సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 914వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహరత్నాలు
2. ఏమడిగినా అనుగ్రహిస్తారు బాబా

బాబా అనుగ్రహరత్నాలు

 

ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మి. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


మొదటి అనుభవం: మా చిన్నమ్మాయి స్కూలు టీచరుగా పనిచేస్తుండేది. అయితే, కొన్ని కారణాల వలన ఆ ఉద్యోగం కాకుండా తను మరో మంచి ఉద్యోగం ఏదైనా చేయాలని మా కోరిక. అందువలన మా అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలారోజులపాటు ప్రయత్నించింది. కానీ ఒకటి, ఒకటిన్నర మార్కులతో ఎప్పుడూ పరీక్ష తప్పేది. మేము చాలా బాధపడేవాళ్ళం. తను వివిధ రకాలైన పోటీ పరీక్షలను కూడా వ్రాసింది. తను ఎంత నిజాయతీగా ప్రయత్నించినప్పటికీ తనకి ఉద్యోగం మాత్రం రాలేదు. మేము తనకి ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని బాబాను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. అలా ఉండగా నేను మహాపారాయణ గ్రూపులో చేరాను. నేను ఆ గ్రూపులో చేరిన మూడవవారంలో మాకు తెలిసినవారి ద్వారా మా అమ్మాయికి మంచి ప్యాకేజీతో(జీతం) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. ఇలా బాబా మా కోరిక తీర్చారు. "థాంక్స్ బాబా. థాంక్యూ సో మచ్ తండ్రీ".


రెండవ అనుభవం: మా పెద్దమ్మాయికి ముఖం మీద పెద్ద పెద్ద దద్దుర్లు వచ్చాయి. అవి తగ్గుతూ, మళ్ళీ వస్తుండేవి. ఇద్దరు, ముగ్గురు డాక్టర్లకి చూపించినా తగ్గలేదు. అప్పుడు మరో స్కిన్ స్పెషలిస్ట్‌ని సంప్రదించాము. షుగర్, థైరాయిడ్, ఇంకా ఇతరత్రా టెస్టులన్నీ చేశారు. అప్పుడు నేను, "రిపోర్టులన్నీ నార్మల్‌గా రావాల"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవలన రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. తరువాత ఆ డాక్టరు చేసిన చికిత్సతో దద్దుర్లు చాలావరకు తగ్గాయి. పూర్తిగా తగ్గించమని బాబాని వేడుకున్నాను.


మూడవ అనుభవం: మా చిన్నమ్మాయి స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నపుడు ఒకరోజు ఒక విద్యార్థిని తల్లి మా అమ్మాయికి ఫోన్ చేసి, “మా అమ్మాయికి చెవికి సంబంధించిన సమస్య వచ్చింది. డాక్టరుకి చూపిస్తే, ‘ఇది మందులకు తగ్గదు, ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. తలస్నానం చేసినప్పుడు నీళ్ళు అస్సలు చెవికి తగలకూడదు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అమ్మాయి శాశ్వతంగా చెవిటిది అయిపోతుంద’ని చెప్పారు” అని చెప్పుకుని చాలా బాధపడింది. ఆ విషయం తెలిసి నేను, ‘మా పెద్దమ్మాయికి దద్దుర్లు వస్తేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది 4వ తరగతి చదువుతున్న చిన్నపిల్లకి అటువంటి సమస్య వస్తే ఆ తల్లికి ఇంకెంత బాధ ఉంటుందో కదా!’ అని చాలా బాధపడి బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. వారం రోజుల్లో ఆ విద్యార్థిని తల్లి మాకు ఫోన్ చేసి, 'మందులతో తగ్గిపోతుందని డాక్టరు చెప్పారు’ అని చెప్పాలి" అని ప్రార్థించాను. సరిగ్గా వారం తర్వాత ఆ విద్యార్థిని తల్లి మా అమ్మాయికి ఫోన్ చేసి, "డాక్టరు మందులతో తగ్గిపోతుందని చెప్పార"ని ఎంతో సంతోషంగా చెప్పింది. అంతేకాదు, వాళ్ళ పాప డాక్టరు చెప్పినట్లు మందులు వేసుకుంటూ, తలస్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుంటోందని కూడా చెప్పింది. ఇలా బాబా నా కోరిక తీర్చారు. "ధన్యవాదాలు బాబా". ఈ 2, 3 అనుభవాలను బ్లాగులో పంచుకుంటానని బాబాకి మాటిచ్చిన విధంగా మీ అందరితో పంచుకున్నాను.


నాల్గవ అనుభవం: ఒకరోజు నేను, మావారు విజయవాడ నుండి హైదరాబాదు రావడానికి బయలుదేరాము. మాతోపాటు చాలా బరువున్న రెండు పెద్ద పెద్ద లగేజీ బ్యాగులు, ఒక పెద్ద సూట్‌కేసు ఉన్నాయి. అంత బరువు మోయడం కష్టమని తలచి, "బాబా! మేము ఆటో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు లగేజీ విషయంలో ఆటోడ్రైవరు మాకు సహాయం చేసేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. అయితే మేము ఇంటినుంచి బయటకొచ్చి ఒక ఆటో మాట్లాడుకుని, లగేజ్ ఆటోలో పెట్టమని ఆ ఆటోడ్రైవరుతో చెపితే అతను, "నేను పెట్టను, మీరే పెట్టుకోండి" అని చెప్పి మాకు సహాయం చేయలేదు. ఎలాగో మొత్తానికి మేము హైదరాబాదు రైల్వేస్టేషన్‌లో దిగాము. అక్కడ అతి కష్టం మీద మా లగేజీ బ్యాగులు మోసుకొస్తున్నాము. నేను ముందు మెట్లు ఎక్కుతున్నాను, వెనక మావారు వస్తున్నారు. హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చాడో తెలియదుగానీ ఒక వ్యక్తి వచ్చి మావారి చేతిలోని సూట్‌కేస్ తీసుకున్నాడు. మేము స్టేషన్ బయటకి వచ్చి ఆటో ఎక్కేవరకు అతను మాతోనే ఉన్నాడు. డబ్బు ఇంత ఇవ్వమని డిమాండ్ కూడా చేయలేదు. మేము ఇచ్చినంత తీసుకుని వెళ్లిపోయాడు. సగం దూరం వెళ్లిన తర్వాత విజయవాడలో బయలుదేరేటప్పుడు నేను సహాయం కోసం బాబాని ప్రార్థించిన సంగతి గుర్తొచ్చి ఆనందాశ్చర్యాలకు లోనై బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. “ధన్యవాదాలు సాయీ”.


ఐదవ అనుభవం: ఒకరోజు రాత్రి నాకు బాగా తలనొప్పి వచ్చింది. అదే తగ్గిపోతుందని చూశానుగానీ, తగ్గే సూచనలు కనిపించలేదు. అప్పుడు మా అమ్మాయిని బాబా ఊదీ ఇవ్వమని అడిగాను. తను బాబా ఊదీ తెచ్చిస్తే, కొద్దిగా ఊదీని నా నుదుటన పెట్టుకుని, మరికొంత ఊదీని నీటిలో వేసుకుని త్రాగాను. ఐదు నిమిషాల తర్వాత మా అమ్మాయి, "మమ్మీ, ఇప్పుడు ఎలా ఉంది? తలనొప్పి తగ్గిందా?" అని అడిగింది. నిజానికి అప్పటికే నేను గాఢనిద్రలోకి జారుకున్నాను. నా తండ్రి ఊదీ మహాత్మ్యం వలన తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది.


ఆరవ అనుభవం: చాలా సంవత్సరాల క్రితం ఎడమవైపు పన్ను ఒకటి పుచ్చిపోతే ట్రీట్మెంట్ తీసుకున్నాను. పుచ్చినంతవరకు క్లీన్ చేసి సిమెంట్ వేసినందువల్ల మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే పన్ను దగ్గర క్రాక్ వచ్చి విపరీతమైన నొప్పి పెట్టింది. ట్రీట్మెంట్ తీసుకుంటే, మళ్లీ 11 నెలలకి సమస్య వచ్చింది. అప్పుడు నేను, "బాబా! చికిత్స చేసేటప్పుడు నొప్పిని నేను భరించలేను. మీ ఊదీ పెట్టుకుంటాను, మందులతోనే తగ్గిపోయేలా చూడండి బాబా" అని బాబాను వేడుకున్నాను. తరువాత డాక్టరు వద్దకి వెళితే, "ఇన్ఫెక్షన్ అయింది. మందులు వాడితే తగ్గిపోతుంది" అని చెప్పారు. "ధన్యవాదాలు బాబా".


ఏడవ అనుభవం: ఒకసారి నేను మెహందీ డిజైన్ కోర్సులో చేరాను. రోజూ క్లాసు అయిన తర్వాత ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసేదాన్ని. అదే సమయంలో సప్తాహపారాయణ చేయాలని మొదలుపెట్టాను. కానీ ఏదో గబగబా చదివేసి, నా శ్రద్ధ అంతా మెహందీ డిజైన్ మీద పెట్టేదాన్ని. మొదట నేను గమనించలేదుగానీ, మెహందీ ప్రాక్టీస్ ఎప్పుడు చేసినా విపరీతంగా తలనొప్పి వచ్చేది. మెహందీ ప్రాక్టీస్ చేసే సమయంలో తప్ప  మిగతా సమయంలో తలనొప్పి ఉండేది కాదు. క్రమంగా నాకు అది అర్థం అయింది. అప్పుడు నేను, "బాబా! నన్ను క్షమించండి" అని బాబాతో చెప్పుకుని శ్రద్ధగా ముందు పారాయణ చేసిన తర్వాత మెహందీ ప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పటినుంచి తలనొప్పి రాలేదు. ఈ విధంగా నా తప్పు నాకు తెలిసేలా చేశారు బాబా. "క్షమించు తండ్రీ. ఆపదలో ఉన్నవారిని, మీ సహాయం కావలసిన అందరినీ ఆదుకో తండ్రీ".


ఏమడిగినా అనుగ్రహిస్తారు బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! 


నేనొక సాయిభక్తురాలిని. ఈమధ్య ఒకసారి మా బావగారికి జ్వరం వచ్చింది. కరోనా సమయంలో జ్వరం అంటేనే చాలా భయం పుడుతోంది. పైగా జ్వరంతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. నాకు అవి కరోనా లక్షణాలులానే అనిపించాయి. వెంటనే నేను, "బాబా! మీ కృపవలన బావగారికి జ్వరం తగ్గిపోతే ఈ అనుభవాన్ని 'సాయిభక్తుల అనుభవమాలిక'లో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా అద్భుతం చేశారు. వెంటనే మా బావగారికి జ్వరం తగ్గిపోయింది. తరువాత మా అమ్మకి కూడా జ్వరం వచ్చింది. అప్పుడు కూడా నేను ‘అమ్మకి జ్వరం తగ్గితే 'సాయిభక్తుల అనుభవమాలిక'లో పంచుకుంటాన’ని మునుపటిలాగే బాబాకి మ్రొక్కుకున్నాను. అయితే, అమ్మకి ఇంకా జ్వరం తగ్గలేదు. కానీ బాబా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ముందుగానే ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. "అమ్మావాళ్లని కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు ధన్యవాదాలు బాబా. మీ పాదాలకు నా శతకోటి వందనాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



4 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om sai ram baba na samasyalani toligipovali thandri

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺🥰🌸🤗🌹😀🌼

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo