సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 917వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • భక్త రక్షణలో సదా అప్రమత్తుడై ఉండే బాబా

సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. మా జీవితంలో బాబా ఎన్నో మహిమలు చూపించారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.


సాయిమహిమ-1


అవి నేను భద్రాచలం మండలం, తోటపల్లిలో ఉద్యోగం చేస్తున్న రోజులు. నేను అంతగా పూజలు చేసేవాడిని కాదు. ఒకరకంగా చెప్పాలంటే నేను దేవుణ్ణి నమ్మేవాడిని కాదు. నా భార్య మాత్రం గురువారం, శుక్రవారం పూజ చేసేది. గురు, శుక్ర, శనివారాలు ఉపవాసాలు చేసేది. ఒకసారి మా వదినగారు, అంటే నా భార్య అక్కావాళ్ళ కుటుంబం శిరిడీ వెళ్ళినప్పుడు మాకోసం చిన్న పాలరాతి బాబా విగ్రహం తీసుకొచ్చి ఇచ్చారు. నా భార్య ఆ విగ్రహాన్ని పూజామందిరంలో ఉంచి పూజలు చేస్తుండేది. నేను స్కూలులో ఉద్యోగం చేస్తుండటం వలన సెలవురోజుల్లో మేమంతా మా స్వగ్రామానికి వెళ్ళేవాళ్ళం. తోటపల్లిలో ఉన్నప్పుడు నా భార్య నగరసంకీర్తనకి, సత్సంగానికి వెళ్తుండేది. ఒకసారి సత్సంగంలో, ‘ఇంట్లో విగ్రహం ఉన్నప్పుడు రోజూ పూజ చెయ్యకపోయినా విగ్రహం దగ్గర అగరువత్తి వెలిగించి, కనీసం బెల్లంముక్క అయినా నైవేద్యం పెట్టాలి’ అని చెప్పిన మాట విని, మేము సెలవులలో ఊరికెళ్ళినప్పుడు బాబాను ఉపవాసం ఉంచుతున్నామని భావించి, ఆ తర్వాత వచ్చిన సెలవులలో ఊరికి వచ్చేముందు బాబా విగ్రహాన్ని అక్కడున్న రామాలయంలో ఇచ్చి మా ఊరికి వచ్చాము. ఆరోజు రాత్రే నా భార్యకి బాబా స్వప్నదర్శనం ఇచ్చి, “నన్ను ఇంటినుండి పంపించేశావుగా” అని అలిగారట. ఆ స్వప్నం గురించి మరుసటిరోజు నా భార్య నాతో చెప్పింది. అది విని నేను, “అది నీ ఆలాపన అయివుంటుంది” అని కొట్టిపడేశాను. తరువాత రెండు రోజులకు నాకు స్వప్నంలో శివుడు పైన, క్రింది వరుసలో వెంకటేశ్వరస్వామి, ప్రక్కన సాయిబాబా దివ్యదర్శనం (ఇది ఆకాశంలో కనపడింది) ఇచ్చారు. ఆ స్వప్నదర్శనంతో నా మనస్సుని భక్తివైపు మళ్ళించిన బాబాకు నిజంగా నా కృతజ్ఞతలు.


సాయిమహిమ-2


అవి జిల్లాపరిషత్ సెంకడరీ స్కూల్, నాగుపల్లికి బదిలీపై వచ్చి సత్తుపల్లిలో నివసిస్తున్న రోజులు. ఒకసారి బజారులోనో లేక తిరునాళ్ళలోనో సరిగా గుర్తులేదు, ఫ్రేమ్ లేని బాబా ఫోటో ఒకటి నాకు బాగా నచ్చి కొని తీసుకొచ్చాను. దానికి ఫ్రేమ్ కట్టించాలని వెళితే అక్కడున్న అతను 250 రూపాయలు అడిగాడు. ‘వాడికి 250 రూపాయలు ఇవ్వడమేమిటి, నేనే దానిని ఫ్రేమ్ కట్టుకుంటాన’ని ఫోటోను ఇంటికి తెచ్చాను. కానీ 3, 4 సంవత్సరాలైనా ఆ ఫోటోకి ఫ్రేమ్ కట్టించలేకపోయాను. ఈలోగా నాకు అశ్వారావుపేట MDO ఆఫీసుకి డెప్యుటేషన్ (అంటే, నా ప్రయత్నం వలనే) వేశారు. అప్పుడు నేను అక్కడ ఇల్లు కట్టిస్తూ మా అత్తగారింట్లో ఉన్న సందర్భంలో ఫ్రేమ్ కట్టని ఆ బాబా ఫోటోని పూజామందిరం పైన ఉంచి పూజించేవాళ్ళం. ఒక సంవత్సరం తరువాత డెప్యుటేషన్ క్యాన్సిల్ అయి నేను వేంసూరు ఎమ్.డి.ఓ ఆఫీసుకి వచ్చాను. ఫ్యామిలీని కూడా ఇక్కడికే షిఫ్ట్ చేశాను. అలా వచ్చేటప్పుడు బాబా ఫోటోని మా అత్తగారింట్లో వదిలి వచ్చాము. ఈమధ్యలో అశ్వారావుపేట వెళ్ళినప్పుడు రెండు, మూడుసార్లు అనుకున్నాను, ‘అక్కడున్న బాబా ఫోటోను తెచ్చి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టాలి’ అని. కానీ ఎప్పటికప్పుడు ‘తరువాత తీసుకుని వెళదాములే’ అని నిర్లక్ష్యం చేశాను. ఇటీవల, అంటే 2021, ఆగస్టు 22వ తేదీన అశ్వారావుపేట వెళ్ళాము. ఆరోజు సాయంత్రం స్నానం చేసి మేము వదిలి వచ్చిన బాబా ఫోటోకి దండం పెట్టుకుని, ‘ఈ ఫోటోని ఇంటికి తీసుకుని వెళ్లాల’ని మరలా మనసులో అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం బాబా మన గ్రూపులో వాట్సాప్ మెసేజ్ ద్వారా నాకు తమ సందేశాన్ని ఈక్రింది విధంగా ఇచ్చారు. నేను ఏ ఫోటో కొన్నానో అదే ఫోటోతో, “ఈ పటం రూపంలో నేను మీ ఇంటికి వచ్చాను. నువ్వేమో నన్ను నిర్లక్ష్యం చేశావు. రెండురోజులలో కనుక నువ్వు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళకపోతే నా కాలు తినివేయబడుతుంది” అని నా మొబైల్‌కి వచ్చిన మెసేజ్ చదవగానే నిజంగా నేను చాలా దిగ్భ్రాంతికి లోనై, ఈసారైనా తన ఫోటోను ఇంటికి తీసుకుని వెళ్ళమని బాబా ఈ విధంగా ఆదేశించారని తలచి ఆ ఫోటోని ఇంటికి తెచ్చుకున్నాను. ఈ విధంగా బాబా లీలలు ఉంటాయి.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


సాయిమహిమ-3


అవి కరోనా విజృంభిస్తున్న రోజులు. 2020, ఆగస్టు 2వ తేదీ నుండి నాకు దగ్గు, జ్వరం మొదలయ్యాయి. మాట్లాడుతుంటే ఆయాసం. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ, ఆఫీసులో ఇద్దరు డెప్యుటేషన్, ఒకరు ట్రాన్స్‌ఫర్ అవడంతో నేను ఒక్కడినే ఉండటం వలన తప్పనిసరిగా ఆఫీసుకి వెళ్ళవలసి వచ్చేది. ప్రతిరోజూ వర్షం కురిసేది. బయటికి వస్తే చలిగాలికి చలిపుడుతుండేది. జర్కిన్ వేసుకుని, మంకీ క్యాప్ పెట్టుకుని, బాబాను స్మరించుకుంటూ, ‘నాకేమీ లేదు, ఏమీ కాదు’ అనుకుంటూ అలా 11వ తేదీ వరకు ఆఫీసుకి వెళ్ళాను. కానీ ఆ తరువాత ‘నా వల్ల కావటం లేద’ని మా సార్‌కి చెప్పి సెలవు పెట్టాను. ఆ సమయంలోనే హైదరాబాద్ నుండి మా అబ్బాయి, కోడలు వారి క్రింది పోర్షన్‌లో ఉన్నవారికి కరోనా వచ్చిందని, కంపెనీకి సెలవు పెట్టి మా దగ్గరకు వచ్చారు. మేముండేది సింగిల్ బెడ్‌రూం పోర్షన్. నాకేమీ కాకూడదని నా భార్య రోజూ బాబాకు విన్నవించేది. మా ఫ్రెండ్ మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నారు. వాళ్ళు నాకు రోజూ ఫోన్ చేసి, “నువ్వు ఇంక ఆలస్యం చెయ్యొద్దన్నా, అర్జెంటుగా హైదారాబాద్ వచ్చి ఏదైనా పెద్ద హాస్పిటల్లో చేరు” అని చెప్పేవారు. కానీ నేను, నా భార్య బాబాపైనే భారం వేసి ఉన్నాము. సరిగ్గా జ్వరం వచ్చిన 14వ రోజున కరోనా టెస్ట్ చేయిస్తే బాబా దయవలన నాకు నెగిటివ్ వచ్చింది. కానీ నాకున్న లక్షణాల వలన నన్ను RTPCR టెస్ట్, లంగ్స్ స్కానింగ్ చేయించుకోమని మా ఫ్రెండ్ చాలా గట్టిగా చెప్పారు. కానీ నేను భారమంతా బాబాపైన వేసి, “సాయీ, నిన్నే నమ్ముకున్నాము. నీ చల్లని చూపు మా మీద ఉంటే మాకేమీ కాదు. మాకేమీ కాకుండా నువ్వే కాపాడాలి” అనుకుంటూ బయటికి ఎక్కడికీ వెళ్ళకుండా, లోకల్ ఆర్.ఎం.పి (మా ఇంటి ఓనర్)తోనే ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. నాకేకాదు, నా భార్యకి, మా అబ్బాయికి కూడా అదేవిధంగా దగ్గు, జ్వరం ఉన్నాయి. ఈ విధంగా మా ముగ్గురికి ఉన్న లక్షణాలు కరోనా లక్షణాలని తెలుస్తున్నా బాబాపై ఉన్న అచంచలమైన నమ్మకంతో, అతి తక్కువ ఖర్చుతో, అంటే మొత్తం సుమారు 15,000 రూపాయలతో బ్రతికి బయటపడ్డాము. నిజంగా 20వ రోజున చాలా అంటే చాలా బాధపడ్డాము. శ్వాస అందేది కాదు. మాట్లాడితే దగ్గు, జ్వరం, నోరు రుచి తెలియదు. ఏమీ తినేవాడిని కాదు. కొద్దిగా గాలి తగిలినా వణుకు, దగ్గు. ఇన్ని బాధలూ కూడా ఇట్టే మటుమాయం అయ్యాయి. బాబా తనను నమ్ముకున్న భక్తులను కాపాడే బాధ్యత తానే చూసుకుంటాడనే మాటకి ఇంతకంటే ఋజువు ఏంటి?


సాయిమహిమ-4


బాబాను దర్శించుకోవాలనే అభిలాషతో మా కుటుంబం మరియు మా కజిన్ వాళ్ళ కుటుంబం కలిసి మొత్తం సుమారు ఇరవైమందిమి 2019, డిసెంబరు 3వ తేదీన ఖమ్మంలో రైలు ఎక్కి శిరిడీ వెళ్ళాము. 4వ తేదీ ఉదయం శిరిడీలో ఒక సదనంలో దిగి స్నానాదికాలు ముగించుకుని అందరం బాబా దర్శనం చేసుకోవడానికి సమాధిమందిరానికి వెళ్ళాము. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకొంటుంటే మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా, అన్ని బాధలూ తీరి ఆనందంగా పరవశించిపోయింది. ఆరోజుకి విశ్రాంతి తీసుకుని మరుసటిరోజు ఉదయం త్ర్యంబకేశ్వరము, నాసిక్ చూడాలని వెహికిల్ మాట్లాడుకుని ముందుగా నాసిక్ వెళ్ళాము. అన్ని దేవాలయాలను దర్శించుకుని మేము మా వ్యాన్ దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. దానికి ఆ వ్యాన్ డ్రైవర్ మాతో గొడవకి దిగాడు. మేము ఏమి చెప్పినా అతను వినడం లేదు. అసలే మాకు, అతనికి భాష సమస్య. మాకు హిందీ రాదు, అతనికి తెలుగు రాదు. ఈలోగా అతనికి సపోర్టుగా అక్కడున్న డ్రైవర్లు వచ్చి, ‘మమ్మల్ని అక్కడే వదిలేయమని, మాకు ఎవ్వరూ వెహికల్ పెట్టవద్దని’ అందరికీ చెప్పారు. అప్పటికే చాలా ప్రొద్దుపోయింది. చీకటి పడింది. చిన్నపిల్లలున్నారు. ఆడవాళ్ళు భయపడుతున్నారు ఏమవుతుందోనని. వాళ్ళు మమ్మల్ని వ్యానునుండి దిగమంటున్నారు. మాకు వ్యాన్ మాట్లాడిన వ్యక్తి తెలుగువాడేగానీ అతని ఫోన్ నెంబరు మేము తీసుకోలేదు. నేను, నా భార్య మనస్సులోనే బాబాను స్మరించుకుని, “బాబా! మా అందరినీ ఈ ఆపద నుండి గట్టెక్కించు స్వామీ. వ్యాను డ్రైవర్ మనస్సు మారి మమ్మల్ని శిరిడీ తీసుకువెళ్ళేలా చెయ్యి స్వామీ” అని వేడుకున్నాము. ఇంతలో, అప్పటివరకు వెనుక సీటులో కూర్చున్న మా అబ్బాయి లేచి ముందుకి వచ్చి చాలా సౌమ్యంగా, “ఇంత చిన్న విషయానికి గొడవెందుకు? వదిలేయండి భయ్యా” అని డ్రైవరుకి సపోర్టుగా వచ్చిన వారితో అన్నాడు. అంతే, వాళ్ళు ఇంకేమీ మాట్లాడకుండా ‘చలో’ అని ప్రక్కకి తప్పుకున్నారు. మేము తలవగానే బాబా ఎంతో కరుణతో మమ్మల్ని క్షేమంగా శిరిడీలోని మా సదనానికి చేర్చారు. 


మేమందరం సదనంలో మూడవ అంతస్తులోని గదులలో ఉంటున్నాం. మెట్లు ఎక్కలేక నేను, నా భార్య లిఫ్ట్ ఎక్కాము. లిఫ్టులోకి వెళ్ళాక తలుపులు మూసుకున్నాయి. మూడవ అంతస్తుకి వెళ్ళడానికి స్విచ్ నొక్కితే లిఫ్ట్ కదలటం లేదు. లోపల ఫ్యాన్ తిరగటం లేదు. అది మెష్ డోర్ ఉండే లిఫ్ట్ కాదు, తలుపులు పూర్తిగా మూసుకునే లిఫ్ట్. అందువలన బయటి గాలి, వెలుతురు లోపలికి రావటం లేదు. మాకు బాగా చెమటలు పట్టాయి. ఎవరైనా వచ్చి లిఫ్ట్ తలుపులు తీయమని గట్టిగా అరుస్తున్నాము. కానీ ఎవ్వరికీ మా మాటలు వినపడటం లేదు. మేము బయటికి కనపడము. అప్పటికే భయంతో ఒళ్ళంతా తడిసిపోయి నా భార్య కూలబడిపోయింది. నేను తలుపుల మధ్య ఖాళీ దొరికితే ఓపెన్ చేద్దామని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ తలుపులు కాస్త కూడా తెరుచుకోలేదు. అప్పుడు నాలో కూడా కొద్దిగా భయం మొదలైంది. దాంతో నేను బాబాను, “స్వామీ, ఏమిటి నీ సన్నిధిలో మాకు ఈ పరీక్షలు? మమ్మల్ని రక్షించు స్వామీ” అని మనస్సులో తలచుకుంటూ నా భార్య ప్రక్కన కూర్చున్నాను. ఇంతలో, అప్పటివరకు భయంతో అయోమయంలో ఉన్న నా భార్య ఒక్కసారిగా లేచి లిఫ్ట్ తలుపులను రెండు చేతులతో నెట్టగానే తలుపులు వెంటనే తెరచుకున్నాయి. అంతే, చల్లటిగాలి మాకు తగలగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది. తనను నమ్మకున్నవారిని బాబా ఎన్నడూ విస్మరించకుండా కాపాడుకుంటారని ఈ ఉదంతం వల్ల మేము గ్రహించగలిగాము.


8 comments:

  1. Jaisairam. Bless amma for her eye operation and bless me for my health and wealth. Jai sairam

    ReplyDelete
  2. ఆ సాయి నాధుడు సదా మిమ్మల్ని రక్షించు గాక.మీకు సంపూర్ణ మైన ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ బాబాని ప్రార్ధిస్తూ ఉన్నాను.

    ReplyDelete
  3. Om Sri Samrtha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼🤗🌹😃🌺🥰🌸

    ReplyDelete
  5. Om sai ram Baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  6. Baba na samasyalani teerchu thandri sainatha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo