సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 944వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అనారోగ్యసమస్య - మార్గనిర్దేశం - సాయి సేవకు అంకురార్పణ
2. అసంభవం అనుకున్నది సంభవం చేసి చూపిన బాబా

అనారోగ్యసమస్య - మార్గనిర్దేశం - సాయి సేవకు అంకురార్పణ


'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును ఆధునిక సాయి సచ్చరిత్రకు వేదికగా ఎంతోమంది సాయిభక్తుల అనుభవాలను చక్కటి కూర్పుతో ప్రచురిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఎంతో చాకచక్యంగా నిర్వహిస్తున్న సాయికి మరియు వారి బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు దేవి. మాది గజపతినగరం. బాబా కృపతో నేను ఇంతకుముందు మూడు అనుభవాలను మన బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు బాబా ఈమధ్య నాకు ప్రసాదించిన ఒక అద్భుతాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఈ అద్భుతం చేస్తే, బ్లాగులో పంచుకుంటానని బాబాకు మొక్కుకున్నాను.


మా ఆడపడుచుకి పెళ్ళైన 20 సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. ఆమె బాబాపై పూర్తి నమ్మకముంచి బాబా చరిత్ర పారాయణ చేసింది. ఫలితంగా సంవత్సరంన్నర క్రితం ఆమెకు కవలలు (పాప, బాబు) పుట్టారు. ఆమె ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు అయినందున సాయి వరప్రసాదమైన పిల్లల సంరక్షణ నిమిత్తం మా అత్తయ్య, మావయ్యలు ఆమె దగ్గరే ఉంటున్నారు. 2021, వినాయకచవితి పండగ తరువాత సెప్టెంబర్ 11వ తారీఖున మా ఆడపడుచు ఫోన్ చేసి, 'మా మావయ్యగారికి చాలా ఆయాసంగా ఉందని, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుందని, వాళ్ళ ఊరిలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్లో చేర్పించామ'ని ఏడుస్తూ చెప్పింది. హుటాహుటిన మావారు బయలుదేరి హాస్పిటల్‍కి వెళ్లారు. అప్పటికే మా మావయ్యగారి పరిస్థితిని, అతని టెస్టు రిపోర్టులను పరిశీలించిన డాక్టర్లు, "పరిస్థితి విషమంగా ఉంది. గుండె ఉండవలసిన పరిమాణం కంటే పెద్దగా ఉంది(heart enlarge అయ్యింది), రెండు, మూడు రోజులు కంటే బతకడం కష్టం. ముందైతే ఆక్సిజన్ పెడదామ"ని ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు. డాక్టర్లు చెప్పిన మాటలు మా మావయ్య, అత్తయ్యలకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ మావారు, ఆడపడుచు తమలోతామే అంతులేని ఆవేదనను అనుభవిస్తూ మాకు కూడా విషయం స్పష్టంగా చెప్పలేదు. మాకు చెపితే మేమెక్కడ హాస్పిటల్‍కి వెళ్తామో! మమ్మల్ని చూసి మావయ్య ఎక్కడ కంగారు పడిపోతారోనని వాళ్ళ భయం. కానీ నేను ఫోన్లో మావారి మాటల వెనక దుఃఖాన్ని గుర్తించి, సమస్య పెద్దదై ఉంటుందని ఊహించి గట్టిగా గదమాయించి అడిగితే, అసలు విషయం చెప్పారు. దాంతో ఒక్కసారిగా నా కాళ్ళుచేతులు ఆడలేదు. వెంటనే బాబా దగ్గరికి వెళ్లి, "ఏమిటి నాయనా ఇదంతా?" అని అడిగి, ఆపై జరగబోయే పరిస్థితులన్నింటినీ ఊహించుకుని తట్టుకోలేకపోయాను. "బాబా! ఏ విషయమైనా ముందుగా తెలియజేసే మీరు ఇప్పుడీ విషయాన్ని ఎందుకు తెలియజేయలేదు?" అని బాబాను అడిగాను. ఇంకా, "చావుపుట్టుకలు సర్వసాధారణమని తెలుసు బాబా. కానీ, చిన్నప్పటినుండీ కొన్ని కారణాల వలన తల్లిదండ్రుల దగ్గర పెరగని మావారు, ఆడపడుచు ఇప్పుడైనా అమ్మానాన్నలతో కలిసి ఉందామనుకున్నారు. వారి ఆశను నీరుకార్చొద్దు బాబా" అని బాబాను ప్రార్ధించి, 'బాబా ప్రశ్నలు-సమాధానాలు' అన్న పుస్తకం తీసి చూసాను. అక్కడ, "ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒక సంవత్సరం పూజ చేయవద్దని శాస్త్రాలు, మహాత్ములు తెలిపారు. ఇవి ప్రాపంచిక వ్యక్తులకే కానీ బ్రహ్మజ్ఞాన సాధకులకు కాదు" అని బాబా ఇచ్చిన సమాధానాన్ని చూసి ఒక్కసారిగా నేను అదిరిపడ్డాను. ఇక అప్పటినుండీ ఏ ఫోన్ కాల్ వచ్చినా ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఒకటే ఆందోళన, కంగారు. అలా ఆ రాత్రి ఆందోళనతో గడిచింది. మరుసటిరోజు మా పాపని తీసుకుని, అమ్మ, అన్నయ్య అందరమూ కలిసి హాస్పిటల్‍కి వెళ్ళాము. మనసులో బాబా నామాన్ని తలుచుకుంటూ వెళ్లి మా మావయ్యగారిని చూసాను. ఒక పక్క మామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతుంటే, మరోపక్క నేను నా మనస్సులో 'బాబా ఇచ్చిన సమాధానం, డాక్టర్ల మాటల ఆధారంగా' ఇప్పుడిలా కనిపిస్తున్న మావయ్య రెండురోజుల తరవాత ఎలా ఉంటారోనన్న తలంపుని జీర్ణించుకోలేక నాలో నేనే చాలా మధనపడిపోయాను. ఏమి చేయాలో తెలియక వెంటనే నా ఫోన్‍లో 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేసేసరికి అందులో 'మరణం నుండి తప్పించిన బాబా', 'పెద్ద ఆపద నుండి కాపాడిన బాబా' అనే శీర్షికలతో కూడిన ఒక భక్తురాలి అనుభవం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాను. నాలో మళ్ళీ ఆశలు చిగురించాయి. వెంటనే నేను నాతోపాటు తీసుకెళ్లిన బాబా ఊదీ మావయ్యగారి ఛాతీపై రాసి, నుదుట బొట్టుపెట్టి, "భక్తితో బాబాను  మనసులో ప్రార్ధించకోమ"ని మామయ్యతో చెప్పాను. నేను కూడా, "మావయ్య త్వరగా కోలుకుంటే, మరుసటివారంలో ఇదేరోజున ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మొక్కుకున్నాను.


తరువాత బాబా నాలో కల్పించిన ఆశలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటికి వచ్చి మా వదినతో జరిగిన విషయం చెప్పాను. అందుకు మా వదిన తనకు అప్పుడే వచ్చిన ఒక ఆలోచనను ఆచరణలో పెడితే బాగుంటుందని, దాన్ని బాబాయే నాకు చెప్తున్నట్టు తోస్తుందని అన్నది. అదేమిటంటే, 'మావయ్యగారి పేరు మీద సాయి సంకల్ప పారాయణ పెట్టిస్తే, ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంద'ని. కానీ ఎలా చేయాలనేది మాత్రం మీరే ఆలోచించండని మా వదిన చెప్పింది. నాకు అది చాలా బాగుందనిపించి వెంటనే కవిత అనే నా సహోపాధ్యాయురాలిని ఆ విషయమై సంప్రదించాను. తను నాకు ధైర్యాన్ని చెపుతూ, "మన మహిళల స్కూల్ గ్రూపులో ఉన్న వారంతా చాలా గొప్పవారు. ముందుగా విషయం చెప్పకుండా చదవమని సాయి సచ్చరిత్రలోని అధ్యాయాలు కేటాయించినా పారాయణ చేసే గొప్ప వ్యక్తిత్వం, మానవత్వం, దేవునియందు అమితమైన భక్తి ఉన్నవారు వాళ్ళందరూ. కాబట్టి ఏమీ ఆలోచించకుండా ఆ పని చేయమ"ని చెప్పింది. అంతటితో నేను అది బాబా ఆజ్ఞగా తీసుకుని అలాగే చేశాను. వెంటనే పారాయణ చేయవలసిన అధ్యాయాలను ఒక పేపర్ మీద వ్రాసి, ఫోటో తీసి, విషయం టైపు చేసి గ్రూపులో పెట్టాను. వెంటనే, "మీకు మేమంతా ఉన్నామ"ని వాళ్ళు స్పందించిన తీరు ఎంతో ప్రసంశనీయం. ఆ క్షణం వాళ్లలో నాకు బాబాయే కనిపించారు. సోమవారంనాడు సంకల్ప పారాయణ దిగ్విజయంగా పూర్తయింది. మరుక్షణం డాక్టర్లు మావయ్యగారు కొంచం కోలుకున్నారని, ఇక ఆక్సిజన్ అవసరం లేదని, రెండురోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము, ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్పారు. అయితే ఇంట్లో పాటించవలసిన జాగ్రత్తలు మాత్రం కాస్త ఎక్కువగానే చెప్పారు. ఈ వివరాలన్నీ నేను మావారికి ఫోన్ చేస్తే తెలిసాయి. ఆ క్షణాన నేను బాబా చూపిన పరిష్కార మార్గానికి, చేసిన లీలకు పులకించిపోయాను.


అలా మా మావయ్యగారి ఆరోగ్య విషయంగా మొదలైన 'సాయి సంకల్ప పారాయణ'ను ఇంకొంతమంది స్నేహితులను కూడా చేర్చుకుని మొత్తం 37 మందిమి ఒక సమూహంగా ఎవరికీ ఏ సమస్య ఉన్నా వారికోసం (ప్రస్తుతం)మంగళ, శుక్రవారాల్లో అందరి ఆత్మలను ఒకే సాయి పరమాత్మలో లయం చేసే విధంగా పారాయణ చేస్తూ ఆ సాయినాథునిసేవలో తరిస్తున్నామని చెప్పడానికి పొంగిపోతున్నాను. ఇలా సాయి సేవ చేయడానికి ప్రధాన కారణమైన మా మావయ్యగారికి, పారాయణ ఆలోచనను కల్పించిన వదినకి, ప్రోత్సహించిన కవితకి, సాయి సేవలో పాల్గొంటున్న నా స్నేహితులందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని బాబాను సవినయంగా ప్రార్ధిస్తున్నాను.


ఇంకా పైన చెప్పిన మా మావయ్యగారి అనారోగ్య పరిస్థితి ద్వారా తమపై చాలా అల్ప విశ్వాసమున్న మా వారిచేత తన తండ్రి ఆరోగ్యం చక్కబడితే, శిరిడీ వస్తానని  మొక్కుకునేలా ప్రేరేపించడమే కాకుండా భక్తివిశ్వాసాలతో క్రమం తప్పకుండా రోజుకి ఒక అధ్యాయం చొప్పున సచ్చరిత్ర పారాయణ చేసే భాగ్యాన్ని మావారికి ప్రసాదించిన మన సద్గురు శ్రీ సాయినాథునికి శతసహస్రకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. పారాయణాల మూలంగా ఈ అనుభవాన్ని వ్రాయడంలో కొద్దిగా ఆలస్యమైనందుకు మీరు నన్ను మన్నిస్తారని ఆశిస్తున్నాను. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా రక్కసిని మీ దృష్టి వీక్షణాలతో పూర్తిగా నిర్మూలన చేసి, ప్రజలందరినీ కాపాడి అందరినీ మీ మార్గంలో నడిపించండి".


శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


అసంభవం అనుకున్నది సంభవం చేసి చూపిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నా అనుభవం విషయానికి వస్తే... ఒక సంవత్సరం క్రితం మాకు, మా బాబాయి వాళ్ళకి మధ్య కొన్ని తగాదాలు ఏర్పడ్డాయి. దానివల్ల మేము మాట్లాడుకోవడం లేదు. ఈ విషయమై నేను తీవ్ర ఆందోళనకు గురయ్యాను. ఆ సమయములోనే నా స్నేహితురాలు నన్ను ఈ బ్లాగుకు సంబంధించిన 'సాయి భక్తుల అనుభవాల' గ్రూపులో చేర్చింది. తోటి భక్తుల అనుభవాలు చదివిన నేను, "ఎలాగైనా మేము, మా బాబాయి వాళ్ళు మునుపటిలా కలిసిపోతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మొక్కుకున్నాను. అలా మొక్కిన తరువాత చాలారోజులు గడిచాయి కానీ, మా మధ్య ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. దాంతో మేము కలవడం అసంభవమేమో అనుకున్నాను. తరువాత ఒకరోజు ఇంస్టాగ్రాములో బాబా సందేశాలు చూస్తుంటే, "ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది" అనే మెసేజు చూశాను. అప్పుడు నేను, 'అలా ఏమి జరగదులే! ఎప్పుడూ ఇలానే వస్తాయి' అని మనసులో అనుకున్నాను. సరిగ్గా ఒక గంట తర్వాత మా బాబాయి మా ఇంటికి వచ్చి ఎప్పటిలాగానే మాతో మంచిగా మాట్లాడారు. అసంభవం అనుకున్న దానిని బాబా సంభవం చేసి చూపించారని నేను చాలా చాలా సంతోషించాను. దాంతో నా మనసులో మిగిలి ఉన్న ఆందోళన పటాపంచలైపోయింది. "బాబా! జీవితాంతం మీకు ఋణపడి ఉండటం తప్ప  ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను? అసలు ఇలాంటి అనుభవం నేను పంచుకుంటానని కలలో కూడా అనుకోలేదు. అంతా మీ కృప వలనే జరిగింది. థాంక్యూ సో మచ్ బాబా. లవ్ యు బాబా".


ఒకరోజు సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళిన మా చిన్నాన్నగారి అబ్బాయి ఇంటికి తిరిగి రాలేదు. మేమంతా చాలా కంగారుపడి అంతటా వెతికాము కానీ, తను ఎక్కడా కనపడలేదు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! మీ దయతో తమ్ముడు కనిపిస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. అలా బాబాకి మొక్కుకున్న కాసేపటికి తన స్నేహితుని ఇంటిలో నుంచి తమ్ముడు బయటకు వచ్చాడు. ఇక మా ఆనందానికి అవధులు లేవు. అంతా బాబా దయ. "బాబా! మా చిన్న తమ్ముడికి నోట్లో అల్సర్స్ అయ్యాయి. తను ఏమీ తినలేకపోతున్నాడు బాబా. ఆ అల్సర్స్ తొందరగా తగ్గిపోయేలా చూడు తండ్రి".



8 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jai sairam

    ReplyDelete
  3. Om sai ram sai leelas are very nice. All devotees experienced baba's leelas. That is power of baba. I love you sai❤❤❤

    ReplyDelete
  4. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  5. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌼😀🌺🥰🌸😃🌹😊🌸

    ReplyDelete
  6. సాయినాథా.. మీకు సాష్టాంగ ప్రణామములు.. మీ దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించి, మా అనారోగ్యం రూపు మాపి నిర్ములించి, ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యలు అందించండి సాయినాథ నీవే దిక్కు నీవే రక్షా నీవే తప్పా మాకెవరీ భువిలో.. కృతజ్ఞతలు ధన్యవాదములు సాయిరాం బాబా దేవా..

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo