సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 517వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ప్రేమబంధాన్ని నిలిపిన బాబా
  2. బాబా ఆశీస్సులతో వచ్చిన ఉద్యోగం

ప్రేమబంధాన్ని నిలిపిన బాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు: 

అందరికీ హాయ్! నేను సాయిభక్తురాలిని. బాబా నాకు చాలా అద్భుతమైన అనుభవాలను ప్రసాదించారు. వాటిలో ఒకదాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. బాబా పట్ల నాకున్న కృతజ్ఞతాభావాన్ని తెలియజేయడానికి ఇది ఒక మార్గమని నేను భావిస్తున్నాను. నేనొక వ్యక్తిని ఇష్టపడ్డాను. అతను నన్ను చాలా బాగా అర్థం చేసుకున్న వ్యక్తి. జీవితంలో కావాల్సినంత ఆనందాన్ని నాకు ఇవ్వడానికి తనవంతు ఎంతో గొప్పగా ప్రయత్నించాడు. అయితే త్వరగా నిగ్రహాన్ని కోల్పోయే స్వభావం నాది. క్షణాల్లో నాకు కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో నేను అనే మాటలపై నాకు నియంత్రణ ఉండేది కాదు. శాంతస్వభావి అయిన తను మాత్రం చెడు సమయాల్లో సైతం నాతో చక్కగా నడుచుకునేవాడు. అలా తనతో నా అనుబంధం ఆరున్నర సంవత్సరాలు చాలా చక్కగా సాగింది. అందుకు నేనెంతో అదృష్టవంతురాలిగా భావించాను. 

అతని అభిరుచులు ఇష్టపడి తనతో ఒక స్త్రీ మాట్లాడుతుండేది. అతను నాకే సొంతమన్న స్వార్థంతో నేను అది సహించలేక అతనితో గొడవపడ్డాను. అంతటితో అతను ఆ స్త్రీతో మాట్లాడటం మానేయడంతో నేను చాలా సంతోషించాను. అయితే కొన్నినెలల తర్వాత ఆ స్త్రీ మళ్ళీ నాకు సమస్యగా మారింది. ఆ సమయంలో అతను తన స్వేచ్ఛని కోల్పోతున్నానని, మొదటినుండి అనేక విషయాలలో రాజీపడుతూ జీవితం గడపాల్సి వస్తోందని భావించాడు. ఇలాంటి జీవితాన్ని గడపడంలో అర్థం లేదని నన్ను విడిచిపెట్టి మా సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతటితో అతను నాతో మాట్లాడటం మానేశాడు.

తరువాత నేను అతని విలువను గ్రహించాను. నా జీవితంలోకి అతను తిరిగి రావాలని కోరుకున్నాను. నేను నా ఆత్మాభిమానాన్ని వదులుకుని మరీ అతన్ని ఒప్పించటానికి అన్నివిధాలా ప్రయత్నించాను, కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు బాబా పట్ల పూర్తి విశ్వాసమున్న నేను, "బాబా! మేము మళ్ళీ కలిసేలా ఆశీర్వదించి మమ్మల్ని శిరిడీకి రప్పించుకోండి" అని బాబాను మనసారా ప్రార్థించాను. అంతేకాదు, "మమ్మల్ని శిరిడీకి పిలిచేవరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల తర్వాత నేను ఆహారాన్ని తీసుకోను" అని బాబాకు చెప్పుకున్నాను. ఆ సమయంలో నా స్నేహితురాలు '9 గురువారాల సాయి వ్రతం' చేయమని నాకు సలహా ఇచ్చింది. నేను వెంటనే వ్రతాన్ని ప్రారంభించాను. 5వ గురువారం అద్భుతం జరిగింది. అతను తిరిగి నా జీవితంలోకి వస్తాడన్న ఆశ ఏమాత్రం లేకపోయినప్పటికీ, నన్ను నేను నియంత్రించుకోలేక అతనికి ఒక సందేశాన్ని పంపించాను. అతను ప్రత్యుత్తరం ఇస్తాడని నేను అస్సలు అనుకోలేదు. కానీ నేను ఆశ్చర్యపోయేలా అతను సమాధానం ఇచ్చాడు. అకస్మాత్తుగా పరిస్థితుల్లో మార్పు ప్రారంభమైంది, తిరిగి మా బంధం పూర్వపు రూపాన్ని సంతరించుకుంది. ఆ క్షణాన నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నాకు స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది. ఈ అద్భుతాన్ని ప్రసాదించిన బాబాకు చాలా చాలా కృతజ్ఞతలు. "బాబా! మీ ఆశీస్సులు ఎప్పటికీ మాపై ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యు బాబా!"

బాబా ఆశీస్సులతో వచ్చిన ఉద్యోగం

యు.ఎస్ నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

1993 నుండి నేను సాయిభక్తుడిని. నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను నా భార్య ద్వారా సాయిబాబా అద్భుతలీలలకు సంబంధించిన ఒక ఫేస్‌బుక్ పేజీ గురించి తెలుసుకున్నాను. అప్పటినుండి నేను సాయిభక్తుల అనుభవాలను చదవడం మొదలుపెట్టాను. నిజంగా అవి చాలా అద్భుతమైనవి. చదువుతుంటే మనసుకెంతో హాయిగా ఉండేది. తరువాత నాకు కూడా ఒక చక్కటి అనుభవం జరిగింది. అప్పట్లో నేను చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన కాంట్రాక్టు ముగిసింది. నేను అన్ని జాబ్ పోర్టల్స్‌లో నా రెజ్యూమ్ అప్‌లోడ్ చేసి, ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో శోధిస్తూ దరఖాస్తు చేయడం ప్రారంభించాను. అయితే రెండు వారాలు గడిచినా నాకు ఇంటర్వ్యూ కాల్స్ రాలేదు. ఆ సమయంలో నా భార్య నాతో, "మీరెందుకు ఈ గురువారం సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి, వచ్చే గురువారానికి పూర్తిచేయకూడదు?" అని అడిగింది. సరేనని నేను సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి బుధవారం నాటికి పూర్తిచేశాను. అదేరోజు నాకొక పాత వెండర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ వద్ద ఒక పొజిషన్ ఉందని, అదివరకటి ఒకానొక పాత కంపెనీలోని నా సహోద్యోగి వద్ద నుండి నా రెజ్యూమ్ సేకరించి కాల్ చేస్తున్నామని చెప్పి ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. నేను గురువారంనాడు క్లయింట్‌తో పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరయ్యాను. బాబా కృపవలన వాళ్ళు నా ఇంటర్వ్యూతో సంతృప్తి చెంది ఆరోజే నా ఉద్యోగాన్ని నిర్ధారణ చేశారు. ఇదంతా బాబా ఆశీస్సుల వల్లనే జరిగింది. నేను బాబాను నమ్ముతున్నప్పటినుండి నా జీవితంలో ఇలా చాలా అనుభవాలు జరిగాయి. "జీవితంలో మీరు ఇచ్చిన ప్రతిదానికీ నా ధన్యవాదాలు బాబా. మీ భక్తులందరినీ అనుగ్రహించి వారికి మనశ్శాంతిని ప్రసాదించండి". 

ఓం సాయిరామ్!



6 comments:

  1. Jai Sairam. తొందర లోనె నేనుకూడ నా అనుభవాన్ని పంచుకొనే అదృష్టమును నాకు కల్పించాలని బాబాను వెడుకొంటున్నాను.

    ReplyDelete
  2. Baba na korika teerchu thandri sai

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  4. ఓం సాయిరామ్!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo