1. ఇలా పిలవగానే అలా కరుణించే బాబా2. బాబా అనుగ్రహంతో సకాలంలో పూర్తైన రిజిస్ట్రేషన్
ఇలా పిలవగానే అలా కరుణించే బాబా
సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం!
తరుం కల్పవృక్షాధికం సాధయం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం!!
శ్రీ సాయినాథుని దివ్యచరణాలకు నమస్కరిస్తూ నా అనుభవాలను సాటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను. నా పేరు మహేష్. 2021, ఆగస్టు చివరి వారంలో మా అమ్మకి జ్వరం వచ్చి, రోజురోజుకీ ఎక్కువ కాసాగింది. మందులు వాడుతున్నప్పటికీ జ్వరం తగ్గలేదు. అప్పుడు వేరే హాస్పిటల్‌కి వెళ్తే, డాక్టరు బ్లడ్ టెస్ట్, టైఫాయిడ్, మలేరియా టెస్టులు చేయించమన్నారు. సరేనని అన్ని టెస్టులూ చేయించాము. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! అమ్మకి ఎలాంటి వైరల్ జ్వరం రాకూడదు. కొంచెం బ్లడ్ తక్కువ ఉందనే రిపోర్ట్ రావాలి. అలా వస్తే నా అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. కాసేపటికి రిపోర్ట్ వచ్చింది. అద్భుతం! రిపోర్టులో 'అమ్మకు ఎలాంటి వైరల్ జ్వరమూ లేదు, కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది' అని వచ్చింది. వెంటనే నేను బాబాకు నమస్కరించుకుంటూ బయటకు వచ్చాను. హాస్పిటల్ గేటుపై వ్రాసి ఉన్న 'శ్రీసాయి' అన్న అక్షరాలు చూసిన క్షణాన 'సాయిబాబా ఎల్లప్పుడూ మనతోనే ఉన్నార'ని నాకు అర్థమైంది. సాయినాథుని దయవల్ల అమ్మకి రెండు రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గింది. "మీకు వేలవేల వందనాలు సాయినాథా!".
మరో అనుభవం: 2021, వినాయకచవితి సమయంలో నా స్నేహితునికి జలుబు చేసింది. అతనితో ఎక్కువగా ఉండటం వల్ల నాకు కూడా జలుబు చేసింది. తరువాత కూడా స్నేహితులతో కలిసి రెండు మూడుసార్లు కూల్‌డ్రింక్స్ త్రాగాము. దాంతో జలుబు విపరీతంగా పెరిగి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దాంతోపాటు ఒంటినొప్పులు కూడా మొదలయ్యాయి. నేను భయపడి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. అయినా తగ్గలేదు. అప్పుడు, "నా ఆరోగ్యం మంచిగా అయితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మన బాబాను వేడుకున్నాను. అంతే! అంత తీవ్రమైన జలుబు తగ్గుముఖం పట్టింది. అంతా సాయిబాబా కృప. "చాలా ధన్యవాదాలు బాబా".
ఇంకో అనుభవం: మా ఊరు సిద్ధిపేటకి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం. మా అక్క, అన్నయ్య వాళ్ళు హైదరాబాదులో ఉంటారు. మా నాన్నగారి పేరు మల్లయ్య. నాన్నకి చదువు రాదు. అయినా ఒక్కరే అప్పుడప్పుడు హైదరాబాదు వెళ్లొస్తుంటారు. అలాగే 2021, సెప్టెంబరు 20, మధ్యాహ్నం ఒంటగంటకు బయలుదేరి అక్క, అన్నయ్యలను చూడాలని నాన్న హైదరాబాదు వెళ్ళారు. ఆ సాయంత్రం అన్నయ్య ఫోన్ చేసి, "నాన్న ఇంటికి ఇంకా రాలేదు" అని చెప్పాడు. దాంతో అందరం చాలా ఆందోళన చెందాము. మా మామయ్యవాళ్ళకు, బావవాళ్లకు 'నాన్న వచ్చాడా?' అని పదేపదే ఫోన్ చేస్తూ ఉన్నాం. అయితే మధ్యాహ్నం బయలుదేరిన నాన్న రాత్రి 8.30 దాటినా అన్నయ్య, అక్కల వద్దకు చేరలేదు. నాకు ఒకటే కంగారుగా అనిపించి, "బాబా! నాన్నని క్షేమంగా అక్క, అన్నయ్యల వద్దకు చేర్చు. నాన్న క్షేమంగా అక్కడికి చేరుకుంటే, నా అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. ఆశ్చర్యం! బాబాని వేడుకుని 10 నిమిషాలైనా కాలేదు, అన్నయ్య ఫోన్ చేసి, "నాన్న ఇప్పుడే అక్కావాళ్ళ ఇంటికి వచ్చాడు" అని చెప్పాడు. పిలిచిన వెంటనే పలికే దైవం మన బాబా. ఇలా పిలవగానే అలా కరుణించారు.
ఇంకొక చిన్న అనుభవం: ఇటీవల ఒకరోజు మేము కొమురవెల్లి శ్రీమల్లిఖార్జునస్వామిని దర్శించుకుందామని సిద్ధమయ్యాము. ఆరోజు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడు నేను, "బాబా! వర్షం తగ్గించి మాకు మల్లిఖార్జునస్వామి దర్శనం చేయించు" అని బాబాను వేడుకున్నాను. కొద్దిసేపట్లోనే వర్షం తగ్గింది. మేము మా ఊరిలో ఉన్న ఒక ఆటో అతనికి ఫోన్ చేశాము. అతను వెంటనే వచ్చాడు. ఆ ఆటోడ్రైవరు పేరు సాయి. అతను మమ్మల్ని అరగంటలో కొమురవెల్లికి చేర్చాడు. మేము అక్కడికి చేరుకోగానే వర్షం మళ్ళీ మొదలైంది. అంతసేపూ బాబా మాకోసమే వర్షాన్ని ఆపారని నాకు అర్థమైంది. బాబా దయవలన శ్రీమల్లిఖార్జునస్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చాము. "ఇలానే మీ అనుగ్రహం మాపై ఎల్లవేళలా ఉండాలి సాయినాథా. దయతో నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదించండి బాబా. అదేవిధంగా, నేను బయటకు చెప్పుకోలేని ఒక అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నాను సాయినాథా. చాలా ఇబ్బందిగా ఉంది, నయం చేయండి, ప్లీజ్ బాబా".
మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకొస్తాను.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా అనుగ్రహంతో సకాలంలో పూర్తైన రిజిస్ట్రేషన్
సాయిభక్తులందరికీ నా ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా చిన్నతనం నుండి బాబా నాకు ఎల్లవేళలా తోడుగా ఉన్నారు, ఎన్నో ఆపదల నుండి నన్ను కాపాడారు. ఇప్పుడు నేను ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని పంచుకుంటున్నాను. బాబా అనుగ్రహంతో మేము ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాము. అందులో భాగంగా మేము మొదట కొంత డబ్బిచ్చి సేల్ అగ్రీమెంట్ చేసుకున్నాము. అప్పటినుండి 45 రోజుల లోపల మేము మిగతా డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే, మేము ఆ ఇంటిని అమ్ముతున్న వాళ్ళకి లక్షరూపాయలు ఇవ్వాలి. అది కాకుండా ఇక మాకు ఆ ఇల్లు దక్కుతుందో, లేదో తెలియని పరిస్థితి. కాబట్టి మేము వెంటనే బ్యాంకులో లోన్ కోసం అప్లై చేసాము. అయితే 30 రోజులు పూర్తవుతున్నా లోన్ ప్రక్రియ కొంచెం కూడా ముందుకు పోలేదు. దాంతో చాలా తక్కువ సమయం ఉండటం వలన మాకు ఏం చేయడానికి దిక్కు తోచలేదు. అంతలో బ్యాంకు వాళ్ళు ఈ వారంలో లోన్ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. కానీ, ఏదో ఒక ఆటంకం వస్తూ చివరికి గడువులో ఒక్క వారం మాత్రమే మిగిలింది. అప్పుడు నేను, "బాబా! మాకు లోన్ వచ్చి, ఎలాగైనా గడువు లోపల రిజిస్ట్రేషన్ పూర్తి అవ్వాలి. అలా జరిగితే, నేను ఈ అనుభవాన్ని సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. ఆయన అనుగ్రహంతో ఏ ఆటంకాలు లేకుండా రిజిస్ట్రేషన్ సకాలంలో పూర్తి అయ్యింది. "ధన్యవాదాలు బాబా. మీ దయ మా కుటుంబానికి ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteTq baba,tq so much(flat, admission)
ReplyDeleteOm sai ram nice sai leelas. I love you Sai. Be with us and bless all ❤❤❤
ReplyDeleteOm sai ram baba amma Arogyam bagundali thandri enka na arogya samasya kuda tagginchu thandri sainatha
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌼😀🌺🥰🌸😃🌹
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete