1. సాయిని నమ్ముకుంటే కానిది ఏముంది?
2. బాబాతో అనుబంధం
3. బాబా అనుగ్రహంతో మామూలు స్థితికి వచ్చిన కన్ను
సాయిని నమ్ముకుంటే కానిది ఏముంది?
శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు రాము. మాది ఏలూరు. లెక్కకు మించిన అనుభవాలను బాబా తమ భక్తులకు ప్రసాదిస్తారు. వాటినుండి కొన్ని అనుభవాలను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఒకసారి నేను నా అనుభవమొకటి ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకోవాలని మీ ముందుకి వచ్చాను.
అనుభవం-1: రెండు సంవత్సరాల క్రితం నా ఎడమకాలి నరాలకు రక్తప్రసరణ ఆగిపోయింది. డాక్టరుకి చూపిస్తే, "కాలు తీసివేయవలసి ఉంటుంది" అని అన్నారు. నాకు చాలా భయం వేసి భారం బాబా మీద వేశాను. అప్పుడు నా ముస్లిం మిత్రులొకరు వారి వైద్యవిధానం ద్వారా ఎటువంటి సమస్యా లేకుండా నాకు నయమవుతుందని చెప్పారు. బాబా దయవల్ల ఆ విధంగా నా సమస్య తీరింది. ఇప్పుడు అదే కాలికి చిన్న దెబ్బ తగిలి తిమ్మిరి మొదలై కాలు చాలా ఇబ్బందిపెడుతోంది. బాబా దయతో చూసి నా కాలి సమస్యను తీర్చినట్లైతే, నా అనుభవాన్ని ఈ బ్లాగులో మళ్లీ పంచుకుంటాను.
అనుభవం-2: ఇప్పుడు చెప్పబోయే అనుభవం మా చెల్లెలిది. 10, 12 సంవత్సరాల క్రితం జరిగిన ఈ అనుభవాన్ని మా చెల్లి నాతో చెప్పింది. అప్పట్లో ఒకసారి వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం బాగాలేక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారట. డాక్టర్లు అబ్బాయి ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పారట. తను చాలా భయపడి బాబాని వేడుకుందట. తరువాత ఎక్కడనుండి వచ్చారో తెలియదు కానీ, ఒక సాయిభక్తుడు, కాదు..కాదు, ఆ రూపంలో బాబానే వచ్చి, "ఈ సాయిబాబా ఊదీ శిరిడీ నుండి తెచ్చాము. దీనిని ప్రతిరోజూ మీరు వాడే మందులతో పాటు మీ అబ్బాయికి ఇవ్వండి. అంతా బాగుంటుంది" అని చెప్పారట. విచిత్రం ఏమిటంటే, అక్కడున్న వాళ్ళందరికీ ఒక్కో ఊదీ ప్యాకెట్ ఇచ్చి, మా చెల్లికి మాత్రం 2 ప్యాకెట్లు ఇచ్చి, "వీటిని వాడుకోండి"అని చెప్పారట. మందులతోపాటు ఆ ఊదీని వాడిన తర్వాత అబ్బాయి కోలుకున్నాడట. చూశారా! బాబా మీద భారం వేస్తే, ఆయన మనల్ని తప్పక కాపాడుతారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? సాయినాథ్ మహరాజ్ కీ జై!
అనుభవం-3: ఒకసారి నాకు సిస్టర్ వరుసయ్యే ఒకరిచేత ఒక స్థలం కొనుగోలు చేయించాను. ఐతే, కొంత అడ్వాన్స్ ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసుకునే సమయానికి మిగిలిన డబ్బు మొత్తం ఇస్తామని చెప్పాము. కానీ అనుకున్న సమయానికి మొత్తం డబ్బు సర్దుబాటు కాలేదు. మేము చాలా ఆందోళన చెంది, స్థలం యొక్క యజమానులతో, "ఒక్క నెలరోజులు గడువు ఇచ్చినట్లయితే డబ్బు సర్దుబాటు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటామ"ని అన్నాం. కానీ, వాళ్ళు అస్సలు కుదరదని అన్నారు. చివరికి బాబా దయవల్ల 10 రోజులు గడువు ఇచ్చారు. అప్పుడు నేను, "ఆ రోజుకి మొత్తం డబ్బు మాకు సర్దుబాటు ఐతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల సమయానికి మాకు కావల్సిన డబ్బు సర్దుబాటు అయింది. దాంతో రెండవసారి ఇచ్చిన గడువు సమయానికి మేము ఆ డబ్బిచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఇది బాబా దయవల్లే జరిగింది. సాయిని నమ్ముకుంటే కానిది ఏముంది? ఇలా మాకు ఎన్నో విషయాలలో బాబా తోడుగా నిలిచారు. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".
శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబాతో అనుబంధం
నా పేరు ఆదిలక్ష్మి. నేను సెకండరీ గ్రేడ్ టీచరుగా పనిచేస్తున్నాను. సాయితో నాకున్న అనుబంధాన్ని సాయిబంధువులతో పంచుకోవడం, ఈ బ్లాగులో ప్రచురించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాయితో నాకున్న అనుబంధం గురించి చెప్పాలంటే, నా 13వ సంవత్సరంలోనే నాకు సాయి మీద భక్తి కలిగింది. నేను ఎక్కడ చదువుకున్నా దగ్గర్లో ఉండే సాయి మందిరానికి వెళ్ళడం, సాయిలీలామృతం పారాయణ చేయడం చేస్తుండేదాన్ని. నేను అనుకున్నవన్నీ జరగడంతో క్రమంగా సాయి మీద నాకున్న భక్తి పెరిగింది. నా ఉద్యోగ విషయంలో ఎన్నడూ లేని విధంగా ఆ సంవత్సరం సెకండ్ లిస్ట్ ప్రకటించడం, అందులో నా పేరు ఉండటం, అలా నేను సెకండరీ గ్రేడ్ టీచరునవ్వడం సాయిలీలగా నేను భావిస్తున్నాను. తరువాత, అర్థం చేసుకునే భర్తని ప్రసాదించమని సాయిని కోరాను. అలాగే ప్రసాదించారు. ఆ తరువాత, నాకు మగబిడ్డను ప్రసాదించమని బాబాను అడిగాను. అలానే జరిగింది. బాబు పుట్టినప్పుడు నుదుట బొట్టుతో జన్మించాడు. సాయి ప్రసాదంగా భావించి సాయి పేరే పెట్టుకున్నాను. ఇటీవల కరోనా సెకండ్ వేవ్‌లో నాకు కరోనా వచ్చింది. ఆ సమయంలో, కరోనా తగ్గిన తర్వాత వచ్చిన పోస్ట్ కోవిడ్ సమస్యలతో నేను బాగా ఇబ్బందిపడ్డాను. నా షుగర్ లెవెల్స్ పెరిగాయి. అప్పుడు నేను, "తండ్రీ! నన్ను ఈ షుగర్ నుండి కాపాడండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల మూడు నెలల్లో షుగర్ నార్మల్ స్థాయికి వచ్చింది. ఇలా అడుగడుగునా బాబా నన్ను కాపాడుతూ నాకు అండగా ఉన్నారు. 'సాయికి మన బాధలు నివేదించనక్కరలేదు. ఆయన అనుక్షణమూ మనల్ని కనిపెట్టి ఉంటారని గుర్తుంచుకుంటే చాలు' అన్న ఎక్కిరాల భరద్వాజగారి మాట ఎంత నిజమో ప్రతి సాయిభక్తునికీ అనుభవం.
నేను సాయిని నా గురువుగా, దైవంగా, తండ్రిగా, స్నేహితునిగా భావిస్తాను. నా ప్రతి కష్టసుఖాన్నీ బాబాతో పంచుకుంటాను. అయితే, 'బాబా మనం కోరినదల్లా నెరవేర్చక, పూర్వకర్మ దృష్ట్యా మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు' అనే సాయిలీలామృతంలోని వాక్యాన్ని నేనెప్పుడూ నమ్ముతాను. అనుకున్నది జరగకపోతే, ‘అది మంచిది కాదేమో! అందుకే సాయి నాకు ఇవ్వలేదేమో’ అని నమ్ముతాను. అలా నమ్మినా కూడా కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు బాబా తీర్చలేదని ఆయన మీద అలిగి పూజామందిరంలోకి వెళ్ళకుండా ఉంటాను. కానీ ఏదో ఒక కారణం చేత నన్ను మళ్ళీ తన దగ్గరకు చేర్చుకుంటారు బాబా. అంతటి ప్రేమమూర్తి బాబా. ఏ మూర్తిని చూసినా కలుగని శాంతి సాయిమూర్తిని చూస్తే కలుగుతుంది. 'ఎక్కడ చిత్తం శాంతిస్తుందో అదే పరమగమ్యం' అన్న ఋషివాక్యం ఎంత సత్యమో కదా! అందుకే మన మార్గం సాయి మార్గం, మన గమ్యం సాయి. "నేను ఎవరినీ మధ్యలో విడువను, చివరికంటా గమ్యం చేరుస్తాను" అన్న సాయిమాటను దృఢంగా విశ్వసిస్తాను. అందుకే నా ఆశయం ఒకటే, నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ బాబాకి మరింత చేరువకావాలని. అందుకోసం ఆయన చెప్పిన మాటలను పాటించే దిశగా ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిజన్మలోనూ ఆయనతో బంధం కొనసాగాలనీ, ఆయన రక్షణ అనుక్షణం ఉండాలనీ సాయి దివ్యపాదాలకు వినమ్రంగా వేడుకుంటున్నాను.
బాబా అనుగ్రహంతో మామూలు స్థితికి వచ్చిన కన్ను
సాయిభక్తులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు విజయలక్ష్మి. నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 2021, ఆగస్టు 30న ఆరబెట్టిన బట్టలు తీస్తుండగా, బట్టలకు పెట్టిన క్లిప్ విరిగి మావారి కంటికి బలంగా తగిలింది. వెంటనే తన కన్ను ఎర్రబారిపోవడం, నీరు కారడం, నొప్పి పెట్టడం జరిగింది. ఇంట్లో ఐ-డ్రాప్స్ ఉంటే వేసి, ఉదయానికి తగ్గిపోతుందని అనుకున్నాము. కానీ తగ్గలేదు. దాంతో మావారు మెడికల్ షాపుకి వెళ్లి వేరే ఐ-డ్రాప్స్ తెచ్చుకున్నారు. వాటి వల్ల కూడా నయం కాలేదు. అప్పుడు నేను డాక్టరుని సంప్రదించమని మావారితో చెప్పాను. అలాగే ఆయన డాక్టరు వద్దకు వెళితే, కొన్ని టాబ్లెట్స్, ఐ-డ్రాప్స్ ఇచ్చారు. నేను ఆ మందులతోపాటు బాబా ఊదీని మావారికి ఇచ్చి, "బాబా! మావారి కన్ను మామూలుగా అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల మావారి కన్ను మామూలుగా అయింది. కానీ నా మనసులో ఎక్కడో ‘మందులు వాడటం వల్ల తగ్గిందేమో’నని ఒక అనుమానంతో వెంటనే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకోలేదు. తరువాత సెప్టెంబరు 5న మళ్ళీ మావారి కన్ను ఎర్రబారి నీరు కారడం, నొప్పి పెట్టడం మొదలైంది. వెంటనే నేను, "బాబా! మీ దయతో మావారి కన్ను మామూలుగా అయితే ఈసారి తప్పకుండా నా అనుభవాన్ని పంచుకుంటాన"ని బాబాకు మొక్కుకుని, బాబా ఊదీని నీళ్లలో కలిపి మావారి చేత తాగించాను. మరుసటిరోజుకు నొప్పి తగ్గి మావారి కన్ను మామూలుగా అయింది. అందుకే ఆలస్యం చేయకుండా నా అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless amma for her eye operation and bless me for my health and wealth. Jai sairam
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼🤗🌹😃🌺🥰🌸
ReplyDeleteOm sai ram baba mamalini kapadu thandri sainatha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete