సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 921వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహంతో ఉన్నతవిద్య కోసం అమెరికా ప్రయాణం
2. ఆటంకం లేకుండా హోమం పూర్తిచేయించిన బాబా

బాబా అనుగ్రహంతో ఉన్నతవిద్య కోసం అమెరికా ప్రయాణం


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సాయికృష్ణ. నేను సాయిభక్తురాలిని. మా అబ్బాయి అమెరికాలో చదువు కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు వీసా బయోమెట్రిక్ మరియు వీసా ఇంటర్వ్యూల స్లాట్ బుకింగ్ విషయంలో చాలా సమస్య అయింది. కారణం, కోవిడ్ వల్ల ఎక్కువ కౌంటర్స్ ఓపెన్ చేయకపోవటం. దానికితోడు మేము కూడా కోవిడ్ భయంతో చెన్నై లేదా ఢిల్లీలో స్లాట్ బుక్ చేసుకోవడం కంటే హైదరాబాదులో బుక్ చేసుకోటానికే ప్రాధాన్యత ఇవ్వడం వలన ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువ అయింది. ఏజెంట్స్‌ని అడిగితే, "హైదరాబాద్ తప్ప ఎక్కడైనా స్లాట్ ఈజీగా వస్తుంది. అక్కడ చేయమంటే చేస్తాం" అన్నారు. కానీ మేం అందుకు ఇష్టపడలేదు. మా అబ్బాయి వాష్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు, స్నానం చేసేటప్పుడు మినహాయిస్తే దాదాపు మిగతా సమయమంతా తన ఫోనులో స్లాట్ బుకింగ్ కోసం చాలా ప్రయత్నిస్తుండేవాడు. జూన్ నెల అంతా గడిచినా హైదరాబాదులో స్లాట్ దొరకలేదు. జులై కూడా వచ్చింది. ఇక మాకు టెన్షన్ మొదలైంది. అసలే ఈమధ్య మా టైం బాగాలేదు, ఏది చేసినా అస్తవ్యస్తం అవుతోంది. దాదాపు రెండు నెలలైనా మిగతావాళ్ళకి దొరుకుతూ తనకు మాత్రమే స్లాట్ దొరకకపోవడంతో మా అబ్బాయి చాలా నిరాశ చెందాడు. ఒకరోజు మధ్యాహ్నం భోజన సమయంలో తను ఫోన్ చేతిలో పట్టుకుని స్లాట్ బుక్ చేసే వెబ్‌సైట్ చూస్తూనే నాతో, "అమ్మా! మిగతావాళ్ళకి స్లాట్ దొరుకుతోంది. మరి నాకెందుకు స్లాట్ దొరకడం లేదు? నాకే ఎందుకిలా అవుతోంది? బాబా స్లాట్ బుక్ చేయిస్తారా అసలు?" అని అన్నాడు. నేను తనతో, "బాబా మీద నమ్మకం ఉంచు. ఆయన ఏ క్షణంలో అనుగ్రహిస్తారో, ఎలా అనుగ్రహిస్తారో ఆయనకు మాత్రమే తెలుసు. బాబా మాత్రమే ఏదైనా చేయగలరు" అని చెప్పాను. అంతలోనే హఠాత్తుగా తను, "అమ్మా! మిరాకిల్! వీసా బయోమెట్రిక్ మరియు వీసా ఇంటర్వ్యూ రెండు స్లాట్స్ హైదరాబాదులోనే బుక్ చేశాను. అది కూడా రెండు రోజుల వ్యవధితో దొరికాయి" అని చెప్పాడు. ఒక్కసారిగా మేమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. రెండు నెలలుగా ప్రయత్నిస్తున్న పనిని కేవలం రెండే రెండు నిమిషాల్లో, అదికూడా 'బాబా చేస్తార'ని చెప్తున్నంతలో బాబా తమ అనుగ్రహాన్ని చూపించారు.


అంతటితో ఒక టెన్షన్ తీరింది. కానీ, అసలు టెన్షన్ ముందు ఉంది. విషయం ఏమిటంటే, వీసా తిరస్కరణ శాతం హైదరాబాదులో ఎక్కువగా ఉంటోందని చాలామంది చెన్నై, కలకత్తా, ఢిల్లీలలో ఇంటర్వ్యూ పెట్టుకుంటున్నారు. మా అబ్బాయిని కూడా ఇక్కడ(హైదరాబాదులో) పెట్టుకోవద్దని అందరూ చెప్పారు. కానీ నేను, "బాబా మీద భారం వేద్దాం, ఏదైతే అదవుతుంది. బాబా ఇవ్వాలనుకుంటే ఇస్తారు, ఇవ్వొద్దు అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఇవ్వరు" అని అన్నాను. చివరకు బాబా దయవలన హైదరాబాదులోనే మా అబ్బాయి ఇంటర్వ్యూ బుక్ చేసుకున్నాడు. అయితే, కొంతకాలంగా టైం కలిసిరాకపోతుండటంతో ఇంటర్వ్యూ ఏమవుతుందోనని మేము చాలా టెన్షన్ పడ్డాము. కానీ బాబా దయవలన ఇంటర్వ్యూలో పెద్దగా ఏమీ అడగకుండానే, ‘వీసా అప్రూవ్ అయింది’ అంటూ ఆ ఇంటర్వ్యూ చేసిన ఆవిడ చెప్పారు. అయితే, వీసా అప్రూవ్ అయ్యాక నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటానని బాబాకి మాటిచ్చిన నేను, 'ఎలాగూ రెండు మూడు రోజుల్లో పాస్‌పో‌ర్ట్ వస్తుంది కదా, అప్పుడు మరింత ఆనందంగా పంచుకోవచ్చ'ని వాయిదా వేశాను. కానీ అప్పుడే అసలు కథ మొదలైంది!


మామూలుగా అయితే ఈమధ్య పాస్‌పో‌ర్ట్‌లు మూడు రోజులకే వచ్చేస్తున్నాయి. అలాంటిది మా అబ్బాయి పాస్‌పో‌ర్ట్ రాలేదు. తన తర్వాత వాళ్ళకు కూడా వచ్చాయిగానీ, మావాడిది రాలేదు. మా టైమ్ బాగాలేకపోవడమో ఏమోగానీ రోజులు గడిచిపోతున్నా అమెరికా ఎంబసీ వెబ్‌సైట్‌లో ఎలాంటి అప్డేట్ లేదు. కంప్లయింట్ పెట్టి ఎన్నిరోజులవుతున్నా 'అండర్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెసింగ్' అనే చూపిస్తూండేసరికి మాకు పిచ్చిలేచింది. అంతలో పాస్‌పో‌ర్ట్ ఆలస్యమైనవాళ్ళకు ఒక టెలిగ్రాం గ్రూప్ ఉందని మా అబ్బాయికి తెలిసి అందులో జాయిన్ అయ్యాడు. అప్పుడు తెలిసిన విషయమేమిటంటే, 'మాలాగే ఏ కారణమూ లేకుండా పాస్‌పో‌ర్ట్ ఆలస్యమై కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నవాళ్ళు చాలామంది ఉన్నారని; కొంతమందైతే పాపం పాస్‌పో‌ర్ట్ వస్తుందని చివరి నిమిషందాకా ఆశతో వేచి చూసి చివరికి ఫ్లైట్ టికెట్ డబ్బులు కూడా నష్టపోయారని; ఇంకొంతమంది ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని తమ చదువును నెక్స్ట్ సెమిస్టర్‌కి వాయిదా వేసుకున్నార'ని. అలా ప్రతీరోజూ మాకు మానసిక సంఘర్షణే. ఒకరోజు మా అబ్బాయి తీవ్రమైన నిరాశానిస్పృహలతో, "నేను అన్‌లక్కీ ఫెలోని. నాకు టాలెంట్ ఉన్నా వేస్ట్, లక్ లేదు. నాకంటే చదువు రానివాడే బెటర్, కనీసం వాడికి లక్ ఉంది. నా బ్రతుకింతే. నేను ఏమి చేసినా ఇలాగే అవుతోంది" అని చాలా భాధపడ్డాడు. ఒకరకంగా చెప్పాలంటే, బాబా మీద కూడా నమ్మకం కోల్పోయాడు. తన పరిస్థితి చూసి నాకు చాలా బాధేసి, "బాబా! ఏమన్నా కానీ, వాడిని నీ సేవకు, నీ ప్రేమకు, నీ మీద నమ్మకానికి దూరం కాకుండా చూడు. తొక్కలో పాస్‌పో‌ర్ట్ వచ్చినా రాకున్నా ఒకటే. కానీ, నీ మీద భక్తి మాత్రం సడలనీయకు" అని ఆర్తిగా బాబాను వేడుకున్నాను.


తరువాత నేను మా అబ్బాయితో, "చూడు నాన్నా! నేను బాబాని ఒక్కటే అడిగాను: 'బాబా! అమెరికాలో ఇప్పుడున్న కరోనా థర్డ్ వేవ్ పరిస్థితుల్లో మీ మనవడు అక్కడ సురక్షితంగా ఉంటాడని మీరు భావిస్తే, వాడిని ఫ్లైట్ ఎక్కించండి. సురక్షితం కాదంటే, నెక్స్ట్ సెమిస్టర్‌కి ఫ్లైట్ ఎక్కించండి" అని. అలాంటప్పుడు బాబా ఎలా చేస్తే మనం అలా నడుచుకోవాలి. అంతేకానీ, ఇలా బాబా మీద నమ్మకం కోల్పోకు. నీ జీవిత ప్రయాణంలో అమెరికా అనేది ఒక టర్నింగ్ పాయింట్ మాత్రమే. అక్కడితో అంతం కాదు కదా. ఇంకా ముందుకు వెళ్తే చాలా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఏ టర్నింగ్ పాయింట్ నీకు ఉత్తమ జీవితాన్నిస్తుందో నీకు, నాకు తెలీదు. అది కేవలం బాబాకి మాత్రమే తెలుసు. కాబట్టి, బాబా నిర్ణయం కోసం ఎదురుచూడటం తప్ప మరోదారి లేద"ని నచ్చజెప్పాను. వాడికైతే ఎలాగో సర్దిచెప్పాను కానీ, నా అంతరంగంలో గొప్ప తుఫానే చెలరేగింది. ఆ తుఫానులో ఎన్ని ఆలోచనల సుడిగుండాలో చెప్పలేను. ఎన్నో మానసిక పరీక్షలు. వాటిలో కొన్ని గెలుపులు, కొన్ని ఓటములు. అవన్నీ పరీక్ష పెట్టిన సాయినాథునికి, వాటిని ఎదుర్కొన్న నాకు మాత్రమే తెలుసు. నా మనసును చిత్తు చిత్తు చేసి నన్ను ఎంతగానో పరీక్షించి ఎన్నో పాఠాలు నేర్పించారు. రోజులు గడుస్తున్నకొద్దీ నాకు నమ్మకం పోయి ఇక పాస్‌పోర్ట్ రాదని నిర్ధారించుకున్నాను. మా అబ్బాయితో కూడా అదే చెప్పి, "ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకు. వస్తే వస్తుంది, లేదంటే నెక్ట్స్ సెమిస్టర్‌కి వెళుదువు. అదీ కాకపోతే వేరే ఏదైనా చెయొచ్చు" అని అన్నాను. ఎందుకంటే, కొన్ని సంవత్సరాలుగా మాకు నిరాశపడటం జీవితంలో ఒక భాగమైంది. చేయని తప్పులకి ఫలితాన్ని అనుభవించటం; పనులు చేయించుకుని, ఆ పనులు అయ్యాక వాళ్ళు మళ్ళీ మమ్మల్ని డబ్బులు అడగటం; మాకు కొట్లాడే మనస్తత్వం లేకపోవడంతో డబ్బులు తిరిగి ఇచ్చేసి లక్షల్లో నష్టపోవటం; ఏది చేసినా అందులో అనవసర తలనొప్పులు, అర్థంపర్థం లేని వ్యక్తుల జోక్యం వల్ల పనులు అస్తవ్యస్తం అయి పెట్టిన పెట్టుబడి బ్లాక్ అవటం; ఇలాంటి చిత్రవిచిత్ర సంఘటనలతో ఒకరకంగా జీవితం నిరాశతో నిండిపోగా కొన్నేళ్లుగా ఒక నిరాశా ప్రపంచంలో బ్రతుకుతున్నామన్న భావనలో ఉంది నా మానసిక పరిస్థితి. ఇదంతా గత జన్మలో చేసుకున్న కర్మల ఫలితాలని, ఇందులో బాబాని ఎందుకు నిందించాలని మనసుకి సర్దిచెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నాం. కానీ మా అబ్బాయి విషయంలో ఎందుకో కాంప్రమైజ్ కాలేకపోయాను. బాబా మీద అలకో, ఉక్రోషమో, నిందారోపణో, ఇవన్నీ కలగలపిన భావాలతో నాలో నేనే సతమతమవుతూ, "బాబా! ఇదంతా కర్మఫలమే కావచ్చు. కానీ దీన్ని మార్చే శక్తి మీకుంది కదా! మరెందుకు ఇంకా పరీక్షిస్తున్నావు? ఇంకెంతకాలం ఈ పరీక్షలు?" అని మనసులోనే బాబాను ప్రశ్నించేదాన్ని. ఇలా మూడు వారాలు గడిచాయి. 21వ రోజు గురువారం. మావారు మాతో, "ఈరోజు పాస్‌పోర్ట్ తప్పకుండా వస్తుంది" అని చాలా గట్టి నమ్మకంతో అన్నారు. దానికి నేను, "ఇదిగో, ఆ పెద్దాయన(బాబా) ఇష్టం. అనవసరపు ఆశలు పెట్టుకోకండి. ఆయన ఏం లీలలు చేస్తున్నాడో ఏమో ఆయనకే తెలియాలి. దునియాలో(ప్రపంచంలో) అందరికీ వస్తోంది మనకు తప్ప. ఆల్రెడీ మధ్యాహ్నం మూడు గంటలైంది. ఇంకేం వస్తుంది? ఆ ఎంబసీ వెబ్‌సైట్‌లో మళ్ళీ నో స్టేటస్ చూడటం, మూసుకుని ఉండటం... ఇదే కదా రోజూ జరిగేదీ" అని బాబా మీద ఉక్రోషంతో అన్నాను. కానీ మరుక్షణంలో, "మేము చేసిన కర్మలకు బాబాను నిందించటం ఎందుకు?" అనుకుని బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాను. దాదాపు ప్రతీరోజూ ఇలాగే బాబా మీద అలకలు, క్షమాపణలతో అంతరంగమంతా ఒక మానసిక యుద్ధరంగంలా అయింది. కానీ ఆ మానసిక యుద్ధంలో బాబా నాకు నేర్పిన ఆంతరంగిక అనుభవాలు కోకొల్లలు. అదే బాబా ప్రత్యేకత. ఆయన మన జీవితంలోని ప్రతీక్షణాన్ని అనుభవంతో ఒక బోధనందిస్తారు, ఎన్నో నేర్పిస్తారు.


సరే, నేను మావారితో అలా అన్న అరగంట తర్వాత మా అబ్బాయి వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి ఆశ్చర్యానందాలతో, "వీసా అప్రూవ్డ్" అని చెప్పాడు. నేను నమ్మక, "ఒరేయ్, సరిగ్గా చూడు. నీదా, లేదంటే నీ ఫ్రెండుదా?" అని అన్నాను. ఇన్నేళ్ళుగా నేను అనుభవిస్తున్న పరిస్థితుల ప్రభావం అలాంటిది మరి. చివరికి, ఆరోజు గనక వీసా రాకపోతే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి లేదా మొత్తం టికెట్ డబ్బులు నష్టపోతాము’ అన్న స్థితిలో బాబా అనుగ్రహించారు. మా ఆనందానికి అవధులు లేవు. మా అబ్బాయి పాస్‌పోర్ట్ హోమ్ డెలివరీ ఆప్షన్ పెట్టుకోవటంతో రెండు రోజుల్లో పాస్‌పోర్ట్ ఇంటికి వచ్చింది. అయితే మా అబ్బాయి అమెరికా ప్రయాణానికి కేవలం ఐదు రోజులే ఉన్నాయి. ‘ఇంత తక్కువ సమయంలో కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయగలమా’ అని నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ, ఐదురోజుల్లోనే షాపింగ్, ప్యాకింగ్ వంటి పనులన్నీ సమయానికి పూర్తిచేసేలా మాకు శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి తమ మనవడిని క్షేమంగా అమెరికా చేర్చారు మా పెద్దాయన. ఆయనే మా ఇంటికి యజమాని. ఆయన పెట్టిన భిక్ష ఈ జీవితం.


చివరగా మీ అందరితో ఒకటి చెప్పాలనుకుంటున్నాను: 'మనకు పరీక్షలు పెట్టేదీ, వాటిని తట్టుకునే ధైర్యాన్నిచ్చేదీ బాబానే'. మనం చేయవలసింది ఒక్కటే, 'ఆయన మనల్ని తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకం, ఓర్పులతో ఉండటం'. కానీ, అలా ఉండటం చాలా కష్టం. బాబా మనల్ని తప్పక గెలిపిస్తారు. ఎందుకంటే, మనం ఆయన పిల్లలం. పిల్లలు ఏడిస్తే ఏ తల్లికైనా బాగుంటుందా? బాబా మనకు తల్లికంటే ఎక్కువ. ఆయన మీద అచంచల భక్తి కుదరటమే ఒక యోగం. ఎలాంటి కష్టాలు వచ్చినా బాబా మీద విశ్వాసం సడలనీయవద్దు. అదే మనకు రక్ష. ఆలస్యమైనా సరే, బాబా మనకు ఇవ్వాల్సినవి ఇస్తారు. అయితే, బాబా దగ్గర ఒక ప్రత్యేక అనుగ్రహ విధానం ఉంటుంది. అదేమిటంటే, మనం అడిగినది మనకు శ్రేయస్సునిచ్చేదైతే బాబా దానిని మనకు అనుగ్రహిస్తారు; శ్రేయస్సునిచ్చేది కాకుంటే మాత్రం మనం ఏడ్చి గోలచేసినా, పొర్లుదండాలు పెట్టినా ఇవ్వరు.


"ధన్యవాదాలు సాయితండ్రీ. ఈ అనుభవం పంచుకోవడంలో కొంత ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా. మీకన్నీ తెలుసు, నేను చెప్పటానికేముంది? మీరు నాకు ఇచ్చిన ప్రతీ సంతోషానికీ కోటికోటి కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు. అలాగే, నాకు వచ్చిన ప్రతీ కష్టం ద్వారా మీరు నాకు నేర్పిన జీవితానుభవాలకు, ఆ తర్వాత జీవితంలో జరిగిన మంచిచెడులను తట్టుకునే శక్తిని ఇచ్చినందుకు కోటికోటి కృతజ్ఞతా ప్రణామాలు బాబా. మా అందరికీ చివరి ఘడియదాక మీ పాదసేవలో ఉండే అదృష్టాన్ని ప్రసాదించండి. మీ దయను సర్వజనులపై వర్షించి అందరినీ కాపాడండి. థాంక్యూ బాబా! లవ్ యూ బాబా!"


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


ఆటంకం లేకుండా హోమం పూర్తిచేయించిన బాబా


సాయిభక్తులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగును ఇంత చక్కగా నిర్వహిస్తున్నవాళ్లందరికీ కృతజ్ఞతలు. నేను ఇదివరకు ఈ బ్లాగులో చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు ఇంకో క్రొత్త అనుభవంతో మీ ముందుకు వచ్చాను.


మేము గత రెండు సంవత్సరాలుగా చండీహోమం చేయించుకోవాలనుకుంటున్నాము. కానీ ఏవో అవాంతరాల వలన కుదరడం లేదు. ఇంక వాయిదా వేయకుండా ఈసారి ఎలా అయినా హోమం చేయాలని నిశ్చయించుకుని, గుడిలో పంతులుగారిని అడిగి 2021, సెప్టెంబరు 5వ తేదీన ఖరారు చేసుకున్నాము. అయితే, నాకు ఆగష్టు 29కి రావలసిన నెలసరి రాలేదు. దాంతో నాకు టెన్షన్ మొదలైంది. సెప్టెంబరు 2వ తేదీ వచ్చినప్పటికీ నాకు నెలసరి రాలేదు. అప్పుడు నేను, "ఇప్పుడెలా బాబా? ఈసారి కూడా హోమం చేయడం కుదరదా? మళ్లీ వాయిదా వెయ్యాలా ఏంటి బాబా? ఇలా అవుతుంది ఎందుకని? ఈ ఆటంకం రాకుండా అంతా మంచిగా జరిగితే, హోమం అయిన తరువాతి గురువారంనాడు ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని బాబాకి మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు సెప్టెంబరు 3న నాకు తీవ్రమైన నడుమునొప్పి మొదలైంది. "మళ్లీ ఇదేంటి బాబా?" అనుకుని బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగాను. బాబా దయవల్ల సెప్టెంబరు 5వ తేదీకి నొప్పి కాస్త తగ్గింది. ఆయన అనుగ్రహం వల్ల మేము అనుకున్నట్టు అన్నీ మంచిగా జరిగాయి. ఇది చూడడానికి చిన్నగా అనిపించవచ్చు కానీ, 2 సంవత్సరాల నుండి మేము ఎదురుచూస్తున్న హోమం ఎక్కడ మళ్లీ వాయిదాపడుతుందోనని చాలా ఆందోళనపడ్డాను. ఇంకో విషయం, నేను శ్రావణమాసంలో సోమవారాలు ఉపవాసం ఉంటున్నాను. బాబా దయవల్ల సెప్టెంబరు 6, చివరి సోమవారం కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తయింది. "బాబా! ఇలాగే మా మీద దయచూపించు తండ్రీ. తొందరగా ఈ కరోనాను పారద్రోలి అందరినీ కాపాడు సాయీ". చివరిగా, నాకున్న ఇంకో కోరిక కూడా బాబా దయవల్ల నెరవేరితే ఆ నా అనుభవాన్ని కూడా మీతో పంచుకుంటాను.



5 comments:

  1. Jaisairam bless amma for her eye operation and bless me for my health and gain wealth.

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌹🥰🌸🤗🌺

    ReplyDelete
  3. Baba, amma nanna runa badhalu tholaginchu thandri. Vari arogyalu bagundela vallani rakshinchandi baba. Ma amma nanna ni meke vadhilesanu. Vallu chinna Valle. Inka chala life undhi. Undela, aa life antha happy ga undela deevinchandi baba vallani. Ippatidhaka padda kastalu chalu baba. Please bless my mother and father with abundant happiness, love and prosperity baba. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌹🥰🌸🤗🌺

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo