సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మహల్సాపతి - ఐదవ భాగం



బాబా దృష్టి తమ భక్తుల ప్రాపంచిక ప్రయోజనాలపైన మాత్రమే కాకుండా వారి నైతిక ప్రవర్తనపై ఎంతగానో ఉండేది. ఆయన తరచూ, "ఏ ఋణానుబంధం లేకుండా ఎవరూ మన వద్దకు రారు. కుక్క, పంది, ఈగ మొదలైనవి ఏవైనా అంతే. కనుక, ‘ఛీ, ఛీ, పో, పొమ్మ’ని ఎవరినీ తరిమివేయకండి. ఎవరైనా మీ వద్దకు వస్తే అలక్ష్యం చేయక ఆదరించండి" అని చెప్పేవారు. అయితే, బాబా ఎన్నడూ అనవసరమైన ఉపన్యాసాలు ఇచ్చేవారు కాదు. ప్రత్యేకమైన లీలల ద్వారా తాము బోధించినవాటిని భక్తులతో ఆచరింపజేసేవారు. ఎంతటి భక్తునికైనా ఏమారే క్షణాలుంటాయి గాబోలు! సహజంగా మహల్సాపతి ధర్మబద్ధమైన వ్యక్తి అయినప్పటికీ కొన్నిసార్లు తప్పటడుగు వేసేవాడు. అతను రోజూ రాత్రిపూట ఒక కుంటికుక్కకు అన్నం పెడుతుండేవాడు. అది తిని వెంటనే వెళ్ళిపోయేది. కానీ ఒకరోజు అతడెంత అదిలించినా అది అక్కడినుండి కదలలేదు. దాంతో మహల్సాపతి ఒక కర్ర తీసుకొని దాన్ని కొట్టాడు. అది నొప్పితో అరుస్తూ పారిపోయింది. తరువాత మహల్సాపతి మసీదుకెళ్లి, బాబా పాదాలొత్తుతుండగా అక్కడున్న బాపూసాహెబ్ జోగ్, దాదాకేల్కర్ మొదలైన భక్తులతో బాబా, "అరే, ఈ గ్రామంలో నాలాంటి రోగిష్టి కుక్క ఉంది. అందరూ దాన్ని కొట్టేవారే!" అని అన్నారు. బాబా మాటలు వింటూనే మహల్సాపతి కొంతసేపటి క్రితం తన ప్రవర్తనను గుర్తుచేసుకొని పశ్చాత్తాపపడ్డాడు. కానీ అటువంటి పరిస్థితి అతనికి మరోసారి వచ్చింది. ఒకసారి మహల్సాపతి తండ్రి సంవత్సరీకంనాడు అతిథులొచ్చి భోజనానికి కూర్చున్నారు. అకస్మాత్తుగా ఒక గజ్జికుక్క వచ్చి వాళ్ళ ముందు నిలబడింది. మహల్సాపతి ఆ కుక్కకొక రొట్టెముక్క వేయమని తన భార్యతో చెప్పాడు. కానీ ఏ కారణం చేతనో ఆమె రొట్టెముక్క వేయలేదు. కొంతసేపటి తరువాత ఆ కుక్క ఇంకా అక్కడే ఉండటం చూసిన మహల్సాపతి దాన్ని కొట్టి తరిమేశాడు. ఆ రాత్రి అతను బాబా కోసం పడక సిద్ధం చేస్తుండగా మునపటిలాగే బాబా అతనితో, "గ్రామంలో జబ్బుతో బాధపడుతున్న నాలాంటి రోగిష్టి కుక్క ఉంది. ఎందుకురా భగత్, ప్రజలు దాన్ని కొడుతున్నారు?” అని అన్నారు.

ఇంకోసారి, నోట చొంగ కారుతున్న రోగగ్రస్తమైన కుక్క ఒకటి తోకాడించుకుంటూ మహల్సాపతి దగ్గరకు వచ్చింది. అతను దాన్ని చీదరించుకొని రాయి విసిరి తరిమికొట్టాడు. అది బాధతో అరుస్తూ పారిపోయింది. తరువాత అతను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా అతనిని చూపిస్తూ ఇతర భక్తులతో, "నేను ఎంతో ఆశతో కొద్దిపాటి ఆహారం కోసం ఈ భగత్ వద్దకు వెళ్ళాను. కానీ నాకు లభించింది దెబ్బలు మాత్రమే" అని అన్నారు. ఈ సంఘటన ఉదయం జరిగింది. రెండు గంటల తరువాత దీక్షిత్ వాడాలో భక్తులు భోజనాలు చేస్తున్నారు. అకస్మాత్తుగా ఒక కుక్క వచ్చి వాడా మెట్లమీద కూర్చుంది. దీక్షిత్ దాన్ని తరిమేస్తే అది పరిగెత్తుకుంటూ వెళ్లి కాస్త దూరంలో మరోచోటనున్న మెట్ల మీద కూర్చుంది. అక్కడ ఎవరో దాన్ని రాయితో కొట్టారు. అది బాధతో అరుస్తూ భయపడుతూ పారిపోయింది. దాని అరుపులు విన్న భక్తులు ఆరోజు ఉదయం బాబా అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. దీక్షిత్ మనసు నొచ్చుకోగా బాధతో, "నేను ఆ కుక్కను తరిమికొట్టకుండా ఒక రొట్టెముక్క ఇచ్చివుంటే, అది ఇలా గాయపడకుండా వెళ్లిపోయేది కదా" అని అనుకున్నాడు. అదేరోజు సాయంత్రం దాసగణు తన కీర్తనలో నామదేవునికి సంబంధించిన ఒక కథను ఆలపించాడు. దాని సారం: 'ఒకసారి నామదేవుడు విఠలుని విగ్రహం వద్ద నివేదించిన పళ్లెంలోని రొట్టెముక్కను ఒక కుక్క తన నోటిలో కరుచుకొని పరుగుతీసింది. అది చూసిన నామదేవుడు, "దేవా! ఎండురొట్టె తినకండి. ఇదిగో, ఈ నెయ్యితో తినండి" అంటూ ఒక గిన్నెతో నెయ్యి పట్టుకొని ఆ కుక్కకు అందించడానికి దాని వెనుక పరుగుతీశాడు' అని. అదేరోజు రాత్రి మారుతి మందిరంలో మాధవరావు అడ్కర్ ‘భక్తలీలామృతం’ అనే గ్రంథాన్ని పఠించాడు. అతను చదివిన భాగంలో పైన చెప్పిన నామదేవుని కథే వచ్చింది. ఆ విధంగా బాబా ఆరోజు ఉదయం తాము బోధించిన విషయానికి బలాన్ని చేకూర్చారు. బాబా అనుసరించిన పద్ధతికి అందరూ ఆశ్చర్యపోయారు.

అహంకార మమకారాలను జయించడంలో సాధకులు పెద్ద విషయాలలో జాగ్రత్త వహిస్తూ, చిన్న చిన్న విషయాలలో తప్పటడుగు వేయటం సామాన్యంగా జరుగుతుంటుంది. కానీ, ఘటనాఘటన సమర్థుడైన సద్గురువు తనదైన అద్భుతరీతిలో తన భక్తుని మనస్సు అడుగుపొరల్లో దాగిన ఆశామమకారాలను వెలికితీసి, గుర్తింపజేస్తాడు. ఒకసారి ఖండోబా ఆలయంలో దొంగతనం జరిగింది. మహల్సాపతి వాడుకొనే ఉన్ని జంఖానా, కొన్ని పాత్రలు దొంగిలించబడ్డాయి. ఆ కంబళి అంటే మహల్సాపతికి చాలా ప్రీతి. ఆ వస్తువుల కోసం వెతికి, ఇక వాటిమీద ఆశ వదులుకున్నారు. కొన్నిరోజుల తర్వాత డోర్హాలాలో ఉన్న మహల్సాపతి కూతురు (గ్రామస్థులు బట్టలు ఉతుక్కునే బండ దగ్గరకు) బట్టలు ఉతుక్కునేందుకు వెళ్ళినప్పుడు, ఒక మహిళ ఉతికేందుకు తెచ్చిన కంబళిని చూచి, అది తన తండ్రిదని గుర్తించి, గ్రామపటేలుకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళను ప్రశ్నిస్తే, ఆమెకు ఆ కంబళి ఇచ్చిన దొంగ కూడా దొరికాడు. పటేలు ఆ కంబళిని గుర్తించి తీసుకొని పొమ్మని మహల్సాపతికి కబురుపెట్టాడు. మహల్సాపతి ఆ కంబళి తెచ్చుకోవడానికి బాబా అనుమతి కోరితే, "ఏం లాభం? నీవు వెళ్ళినా ఒకటే, వెళ్ళకున్నా ఒకటే" అన్నారు బాబా. అయినా బాబా మాటలు లెక్కచేయక డోర్హాళ్ వెళ్ళాడు మహల్సాపతి. కంబళి దొరికింది. కానీ తన వియ్యపురాలు ఆ కంబళిని తనకివ్వమని కోరడంతో, దాన్ని ఆమెకు ఇవ్వక తప్పిందికాదు. బాబా మాటల్లోని అంతరార్థం, జరిగినదాన్లోని పరమార్థం అప్పుడు అతనికి స్ఫురించింది. ఆ దొంగ తనకు పరోక్షంగా మేలే చేశాడని గుర్తించి, ఆ దొంగపై ఫిర్యాదు ఉపసంహరించుకొని, ఆ దొంగను క్షమించి వదలివెయ్యమని పటేలును అభ్యర్థించి, వట్టి చేతులతో, వట్టిపోయిన మనస్సుతో, నిర్వికారంగా శిరిడీ చేరాడు మహల్సాపతి. ఆ విధంగా మహల్సాపతి జీవితంలో జరగబోయే అనేక సంఘటనలను గురించి బాబా ముందే చెప్పేవారు.

బాబా మాట్లాడే మాటలు నర్మగర్భంగానూ, ఎంతో నిగూఢంగానూ ఉండేవి. పలు సందర్భాల్లో వారు మాట్లాడే ఆ మాటలను భక్తులు అర్థం చేసుకోలేకపోయేవారు. అందువల్ల వాళ్లలో చాలామంది మహల్సాపతిని ఆశ్రయించి, బాబా మాటలకు అర్థమేమిటో చెప్పమని అడిగేవారు. ఎందుకంటే, బాబాతో నిరంతర సహవాసం వలన బాబా బాహ్యంగా వ్యక్తపరిచే వింత ప్రవర్తనను, విచిత్ర చర్యల యొక్క అంతరార్థాన్ని మహల్సాపతి అర్థం చేసుకోగలిగేవాడు; బాబా సంజ్ఞలకు, నిగూఢమైన వారి మాటలకు అర్థాన్ని వివరించగలిగేవాడు. బాబా కూడా విద్యావంతులైన అనేకమంది భక్తులను మహల్సాపతి వద్దకు పంపేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ ఇలా వ్రాశాడు: "మహల్సాపతి ఆధ్యాత్మికతపై పట్టు సాధించాడు. ప్రాపంచిక విషయాలపట్ల ఎలాంటి కోరికలు లేకుండా ఉండేవాడు. అతని ద్వారా సాయిభక్తులు జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందేవారు. బాబా మహాసమాధి అనంతరం ఎంతోమంది సాయిభక్తులకు అతను ఓదార్పునిచ్చే వ్యక్తి అయ్యాడు”.

బాబా మహాసమాధి చెందడానికి పది పన్నెండు రోజుల ముందు, భక్తులు బాబా పడకను సిద్ధం చేస్తున్న సమయంలో, బాబా తాము పరుండే సమయంలో తమ తలక్రింద పెట్టుకొనే ఇటుక మాధవ్‌పస్లే చేతినుండి జారి క్రిందపడి రెండు ముక్కలైపోయింది. మహల్సాపతి ఆ ఇటుక ముక్కలను ఎప్పటిలానే గుడ్డలో చుట్టి బాబా తలదిండుగా ఉంచాడు. బాబా అది గమనించి ఆ ఇటుక ముక్కలను చేతిలోకి తీసుకుని, “దీన్ని ఎవరు విరగ్గొట్టారు?” అని అడిగారు. మహల్సాపతి మాధవ్‌ఫస్లే పేరు చెప్పగా బాబా అతనిపై కోప్పడ్డారు. కానీ మరుక్షణమే శాంతించి, ఆ ఇటుక ముక్కలను తమ చెక్కిలికి ఆనించుకుని, "నా జీవిత సహచరి విరిగిపోయింది" అంటూ కన్నీరు కార్చారు. మరుసటిరోజు ఉదయానికి కూడా బాబా దిగులుగానే ఉన్నారు. బాబా దిగులుగా ఉండటం గమనించిన కాకాసాహెబ్ దీక్షిత్, “బాబా! ఇటుక విరిగినందుకు విచారించనవసరంలేదు. ఆ రెండు ఇటుక ముక్కలను వెండితో జతచేయించి ఇస్తాను” అని చెప్పాడు. బాబా చిన్న నవ్వు నవ్వి, "నువ్వు వీటిని బంగారంతో జతపరిచినా ఉపయోగం ఏమిటి? ఈ ఇటుక నా జీవిత సహచరి. ఇది విరిగిపోవడం అశుభాన్ని సూచిస్తుంది!" అని అన్నారు. అప్పటినుండి బాబా విచారంగా ఉంటున్నట్లు మహల్సాపతికి అనిపించింది. కానీ రానున్న తమ అవసాన ఘడియల గురించి బాబా సూచిస్తున్నారని అతను తెలుసుకోలేకపోయాడు. ఈ సంఘటన జరగడానికి ముందొకసారి కూడా బాబా మహల్సాపతికి అటువంటి సూచననే ఇచ్చారు. ఒకరోజు సాయంకాలం మహల్సాపతి దీపం వెలిగించి, చిలిం నింపబోతుండగా బాబా అతనితో, "అరే భగత్, కొద్దిరోజుల్లో నేను ఎక్కడికో వెళ్తాను. ఆ తరువాత 2 లేదా 4 సంవత్సరాలపాటు రాత్రిళ్ళు నువ్వు ఇక్కడికి(మసీదుకి) వస్తావు" అని అన్నారు. ఆ మాటలు మహల్సాపతికి అర్థం కాలేదు.

1918, అక్టోబరు 15వ తేదీన బాబా మహాసమాధి చెందారు. అప్పటివరకు ఆయనతో తనకున్న అనుబంధం కారణంగా బాబా వియోగాన్ని భరించలేని మహల్సాపతి అన్నపానాలను త్యజించి 13 రోజులపాటు పస్తున్నాడు. బాబా అప్పుడప్పుడు తమ మరణం గురించి నిగూఢంగా చేసిన సూచనలన్నీ అతనికి అప్పుడు క్రమంగా అర్థమవసాగాయి. సాయి సన్నిధిలో అతనలవరచుకున్న భక్తీ, వివేకమూ తిరిగి శక్తి పుంజుకున్నాయి. మహాసమాధి వలన బాబా ఉనికికేమీ భంగం లేదన్న విశ్వాసం బలపడింది. మునుపటిలాగే అతను రాత్రిళ్ళు మసీదులో గడుపుతుండేవాడు. ఆ సమయంలో అతను మౌనంగా ధ్యానస్థుడయ్యేవాడు. ఒక్కోసారి మసీదులో కూర్చుని కన్నీరు కారుస్తూ, బాబా భౌతికంగా ఉన్నప్పుడు ఎలాగైతే బాబా కాళ్ళు పట్టేవాడో, అలాగే బాబా అక్కడ ఉన్నట్లు 'కాళ్ళొత్తుతూ' రాత్రిళ్ళంతా గడిపేవాడట. అలాంటి స్థితిలో మహల్సాపతిని చూచిన భక్తులకు ఆ దృశ్యం ఎంతో హృదయవిదారకంగా తోచేదట. అలా నాలుగేళ్ళు గడిచాయి.

1922, సెప్టెంబరు 11, భాద్రపద శుద్ధ ఏకాదశి, ఖండోబాకు పవిత్రమైన సోమవారంనాడు మహల్సాపతి ఎప్పటిలానే ఖండోబాకు, బాబాకు పూజ పూర్తిచేసుకొని, "నేడు నా తండ్రి ఆబ్దికానికి వంట త్వరగా చేయండి. నేడే నేను నా ప్రాపంచిక జీవనాన్ని ముగించి స్వర్గానికి వెళ్తాను" అని అన్నాడు. పురోహితుడు లక్ష్మణ్ వచ్చి శ్రాద్ధకర్మలు యథావిధిగా పూర్తిచేశాడు. అతిథుల భోజనం ముగిశాక మహల్సాపతి, అతని కుటుంబం భోజనానికి కూర్చున్నారు. మహల్సాపతి భోజనం చేసి తాంబూలం వేసుకున్నాడు. తరువాత అతను కఫ్నీ ధరించి సమీపంలో ఉన్న బాలాగురవ్, రామచంద్రకోతే మొదలైనవారితో, "రామ నామస్మరణ చేయమ"ని చెప్పాడు. నామస్మరణ జరుగుతుండగా తన కుమారుడు మార్తాండ్‌కు తన దండాన్నిచ్చి, "ఉత్తమమైన భక్తిమార్గంలో సమయాన్ని గడుపుతూ జీవించు. నేను నీకు చెప్పినవన్నీ జరుగుతాయి" అని చెప్పాడు. ఇదిలా ఉండగా, కొందరు భక్తులు మహల్సాపతి నిర్యాణం చెందనున్న విషయాన్ని తెలియపరుస్తూ, వెంటనే ముంబాయి నుండి బయలుదేరి శిరిడీ రమ్మని కాకాసాహెబ్ దీక్షిత్‌కు టెలిగ్రామ్ ద్వారా కబురు పంపారు. అంతేకాదు, ఆ విషయం తెలిసిన శిరిడీ, పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి మహల్సాపతిని చివరిసారి కలిశారు. మరుసటిరోజు వేకువఝామున మహల్సాపతి 'రామా!' అని ఉచ్ఛరిస్తూ తుదిశ్వాస విడిచాడు. అలా ఆ ధన్యజీవి తన 85వ ఏట 1922, సెప్టెంబరు 12, ఏకాదశి ఘడియల్లో సాయి పాదాలలో ఐక్యమయ్యాడు. మహల్సాపతి పార్థివదేహానికి లెండీబాగ్ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించదగ్గవి: బాబా తమ అంత్యకాలంలో మహల్సాపతితో, "అరే భగత్, కొద్దిరోజుల్లో నేను ఎక్కడికో వెళ్తాను. ఆ తరువాత 2 లేదా 4 సంవత్సరాలపాటు రాత్రిళ్ళు నువ్వు ఇక్కడికి వస్తావు" అని చెప్పినట్లే, 1918లో బాబా మహాసమాధి చెందిన తరువాత సరిగ్గా నాలుగు సంవత్సరాలే (1922 వరకు) మహల్సాపతి మసీదుకి వెళ్ళాడు. అంతేకాదు, పాతికేళ్ళ క్రిందట మార్తాండ్ జన్మించినప్పుడు బాబా మహల్సాపతితో, "ఈ బిడ్డని 25 ఏళ్ళపాటు చూసుకో" అని అన్నారు. బాబా చెప్పినట్లే మార్తాండ్‌కి 25 ఏళ్ళ వయస్సు వచ్చాక మహల్సాపతి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈవిధంగా మహల్సాపతి మరణం గురించి బాబా ముందే సూచనలిచ్చారు. ఏదేమైనా తన మరణానికి తానే ముహూర్తం నిర్ణయించుకొని, భగవన్నామస్మరణ చేస్తూ, ప్రశాంతంగా దేహత్యాగం చేయగలగడం మహాయోగులకుగానీ సాధ్యంకాదు. యోగనాథుడైన బాబా శిక్షణలో మహల్సాపతి అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలు అధిరోహించాడనే విషయం ఆయన నిర్యాణం చెందిన విధానమే చెబుతున్నది.

ద్వారకామాయి నుండి కొద్దిదూరంలో ఉన్న మహల్సాపతి ఇంటిలో అతని సమాధిని, బాబా ధరించిన కఫ్నీ, చెప్పులు, చేతికర్ర(సటకా) మొదలైన వస్తువులను నేటికీ భక్తులు సందర్శించుకుంటున్నారు.

సమాప్తం..  
సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ,
శ్రీసాయిబాబా బై శ్రీసాయిశరణానంద,
లైఫ్ ఆఫ్ శ్రీసాయిబాబా బై శ్రీబి.వి.నరసింహస్వామి,
సాయిలీల మ్యాగజైన్ జూలై-ఆగస్టు 2005 సంచిక. 

  ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 


6 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌸🥰🌺🤗🌹

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo