1. అడుగడుగునా తోడు నీడై నడిపించే సాయి
2. బాబా దయ ఉంటే ఏ కష్టం దరిచేరదు
అడుగడుగునా తోడు నీడై నడిపించే సాయి
సాయిబంధువులందరికీ నమస్కారం. సమర్థవంతంగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నడిపిస్తున్న సాయికి, తన వెనకాల ఉండి అన్నీ తామై ముందుకు నడిపిస్తున్న మనందరి సద్గురువైన శ్రీసాయినాథునికి నా హృదయపూర్వక నమస్సులు. నా పేరు సాయిగీత. మాది గజపతినగరం. నేను రోజూ బ్లాగులో ప్రచురించబడే అనుభవాలను చదువుతూ, బాబా ప్రేరణతో ఇదివరకు రెండుసార్లు నా అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోమని బాబా ఆజ్ఞగా మీ ముందుకొచ్చాను.
మొదటి అనుభవం: ఒకసారి కార్తీకమాసంలో సోమవారంనాడు ఉపవాసం ఉందామనుకుని మొదలుపెట్టాను. కొంతసేపటికి అనుభవమాలిక చదువుదామని బ్లాగ్ ఓపెన్ చేశాను. అందులో, "ఉపవాసాలు తపవాసాలు అక్కర్లేదు. నా బిడ్డల్ని నేను పస్తుండనిస్తానా? వాళ్ళు ఉపవాసం ఉంటామంటే నేను ఒప్పుకోను" అన్న 'సాయి వచనం' చూసి నేను ఉలిక్కిపడ్డాను. బాబాకి ఉపవాసం ఉండడం ఇష్టం ఉండదని తెలిసినప్పటికీ మరోసారి ఆలోచించి బాబా ఆజ్ఞ తీసుకుందామని నా అలవాటు ప్రకారం చీటీలు వేశాను. అందులో "ఉపవాసం వద్దు" అని సమాధానం ఇచ్చారు బాబా. అంతటితో నేను నా ఉపవాసాన్ని విరమించాను. పరమ ప్రేమమూర్తి అయిన బాబా తన భక్తులను ఆకలితో పస్తుండనిస్తారా? అయినా 'ఉపవాసం అంటే భగవన్నామస్మరణతో దైవానికి దగ్గరగా ఉండడం, అంతే తప్ప ఆకలితో ఉండడం కాదు'. అయితే నేను ఇక్కడ మన సంస్కృతినీ, ఆచారాలనూ కించపరచడం లేదు. కొన్ని తప్పనిసరి సందర్భాల్లో ఉపవాసం ఉండాల్సి వచ్చినా అది కూడా బాబా ఆజ్ఞగానే భావించి అంతా ఆయనకే సమర్పిస్తాను. ఏదేమైనా "స్వల్పంగా తిను. రుచులకు పోవద్దు" అన్న బాబా వచనాన్ని అనుసరించి పూర్తిగా పస్తుండే బదులు కొద్దిగా తిని స్మరణతో బాబా అనుగ్రహానికి పాత్రులవడం కంటే ఉత్తమమేమున్నది?
రెండవ అనుభవం: ఒకరోజు సాయంత్రం నాకు బాగా వీపునొప్పి వచ్చింది. టాబ్లెట్ వేసుకున్నా నొప్పి తగ్గలేదు. మర్నాడు గురువారం. ఉదయం లేచేసరికి కూడా వీపునొప్పి అలానే ఉంది. బాబాకి అభిషేకం చేసి, 'బాబాకి నివేదించడానికి ఏం చేయాలి' అని అనుకుంటూ బాబాకి సాంజా(ఉప్మా) అంటే ఇష్టమని, అది కూడా తొందరగా అయిపోతుందని అదే చేశాను. వీపు నొప్పిగా ఉన్నా బాబాను స్మరించుకుంటూ ఉప్మా నైవేద్యంగా బాబాకి సమర్పించి పూజ పూర్తిచేశాను. అప్పటికి నొప్పి కొంచెం తగ్గుతున్నట్టు అనిపించింది. కాసేపటికి నేను నిత్యపారాయణలో భాగంగా సచ్చరిత్ర గ్రంథాన్ని తీశాను. ఆరోజు నాకు 28వ అధ్యాయం వచ్చింది. అందులో లాలా లక్ష్మీచంద్ అనే భక్తుడు వీపునొప్పితో బాధపడుతుండటం, బాబా అతనిని కావాల్సినంత సాంజా తినమని చెప్పడం గురించి ఉంది. ఆ కథ రావడం చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను కూడా ఆ భక్తునిలాగే వీపునొప్పితో బాధపడుతున్నాను, ఉప్మానే నైవేద్యంగా బాబాకి పెట్టాను. బాబా లీలకు నాకు చాలా ఆనందం కలిగింది. ఇంకో విషయం, ఆ సాయంత్రానికి వీపునొప్పి పూర్తిగా తగ్గిపోయేలా అనుగ్రహించారు బాబా. మనసారా బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
మూడవ అనుభవం: మా పక్కింటివాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళ తమ ఇంటి సెప్టిక్ ట్యాంక్ మా బోర్‌కి కాస్త దగ్గరగా త్రవ్వారు. అది భవిష్యత్తులో లీక్ అయి మా బోరులో నీరు పాడవుతుందేమోనని కంగారుపడ్డ మా మావయ్యగారు, ‘ఇటువైపు త్రవ్వొద్దు’ అంటూ వాళ్లతో వాదించారు. అయినా వాళ్ళు వినలేదు. దాంతో మావయ్యగారు, "ఇటువైపు త్రవ్వుకుంటే మీకే మంచిది కాదు" అని అన్నారు. దాన్ని వాళ్లు కొంచెం సెంటిమెంట్‌గా తీసుకుని, "బ్రాహ్మణులు అయివుండి మమ్మల్ని అలా అనకూడదు కదా!" అని బాధపడ్డారు. ఏం చేస్తాం, ఎవరి భయాలు వాళ్ళవి. అయినప్పటికీ మా అత్తయ్యగారు, "ఇరుగుపొరుగువాళ్ళం, ఇవేమీ మనసులో పెట్టుకోవద్దు" అని సర్ది చెప్పారు. కొద్ది రోజుల తరువాత వాళ్ళు ఇంటి స్లాబ్ వేసుకుంటుంటే హఠాత్తుగా వాన చిన్నగా మొదలయింది. అది చూసి, 'ఆరోజు మావయ్యగారు వాళ్ళని అలా అన్నందుకే ఈరోజు వాన కురిసి స్లాబ్ పాడయిపోయింద'ని వాళ్ళు బాధపడతారేమోనని నాకు, మా అత్తయ్యగారికి కాస్త టెన్షన్‌గా అనిపించింది. నేను వెంటనే బాబా దగ్గరకి వెళ్లి, "బాబా! ఎలాగైనా వాన కురవకుండా ఆపి, వాళ్ళ స్లాబ్ పూర్తయ్యేలా చెయ్యండి" అని ప్రార్థించాను. ఆశ్చర్యంగా, మేఘాలు ఉన్నప్పటికీ కొద్దిసేపట్లో వాన ఆగిపోయి వాళ్ళ స్లాబ్ పూర్తయింది. ఆ మర్నాడు వాన పడింది. ఇది బాబా లీలకాక ఇంకేమిటి? అడిగిన వెంటనే సహాయం చేసినందుకు బాబాకి మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాను. "ఇలా అడుగడుగునా నాకు తోడునీడగా ఉంటూ, కొన్ని శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పటికీ వాటిని మీ లీలల ద్వారా మరిపించి నన్ను నడిపిస్తున్న మీకు వేలవేల నమస్కారాలు సాయీ. మేము నిరంతరం మీ నామస్మరణతో మీ మార్గంలో పయనిస్తూ మా జీవితాలను సార్థకం చేసుకునేలా ఆశీర్వదించమని మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సర్వం శ్రీ సాయినాథ దివ్య చరణారవిందార్పణమస్తు.
సర్వేజనాః సుఖినోభవంతు.
బాబా దయ ఉంటే ఏ కష్టం దరిచేరదు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిబంధువులందరికీ నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను నా గత అనుభవంలో మా అమెరికా ప్రయాణంలో సాయి నాకు తోడుగా ఉండి సురక్షితంగా మమ్మల్ని ఎలా గమ్యం చేర్చారో తెలియజేశాను. నేనిప్పుడు ప్రస్తుతం యు.ఎస్.ఏలో కూడా బాబా ఎలా మాకు తోడుగా ఉన్నారో తెలియజేసే ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. 2021, జూలై నెలలో మావారు ఫిలడెల్ఫియాలో ఉన్న మా పెద్దమ్మాయి దగ్గరకి వెళ్ళారు. ఆగస్టు నెల చివరిలో ఒకరోజు మొదట మా మనవరాలికి జలుబు, స్వల్పంగా జ్వరం వచ్చాయి. తరువాత మా మనవడికి, మా అమ్మాయికి, అల్లుడికి కూడా జలుబు, జ్వరం వచ్చాయి. అప్పుడు నేను, "బాబా దయవల్ల మావారికి జలుబు, జ్వరం రాకుండా ఉండాలి" అనుకున్నాను. చాలా విచిత్రంగా, అందరికీ వచ్చిన జలుబు, జ్వరం మావారికి మాత్రం రాలేదు. ఇదంతా సాయి లీల. "ఇలాగే మేము ఇండియా తిరిగి వచ్చేవరకూ మాకు ఏ కష్టం రాకుండా కాపాడు బాబా. చిన్నపిల్లలందరూ స్కూలుకి వెళ్తున్నారు. వాళ్లందరికీ కూడా ఏ సమస్యలూ రాకుండా కాపాడు తండ్రీ. ఈ కరోనాను అంతం చేయండి సాయీ".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless amma for her eye operation and bless me for my health and wealth of happiness .Jaisairam
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌹😃🌺🥰🌼🤗🌸
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri sainatha
ReplyDeleteBaba ma samasayalini teerchu thandri
ReplyDelete