సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఎం.బి. రేగే - నాలుగవ భాగం



జస్టిస్ ఎం.బి.రేగే 1936, జూన్ 11న బి.వి.నరసింహస్వామి చేసిన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని అంశాలు:

నేను శ్రీసాయిబాబాను సృష్టి, స్థితి, లయకారకునిగా భావిస్తాను. 1918లో బాబా మహాసమాధి చెందడానికి ముందు, తరువాత కూడా నా భావం అదే. ఆయన ఎక్కడికీ వెళ్లిపోలేదు. ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన మనతోనే ఉన్నారు, ఉంటారు. నా దృష్టిలో వారికి పరిమితులు లేవు. వారు సశరీరులుగా ఉన్నప్పుడు, వారి పాంచభౌతిక రూపం మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువగా నా ఎరుకలో నిలిచింది మాత్రం వారి అనంతత్వమే. మూర్తీభవించిన ఒక మనోమయ దివ్యతత్వంగా నాకాయన గోచరిస్తారు. పరిమితులు లేని అనంతతత్వం మానుషరూపంలో లీలామాత్రంగా ఇమిడిపోయి మా కనులముందు సంచరిస్తున్నట్లనిపించేది. ఆ పాంచభౌతిక దేహం కనుమరుగై, 'సాయిబాబా' అనే అవధులు లేని దివ్యతత్వం మాత్రమే మిగిలింది.

సాయిబాబా అప్పుడప్పుడు దృష్టాంతాలు, నీతికథలతో ఆధ్యాత్మిక పరిభాషలో మాట్లాడేవారు. వారి మాటలను ఒక్కో భక్తుడు ఒక్కోలా అర్థం చేసుకునేవాడు. వేదాంత, తత్వశాస్త్రాల పట్ల ఆసక్తిలేని నాకు వారి మాటలు అర్థమయ్యేవి కావు. ఒకసారి బాబా నాతో ఆధ్యాత్మిక పరిభాషలో మాట్లాడి, "అర్థమైందా?" అని అడిగారు. నేను "అర్థం కాలేద"ని బదులిచ్చాను. అక్కడున్న భక్తులందరూ వెళ్ళిపోయాక నేను బాబాతో, "మీరు ఆధ్యాత్మిక పరిభాషలో మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకేదైనా చెప్పదలిస్తే నాకర్థమయ్యేటట్లు సాధారణ రీతిలో చెప్పండి బాబా" అని చెప్పాను. అప్పటినుండి బాబా నాతో నీతికథల రూపంలో కాకుండా స్పష్టంగా మాట్లాడేవారు.

బాబా అందరికీ ఒకేరకమైన సాధనను ఆదేశించరు. ఆ భక్తుని సంస్కారానికి, పరిణతికి, ఇతర పరిస్థితులకు అనుగుణమైన సాధననే విధిస్తారు. రామభక్తుడైతే రాముణ్ణి, అల్లాను కొలిచేవారిని అల్లానే కొలుచుకోమంటారు. వారు ఎల్లప్పుడూ నిష్పాక్షికంగా ఉండేవారు. కొన్నిసార్లు హిందువులు నైవేద్యం సమర్పించే సమయాలలో వారు 'ఫత్యా' (ముస్లింల ప్రార్థన) చదివేవారు. ఒకటి రెండు సంఘటనల మినహా హిందువులు, ముస్లింలు బాబాను పూజించే విధానాల మధ్య ఎటువంటి వైరుధ్యం ఏర్పడలేదు. అందుకు ఒక ఉదాహరణ చెప్తాను.

1916లో ఇద్దరు రోహిల్లాలు శిరిడీ వచ్చి సాయిబాబాను ఆశ్రయించారు. వారిలో పెద్దవాడు ఎప్పుడూ బాబా వద్దనే ఉంటూ, ప్రత్యేకించి రాత్రివేళల్లో బాబా పాదాల చెంత కూర్చుని ఖురాన్ చదువుతుండేవాడు. అతడు బాబాను భగవంతునిగా తలచి, ఆయనపట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉండేవాడు. కానీ మసీదులో సంగీతవాయిద్యాలతో ఆరతి చెయ్యనివ్వడం, దేవతామూర్తులకు నివేదించబడిన నైవేద్యాలను స్వీకరించడం, తమనే దైవంగా ఆరాధించడానికి అనుమతించడం వంటివి ఇస్లాం మత సంప్రదాయానికి విరుద్ధమైనవని భావించేవాడు. ఆ విషయమై అతడు అభ్యంతరం చెబితే బాబా చిరునవ్వు నవ్వి, "అంతా(దేవతలందరూ) అల్లాయే!" అని అన్నారు. ఒక్కొక్కప్పుడు బాబా, “మనమందరమూ అల్లాచే సృష్టించబడినవారమే” అనీ, ఇంకొకసారి, “నేనే దైవాన్ని” అనీ అనేవారు. ఇదంతా అతడి దృష్టికి మతవిరుద్ధంగా తోచింది. అతనికి తెలిసిందల్లా మతధర్మంలో తద్విరుద్ధమైన అంశాలు చొప్పించినవారికి మరణశిక్ష విధించాలని మాత్రమే. ఆ కారణంగా, బాబా దైవమే అయినప్పటికీ వారి సిద్ధాంతం తప్పని, బాబాను, ఆయన సిద్ధాంతాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

ఒకరోజు బాబా నడిచి వెళ్తుండగా, వెనుకనుండి అతడు కుడిచేతిలో ఒక దుడ్డుకర్ర పట్టుకుని ఆయనను సమీపించాడు. అకస్మాత్తుగా బాబా వెనుకకు తిరిగి అతడి ఎడమచేతి మణికట్టును పట్టుకుని తీక్షణంగా అతని వైపు చూశారు. అతడు భయంతో కృంగిపోయి నేలపై కుప్పకూలిపోయాడు. దుడ్డుకర్రను పైకి లేపడానికి గానీ, తాను లేవడానికి గానీ అతనికి శక్తి లేకపోయింది. బాబా అతనిని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. చివరికి ఎవరో వచ్చి అతనిని లేపవలసి వచ్చింది. కొన్నిరోజుల తర్వాత అతడు బాబా వద్ద సెలవు తీసుకుని శిరిడీ విడిచి వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు. రెండవ రోహిల్లా మాత్రం బాబాపై ఎట్టి అసహనం వహించక వినయవిధేయతలతో సంస్థాన్ లో సేవ చేసుకుంటూ గడిపాడు. అట్టి మతఛాందసాన్ని ముస్లింలే కాదు కొందరు హిందువులు కూడా ప్రదర్శించేవారు. కానీ బాబా ప్రతి సందర్భంలోనూ వాళ్లలోని ద్వేషభావాన్ని ఒకేవిధంగా అణచివేశారు.

అన్ని మతాల అంతిమ లక్ష్యం మన దైవాన్ని భౌతికంగా దర్శించడం లేదా సాక్షాత్కారం పొందడమేనని కొందరి అభిప్రాయం. కానీ నేనలా అనుకోవడం లేదు. నేను బాబాను ఏకాగ్రతతో ధ్యానిస్తున్నప్పుడు, ధ్యానంలో బాబా రూపం సాక్షాత్కరించేది. నేను దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాను. ఎందుకంటే బాబాను వేరుగా, నా నుండి బాహ్యంగా చూడడం నాకు ఇష్టం లేదు. అందుకే బాబాను నా లోనికి వచ్చి "నేను"గా ఉండమని ప్రార్థించాను. ఆత్మ (నేను) అనేది రెండు పదార్థాలతో కూడుకున్నది. ఒకటి స్థూల శరీరము, రెండవది సూక్ష్మ శరీరము. సూక్ష్మశరీరమే మన ఉనికికి ఆధారమైనది, ఉత్కృష్టమైనది. మన ఆత్మ, విఠల దేవుడు, ఇతర తత్త్వాలు అన్నీ సత్యం యొక్క ప్రతిబింబాలే. అందువలన "నేను" విఠలుడు లేక సాయిగా ఎదగడానికి ప్రయత్నించాలి. వారు నాలో అత్యంత ఉన్నతంగా ప్రకాశించాలి. ఇదే నేను కోరుకునేది.

బాబాతో నాకున్న అనుభవాలన్నీ వివరించనవసరమూ లేదు, అది సాధ్యమూ కాదు. వారు నాపై చూపిన కరుణకు, వారు నా సంక్షేమానికై చేసిన ఏర్పాట్లకు పరిమితి లేదు. వారు చేసే సహాయం భక్తుని స్వభావం, పరిస్థితులపై ఆధారపడి వివిధ పద్ధతులలో ఉండేది. నేను అన్నివిధాలా వారి సహాయం పొందాను. వాటి గురించి ఇప్పుడు చెప్తాను.

మొదటి పద్ధతి: మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా మనమేదైనా ఒక నిర్దిష్టమైన పని చేయాలని బాబా తలచినప్పుడు మనకు ఒక ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణ బాబా నుండి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అప్పుడు మనం అలా నడుచుకోవాలి. ఉదాహరణకు, బాబా నాతో ఏదైనా అసాధారణ సమయంలో ఏకాంతంగా మాట్లాడాలని సంకల్పించారనుకోండి, వెంటనే నాకు బాబాను దర్శించాలనే ప్రేరణ కలిగేది. ఈ మొదటి పద్ధతి మనం ఎరుకలో ఉన్నప్పుడు కలిగే ప్రేరణలకు సంబంధించినది.

రెండవ పద్ధతి: స్వప్నదర్శనాల ద్వారా గానీ, ధ్యానపారవశ్యంలో గానీ, కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనపడటం ద్వారా గానీ బాబా సలహాలు, సూచనలు ఇస్తారు. ఇది పొరపాటుకు తావులేకుండా మన మనసులో చెదరని ముద్ర వేసే పద్ధతి.

మూడవ పద్ధతి: బాబా మనలను మరో వ్యక్తి వద్దకు పంపించి, వారి ద్వారా మనకు పరిష్కారం చూపుతారు లేదా సూచనను అందజేస్తారు. ఆ వ్యక్తికి సమస్యను పరిష్కరించగల సామర్థ్యంగానీ, వివేకంగానీ ఉండవు. ఆ వ్యక్తికి సమస్యేమిటో, దాని పరిష్కారమేమిటో కూడా తెలియదు. ఆ వ్యక్తికి తెలియకుండానే మనకు పరిష్కారం అందుతుంది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు, సమాధి చెందిన తరువాత కూడా పై మూడు పద్ధతుల ద్వారానే కాక అనేక విధాలుగా శిక్షణనిచ్చి నాకు సహాయం చేశారు.

నేనేమి చేయాలో అన్నది నా అనుభవాలే నాకు తెలియజేసేవి. ఇప్పటివరకు నన్ను ఏది నడిపించిందో, నేనేమి పొందానో దానికి నేను సంతృప్తిగా ఉన్నాను. నేను శ్రీసాయిని ఎంతగానో ప్రేమించినప్పటికీ ఇతరులు చేసుకున్నంత సేవ చేసుకోలేకపోయాను.

బాబాను భౌతికంగా దర్శించనివారెవరైనా బాబా భక్తుడయ్యేందుకు, వారి సహాయం పొందేందుకు ఏమి చేయాలని అడిగితే, "బాబాను హృదయపూర్వకంగా ప్రేమించమని, హృదయం నిండా ఆయనపట్ల ప్రేమను నింపుకునే ప్రయత్నం చేయమ"ని సలహా ఇస్తాను. అందుకోసం శిరిడీయే వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే శిరిడీ సందర్శనం నిస్సందేహంగా సహాయపడుతుంది. ప్రేమతో సర్వేంద్రియాలను కేంద్రీకరించి బాబాను ధ్యానిస్తే, ఎవరి ఆర్ద్రతలకు తగినట్లు వాళ్ళు ఆయన సహాయాన్ని తప్పక పొందుతారు.

రేగే ఒక లేఖలో తెలిపిన అంశాలు:

బాబా వయస్సు ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం. కానీ వారు 1872లో మొదటిసారి శిరిడీ వచ్చినప్పుడు వారి వయస్సు సుమారు 18 సంవత్సరాలని అంటారు. దానినిబట్టి వారు 1918లో మహాసమాధి చెందేనాటికి వారి వయస్సు 60 ఏళ్ళకు పైబడి ఉంటుందని అంచనా వేయవచ్చు. కానీ వారు సుమారు 80 సంవత్సరాలు పైబడినట్లు కనిపించేవారు.

బాబా సుమారు 5'10" ఎత్తుండేవారు. వారి దేహచ్ఛాయ గోధుమవర్ణంలో వర్ణించశక్యంకాని కాంతివంతంగా ఉండేది. కొన్ని సందర్భాలలో వారి ముఖం చుట్టూ తేజోవంతమైన ప్రకాశం ఉంటుండేది. వారు ఉదయాన్నే మేల్కొని సూర్యోదయం తరువాత మసీదు అరుగుమీద కూర్చుని ముఖం, చేతులు కడుక్కునేవారు. తరువాత వారు తమ ఆసనం మీద కూర్చుని చిలిం త్రాగేవారు. ఆ సమయంలో వారి దర్శనం కోసం భక్తులు వచ్చేవారు. సుమారు గంట తరువాత బాబా లెండీకి వెళ్లేవారు. కొంతమంది భక్తులు వారిని అనుసరించేవారు. గ్రామం వెంబడి బాబా నడిచే మార్గాన్ని రాధాకృష్ణఆయీ శుభ్రపరిచేది. లోతైన లెండీ కాలువ వద్ద బాబా ఒక గంటసేపు గడిపేవారు. వారితో వెళ్లిన భక్తులు బాబా లెండీ నుండి తిరిగి వచ్చేవరకు సమీపంలో వేచి ఉండేవారు. భక్తులతో కలిసి బాబా మసీదుకి తిరిగి వచ్చిన తరువాత తమ పాదాలు కడుక్కుని భిక్షకు బయలుదేరేవారు. శిరిడీలో ఉన్నప్పుడు నేను కూడా వారితోపాటు వెళ్తుండేవాడిని. నాకు తెలిసినంతవరకు రోజులో ఒక్కసారి మాత్రమే బాబా లెండీకి వెళ్లేవారు.

బాబా ధ్యానంలో లేదా ప్రార్థనలలో నిమగ్నమై ఉన్నట్లు నేను చెప్పలేను. కానీ సిద్ధత్వాన్ని పొందినవారు శాశ్వతధ్యానంలో ఉంటారని, వారు తమ జీవితంలో ప్రతిక్షణం భగవంతుని సేవలో గడుపుతారని శాస్త్రాల్లో చెప్పబడిన విషయాన్ని నేను నమ్ముతాను. బాబా మాంసాహారం తీసుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. 1911 నుండి 1912 వరకు భక్తులు అనేక రకాల వంటకాలను తయారుచేసి బాబాకు నైవేద్యంగా పంపేవారు. కానీ బాబా తాము భిక్షగా తెచ్చుకున్న ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవారు. అన్నిరకాల నైవేద్యాలు వస్తున్నప్పటికీ బాబా భిక్ష చేయడం మానలేదు. సచ్చరిత్రలో చెప్పబడినవాటికి నేను ఖచ్చితమైన హామీ ఏమీ ఇవ్వలేను. నాకు తెలిసినంతవరకు బాబా అల్పాహారం గానీ, రాత్రివేళ భోజనం గానీ తీసుకునేవారు కాదు. మధ్యాహ్న ఆరతి తరువాత మధ్యాహ్న భోజనం మాత్రమే తీసుకునేవారు. అదే పద్ధతి ఇప్పుడు శిరిడీలో కొనసాగుతోంది. బాబా తమ భక్తులకు ఔషధాలను సూచించినట్లు నేను ఎప్పుడూ చూడలేదు. వారు కళ్ళలో కొద్దిగా కారం పెట్టి ఒక అంధుడికి నయం చేశారని, ఒకటి రెండు సందర్భాలలో కొన్నిరకాల వేర్ల పొడిని ఔషధంగా సూచించారని మాత్రమే విన్నాను. సాధారణంగా బాబా భక్తులకు కొంత ఊదీ ఇచ్చి, వారి నుదుటిపై రాసేవారు.

గతంలో బాబా కోపావేశాలతో ఉన్నప్పుడు భక్తులను సట్కాతో కొట్టేవారని భక్తులు చెప్పారు. నేను కూడా కొన్నిసార్లు వారు తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉండటం చూశాను. కానీ ఆ సందర్భాల్లో కొందరు భక్తులు వారిని సమీపించే ప్రయత్నం చేసినప్పుడు వారు మంచులా కరిగిపోయేవారు. బాబా ప్రేమస్వరూపులు. ఒకప్పుడు శిరిడీకి చెందిన ఒక వ్యక్తి బంగారు ఆభరణాలను దొంగిలించి పట్టుబడ్డాడు. అతన్ని విచారించినప్పుడు ఆ ఆభరణాలను బాబానే తనకిచ్చారని అతను చెప్పాడు. దాంతో కోర్టుకు హాజరుకమ్మని బాబాకు సమన్లు జారీ చేశారు. తరువాత వారెంట్ కూడా జారీ చేయబడింది. అయితే బాబా ఎందరికో పూజ్యులైనందున భక్తులు పెట్టుకున్న అర్జీననుసరించి న్యాయమూర్తి కోర్టు ప్రతినిధిని శిరిడీకి పంపి విచారణ జరపడానికి అంగీకరించారు. ఆ విచారణలో బాబా, "ప్రజలు తనని ‘సాయి’ అని పిలుస్తారని, తన తండ్రి 'అల్లా' అని, అంతటా నా నివాసమ"ని చెప్పారు. చివరికి కోర్టువారు ఆభరణాల గురించి అడగగా, "ఏదైనా నేనుగాక మరెవరు ఇస్తారు?" అని బాబా బదులిచ్చారు. బాబా మాటలను బట్టి వారు దైవమే అని గ్రహించిన న్యాయమూర్తి నిందితుణ్ణి దోషిగా నిర్ధారించి, అతనికి జైలుశిక్ష విధించారు. ఈ విషయం గురించి బాబాతో చెప్పినప్పుడు వారు, "ఎవరు శిక్ష విధించింది? ఆభరణాలను ఇచ్చినవాడే శిక్షను కూడా విధించాడు" అని అన్నారు.

ఒకసారి నేను, అవస్తే ఒక రథాన్ని బాబాకు సమర్పించుకున్నాము. ఈ విషయం భక్తులెవరికీ తెలియదు. రాత్రికి రాత్రే మేము ఆ రథాన్ని తీసుకొచ్చి మసీదులో ఉంచాము. మరుసటిరోజు ఉదయం దాసగణు బాబా దర్శనం కోసం వచ్చినప్పుడు బాబా తమ సాధారణ ధోరణిలో ఆ రథాన్ని చూపిస్తూ, "ఆ తుర్బాత్ (తాజియా, అంటే సమాధి)ని చూడు! ప్రజలు ఏమి చేస్తున్నారో గమనించు! ఇది భక్తా?" అని అన్నారు. అలాంటివి అనుమతించినందుకు బాబాను నిందించి, ఆ భక్తులను కూడా తీవ్రంగా దూషించడం మొదలుపెట్టాడు దాసగణు. పది నిమిషాల తరువాత బాబా నవ్వుతూ, "గణూ, నువ్వేమైనా గ్రుడ్డివాడివా? నీ మతి పోయిందా? ఇది తుర్బాత్ కాదు. ఇది నా రథం. నేను దీనిలో ప్రపంచమంతటా విహరిస్తాను" అని అన్నారు. అయితే బాబా భౌతికంగా దానిని ఏనాడూ ఉపయోగించలేదు.

సమాప్తం 

Source: http://www.saiamrithadhara.com/mahabhakthas/m.b.rege.html
http://bonjanrao.blogspot.com/2012/10/j-u-s-t-i-c-e-m-b-r-e-g-e.html
Devotees' Experiences of Sri Sai Baba Sri.B.V.Narasimha Swamiji

 


ముందు భాగం కోసం

బాబా పాదుకలు తాకండి.




నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

6 comments:

  1. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  4. ఓం సాయి రామ్ 🙏🏻🕉️

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo