సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 922వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా నాపై, నా కుటుంబంపై చూపుతున్న ప్రేమ
2. బాబాపై భారం వేసి నిశ్చింతగా ఉంటే ఆయనే మనల్ని రక్షిస్తారు
3. బాబాను ప్రార్థించినంతనే దొరికిన గోల్డ్ చైన్

బాబా నాపై, నా కుటుంబంపై చూపుతున్న ప్రేమ


సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు అనుపమ. ఈ బ్లాగు ద్వారా నేను బాబాకు మరింత దగ్గరవుతున్నాను. నేను ఇంతకుముందు ఈ బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోబోతున్నాను. ఒకరోజు ఉదయం మా ఇంటి గేటు బయట ఒక త్రాచుపాము పిల్ల పడగవిప్పి నుంచుంది. దాన్ని మేము ఎవరమూ గమనించకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్నాము. ఆ పాముకి ఆరడుగుల దూరంలో మా అమ్మ పూలు కోస్తుండగా హఠాత్తుగా నేను ఆ పాముపిల్లను చూసి గట్టిగా అరిచాను. ఆ అరుపులకి పొరుగింటివాళ్ళు వచ్చారు. ఆలోపు పాము ఒక రాయి కిందికి దూరింది. కానీ దాన్ని ఏదోవిధంగా చంపేశారు. బాబా దయవల్ల ఎవరికీ ఏ హాని జరగలేదు. సమయానికి ఆ పాముపై నా దృష్టి పడేలా చేసి బాబా మమ్మల్ని రక్షించారు.


అదేవిధంగా ఒకసారి నేను పొయ్యి మీద పాలు కాస్తూ వేరే పనిలో నిమగ్నమై ఉన్నాను. ఎప్పుడు, ఎలా జరిగిందో తెలీదుగాని ఒక కాళ్ళజెర్రి కాగుతున్న పాలలో పడింది. కాసేపటి తరువాత నేను మా బాబుకోసం పాలు గ్లాసులో పోసాను. ఆ జెర్రి పాత్ర అడుగుకు చేరి ఉండటం వలన నా కంటపడలేదు. మరుక్షణంలో బాబా దయవల్ల అడుగున ఏదో ఉన్నట్లు అనిపించి చూస్తే, కాళ్ళజెర్రి పాల వేడికి చనిపోయి కనిపించింది. అది చూసి ఒక్కసారిగా నా ఒళ్ళు ఝల్లుమంది. బాబా దయతో అతిపెద్ద ప్రమాదం నుండి నా బిడ్డని రక్షించారు అనుకున్నాను. "బాబా! మీరు నాపై, నా కుటుంబంపై చూపిస్తున్న ప్రేమకు శతకోటి వందనాలు".


ఒకసారి నేను బస్సుకోసం వేచి చూస్తున్నాను. అయితే అరగంట కావస్తున్నా బస్సు రాలేదు. కరోనావల్ల ఆటోచార్జీలు పెరిగి ఉన్నప్పటికీ తప్పనిసరై ఆటో ఎక్కుదామనుకుని కూడా, "బాబా! ఇంతసేపూ బస్సుకోసం ఎదురుచూసాను. మీ దయతో ఇప్పుడు కనుక బస్సు వస్తే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మనసులో అనుకున్నాను. బాబా దయచూపారు. కాసేపట్లో బస్సు వచ్చింది. "బాబా! మేము కోరిన కోరిక చిన్నదైనా పెద్దదైనా మీరు తీరుస్తారు తండ్రీ" అని మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


ప్రస్తుతం నా ముందు ఒక అతిపెద్ద సమస్య ఉంది. దాన్ని త్వరగా పరిష్కరించమని నేను నవగురువార వ్రతం చేస్తున్నాను. బాబా దయవల్ల ఆ కోరిక నెరవేరుతుందనే నమ్మకం నాకుంది. "సాయినాథా! నా కోరిక వల్ల ఒక బంధం నిలబడుతుంది. అయినా ఎవరికి, ఏది, ఎప్పుడు ఇవ్వాలో మీకు బాగా తెలుసు. నిన్ను నమ్మిన వారికెన్నడూ అన్యాయం జరగదు. త్వరగా నా కోరిక నెరవేరితే మరలా ఈ బ్లాగు ద్వారా నా అనుభవాన్ని పంచుకుంటాను సాయి. ఇంకా నా బిడ్డ భవిష్యత్తు మీ చేతిలో ఉంది బాబా. నా తల్లిదండ్రులు ఆరోగ్యం బాగుండేలా చూడు సాయి. మీ దయవల్ల నా మనస్సులో బాధ తీరితే, మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను సాయి".


సర్వేజనా సుఖినో భవంతు.


బాబాపై భారం వేసి నిశ్చింతగా ఉంటే ఆయనే మనల్ని రక్షిస్తారు


సాయిభక్తురాలు శ్రీమతి తులసి తమకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నా పేరు తులసి. శ్రీసాయినాథుని దివ్యపాదాలకు శిరస్సువంచి నమస్కరిస్తూ ఆ సమర్థ సద్గురు సాయినాథుని కరుణను, ప్రేమను సాటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను. ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ, సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు.


ఈ బ్లాగులో ప్రచురించే అనుభవాలను నేను ప్రతిరోజూ చదువుతూ ఉంటాను. కొందరి అనుభవాలను చదువుతుంటే మానసికంగా మనకు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. నా జీవితంలో కూడా బాబా అనేక అనుభవాలను ప్రసాదించారు. బాబా మాపై చూపిన ప్రేమను, దయను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. మేము హైదరాబాదులో నివసిస్తూ ఉంటాము. మావారు సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ఈ కరోనా కారణంగా గత సంవత్సరం నుంచి తనకు ఇంటినుండి పనిచేసే (వర్క్ ఫ్రం హోం) అవకాశం లభించడంతో 2020, మే నెల నుంచి మేమంతా మా అత్తగారింటికి వచ్చి అక్కడే ఉంటున్నాము. అయితే, ఇక్కడికి వచ్చి చాలారోజులు అయిందని ఒకసారి ఇల్లు చూసుకొచ్చుకుందామని 2021, ఏప్రిల్ 1వ తేదీన మేము హైదరాబాదు వెళ్ళాము. అక్కడ ఒక వారంరోజులుండి మా అమ్మగారింటికి వచ్చాము. వచ్చిన దగ్గరనుండి మావారికి జ్వరం, ఒళ్ళునొప్పులు మొదలయ్యాయి. హైదరాబాదులో మేము ఎక్కడా బయటకు కూడా వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా మా స్వంత వాహనంలోనే వెళ్ళాము. కానీ మావారికి ఇలా వచ్చేసరికి మాకు చాలా భయమేసింది. ఇంటి దగ్గర డాక్టరుకి చూపిస్తే 4 రోజులకి టాబ్లెట్స్ ఇచ్చి, ‘ఇవి వాడండి, తగ్గకపోతే చూద్దాం’ అన్నారు. టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ నాలుగు రోజులైనా కొద్దిగా జ్వరం వస్తూనే ఉంది. మావారికి భయమేసి, ‘కరోనా టెస్ట్ చేయించాలా?’ అని డాక్టరుగారిని అడిగితే, బాబా దయవలన ఆయన, “వద్దండీ, అంత అవసరం లేదు, ఇది కేవలం మామూలు వైరల్ జ్వరం అయివుండవచ్చు. బ్లడ్ టెస్ట్ చేయిద్దాం” అన్నారు. అలానే మరుసటిరోజు బ్లడ్ టెస్ట్ చేయించారు. స్వల్పంగా టైఫాయిడ్ లక్షణాలున్నాయని రిపోర్టు వచ్చింది. అదీగాక, ‘సంవత్సరం నుంచి ఆంధ్రాలో ఉంటూ ఒక్కసారిగా హైదరాబాద్ రావటంతో వాతావరణంలోనూ, త్రాగేనీటిలోనూ వచ్చిన మార్పుకి ఇలా వచ్చివుండవచ్చు’ అని చెప్పి జ్వరం తగ్గటానికి టాబ్లెట్స్ ఇచ్చారు. బాబా దయవలన ఒక్కరోజుకే మావారికి జ్వరం తగ్గిపోయింది. మళ్ళీ ఇంక జ్వరం రాలేదు


మావారికి జ్వరం తగ్గింది అనుకున్న తరువాత ఉన్నట్లుండి నాకు కొద్దిగా జ్వరం, గొంతునొప్పి, ఒళ్ళునొప్పులు వచ్చాయి. అవి తగ్గటానికి మామూలుగా వాడే మందులనే వాడాను, అయినా తగ్గలేదు. పైగా జలుబు కూడా మొదలైంది. లక్షణాలన్నీ కరోనాకి సంబంధించినవిగా అనిపించేసరికి చాలా భయమేసి బాబాను వేడుకున్నాను. మరుసటిరోజు డాక్టరుకి చూపిస్తే, “టెస్టులు ఏమీ అవసరం లేదు, రెండు రోజులకి టాబ్లెట్స్ ఇస్తాను, అవి వేసుకోండి, ఏమీ భయంలేదు” అని చెప్పారు. బాబానే ఆ డాక్టర్ రూపంలో అలా చెప్పారని అనుకున్నాను. ఇంట్లో 75 ఏళ్ళ వయసున్న మా అమ్మమ్మగారు, పెద్దవాళ్ళు ఉన్నారు. నేను బాబా మీద భారం వేసి, ‘స్తవనమంజరి’ పుస్తకాన్ని మూడురోజులు పారాయణ చేసుకున్నాను. ప్రతిరోజూ బాబా ఊదీ పెట్టుకుంటున్నప్పటికీ ఇంట్లో అందరికీ ఏదో తెలియని భయంగా ఉండేది. ఒకరోజు రాత్రి పడుకునేముందు ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలను చదువుతూ ఉన్నాను. మనసులో ఏవో ఆలోచనలు వస్తున్నాయి. “బాబా! నాకు ఇంకా గొంతునొప్పి తగ్గలేదు. వాసన, రుచి కూడా తెలియటం లేదు. ఎందుకో భయంగా ఉంది. కోవిడ్ టెస్ట్ చేయించుకోనా?” అని మనసులోనే బాబాను అడుగుతూ ఫోను చూస్తుంటే బాబా నుంచి నాకు సమాధానంగా, “నువ్వు ధైర్యంగా ఉండు. నిశ్చింతగా ఇంట్లో కూర్చో! నీ ఆరోగ్యం కుదుటపడుతుంది” అని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి నాకు చాలా ధైర్యం, సంతోషం కలిగాయి. అప్పుడు మనసులోనే బాబాతో, “బాబా, నాకు రేపు ఉదయానికల్లా గొంతునొప్పి తగ్గి, కొద్దిగా రుచి తెలిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని అనుకున్నాను. బాబా దయవలన గొంతునొప్పి తగ్గింది. రుచి కూడా కొంచెం తెలుస్తోంది. బాబా బిడ్డలమైన మనకు బాబా ఊదీ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. బాబా దయవలన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకుంది. "ధన్యవాదాలు బాబా".


బాబాను ప్రార్థించినంతనే దొరికిన గోల్డ్ చైన్

ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.


ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు, సాటి సాయిభక్తులకు నా నమస్కారాలు. నాపేరు రమాదేవి. నేను ఈ మధ్యనే సాయి మహాపారాయణలో జాయిన్ అయ్యాను. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు చదవడం మొదలుపెట్టాక సాయిబాబా నాకు ప్రసాదించిన మొదటి అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఒకరోజు మా అబ్బాయి ఒక ఫంక్షన్ కి వెళ్లొచ్చి తన గోల్డ్ చైన్ తీసి నాకు ఇచ్చాడు. నేను దాన్ని నా హ్యాండ్ బ్యాగులో వేసాను. తరువాత నేను షాపింగ్ కి వెళ్ళాను. అర్థరాత్రి గోల్డ్ చైన్ గుర్తుకు వచ్చి హ్యాండ్ బ్యాగులో చూస్తే, అది కనిపించలేదు. నేను, మావారు, మా అబ్బాయి బ్యాగులో ఉన్నవన్నీ కిందపడేసి మళ్లీ మళ్లీ వెతికినా కానీ, చైన్ కనిపించలేదు. లక్ష రూపాయల విలువైన చైన్ కనపడకపోయేసరికి టెన్షన్ తో మేము చాలా భయపడిపోయాము. నిద్రపట్టక రెండుగంటలపాటు వెతుకుతూనే ఉన్నాము. ఇక అప్పుడు నేను బాబాను ప్రార్థించి, 'చైన్ కనపడితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. అలా బాబాకు మ్రొక్కిన వెంటనే హ్యాండ్ బ్యాగులో మరోసారి చూసాము. ఆశ్చర్యం! హ్యాండ్ బ్యాగు పొరల్లో ఒక చిన్న రంధ్రం పడి లోపలకి వెళ్లిపోయిన చైన్ క్లాత్ పై నుండి చేతికి తగిలింది. ఇదంతా బాబా దయ. "థాంక్యూ సో మచ్ బాబా. ఇలాగే మాకున్న బాధలన్నీ తొలగించండి బాబా".



10 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation and bless me for my health and wealth

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌹🥰🌸🤗🌺

    ReplyDelete
  4. Om Sairam
    Sai Always Be with me

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundali thandri sainatha

    ReplyDelete
  6. Baba ma samasayalini teerchu thandri sainatha

    ReplyDelete
  7. సాయిబాబా సాయిబాబా

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo