సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 513వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. మా కుటుంబంపై బాబా అనుగ్రహం
  2. బాబా పాదతీర్థంతో త్వరగా కోలుకున్న భక్తురాలు
  3. బాబా దయ

మా కుటుంబంపై బాబా అనుగ్రహం

బెంగుళూరు నుండి శ్రీమతి లక్ష్మిగారు తమకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయి బృందానికి నా ధన్యవాదాలు. బాబా నాకు ప్రసాదించిన రెండు చిన్న అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 

మొదటి అనుభవం: 

2011లో మా చిన్నబ్బాయికి మెడమీద కణితి వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించి దాన్ని బయాప్సీ చేశారు. మరో రెండు రోజుల్లో రిపోర్ట్ వస్తుందని చెప్పారు. ఆ సమయంలో నేను తప్పనిసరిగా ఒక ఫంక్షనుకి హాజరవ్వాల్సి వచ్చి హైదరాబాదుకు వెళ్ళాను. మనసు బాగాలేక బాబాను స్మరించుకుంటూనే ఫంక్షన్ హాలుకు వెళుతూ ఉంటే, ముందు వెళ్ళే వాహనాల మీద సాయిబాబా ఫోటోలు కనిపించసాగాయి. బాబా నాకు తోడున్నారని నా మనస్సుకు అనిపించి, బాబాపై నమ్మకంతో రిపోర్ట్ కోసం ఎదురుచూస్తూ ఫంక్షనుకు హాజరై తిరిగి బెంగుళూరు చేరుకున్నాను. ఆ మర్నాడు, అంతా నార్మల్ గా ఉందని, థైరాయిడ్ సమస్య కొంచెం ఉందని రిపోర్టు వచ్చింది. అది చూసి నా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంతో సంతోషంతో బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. 
      
రెండవ అనుభవం:

మా చిన్నబ్బాయి తన కుటుంబంతో 2020 జూలై 26వ తేదీన తన వదినగారి కూతురి పెళ్ళికి హైదరాబాదు వెళ్ళాడు. కరోనా సమయం కదా, నాకు చాలా ఆందోళనగా అనిపించి, వాళ్ళు పెళ్ళికి వెళ్ళి వచ్చేవరకు నేను సాయి నామాన్నే స్మరిస్తూ గడిపాను. బాబా దయవలన వాళ్ళు ఏ ఇబ్బందీ లేకుండా తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఒక వారం రోజులపాటు క్వారంటైన్లో ఉన్నారు. బాబా అనుగ్రహంతో ఇప్పుడు అంతా క్షేమంగా ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి నుండి అందరినీ బాబా కాపాడాలని కోరుకుంటున్నాను

బాబా పాదతీర్థంతో త్వరగా కోలుకున్న భక్తురాలు

సాయిభక్తుడు శ్రీకాంత్ తనకు తెలిసిన సాయిబంధువులకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో ఉండే సాయిబంధువులు చీమకుర్తి సత్యనారాయణ, శ్రీమతి తులసీ అన్నపూర్ణ దంపతుల కుమార్తె రోజాకు యాక్సిడెంట్ అయినప్పుడు బాబా అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదించారు. 2008లో 10వ తరగతి పరీక్షలు వ్రాసిన తరువాత జూన్ నెలలో రోజాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కారణంగా తను మంచం మీద ఉన్నప్పుడు ఆ కుటుంబానికి పరిచయస్థుడైన తులసీరాం అనే అబ్బాయి ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు బాబా మందిరానికి వెళ్ళి, బాబాకు అభిషేకం చేసి, బాబా పాదతీర్థం తీసుకొచ్చి వాళ్ళకు ఇచ్చేవాడు. అలా 41 రోజుల పాటు బాబా పాదతీర్థాన్ని ఇచ్చాడు. అలా తులసీరాం తెచ్చిన బాబా పాదతీర్థాన్ని ప్రతిరోజూ త్రాగటం వలన బాబా అనుగ్రహంతో రోజా చాలా త్వరగా కోలుకుంది. రోజా అంత త్వరగా కోలుకోవడం చూసిన డాక్టర్లు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. “41 రోజుల పాటు బాబా మందిరం నుండి పాదతీర్థం తెచ్చి ఇచ్చేలా తులసీరాంను బాబానే ప్రేరేపించటం, బాబా పాదతీర్థాన్ని సేవించి రోజా అంత త్వరగా కోలుకోవటం ఎప్పుడు తలచుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది. మా కుటుంబసభ్యులమంతా బాబాకు, తులసీరాంకు చాలా చాలా ఋణపడివుంటామ”ని సత్యనారాయణగారు ఎంతో ఉద్వేగంగా చెబుతుంటారు. అదేకాకుండా, రోజా కోలుకున్నాక బాబా అనుగ్రహంతో మంచి IIIT కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. ఇలా వారి కుటుంబానికి బాబా చాలా అనుభవాలను ప్రసాదించారు.

బాబా దయ

సాయిబాబాకు నా వందనాలు. నా పేరు అరుణ. మేము విజయవాడలో నివాసముంటున్నాము. బాబా దయవల్ల మాకొక అద్భుతం జరిగింది. ఈమధ్య మా పక్క ఫ్లాట్‌లో ఉండేవాళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మాకు చాలా భయమేసింది. దానికి తోడు నాకు తీవ్రమైన తలనొప్పి, రుచి తెలియకపోవడం, విపరీతమైన కాళ్ళనొప్పులు వచ్చాయి. నాకు చాలా ఆందోళనగా అనిపించి బాబాను తలచుకొని, "నాకు ఏమీ ఉండకూడదు బాబా" అని ప్రార్థించాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి నాకు ఏమీ లేవు. అంతా బాబా దయ.

13 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo