒకసారి, ‘అలా చేస్తే నేను మశీదుకే రాన’ని బెదిరించి 10, 12 రోజులు మశీదుకు వెళ్ళలేదు తాత్యా. బాబా బాధపడి మశీదు ముందుగా దూరాన వెళుతున్న అతన్ని తన వద్దకు రమ్మని కేకవేసేవారు. అయితే తాత్యా మాత్రం ఆయనతో తనకెట్టి సంబంధమూ లేదని సైగలతో తెలుపుతూ వెళ్ళిపోయేవాడు. "బయజామాయి కొడుకువి గనుక బాబాకు నీపై ఎంతో ప్రేమ" అని నచ్చజెప్పి, కాకాసాహెబ్ దీక్షిత్ అతన్ని మశీదుకు తిరిగి తీసుకువచ్చేవాడు. ఈ విధమైన అనుబంధంతో తాత్యా 14 సంవత్సరాలపాటు బాబాతో మశీదులో నిద్రించాడు. తండ్రి మరణించిన తరువాత తాత్యా సంసారంలో పడ్డాడు. ఇంటికి యజమానిగా గృహస్థుడై ఇంట్లోనే నిద్రించసాగాడు. ఆ రోజులెంత గొప్పవి! ఆ మధుర స్మృతులు శాశ్వతంగా నిలిచిపోతాయి. తల్లిదండ్రులను ఇంట్లో వదిలి మశీదులో నిద్రించిన తాత్యాకు బాబాపై ఉన్న ప్రేమను ఎంతని కొలవగలము? అలాగే బాబాకు అతనిపైగల కృపను ఎవరు విలువ కట్టగలరు?

ఒకసారి ఎవరో భక్తులు బాబాకు రెండు ఆవులను, ఒక మేకను సమర్పించారు. అవి తాత్యా వద్ద ఉండేవి. వాటి పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ, నెయ్యి బాబా సేవించేవారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటల ప్రాంతంలో తాత్యా రెండు జొన్నరొట్టెలు, పాలు, బెల్లం తీసుకొని మశీదుకు వెళ్లి, సగం రొట్టెను పాలు, బెల్లంతో కలిపి బాబా ముందుంచేవాడు. బాబా అందులోనుంచి కొంచెం తిని, ఆ పాత్రను దూరంగా తోసేవారు. భక్తుడు కొండాజీ మిగిలిపోయిన రొట్టెలను తీసుకొనేవాడు. బాబా రొట్టె తిన్న తరువాత తాత్యా ఒక చిన్న పళ్లెంతో ఏవైనా తినుబండారాలను వారి ముందు ఉంచేవాడు. బాబా కొంచెం తిని, కొంచెం అతని నోటిలో పెట్టేవారు. తరువాత బాబా అతనికి 35 రూపాయలు (ఆ రోజుల్లో ఒక ప్రభుత్వోద్యోగి సగటు నెలజీతంతో సమానం) ఇచ్చి, "ఈ ధనాన్ని వృధాగా ఖర్చు చేయక సద్వినియోగపరచుకో" అని చెప్పేవారు. మొదటినుండి మధ్యతరగతి వ్యవసాయ(రైతు) కుటుంబీకుడైన తాత్యా అలా బాబా ప్రతిరోజూ ఇచ్చే ధనంతోనూ, తన స్వయంకృషి వల్లా ఆ గ్రామంలోనే పెద్ద మోతుబరి రైతయ్యాడు. ఆ రోజుల్లో తాత్యాది పన్నెండెద్దుల వ్యవసాయం. అప్పటి ప్రమాణాల ప్రకారం పన్నెండెద్దుల సేద్యమంటే పెద్ద భూస్వామి క్రింద లెక్క. ఇలా తాత్యాకు ధనాన్నిచ్చి లౌకిక శ్రేయస్సునివ్వడమే కాకుండా అతని పారమార్థిక ప్రయోజనాల దృష్ట్యా శిరిడీలోని శని, గణపతి, శివపార్వతుల, గ్రామదేవత మరియు మారుతి మందిరాల పునరుద్ధరణ వంటి ధార్మిక కార్యక్రమాలను తాత్యా చేతుల మీదగా చేయించారు బాబా. అన్నిటికీమించి తమ నిత్య సాన్నిధ్యాన్ని ప్రసాదించి తాత్యాను అన్నివిధాలా అనుగ్రహించారు బాబా.

ఒకసారి బాబా ధునిలో తమ చేయిపెట్టి, వేరొక గ్రామంలో కమ్మరి కొలిమిలో పడబోయిన బిడ్డను రక్షించారు. అప్పుడాయన చేయి బాగా కాలింది. అది చూచి తాత్యా కంటతడి పెట్టాడు. బాబా నవ్వి, “తాత్యా! ఎందుకేడుస్తావు? రెండువేల పిడకలు పేర్చి, వాటిపై ఈ శరీరాన్ని కాలుస్తున్నా మనం చలించగూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి!" అన్నారు.


సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
సాయిలీల మ్యాగజైన్ అక్టోబర్, 1960 సంచిక,
Ambrosia in Shirdi & Baba's Gurukul by విన్నీ చిట్లూరి,
Ref : శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ.

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo