1. శ్రీసాయి ఆశీస్సులు
2. ఎల్లవేళలా కాపాడుతున్న బాబా
3. మొర ఆలకించిన బాబా
శ్రీసాయి ఆశీస్సులు
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక చిన్న సాయి భక్తురాలిని. నేను రోజూ ఈ బ్లాగులో వచ్చే అనుభవాలను చదువుతూ ఉంటాను. ఈ బ్లాగు వలన నేను బాబాకి చాలా దగ్గరయ్యాను. బ్లాగులో వచ్చే బాబా సందేశాల వలన నాకు బాబాపై విశ్వాసం, నమ్మకం పెరిగాయి. ఇక నా అనుభవాల విషయానికొస్తే... బాబా నా జీవితంలోకి వచ్చిన తరువాత ఎన్నో అద్భుతాలను చేశారు. వాటిని పంచుకోవడం ఇదే మొదటిసారి.
నేను 2021, ఆగస్టు 6వ తేదీన జరిగిన ఎంసెట్ పరీక్ష వ్రాసి, "నాకు మంచి ర్యాంక్ ప్రసాదించండి బాబా. గుడికి వెళ్లి, కొబ్బరికాయ కొడతాన"ని బాబాతో చెప్పుకున్నాను. ఇంకా సాయికోటి కూడా వ్రాశాను. ఆగస్టు 25న విడుదల అయిన ఫలితాలలో నేను అడిగినట్లే సాయి నాకు మంచి ర్యాంక్ ప్రసాదించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీకు నేను ఎంతో ఋణపడి ఉన్నాను".
2021లో నేను నెలసరి సమస్యతో ఇబ్బందిపడ్డాను. అప్పుడు నేను సాయిని వేడుకుని, "బాబా! నాకు ఈ సమస్య తగ్గేలా అనుగ్రహించండి" అని చెప్పుకున్నాను. తరువాత నేను రోజూ పడుకునే ముందు సాయి ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగాను. బాబా దయవలన కొన్ని రోజుల తరువాత నాకు తగ్గిపోయింది.
2021, సెప్టెంబర్ 3వ తేదీన మేము మా మామయ్య వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాము. మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా పక్కా రోడ్లు వేయలేదు. ఉన్న మామూలు రోడ్లు కూడా అంతగా బాగాలేవు. గృహప్రవేశం రోజు, ఆ ముందురోజు బాగా వర్షం పడటం వల్ల మేము వెళ్ళేటప్పుడు ఒక రాయి కారు టైర్‌కి అడ్డం పడి కారు ముందుకు వెళ్ళలేదు. నేను చాలా భయపడి, సాయి నామస్మరణ చేస్తూ, "మేము ఇంటికి జాగ్రత్తగా చేరుకోవాల"ని సాయిని వేడుకున్నాను. మరుక్షణంలో అక్కడికొక ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తిని సాయే పంపించారని నాకనిపించింది. ఆ వ్యక్తి మా కారును కొంచెం ముందుకు తీసుకెళ్ళి పెట్టాడు. తరువాత మేము ఇంటికి క్షేమంగా చేరుకున్నాము. "సాయినాథా! ఎప్పుడూ నాతోనే ఉంటూ నన్ను, నా కుటుంబాన్ని మంచిగా చూసుకోండి. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉంటాయని ఆశిస్తున్నాను. నా మనసులో ఉన్న కోరికను తీర్చండి బాబా" .
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!!
ఎల్లవేళలా కాపాడుతున్న బాబా
సాయిభక్తులకు నమస్కారం. నేను సాయిభక్తురాలిని. మేము 2020, మార్చిలో ఒక ఇల్లు తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆర్థిక సమస్యల కారణంగా అప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదు. తర్వాత 2021లో చేసుకుందాం అంటే సమస్య వచ్చింది. ఆ ఇంటి యజమాని ఒక NRI అయినందున ఆ ఇంటికి సంబంధించి చట్టపరమైన అధికారాన్ని తన స్నేహితునికి ఇచ్చారు కానీ, అది గడువు ముగిసింది. దాంతో మేము మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాల్సి వచ్చింది. అందుకై మేము డాక్యూమెంట్లు కొరియర్ ద్వారా యు.ఎస్. పంపాము. సరిగ్గా అదే సమయంలో 2వ సారి లాక్డౌన్ ప్రకటించడంతో మేము భయపడి సాయిబాబా నవగురువార వ్రతం ప్రారంభించాము. అద్భుతం! మొదటివారమే బాబా తమ అనుగ్రహాన్ని మాపై కురిపించారు. పూజ జరుగుతుండగా డాక్యుమెంట్ రైటర్ ఫోన్ చేసి, "దయచేసి మీరు వచ్చి రిజిస్ట్రేషన్ కోసం అవసరమయ్యే డబ్బులు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోండి" అని చెప్పారు. పూజ పూర్తయిన తర్వాత మేము ఆఫీసుకు వెళ్లి, డబ్బులు కట్టాము. బాబా కృప వలన మంగళవారం నాటికి మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.
2021లో నేను మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందు నాకు చర్మ సంబంధిత అలెర్జీ కారణంగా దురద, దద్దుర్లు చాలాసార్లు వచ్చాయి. అందువలన వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడ్డాను. కానీ చివరకు ఎలాగో వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఆ రోజు కొద్దిపాటి జ్వరం వచ్చింది. పైగా మునుపటిలా అవే చర్మ సమస్యలు ఇబ్బందిపెట్టాయి. కానీ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఇతరత్రా మందులు ఉపయోగించలేకపోయాను. అందుచేత బాబా ఊదీ ఉపయోగించాను. దాంతో బాబా దయవల్ల చర్మ సమస్యలు సమసిపోయాయి. బాబా కరోనా మరియు ఇతర ఆరోగ్య సమస్యల నుండి మా కుటుంబాన్ని సదా కాపాడారు. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు".
మొర ఆలకించిన బాబా
సాయిభక్తులకు నమస్కారం. నా పేరు మూర్తి. నేను వైజాగ్‌లో నివాసం ఉంటున్నాను. నేను సర్వస్య శరణంగా శిరిడీ సాయిని నమ్ముకున్నవాడిని. బాబా నాకు ఎల్లవేళలా తోడుగా ఉండి కష్టాలను దాటించి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ బ్లాగును చదివే అవకాశం కల్పించిన బాబాకి నా కృతజ్ఞతలు. నేను కూడా బాబా నాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాల నుండి రెండు అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021లో నాకు కొద్దిగా దగ్గు, ఆయాసం వచ్చాయి. అప్పటికి నాలుగు సంవత్సరాల ముందు నా గొంతుకి ఒక చిన్న ఆపరేషన్ అయి ఉన్నందున మళ్ళీ ఇప్పుడు ఏ సమస్య వచ్చిందోనని భయపడ్డాను. హాస్పిటల్లో చేరితే, పరీక్షలు చేసిన మీదట లైట్‌గా కరోనా ఉందని చెప్పారు డాక్టరు. రెండు రోజులు హాస్పిటల్లో ఉండి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, "బాబా! నాకు కరోనా తగ్గించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన తొందరగానే నా ఆరోగ్యం కుదుటపడింది. నాపై చూపిన ప్రేమకు ఆనందంగా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు బాబాకు సమర్పించుకున్నాను.
నాకు ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం ఉంది. 2021లో సుమారు 12 లక్షల సరుకు లోడు చేసిన లారీని దొంగలు డ్రైవరుని, క్లీనరుని కొట్టి పట్టుకుని పోయారు. నేను, "బాబా! లోడుతో సహా లారీ దొరికేలా చూడండి" అని బాబాకి మొరపెట్టుకున్నాను. బాబా నా మొర ఆలకించి అంతా సుఖాంతం చేశారు. నేను బాబాకి ఋణపడి ఉన్నాను. "ధన్యవాదాలు బాబా".
