సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 936వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. దయతో పరిస్థితులు చక్కబరచిన బాబా
2. చెప్పుకున్నంతనే లభించిన బాబా అనుగ్రహం

దయతో పరిస్థితులు చక్కబరచిన బాబా

నేను బాబా భక్తురాలిని. ముందుగా, సాయిబాబా భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సాయిభక్తులకు తమ అనుభవాలను పంచుకునే అద్భుత అవకాశం కల్పిస్తున్న ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. "బాబా! నా ఫలానా కోరిక/కష్టం తీర్చండి, నేను ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని భక్తులు బాబాను కోరుకుంటే ఆ కోరిక/కష్టం తీరడం ఈ బ్లాగుకి బాబా ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయనటానికి నిదర్శనం. అంటే, ఈ బ్లాగ్ బాబా అనుగ్రహానికి ప్రతీక. దీనికి సంబంధించి ప్రతిదీ బాబాకి తెలుసు. ఇకపోతే, నేను కూడా ఈసారి నాకు వచ్చిన ఒక సమస్య నుండి గట్టెక్కిస్తే, ఆ అనుభవాన్ని ఇక్కడ పంచుకుంటానని బాబాను వేడుకున్నాను. బాబా ఎంతో ప్రేమతో నన్ను రెండు సమస్యల నుండి గట్టెక్కించారు. వాటినే నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. "బాబా! కొంచెం ఆలస్యంగా ఈ అనుభవాలు పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి. మీ దయవలనే నేను నాకు వచ్చే సమస్యల నుండి బయటపడుతున్నాను. ధన్యవాదాలు బాబా".

నేను ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. ఒకరోజు మా మేనేజర్ ఒక డెవలపర్ మీటింగ్ పెట్టి, డెవలపర్స్‌కి వున్న సమస్యల గురించి చెప్పమన్నది. అప్పుడు ఒక లీడ్ డెవలపర్, "బిజినెస్ అనలిస్టులు ఇన్ఫర్మేషన్ వివరంగా ఇవ్వట్లేదు, సమస్య అవుతోంది" అని కంప్లైంట్ ఇచ్చాడు. అది నిజమే అయినప్పటికీ నేను క్రొత్తగా ఈమధ్యనే ఆ సంస్థలో జాయిన్ అయినందున నేరుగా చెప్పక, "అవును, మాకు ఇంకొంచెం వివరంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. అప్పుడు మేము కరెక్ట్‌గా డెవలప్ చేయగలుగుతాము" అని చెప్పాను. మేము ఇలా కంప్లైంట్ చేసిన విషయాన్ని మేనేజర్ వెంటనే బిజినెస్ అనలిస్టులందరికీ చెప్పింది. సాధారణంగా ఎవరికైనా తామెంత కరెక్ట్‌గా ఉన్నామనేదానికంటే తమని వేలెత్తి చూపారన్నదే ఎక్కువ బాధిస్తుంది. అందుచేత బిజినెస్ అనలిస్టులందరికీ మా మీద కోపం వచ్చింది. ఈ విషయం మాకు తెలీదు. అప్పటివరకు బిజినెస్ అనలిస్ట్ ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వకపోయినా వాళ్ళ పని, నా పని చేసుకుంటూ, కేవలం వాళ్ళు పంపాల్సిన వాలిడేషన్ ఈ-మెయిల్స్‌ను మాత్రమే పంపమని చెప్పే నా అలవాటు ప్రకారం ఆరోజు కూడా బిజినెస్ అనలిస్ట్‌కి నేను మెసేజ్ చేశాను. వెంటనే ఆ అనలిస్ట్, "కంప్లైంట్ ఇచ్చిన డెవలపర్(లీడ్)నే అడుగు" అన్నాడు. దాంతో, వాళ్లంతా కోపంగా ఉన్నారని నాకు అర్థమైంది. కానీ, గమ్మున పనంతా చేస్తున్నా కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని నాకు బాధేసింది. నిజానికి లీడ్ డెవలపర్ తప్పుగా ఏమీ కంప్లైంట్ చేయలేదు. తప్పుగా అనలేదని తెలిసి కూడా మా మేనేజర్ పరిస్థితిని వాడుకొని టీమ్‌లో డిస్టర్బెన్స్ సృష్టించింది. ఎందుకంటే, ఏ బిజినెస్ అనలిస్ట్ అయితే 'కంప్లైంట్ ఇచ్చినవాళ్లనే అడుగు' అన్నాడో, అతను రెండు సంవత్సరాల నుండి మేనేజరుతో అదే కంపెనీలో వున్నాడు. కాబట్టి ఆమె, 'పని బాగా చేయండి' అని నేరుగా అతనితో చెప్పలేక మా మీద నెట్టి అందరినీ ఇబ్బందిపెట్టింది. ఆ పరిస్థితికి నాకైతే ఉద్యోగం మారిపోవాలని అనిపించింది. టీమ్‌లో అందరూ ఒకరితో ఒకరు మంచిగా ఉంటే బాగుంటుంది, అంతా సానుకూలంగా ఉంటుంది. ఇదంతా గురువారంనాడు జరిగింది. శుక్రవారమంతా నేను సైలెంట్‌గా గడిపేశాను. ఆ వారం నేను ఎక్కువ గంటలు పనిచేశాను. అంతకుముందు నేను ఎక్కువ గంటలు పనిచేసినపుడు మా మేనేజర్ నన్ను శుక్రవారం హాఫ్ డే లీవ్ తీసుకోమని చెప్పేది. అయినప్పటికీ పని ఉందని నేనెప్పుడూ లీవ్ తీసుకోలేదు, పైగా అదనపు గంటలకి ఛార్జ్ కూడా చేయలేదు. కానీ, ఈ వారంలో ఆమె పెట్టిన చిచ్చుకి కోపమొచ్చి, పనిచేసిన అదనపు గంటలకి ఛార్జ్ చేశాను. ఆ విషయం టైం షీట్‌లో కూడా పెట్టాను. కానీ, ఆమె సోమవారం ఏమంటుందోనన్న చింతతో శని, ఆదివారాలు చాలా అసహనంగా అనిపించి, "బాబా! టీమ్‌లో మళ్లీ అంతా మామూలుగా అయ్యేలా చూడు. ఇంకా, మేనేజర్ అదనపు గంటల గురించి అడగకుండా చూడు. నేను ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. ప్రతి సోమవారంనాటి ఉదయం నాకు మా మేనేజరుతో 'వన్ ఆన్ వన్' మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగులో ఆమె, ‘అన్ని అదనపు గంటలు పెట్టావేమిటి?’ అని మాటమాత్రమైనా అడగకుండా నా టైమ్ షీట్‌ని ఆమోదించింది. తరువాత కాసేపటికి ఆ బిజినెస్ అనలిస్ట్ తనంతటతానే నాకు మెసేజ్ చేసి, ‘ఫలానా వర్క్ చేస్తావా?’ అని ఏమీ జరగనట్లు నాతో మంచిగా మాట్లాడాడు. ఇదంతా బాబా దయ. ఆయన కృపవలన ఇప్పుడంతా మునుపటిలా సాఫీగా సాగుతోంది.

మరుసటివారం నేను, "ప్లీజ్ బాబా! ఈ సోమవారం మా మేనేజరుతో మీటింగ్ లేకుండా చూడండి. ఈ వారంలో నేను పనిచేసిన అదనపు గంటలు గురించి పెట్టాను. అవి కూడా ఆమోదింపబడేలా చూడు. ఈ అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. ఆరోజు హఠాత్తుగా మేనేజరుకి మీటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇలా కోరగానే అలా బాబా తీరుస్తున్నారు. ఇవేకాకుండా రోజులో నేనెప్పుడు "బాబా ప్లీజ్!" అన్నా వెంటనే బాబా నాకు సహాయం చేస్తున్నారు. "బాబా! నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలను? మీ ఈ ప్రేమ, కరుణ ఎల్లప్పుడూ ఇలానే నా మీద, సమస్త ప్రజానీకం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఎన్నడూ వదిలిపెట్టవద్దు బాబా. సదా నాతోనే ఉండండి". చివరిగా, మరిన్ని అనుభవాలను మీతో పంచుకొనే అవకాశం బాబా నాకు కల్పించాలని కోరుకుంటూ ...

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు!

చెప్పుకున్నంతనే లభించిన బాబా అనుగ్రహం


సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. మరోసారి నేను నా అనుభవాన్ని పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు చెప్తున్న సమస్య మీకు తేలికగా అనిపించవచ్చు. కానీ, నాకు అది సమస్యే. ఎందుకంటే, చంటిపిల్లలతో నాకు పెద్దగా అనుభవం లేదు. అసలు విషయమేమిటంటే, నాకు రెండు నెలల వయసున్న పాప ఉంది. ఈమధ్య తన ఆరోగ్యం అసలు బాగుండటం లేదు. తరచూ ఏదో ఒక సమస్య ఉంటోంది. అందువలన నా మనసంతా చాలా ఆందోళనగా ఉంటుండటంతో, తన ఆరోగ్యం బాగుండాలని ప్రతిరోజూ బాబాను వేడుకుంటుండేదాన్ని. ఇటీవల పాపకి నాలుగు రోజులవుతున్నా విరేచనం కాలేదు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విరేచనం మాత్రం కాలేదు. చిన్నపిల్లలకి మూడురోజుల వరకు విరేచనం కాకపోయినా పర్వాలేదని చాలామంది చెప్పారు. కానీ, నా తల్లి మనసు కుదురుగా ఉండేది కాదు. ప్రతిరోజూ బాబాని మామూలుగా వేడుకునేదాన్ని. కానీ, నాలుగవరోజు సాయంత్రం, "బాబా! పాపకి విరేచనమయ్యేలా చూడండి. రేపు గురువారం మీ గుడికి వస్తాను. అలాగే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మనస్పూర్తిగా బాబాను ప్రార్థించాను. అద్భుతం! అరగంటలో పాపకి విరేచనం అయింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. బాబాకి మాటిచ్చిన ప్రకారం కృతజ్ఞతతో నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. "తండ్రి సాయీ! ఇంట్లో కొన్ని సమస్యలతో మేము సతమతమవుతున్నాము. కర్మఫలితాన్ని అనుభవించాలని అంటారు. కానీ, మీ దయతో వాటినుండి తొందరగా మాకు విముక్తి లభించినట్లయితే, ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను".



9 comments:

  1. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jai sairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  4. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  5. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌼😀🌺🥰🌸😃🌹

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo