సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కాలేమామ




కాలేమామ అలియాస్ రామచంద్ర బాపూజీ కాలే శ్రీసాయిబాబాను భౌతికదేహంతో ఉండగా దర్శించిన అదృష్టవంతుడు. ఇతను నాటి మరాఠా పాలకుల నగరమైన కొల్హాపూర్‌లో జన్మించాడు. ఇతని తండ్రి బాపూజీ కాలే కొల్హాపూర్ మహారాజు ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. రాజవంశస్థులతో సంబంధాలు కలిగి ఉన్న అటువంటి ప్రభావవంతమైన కుటుంబంలో జన్మించిన కాలేమామ బాల్యం, యవ్వనం అత్యుత్తమంగా సాగాయి. అతను బొంబాయిలో సివిల్ ఇంజనీరుగా పట్టభద్రుడయ్యాడు. కొల్హాపూర్ మునిసిపల్ కార్పొరేషనులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా, ధూలే మునిసిపల్ కార్పొరేషన్ కార్యదర్శిగా, అక్కల్కోట సంస్థాన్‌లో స్టేట్ ఇంజనీరుగా ఉజ్వలమైన జీవితాన్ని సాగించాడు.

1908-09 ప్రాంతంలో కాలేమామ బుర్హాన్‌పూర్‌లోని రైల్వేస్టేషనుకి సమీపంలో ఉన్న బుర్హాన్‌పూర్ తపతి మిల్లు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుండేవాడు. ఒకరోజు అతనితో ఒక స్నేహితుడు ‘శ్రీ సద్గురు నారాయణ మహరాజ్ ఆరోజు ఖాండ్వా వెళుతున్నారని, బుర్హాన్‌పూర్ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కబోతున్నారని’ సమాచారం ఇచ్చాడు. దాంతో కాలేమామ తన స్నేహితులతో కలిసి రైల్వేస్టేషనుకు వెళ్లి నారాయణ మహరాజ్ దర్శనం చేసుకున్నాడు.

తరువాత 1910, ఏప్రిల్ నుండి 1911, మే వరకు కాలేమామ పండరిపురంలో మునిసిపల్ కార్పొరేషన్ కార్యదర్శిగా పనిచేశాడు. ఈ కాలంలోనే సాయిబాబా కీర్తి మహారాష్ట్ర అంతటా వ్యాపించింది. ఎంతోమంది ప్రభుత్వాధికారులు, విద్యావేత్తలు బాబా భక్తులయ్యారు. వాళ్లలో పండరీపురానికి చెందిన రాళే, పట్వర్థన్‌లు ఉన్నారు. వాళ్ళు ఒకసారి, "శ్రీసాయిబాబా గొప్ప మహాత్ములు, శిరిడీ వెళ్లి వారి దర్శనం చేసుకోమ"ని కాలేమామను అభ్యర్థించారు. అందుకతను అంగీకరించాడు. అంతలో కొంతమంది ప్రభుత్వాధికారులు మరియు బొంబాయిలోని ప్రముఖ న్యాయవాదులు 1910, డిసెంబరు నెల చివరివారంలో తమ కుటుంబాలతో శిరిడీలో రెండురోజులపాటు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఆ కార్యక్రమానికి హాజరై బాబా దర్శనం చేసుకుందామని కాలేమామ, రాళే, పట్వర్థన్‌లు అనుకున్నారు. వాళ్లతోపాటు పండరీపురం న్యాయమూర్తి హత్యాంగడి కూడా శిరిడీ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. వాళ్లంతా శిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. బాబా దర్శనంతో కాలేమామ ఎంతగానో ఆనందించాడు. శీతాకాల సెలవుల్లో సన్నిహితుల కుటుంబాలతో శిరిడీలో గడిపినందుకు కూడా అతను చాలా సంతోషించాడు. వాళ్లంతా రెండురోజులు అక్కడ గడిపి తిరిగి పండరీపురం చేరుకున్నారు.

కొంతకాలం తర్వాత 1911 ఫిబ్రవరి ఒకటవ తారీఖున కాలేమామ అన్నయ్య కృష్ణాజీ (అన్నా కాలే) మొదటి భార్య ప్లేగు వ్యాధితో షోలాపూరులో మరణించింది. భార్య మరణంతో దుఃఖితుడైన అన్నాజీ మనశ్శాంతి కోసం మార్పును ఆశించి పండరీపురంలోని కాలేమామ వద్దకు వచ్చాడు. అప్పటికే కాలేమామ సన్నిహితులలో ఒకరైన జస్టిస్ నూల్కర్ తన ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని శ్రీసాయిబాబా సేవ చేసుకుంటూ శిరిడీలో గడుపుతున్నాడు. నూల్కర్ స్నేహితుడైన భాటే కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి శిరిడీలో సాయిబాబా సేవ చేసుకుంటున్నాడు. ఒకరోజు కాలేమామకి నూల్కర్ వద్ద నుండి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో కాలేమామ అన్నయ్య కృష్ణాజీకి భాటే కుమార్తెనిచ్చి వివాహం చేయాలన్న తమ తలంపును తెలియజేస్తూ, అందుకోసం వారివురూ శిరిడీ వచ్చి సాయిబాబా దర్శనం చేసుకుని, వారి అనుమతి తీసుకోవాల్సిందిగా నూల్కర్ ప్రతిపాదించారు. దాంతో కాలేమామ తన అన్నయ్యతో కలిసి 1911 ఫిబ్రవరి లేదా మార్చిలో శ్రీసాయిబాబా దర్శనానికి రెండవసారి శిరిడీ వెళ్ళాడు.

వారిద్దరూ శిరిడీ చేరుకుని తమ సామాను ఒకచోట భద్రపరచి శ్రీసాయిబాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళారు. అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటిగంట అయింది. మసీదులో బాబా ఒంటరిగా ఉన్నారు. వారిద్దరూ లోపలికి వెళ్లి భక్తితో బాబాకు నమస్కరించారు. శ్రీసాయిబాబా వారిని రెండు రూపాయలు దక్షిణ అడిగారు. కాలేమామ జేబులో కేవలం రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి. వెంటనే అతను వాటిని బాబాకు సమర్పించాడు. ఆ రెండు రూపాయలు అందుకున్న బాబా మరో నాలుగు రూపాయలు దక్షిణమ్మని అడిగారు. అయితే కాలేమామ జేబులో డబ్బు లేదు. అతని జేబులో ఉన్న ఏకైక వస్తువు ఏమిటంటే, అతని సూట్‌కేసు తాళాలు. వాటినే అతడు శ్రీసాయిబాబాకు అప్పగిస్తూ తన అన్నతో, "బసకు వెళ్లి సాయిబాబా అడుగుతున్న డబ్బు తీసుకుని రమ్మ"ని చెప్పాడు. అతని అన్న వెంటనే డబ్బు తీసుకుని రావడానికి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేలోపు సాయిబాబా కాలేమామతో, "నువ్వు మాలో ఒకడివి. మళ్ళీ ఎప్పుడు వస్తావు?" అని అడిగారు. అందుకతను, "ఎప్పుడైనా మీరు నన్ను మీ దగ్గరకు రప్పించుకోవచ్చు బాబా!" అని బదులిచ్చాడు. అంతలో అతని అన్న నాలుగు రూపాయలు తీసుకొచ్చి శ్రీసాయిబాబాకు సమర్పించాడు. తరువాత కొంతసేపు వారిరువురూ బాబా సమక్షంలో గడిపి తిరిగి తమ బసకు చేరుకున్నారు. "నువ్వు మాలో ఒకడివి" అన్న బాబా మాటలకు కాలేమామ ఎంతో ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. అతడు ఒక పుస్తకంలో ఇలా రాసిపెట్టుకున్నాడు: "ఆ సందర్శనలో మమ్మల్ని కలిసినందుకు సాయిబాబా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరచి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు" అని. అయితే అతను తరువాత తన జీవితంలో బాబా మాటలకు ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వలేకపోయాడు. మరోవిషయం, అతను తన అన్న వివాహ విషయంలో బాబా ఏమి చెప్పారో తెలియజేయలేదు.

1926లో కాలేమామ మెహర్ బాబాని ఆశ్రయించి జీవితాంతం ఆయనకు అంకితమయ్యాడు. 1927లో ఒకసారి, మరోసారి ధుమాళ్‌తో కలిసి అతడు శిరిడీ వెళ్లి సాయిబాబా సమాధి దర్శనం చేసుకున్నాడు.

సమాప్తం........


4 comments:

  1. very nice leela.i liked this episode very much

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. 🙏💐🙏నమో సాయినాథాయ నమః🙏💐🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo