ఈ భాగంలో అనుభవాలు:
1. అందరికీ సాయి చరణకమలాలే శరణం
2. సాయినాథుని ఆశీర్వాదం వలన సమస్యలు త్వరగా సమసిపోతాయి
అందరికీ సాయి చరణకమలాలే శరణం
సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. నా పేరు ఇందిర. నేను ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను కొన్నిటిని పంచుకున్నాను. ఇక నా అనుభవాలలోకి వస్తే...
గత ఆగస్టు నెలలో మా మామయ్యకి, అత్తయ్య(పెద్దమ్మ కూతురు)కి కరోనా వచ్చింది. వాళ్ళకి కూడా బాబాపట్ల భక్తిప్రపత్తులున్నాయి. వాళ్ళు గుంటూరులో ఉంటారు. వాళ్లకి పిల్లలు లేరు. మా పెద్దమ్మ మాత్రమే వాళ్ళ దగ్గరగా ఉంటుంది. ఆవిడకి 70 సంవత్సరాల వయస్సు. కాబట్టి వాళ్ళకి ఎవరి సహాయమూ అందని పరిస్థితి. మా మామయ్య హనుమాన్ భక్తుడు. నిత్యమూ హనుమన్ చాలీసా పారాయణ చేస్తుంటారు. నా భర్త యాక్సిడెంట్‌కి గురైనప్పుడు నాకు తోడుగా ఉండి నా గురించి హనుమంతునికి మ్రొక్కుకుని, నేను బాగుండాలని చాలా ఆరాటపడ్డారు. అలాంటి మామయ్యకు నేను ఎలాంటి సహాయం చేయలేక బాబాపై భారం వేసి, 'వాళ్ళు కోలుకుంటే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. మా అక్క ఒక ప్రైవేట్ స్కూలులో టీచర్. అక్క దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి ప్రస్తుతం డాక్టర్. అతనికి విషయం చెప్పగానే, వాళ్ళకి కావాల్సిన మందులన్నీ ఇంటికి పంపించాడు. మా పెద్దమ్మ తన వయస్సు కూడా లెక్కచేయకుండా వాళ్ళిద్దర్నీ కంటికి రెప్పలా చూసుకుంది. ఒక్క పదిరోజుల్లోనే వాళ్ళు కోలుకుని మామూలు స్థితికి వచ్చారు. నిజంగా ఇదంతా బాబా దయే.
రెండవ అనుభవం: ఒకసారి మా బావగారికి 102 డిగ్రీల జ్వరం వచ్చింది. ఆయన, మా అత్తగారు మాత్రమే మా ఊరిలో ఉంటారు. ఆవిడ వయస్సు 70 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళెవరూ లేరు. మావారు వెళ్ళలేని పరిస్థితి. అందువలన తెలిసినవాళ్ల ద్వారా మందులు పంపి, డాక్టర్ని సంప్రదించమని చెప్పాము. అలాగే ఆయన డాక్టరుని సంప్రదిస్తే, కోవిడ్ టెస్టు చేయించుకోమన్నారు. అప్పుడు నేను, "బాబా! టెస్టుకి వెళ్లకుండానే ఆయనకి జ్వరం తగ్గాలని, తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని, మందిరానికి వెళ్లి కానుక సమర్పించుకుంటాన"ని అనుకున్నాను. బాబా అనుగ్రహంతో మరుసటిరోజునుండే ఆయనకి జ్వరం తగ్గుముఖం పట్టింది. కానీ నీరసం వల్ల పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. "ధన్యవాదాలు బాబా".
మూడవ అనుభవం: ఇది నా దృష్టిలో చాలా గొప్ప అనుభవం. గత కొన్ని నెలలుగా నేను, నా పిల్లలు అనుభవించిన బాధ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. నేను కొన్ని విషయాలు వ్రాయలేకపోతున్నందువలన క్లుప్తంగా వివరిస్తాను. నా భర్త కొన్ని చెడుస్నేహాల వల్ల ఆరోగ్యపరంగానూ, ఆర్థికపరంగానూ చాలా నష్టపోయారు. కేవలం ఆయనే కాదు, నేను, నా పుట్టింటివాళ్ళు, అత్తింటివాళ్ళు కూడా చాలా నష్టపోయాము. పిల్లలు పెద్దవాళ్ళై బాధ్యతలు మీదపడుతున్నా ఆయనలో పెద్దగా మార్పులేదు. గతంలో చేసిన అప్పులు వడ్డీలతో సహా పెరిగి మమ్మల్ని వేధించసాగాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను నిత్యం బాబాని, "మమ్మల్ని ఋణవిముక్తుల్ని చేసి, నా బిడ్డలకు మంచి భవిష్యత్తును ప్రసాదించమ"ని వేడుకుంటూ సాయి దివ్యపూజ, నవగురువారవ్రతం, సచ్చరిత్ర పారాయణ... ఇలా నాకు తెలిసింది, చేయగలిగింది చేస్తూ ఉండేదాన్ని. బాబా దయవలన ప్రతిసారీ ఏదో ఒక రూపంలో డబ్బు సమకూరి కొంతవరకు ఋణాలు తీర్చగలిగాము. కానీ మళ్లీ మళ్లీ కొత్త అప్పులు పుట్టుకొచ్చేవి. మా బావగారు అప్పుల భారం నుండి మావారిని కాపాడడం కోసం ఇంటిమీద మార్ట్ గేజ్ లోన్ తీసుకుని, ఆ డబ్బుతో ఉన్న అప్పులు తీరుస్తానని అన్నారు. దానికి మావారు ఒప్పుకోక విపరీతంగా గొడవచేసి ఎవరినీ మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. ఆ సమయంలో మేము చాలా నరకం అనుభవించాము. ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామని కూడా అనుకున్నాం. మావారు అదొక రకమైన పిచ్చి ప్రవర్తనతో చాలా బాధపెట్టారు. పిల్లలు చాలా భయపడ్డారు. నేను బాబా ముందు కూర్చుని ఏడవని రోజు లేదు. నా భర్త అదృష్టమేంటంటే, ఆయన మనుష్యులు, బంధాల కన్నా డబ్బుకే ఎక్కువ విలువనిచ్చి ఎంత దురుసుగా ప్రవర్తించినా అందరికీ ఆయన అంటే ఎంతో ప్రేమ.
చివరికి నేను బాబాతో, "బాబా! ఈ పరిస్థితులనుండి బయటపడాలంటే, ముందుగా నా భర్త లో మార్పు రావాల"ని చెప్పుకున్నాను. ఒకరోజు మావారికి చేయి బాగా నొప్పితో మొద్దుబారిపోయింది. అసలు విషయమేమిటంటే, నా భర్తకి రక్తం గడ్డకట్టే సమస్య ఉంది. లోగడ దానివల్ల చేతివేళ్ళు మొద్దుబారిపొతే కొన్నిరోజులు హాస్పిటల్లో ఉన్నాము. ఆ దృష్ట్యా నా భర్త మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందేమోనని, నాతో కూడా చెప్పకుండా హాస్పిటల్‌కి వెళ్లి టెస్టులు చేయించుకుని, మందులు తెచ్చుకున్నారు. ఎప్పుడూ అనకూడని మాటలు అనే వ్యక్తి ఆ సంఘటన వల్ల తాను ఆవేశపడినా, జాగ్రత్తగా లేకున్నా తనకి ఏమవుతుందోనని భయపడిపోయారు. ఆరోజునుండి మనిషిలో మార్పు వచ్చింది. అయనలో వచ్చిన మార్పుకి పిల్లలు ఆశ్చర్యపోయారు. కానీ నాకు ఒకటే భయం, 'ఇది శాశ్వతంగా ఉంటుందో, లేదో' అని. ఎందుకంటే, పూర్వజన్మార్జిత పాపం అనుభవించక తప్పదు. మనకి దుఃఖం కలిగిందంటే అందుకు కారణం చేసుకున్న పాపమనీ, సుఖం కలిగితే పుణ్యమనీ నేను చాలా చోట్ల విన్నాను. కానీ బాబా పాదాలు పట్టుకుంటే, ఆయన ఎలాంటి కష్టమైనా తట్టుకునే శక్తినిస్తారని, బాధ తీరే మార్గాన్ని చూపుతారని నా ప్రగాఢ విశ్వాసం. అందుకే నేను ఏదేమైనా బాబా పాదాలనే నమ్ముకున్నాను. నాకే కాదు, అందరికీ బాబా చరణకమలాలే శరణం. చివరిగా ఒక మాట, ఎవ్వరికీ నా బాధను చెప్పుకోలేని ఆ కష్టకాలంలో నాకు ధైర్యాన్ని, ఓదార్పునిచ్చినవి ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలే. ఇది ముమ్మాటికీ నిజం.
సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.
సాయినాథుని ఆశీర్వాదం వలన సమస్యలు త్వరగా సమసిపోతాయి
సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై! నా పేరు శ్రీకాంత్. మాది నాగర్ కర్నూలు జిల్లా. మా ఇంటి దైవం సద్గురు శ్రీ సాయినాథుని ఆశీర్వాదాల వల్ల మా కుటుంబంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా తొందరగా తగ్గుతాయని నాకు ప్రగాఢ విశ్వాసం. అందుకు సంబంధించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఈమధ్య అనుకోకుండా నా భార్యకి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చి తను చాలా ఇబ్బందిపడింది. డాక్టరుని సంప్రదిస్తే, కొన్ని మందులిచ్చి నెల రోజుల తర్వాత మళ్లీ రమ్మన్నారు. నాకు మాత్రం సాయినాథుని మీద పూర్తి నమ్మకం. అందుచేత ఇంటికి వచ్చి సాయినాథుని ముందు కూర్చొని, "తొందరగా నా భార్యకు ఉన్న ఇబ్బందులను తొలగించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి, మునుపటిలా యథావిధిగా తన పనులు తాను చేసుకునేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. అంతేకాదు, తన ఆరోగ్యం కుదుటపడిన వెంటనే మా సంతోషాన్ని ఈ బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో పంచుకుంటానని కూడా మనసులో అనుకున్నాను. నా నమ్మకం నిజమైంది. బాబా దయవల్ల వారం రోజుల్లోనే నా భార్యకు ఉన్న సమస్య తొలగిపోయింది. ప్రస్తుతం తను చాలా సంతోషంగా ఉంది. నా భార్య పూర్తిగా కోలుకోవాలని ఆ సాయినాథునికి నమస్కరిస్తూ... సెలవు తీసుకుంటున్నాను.
సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai
ReplyDeleteJaisairam bless amma for her eye operation and bless me for my health and wealth jai sairam
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌸🥰🌺🤗🌹
ReplyDeleteMa nanna health bagundela aasirvadinchandi baba 🕉🙏
Om Sairam
ReplyDeleteSai Always be with me
Om sai ram baba ma samasayalini teerchu thandri sainatha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete