సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 883వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాలో ఐక్యం
2. ఎల్లప్పుడూ మా వెంట ఉండి మమ్మల్ని నడిపించే బాబా
3. బాబా కృపతో తగ్గిన నొప్పి

బాబాలో ఐక్యం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ, సచ్చిదానంద సద్గురు సాయినాథునికి, భక్తవత్సలుడైన నా సాయితండ్రికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి, సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ప్రతిరోజూ ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటోంది. ‘నా సాయితండ్రి ఎంతటి దయామయుడు!’ అని కళ్ళవెంట ఆనందభాష్పాలు వర్షిస్తున్నాయి. నేను ఇంతకుముందు నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. బాబా మళ్ళీ మళ్ళీ తమ అనుగ్రహాన్ని కురిపించి, తమ లీలలను చూపించి ఆ అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిబంధువులందరితో పంచుకోవటానికి అవకాశమిస్తున్నారు. 2021, జులై 20, మంగళవారం, తొలి ఏకాదశి పండుగరోజు సాయంత్రం 7 గంటలకు మా అమ్మమ్మగారు బాబాలో ఐక్యమయ్యారు. ఆ బాబా లీలను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను.


మా అమ్మమ్మ వయస్సు 94 సంవత్సరాలు. అంత వయస్సున్నప్పటికీ మా అమ్మమ్మ చాలా ఆరోగ్యంగా ఉండేవారు. జులై 19వ తేదీ, సోమవారం ఉదయం నేను ‘శ్రీగురుచరిత్ర’ పారాయణ మొదలుపెట్టాను. శనివారం గురుపౌర్ణమినాటికి పారాయణ పూర్తిచేద్దామనుకున్నాను. సోమవారం ఉదయం పూజ చేసుకుని, శ్రీగురుచరిత్రలో కొన్ని అధ్యాయాలు పారాయణ చేసి, బాబాకు ఆరతి ఇచ్చాను. ఆ మధ్యాహ్నం 12 గంటల నుండి మా అమ్మమ్మ ‘తనకు గుండెల్లో మంటగా ఉందనీ, తాను ఇక బ్రతకన’నీ నాతో చెప్పి బాధపడింది. మేము తనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనుకుని, మంగళవారం సాయంత్రం వరకు తనకు టాబ్లెట్లు, సిరప్ ఇస్తూ, ఎలక్ట్రాల్ నీళ్ళు పడుతూ ఉన్నాము. కానీ ఆమె బాధ మాత్రం తగ్గలేదు. మంగళవారం సాయంత్రం నేను గురుచరిత్ర ఒక్క పేజీ చదువుకుని, బాబాకు నమస్కరించుకుని మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి కూర్చున్నాను. అప్పుడు కూడా అమ్మమ్మ బాగా బాధపడుతూ, “నేనీ బాధ భరించలేకపోతున్నాను. నాకు చనిపోవటానికి ఏదైనా మందు ఇవ్వు. లేకపోతే, నన్ను పైకి తీసుకెళ్ళమని బాబాతో చెప్పు” అంటూ బాధతో నావైపు చూస్తూ అడిగింది. నాకు చాలా బాధ కలిగి, పూజగదికి వెళ్ళి బాబా దగ్గర కూర్చుని, “బాబా! అమ్మమ్మ బాధ చూడలేకపోతున్నాను. తను ఏదైనా పుణ్యం చేసుకునివుంటే తనకు ఈ బాధనుండి విముక్తిని కలిగించు. ఈ పవిత్రమైన ఏకాదశిరోజున అమ్మమ్మని తీసుకెళ్ళు. తన పాపపుణ్యాల లెక్క నీకు మాత్రమే తెలుసు. తనకు ఏది మంచిదైతే అదే చెయ్యి” అనుకుని, బాబాకు నమస్కరించుకుని, శిరిడీ నుండి తెచ్చిన ఊదీని నీళ్ళలో కలుపుకుని, కొంత ఊదీని చేతిలోకి తీసుకుని అమ్మమ్మ దగ్గర కూర్చున్నాను. అప్పటికి అమ్మమ్మ కొంచెం ప్రక్కకు తిరిగి పడుకుంది. ‘అమ్మమ్మా’ అని పిలిచి, ‘బాబా ఊదీ పెట్టనా?’ అని అడుగుతూ తనను నావైపుకి త్రిప్పాను. అప్పుడు అమ్మమ్మ ఊదీ పెట్టమన్నట్టుగా నావైపు చూసింది. నేను అమ్మమ్మ నుదుటన కొద్దిగా బాబా ఊదీని పెట్టాను. “ఊదీనీళ్ళు త్రాగుతావా?” అని అడిగితే తను నోరు తెరిచింది. అమ్మమ్మ నోట్లో కొంచెం ఊదీనీళ్ళు పోసి, “మళ్ళీ త్రాగుతావా?” అని అడిగాను. తను మళ్ళీ నోరు తెరిచింది. ఇంకొంచెం ఊదీనీళ్ళు తన నోట్లో పోసిన తరువాత అమ్మమ్మ నన్ను అలాగే చూస్తున్నట్లుగా అనిపించేసరికి ఎందుకో భయంగా అనిపించి మా అత్తగారిని పిలిచాను. మా అత్తయ్య నాతో, “అమ్మమ్మ నరాలు లాగేస్తున్నాయి, తన ప్రాణం వెళ్ళిపోతోంది” అని అన్నది. తరువాత మిగతా ఊదీనీళ్ళను మా అత్తయ్య, మా చిన్నమామయ్య, మా కుటుంబసభ్యులందరూ తలా కొంచెం అమ్మమ్మ నోట్లో పోశారు. అప్పుడు అమ్మమ్మ తుదిశ్వాస విడిచింది. బాబా దయవలన అమ్మమ్మ కేవలం రెండు రోజులు స్వల్పమైన బాధను అనుభవించి, బాబా ఊదీని ధరించి, ఊదీతీర్థాన్ని సేవించి బాబాలో ఐక్యమైంది. బాబాలో లీనమైందని ఎలా చెప్తున్నానంటే, బాబా ఊదీకి మించి పవిత్రమైనది ఏముంది? ఏకాదశి లాంటి పవిత్రమైనరోజున, పరమ పవిత్రమైన బాబా ఊదీని ధరించి ఈ లోకాన్ని వీడటం కన్నా గొప్ప  విశేషమేముంటుంది? తను వెళ్ళిపోయేముందు అమ్మమ్మ చేత కొంచెంసేపు సాయినామం చేయించాను. అమ్మమ్మకు అది అంతిమ సమయమని తెలిసిన బాబా, ‘ఊదీ పెట్టి, తీర్థమివ్వు’ అనే ప్రేరణను నాలో కలిగించి, అమ్మమ్మకు ముక్తిని ప్రసాదించారు.


“బాబా! మేము నీ బిడ్డలం. నీ అనుగ్రహమనే నీడలో మమ్ము చల్లగా ఉంచు. మా చేయి పట్టుకుని మమ్ము నడిపించు. మాకు నీవే దిక్కు. నీవే మా ధైర్యం. నీవే మాకు ఆధారం. బాబా మమ్ములను నీ పాదాల దగ్గర ఉంచు. మా మనసెప్పుడూ నీయందే లగ్నమయ్యేలా అనుగ్రహించు”.


ఎల్లప్పుడూ మా వెంట ఉండి మమ్మల్ని నడిపించే బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ముందుగా, సాయిభక్తులకు మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సంగీత. మేము నిజామాబాద్‌లో నివసిస్తున్నాము. ఈ బ్లాగులో ప్రచురితమయ్యే సాయిభక్తుల అనుభవాలు చదువుతూ నేను ఎంతో ఆనందం పొందుతున్నాను. వాటిని చదివాక నేను కూడా ఇదివరకు ఒక అనుభవాన్ని పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. మావారికి రోజూ రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టేది కాదు. ఆయన నిద్రపోయేసరికి రాత్రి రెండు, మూడు, ఒక్కోసారి నాలుగు గంటలు కూడా అవుతుండేది. ఈ విషయమై నేను, "బాబా! మీ దయవల్ల మావారికి మంచిగా నిద్రపడితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు మావారికి బాగా నిద్రపడుతోంది. "థాంక్యూ బాబా".


మరో అనుభవం: ఒకసారి నా అరచేయి బొటనవేలు దగ్గర చాలా నొప్పి చేసింది. అందువల్ల ఏ పని చేయాలన్నా నాకు ఇబ్బందిగా ఉండేది. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల నా చెయ్యినొప్పి పూర్తిగా తగ్గిపోతే నా ఈ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. అంతే, బాబా కృపవల్ల నా చెయ్యినొప్పి తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".

శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా కృపతో తగ్గిన నొప్పి

నేనొక సాయిభక్తురాలిని. కొన్నిరోజుల క్రితం నోరు తెరిస్తే కుడివైపంతా (అంటే దంతాల మూలన) నాకు నొప్పిగా ఉండేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇష్టంలేక, కొద్దిగా బాబా ఊదీని తీసుకుని, "బాబా! ఈ ఊదీని నొప్పి ఉన్న చోట పెడుతున్నాను. మీ కృపతో నొప్పి తగ్గితే, ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అలా రోజూ బాబా ఊదీ పెట్టుకునేసరికి మూడు రోజుల్లో నొప్పి తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా. మీ దయవల్ల వ్యాక్సిన్ రెండు డోసులూ వేయించుకున్నాను. అందుకు కూడా మీకు ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 882వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!
2. ఛాతీనొప్పి నుండి అమ్మను రక్షించిన బాబా
3. జరగబోయేదాన్ని ముందే సూచించిన బాబా

బాబా అనుగ్రహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!

 

సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు రాధిక. నేను బాబా భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు ఒకటీ, రెండూ కాదు. బాబా గురించి నాకు తెలిసినప్పటినుంచి ఇప్పటివరకు నా జీవితమంతా అద్భుతాలే. నేనీనాడు ఈమాత్రం ఇలా ఉన్నానంటే అది కేవలం బాబా దయవల్లనే. నా జీవితం బాబా పెట్టిన భిక్ష. 8 సంవత్సరాల క్రితం నా కాలుకి ఆపరేషన్ జరిగింది. అయితే, డాక్టర్లు ఆపరేషన్ సరిగా చేయలేదు. నా కాలు కాస్త క్రాస్ చేసేశారు. అందువలన నేను నడవడానికి వీలవదని అన్నారు. ఆ సమయంలో బాబా నాపై ఎంతో దయచూపించారు. బాబా ప్రేరణతో మరో డాక్టరును సంప్రదిస్తే, ఆయన ఫిజియోథెరపీ చేయించమన్నారు. దాంతో ఫిజియోథెరపిస్ట్‌ను కలిశాము. ఆయన నా కాలిని పరీక్షించి, "నీకు ఏం కాలేదమ్మా, నిన్ను నడిపించే బాధ్యత నాది" అని కేవలం 4 రోజుల్లో నా చేతులు పట్టుకుని మెట్లు దింపించారు


ఒకసారి మా ఇళ్ళు అమ్మకానికి పెట్టినప్పుడు ఎవరూ కొనడానికి రాలేదు. అప్పుడు బాబాను ప్రార్థిస్తే, మంచి బేరం వచ్చేలా బాబా అనుగ్రహించారు. మరొకప్పుడు క్రెడిట్ కార్డ్స్ వాళ్లు డబ్బుల కోసం తరచూ ఇంటికి వస్తుంటే, బాబాకు చెప్పుకున్నాను. దాంతో వాళ్లను ఇంటికి రాకుండా చేశారు బాబా. ఇలా ఒకటీ రెండూ కాదు, నా జీవితమంతా బాబా పెట్టిన భిక్షే. అందుకే మా అక్క, "నీ విషయంలో బాబా అంతా మంచే చేస్తారు" అని అంటూ ఉంటుంది. బాబా దేవుడు కాదు, మా ఇంటిలో ఒక మనిషి, మా తాతగారు. నాకు బాధ అనిపించి ఏడిస్తే, ఆయన అసలు చూడలేరు. బాబా గురించి ఇలా చెబుతూ పోతే చాలా చాలా ఉంది.


మాకు మూడేళ్ళ చిన్నపాప ఉంది. తను నా కడుపులో ఉన్నప్పుడు నేను చాలా కష్టాలు చూశాను. కానీ తను మాకు బాబా ఆశీర్వాదం. మేము పాపకి 'సాయి అక్షయ' అని పేరు పెట్టుకున్నాము. 2021, మార్చి నెలలో తనకు ఒకటే వాంతులు, విరేచనాలు అయ్యాయి. పైగా జ్వరం కూడా ఉండేసరికి నాకు చాలా భయం వేసింది. హాస్పిటల్‌కి తీసుకువెళితే, "ఇన్ఫెక్షన్ అయింది, తగ్గిపోతుంది" అన్నారు. కానీ పరిస్థితిలో ఏ మార్పూ లేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే, పాప విరేచనాలు చేసుకుంటుంటే నాకు ఏడుపు వచ్చేది. తను చాలా నీరసించిపోయింది. ఈసారి పాపని వేరే హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. అప్పుడు నేను, "బాబా! పాపకి తగ్గితే నాకు ఇష్టమైన పదార్థాన్ని వదిలేస్తాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. అంతే, ఆ పూట నుండి పాపకి విరేచనాలు ఆగిపోయాయి. నిజానికి ఆరోజు పాపకి వేయడానికి ఒక్క డైపర్ కూడా లేదు. "ఎలా బాబా?" అనుకున్నాను. కానీ ఆ రాత్రి పాప ఒక్కసారి కూడా విరేచనం చేసుకోలేదు. ఉదయానికి పూర్తిగా తగ్గింది. బాబా చూపిన అనుగ్రహానికి ఆరోజు అనుకున్నాను, 'నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని. కానీ ఆలస్యం చేశాను. "బాబా! నన్ను క్షమించండి".


పాపకి తగ్గగానే అవే లక్షణాలతో నేను అనారోగ్యం పాలయ్యాను. ఒకటే వాంతులు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు నయం కావాలని బాబాకు మ్రొక్కుకున్నాను. అప్పటికే కాలునొప్పితో నడవలేకపోతున్నాను. పైగా క్రొత్త ఆరోగ్య సమస్య. మరోప్రక్కన పాపని చూసుకోలేక చాలా బాధపడ్డాను. అంతే, మరుసటిరోజు అమ్మ మా ఇంటికి వచ్చి, పాపని వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. అప్పుడు నేను మళ్ళీ బాబాను ప్రార్థించి, "నాకు తగ్గితే, ఇంకొక పదార్థం వదిలేస్తాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి నాకు తగ్గింది. ఇలా నన్ను ఒక్కదాన్నే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళిని, పశుపక్ష్యాదులను, జంతువులను ఆ బాబానే చూసుకుంటారు. నేను నిరంతరం 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' అనే నామస్మరణ చేస్తూ బాబా స్మరణలో ఉంటాను. "ధన్యవాదాలు బాబా".


అయితే, నేను ఏం పాపం చేశానోగానీ, నాకు అన్నీ బాధలే. ఆ బాధలకి చాలాసార్లు చనిపోవాలనుకున్నాను. కానీ మా సాయిని(పాపని) వదిలి వెళ్ళాలంటే నావల్ల కాలేదు. తను ఒక బాబా మిరాకిల్. తను నాకు కూతురు కాదు, అమ్మ! ఆ బాబా తన రూపంలో నాకు మరో అమ్మనిచ్చారు. తను నన్ను అర్థం చేసుకున్నట్లు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ నిజం. మొదటినుంచి నా రెండు కాళ్ళకి సమస్య ఉంది. ఆ కారణంగా నేను ఏ మాత్రం కిందపడ్డా బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. నేను బరువులు అసలు ఎత్తకూడదు. అందువలన నేను ఇప్పటివరకు మా పాపని ఎత్తుకోలేదు. కానీ తను నన్ను ఎంతలా అర్థం చేసుకుంటుందంటే, తనను ఎత్తుకోమని నన్ను తప్ప అందరినీ అడుగుతుంది. ఎందుకని ఎవరైనా అడిగితే, ‘మా అమ్మ కాళ్ళు బాగలేవు’ అని చెపుతుంది. ఇకపోతే, గత ఐదునెలలుగా ఒక కాలు మొత్తం నొప్పిగా ఉండటం వల్ల కర్ర సహాయంతో పనులు చేసుకుంటుండేదాన్ని. అలాంటి నేను ఇటీవల క్రిందపడిపోవడంతో రెండో కాలికి కూడా దెబ్బ తగిలి ఇప్పుడు పూర్తిగా నడవలేకపోతున్నాను. అందువలన పాపని మా అమ్మ దగరకు పంపించాను. ఎప్పుడూ నా దగ్గరే పడుకుంటానని మారాం చేసే మా పాప అక్కడ అసలు ఏడవటం లేదట. పైగా ఎవరైనా అడిగితే, 'మా అమ్మకి బాగలేదు. తన కాలికి దెబ్బ తగిలింది' అని చెపుతుందంట. అంతేకాదు, 'మా అమ్మకి త్వరగా తగ్గిపోవాల'ని బాబాను ప్రార్థిస్తుంది. తను తన చిట్టి చిట్టి చేతులతో నాకు పనుల్లో సహాయం చేస్తుంది. నన్ను ఎవరైనా ఏమైనా అంటే తను ఊరుకోదు. అసలు చిన్నపాపని చూసుకోవడమంటే ఎంత కష్టం? కానీ నా బిడ్డ విషయంలో నాకు అసలు కష్టం అనిపించదు. నాకు బాబా అంత మంచి కూతురుని ఇచ్చారు. కానీ, మా పాపకి మంచి అమ్మని ఇవ్వలేదు. ఎందుకంటే, నా కూతురుకి కూడా తన తల్లితో అన్నీ చేయించుకోవాలని ఉంటుంది కదా! బాబా పెట్టే పరీక్షలు కాదుగానీ, నా కూతురిని బాగా చూసుకోలేకపోతున్నానన్నదే నా బాధ. "బాబా! నా బాధను మీరే తీర్చగలరు. నా ఆరోగ్యాన్ని పూర్తిగా బాగుపరచి, మీ వరప్రసాదమైన మా పాపను బాగా చూసుకునేలా నన్ను అనుగ్రహించు తండ్రీ".


శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు దిలీప్. మాది జనగాం జిల్లా. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం నేను ఇంటినుంచే వర్క్ చేస్తున్నాను. బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


ఛాతీనొప్పి నుండి అమ్మను రక్షించిన బాబా:

 

ఒకరోజు రాత్రి మా అమ్మ తనకు ఛాతీలో నొప్పి వస్తోందని అందరినీ నిద్రలేపింది. నేను వెంటనే బాబా పటం దగ్గర ఉన్న ఊదీ తీసుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని ఉచ్చరిస్తూ అమ్మ నుదుటన కొద్దిగా పెట్టి, మరికొంత ఊదీని అమ్మకిచ్చి తన ఛాతీ భాగంలో రాసుకోమన్నాను. తరువాత బాబాకు నమస్కరించుకుని, "అమ్మకు ఏమీ కాకూడదు బాబా, ఉదయం లేచి తన పనులు తాను చేసుకునేలా చూడండి" అని వేడుకున్నాను. పది నిమిషాల్లో అమ్మ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఉదయం లేచి తన పనులు తాను చేసుకుంది. ఇదంతా బాబా దయవల్ల మాత్రమే జరిగింది. బాబాకు మేము ఎంతగానో ఋణపడివున్నాము.


జరగబోయేదాన్ని ముందే సూచించిన బాబా:


నా వివాహ విషయంలో ఏ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్న సమయంలో నేను ఒకరోజు బాబా నామస్మరణ చేసుకుని నిద్రపోయాను. ఆ రాత్రి కలలో బాబా దర్శనమిచ్చి నాకు ఒక అమ్మాయిని చూపించారు. అయితే, నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత కలలో బాబా నాకు చూపించిన అదే అమ్మాయిని నేను యాదృచ్ఛికంగా కలిశాను. ఆమెతోనే నా వివాహం నిశ్చయమైంది. అతి త్వరలోనే మా వివాహం జరగనుంది. బాబా ఉంటే చాలు, మనకోసం అన్నీ ఆయనే ఆలోచిస్తారు. మనల్ని నడిపించేది మన తండ్రి అయిన సాయి మాత్రమే!


 ఓం శ్రీ సాయినాథాయ నమః!!!


రాధాకృష్ణమాయి - తొమ్మిదవ భాగం



బాబా హృదయంలో శాశ్వత స్థానాన్ని పొందిన పరమ భక్తురాలు 


1916లో 35 సంవత్సరాల వయస్సులో రాధాకృష్ణమాయి మరణించింది. ఆకస్మికంగా సంభవించిన ఆమె మరణం మాత్రం పలు అనుమానాలకు, అపోహలకు దారితీసి ఆమెపై లేనిపోని కళంకాన్ని ఆపాదించింది. ఆమెపై ఏర్పడ్డ కళంకం గురించి, అందులోని పూర్వాపరాల గురించి మాట్లాడుకునేవారికి బాబా ఇచ్చిన సమాధానాన్ని, అన్నిటికీ మించి తమనే అనన్యంగా అంటిపెట్టుకున్న పరమభక్తురాలైన ఆయీని బాబా ఎలా అనుగ్రహించారోననే విషయాన్ని సాయిభక్తుడు యం.బి.రేగే ఎంతో వివరంగా ఈవిధంగా తెలియజేశారు: 


"రాధాకృష్ణమాయి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే ఆ బిడ్డ చనిపోయింది, అలాగే ఆయీ కూడా" అన్న సమాచారాన్ని నేను మొదట నార్వేకర్ పంపిన లేఖ ద్వారా తెలుసుకున్నాను. అయితే, ఆయీ మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి నాకేమీ తెలియదు. వాస్తవానికి ఆయీ మరణించడానికి రెండు నెలల ముందు నేను, నా భార్య కొన్నిరోజులపాటు ఆమెతో శిరిడీలో ఉన్నాము. అప్పుడు ఆయీ గర్భవతి అన్న ఆనవాలు మాకేమీ కనిపించలేదు. మేము ఆమెను చూసుకున్నాంగానీ, ఆమె పరిస్థితిని కాకపోయి ఉండొచ్చు. బహుశా బయటవాళ్ళని/గ్రామస్థులను కలవని కారణంగా నేను ఆమె గురించి ఎటువంటి వదంతులూ వినలేదు.


అప్పుడొకరోజు మసీదు శుభ్రపరిచిన తరువాత ఆయీ బయటికి వచ్చి, బాబా ప్రతిరోజూ ఉదయం తమ కాళ్ళుచేతులు, ముఖం కడుక్కొనే మసీదు అరుగుపై తన తలను ఆనించి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి బాబా లెండీ నుండి తిరిగి వచ్చి, ఆయీ వెన్నుతట్టి, "రామక్రిష్నీ, నేనుండగా ఎందుకు బాధపడుతున్నావు?" అని అన్నారు. వెంటనే ఆయీ తన ఇంటికి పరుగుతీసింది. బాబా ఆమెతో ఏదైనా మాట్లాడటం నేను చూసిన సందర్భం అదొక్కటే. కానీ బాబాకు, ఆమెకు మధ్య టెలిపతిక్ కమ్యూనికేషన్ ఉన్నట్లు నేను చాలా సందర్భాలలో గుర్తించాను.


ఆయీ మరణించిన రెండునెలల తరువాత నేను శిరిడీ వెళ్ళాను. అప్పుడు ఎక్కడ బస చేయాలో తెలియక నేరుగా మసీదుకు వెళ్ళాను. బాబా నన్ను, "దీక్షిత్ వాడాకు వెళ్ళమ"ని చెప్పారు. వారి ఆదేశం మేరకు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ శ్రీమాధవరావు దేశ్‌పాండే తదితరులు ఆయీ మరణం గురించి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, 'ఇది శిరిడీలో జరిగి ఉండకూడదు" అని అన్నారు. అందుకు నేను, "ఆ విషయంపై చర్చించడం నాకు ఇష్టం లేదు. ఆమె నాకు తల్లి. ఆమె విషయంలో తప్పు ఉన్నప్పటికీ నేను ఇలాగే ఉంటాను. భగవద్గీతలోని 9వ అధ్యాయం, 30వ శ్లోకంలో, 'మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగున'ని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు" అని బదులిచ్చాను. ఇలా సంభాషణ జరుగుతుండగా నాతోపాటు వాడాలో ఉన్న అందర్నీ మసీదుకు రమ్మని బాబా వద్ద నుండి సందేశం వచ్చింది. వెంటనే మేము మసీదుకు వెళ్ళాము. బాబా, "దేని గురించి మీరు మాట్లాడుతున్నారు?" అని మాధవరావు దేశ్‌పాండేని అడిగారు. అంతేకాదు, నేనేమి చెప్పానని కూడా అడిగారు. విషయం చెప్పాక బాబా నాతో, "ఈ మూర్ఖులకు ఏం తెలుసు? ఆమె నీకు, నాకు తల్లి. ఆమె తన కర్మబంధనాల నుండి విముక్తి కోరిందనీ, నేను ఆమెకు హామీ ఇచ్చాననీ నీకు తెలుసు! ఒక రాత్రి ఆమె నా వద్దకొచ్చి, 'నేను ఇంక వేచి ఉండలేన'ని చెప్పి, నా కఫ్నీ పైకెత్తి, (బాబా తమ హృదయాన్ని చూపిస్తూ) ఇక్కడికి చేరింది. నువ్వు కావాలనుకున్నప్పుడు ఆమెను ఇక్కడ చూడవచ్చు" అని అన్నారు. దైవసమానురాలైన నా తల్లి ఇప్పుడు సద్గురువు(బాబా)లో ఐక్యమైంది. ప్రజలు తమకు తోచినట్లు ఊహించుకోనీ. నేను మాత్రం ఆమెకు ఋణపడి ఉన్నానని ఎన్నటికీ మరువను".


బాబా అంత స్పష్టంగా చెప్పినప్పటికీ చెడుకే ఆకర్షితమయ్యే మనసు యొక్క సహజ స్వభావాన్ని అనుసరించి నాటి ప్రజల మనస్సులో ఆమెపై ఏర్పడ్డ కళంకం అలాగే ఉండిపోయింది, ఇప్పటికీ ఆ మరకలు పోనంతగా! 1936లో బి.వి.నరసింహస్వామి బాబాను సశరీరులుగా దర్శించిన ఎంతోమంది భక్తులను నేరుగా కలిసి ముఖాముఖీ ఇంటర్వ్యూ చేసి వాటిని యథాతథంగా 'డీవోటీస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ శ్రీసాయిబాబా' అనే పుస్తక రూపంలో సాయిభక్తులకు అందించారు. అందులో సాయిభక్తుడు హెచ్.వి.సాఠే స్వయంగా చెప్పిన ఒక సంఘటన ఈవిధంగా ఉంది: "ఒకసారి నేను శిరిడీలో ఉన్నప్పుడు కుతూహలం కొద్దీ మొదటిసారిగా ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళాలని అనుకున్నాను. అక్కడికి వెళ్లేముందు బాబా నాతో, “నువ్వు ఫలానా చోటికి వెళ్ళావా?” అని అడిగారు. అక్కడి ప్రదేశాల గురించి నాకు అంతగా తెలియనందున బాబా అడిగిన ప్రశ్నలో మర్మమేమిటో నాకు అర్థంకాక మౌనంగా ఉండిపోయాను. బాబా కూడా ఇంకేమీ మాట్లాడలేదు. తరువాత నేను ఆ స్త్రీ ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడుతుండగా చెడు ఆలోచనలు నా మనస్సుపై దాడిచేయడం మొదలుపెట్టాయి. అంతలో అకస్మాత్తుగా ఆ ఇంటి గుమ్మం వద్ద బాబా ప్రత్యక్షమై, మూసి ఉన్న తలుపులను తోసి, 'ఎంత గొప్ప కార్యానికి పూనుకోబోతున్నావు?' అనే అర్థం వచ్చే రీతిలో ఏవో సైగలు చేసి అంతర్థానమయ్యారు. ఆ చెడు ఆలోచనలు నా మనస్సులో స్థిరపడి వాటిని ఆచరణలో పెట్టకముందే బాబా సమయానికి నన్ను హెచ్చరించారు. నా తప్పు తెలుసుకుని వెంటనే అక్కడినుండి వెనుతిరిగి వచ్చేశాను. తిరిగి ఆ ఛాయలకు వెళ్ళలేదు. ఆ తరువాత, నేను వెళ్లిన చోటుకు స్థానికంగా ఉన్న పేరు, బాబా ఆరోజు ప్రస్తావించిన పేరు ఒకటేనని తెలిసి ఆశ్చర్యపోయాను. ఇలా బాబా తరచూ నన్ను ఆడంబరాలకు, గర్వానికి, చెడుకు సంబంధించిన ఆలోచనలకు, చర్యలకు దూరంగా ఉంచడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా సహాయం చేశారు". ఇదే విషయాన్ని బి.వి.నరసింహస్వామిగారు 'లైఫ్ ఆఫ్ సాయిబాబా' పేరుతో ప్రచురించిన మరో పుస్తకంలో, “నువ్వు ఫలానా చోటుకి వెళ్ళావా?” అని బాబా అడిగిన వాక్యంలో 'ఫలానా' అనే పదం స్థానంలో 'శాల' అనే పదాన్ని ఉపయోగించారు. 'రాధాకృష్ణమాయి ఇంటి'ని బాబా 'శాల' అని సంబోధించేవారని ముందే చెప్పుకున్నాము. కాబట్టి ‘శాల’ అనే పదప్రయోగం వలన సాఠే చెడు తలంపుతో ఆయీ ఇంటికి వెళ్లినట్లుగా ఆ వాక్యార్థం మారిపోయింది. చాలావరకు సాయిచరిత్ర గ్రంథాలకు బి.వి.నరసింహస్వామి గారి రచనలే ఆధారం కావడం వలన ఆ విషయం ఇప్పటికీ అలాగే ప్రచురితమవుతూ వచ్చింది. అదే నిజమైతే సాఠే స్పష్టంగా ఇంటర్వ్యూలో చెప్పేవాడే. కానీ అతనలా చెప్పలేదు. మరి బి.వి.నరసింహస్వామి ఆ పదాన్ని ఎందుకు ప్రస్తావించారని ఆలోచిస్తే, బహుశా జరిగిన సంఘటనకు సంబంధించిన నిజానిజాలు తెలియని అతను నాటి ప్రజల మాటలను నమ్మి ఉండవచ్చు. అది సహజమే కదా! సమాజంలో చాలా విషయాలు ఇలాగే ఉంటాయి. నిజానిజాలను ఎవరూ పట్టించుకోరు. ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఎప్పుడో ఏళ్ళ క్రిందట జరిగినవాటి గురించి వేరే చెప్పాలా? 


అయినా, పరమభక్తురాలు, సేవాతత్పరురాలైన రాధాకృష్ణమాయి విషయంలో ఇలాంటి విమర్శలు కేవలం ఆమె మరణంతోనే మొదలు కాలేదు. ఆమె సజీవంగా ఉన్నప్పుడే తోటి భక్తుల నుండి విమర్శలు ఎదుర్కొంది. వాటి గురించి సాయిభక్తుడు యం.బి.రేగే ఇలా చెప్పాడు: "నేను శిరిడీలో కలుసుకున్న భక్తులలో భక్తి గురించి వారి వారి స్వంత అభిప్రాయాలు ఉండేవి. వాళ్లలో ప్రతి ఒక్కరూ లేదా ప్రతి వర్గంవారూ తమ స్వంత మార్గమే సరైనదని భావిస్తూ, చాలా తరచుగా ఇతరుల అభిప్రాయాలపట్ల అసహనానికి గురవుతూ ఉండేవారు. తిరుమల, మధుర, ద్వారక, పండరిపురం వంటి పవిత్రక్షేత్రాలలో భగవంతునికి చేసే పూజలు, అలంకారాలు; పల్లకీ, రథము మొదలైన సేవలను శిరిడీలోని తన సద్గురువైన సాయిబాబాకు కూడా జరిపించాలని రాధాకృష్ణఆయీ అభిప్రాయం. కానీ, ‘సాయిబాబా ఫకీరు అనీ, ఇటువంటి హంగులూ, ఆర్భాటాలు ఆయన సాంప్రదాయానికి విరుద్ధమనీ’ దాసగణు మహరాజ్, హేమాద్పంతు వంటి కొంతమంది ప్రముఖ సాయిభక్తుల అభిప్రాయం. అదీ నిజమే! ఒకసారి ఒక భక్తుడు శ్రీసాయిబాబాకు ఒక మఖమల్ అంగరఖా సమర్పించగా, బాబా దానిని ధరించటానికి నిరాకరిస్తూ, “గోడకు ఒక మేకు కొట్టి దానికి ఇవన్నీ అలంకరించండి” అని అన్నారు. అదలా ఉంచితే, అంతిమ సమయంలో ఆయీపై మోపబడ్డ కళంకం అటువంటి వ్యక్తుల మనస్సును పూర్తిగా విరిచేసింది. సాయిచరిత్రకు సంబంధించిన రచనలు ఎక్కువగా వారిచే రచింపబడినందున వాటిలో ఆయీ గురించిన ప్రస్తావనను ఊహించలేము". 


బహుశా అందువలనేనేమో, ఇంత గొప్ప సాయిభక్తురాలి గురించిన సమాచారం సాయిభక్తులకు అంతగా అందుబాటులో లేకుండా పోయింది. చాలామంది సాయిచరిత్రకారులు ఆయీపై మోపబడిన కళంకం నేపథ్యంగా ఆమెపట్ల వ్యతిరేకభావంతో తమ రచనలలో ఆమె గురించి ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. అంతటి భక్తురాలి గురించి కేవలం ‘బాబా నడిచే దారులను శుభ్రపరిచేది’ అంటూ ఒకటి రెండు మాటల్లో క్లుప్తంగా చెప్పారు. అంతేకాదు, స్త్రీ వ్యామోహాన్ని పరీక్షించటానికే బాబా తమ భక్తులను ఆయీ ఇంటికి పంపేవారని కూడా ఆ రచయితలు ప్రస్తావించారు. అది ఎంత మాత్రమూ సమంజసం కాదు. ఎందుకంటే, భక్తులను పరీక్షించడానికి వారిని ఒక స్త్రీ వద్దకు పంపవలసిన అవసరంగానీ, అగత్యంగానీ బాబాకు లేదు. సర్వజ్ఞులైన బాబాకు మనలోని బలహీనతలు తెలియనివా? అంతేకాదు, ఆయీ ఇంటికి బాబా పంపిన భక్తులలో శ్రీమతి తారాబాయి తర్ఖడ్, భికూబాయి వంటి స్త్రీలు కూడా ఉన్నారు. మరి వారిని ఆయీ ఇంటికి బాబా ఎందుకు పంపినట్లు? ఆయీ వద్ద విలువైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుని, వాటిని సాధన చేసి ఉన్నతమైన గమ్యాన్ని చేరుకుంటారనే బాబా తమ భక్తులను ఆయీ ఇంటికి పంపేవారు. ఆయీ ఇంటిని బాబా ‘శాల’(పాఠశాల) అని పిలవడంలోని అంతరార్థమిదే!


ఇకపోతే, రేగే చెప్పినదానిలో వాస్తవం లేకపోలేదు. ఒకసారి దాసగుణు మహరాజ్ 'బాబా గురించి ఆర్భాటంగా ప్రచారం చేస్తోంద'ని రాధాకృష్ణమాయిని తీవ్రంగా విమర్శించాడు. తరువాత అతను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, ఆయీని విమర్శించినందుకు బాబా దాసగణును మందలించి, "హరికథల ద్వారా నువ్వు మాత్రం చేస్తున్నదేమిటి? ముందు అనవసరమైన విమర్శలు చేసినందుకు వెళ్లి ఆయీకి క్షమాపణ చెప్పు" అని ఆదేశించారు. బాబా ఆదేశానుసారం దాసగణు ఆయీ వద్దకు వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకుని తనను క్షమించమని కోరాడు. నిజానికి దాసగణు గొప్ప భక్తుడు. అతని కీర్తనలలో మనం గోపికల ప్రేమ(మధురభక్తి)ను చూడవచ్చు. కానీ అటువంటి ప్రేమ శ్రీకృష్ణునికి తగినదే కానీ ఫకీరుకి తగినది కాదని బహుశా అతను భావించి ఉంటాడు. అందుకే రాధాకృష్ణమాయి యొక్క మధురభక్తిని ఆమె జీవించి ఉన్న కాలంలో దాసగణు అర్థం చేసుకోలేకపోయాడు. ఆమె మరణానంతరం చాలా సంవత్సరాల తరువాత అతనొకసారి ఇండోర్ వెళ్లి రేగే ఇంటిలో బస చేశాడు. అప్పుడు అతను కన్నీళ్లు పెట్టుకొని రేగేతో, "బాబాసాహెబ్, మధురభక్తితో అత్యున్నత స్థితిలో ఉన్న భక్తురాలితో కలిసి జీవించిన గొప్ప అదృష్టవంతుడివి నువ్వు. నేను మీరాబాయి, జానాబాయి, కన్హాపాత్ర మరియు గోపికల కీర్తనలు చేస్తాను. ఆ సమయంలో నా కళ్ళనుండి కన్నీళ్లు ధారపాతమవుతాయి. కానీ నేను నిజజీవితంలో రాధాకృష్ణమాయి మధురభక్తిని అభినందించలేకపోయాను" అని చాలా బాధపడ్డాడు. అంతేకాదు, ఆయీ విచారకరమైన ముగింపు గురించి ప్రస్తావిస్తూ, "లైంగిక సంపర్కం లేకుండా బిడ్డకు జన్మనిచ్చిన ఉదంతాలు పురాణాలలో ఉన్నాయి" అని అన్నాడు. దాసగణు చెప్పింది బాబా అపార అనుగ్రహం వలన సిద్ధురాలైన రాధాకృష్ణమాయి విషయంలో సంభవమే కావచ్చు. కానీ, ‘ఆత్మహత్య చేసుకుంద’నీ, 'బిడ్డకు జన్మనిచ్చింద'నీ ఆ మహాభక్తురాలికి లేనిపోని కళంకాన్ని అంటగట్టినవారికి అది ఎలా అర్థమవుతుంది?


ఏదేమైనా బాబా సంరక్షణలో ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి సాధించిన రాధాకృష్ణమాయి ఆత్మహత్యకు పాల్పడేటంత అవివేకురాలు ఎంత మాత్రమూ కాదు. తన చేతివేలు రాయిక్రిందపడి నలిగిపోయినా, రాగద్వేషాలకు లోనై సాటి భక్తులే తనను విమర్శించినా చలించని ఆ ధీశాలి ఏ కష్టానికి వెరచి అంతటి ఘాతుకానికి పాల్పడి తన ఆత్మోన్నతికి తానే విఘాతం కలిగించుకుంటుంది? ఒకవేళ ఆమె అందుకు పూనుకున్నా, భక్తోద్ధరణే ధ్యేయంగా అవతరించిన బాబా అలా జరిగేందుకు అనుమతిస్తారా? వారి భక్తుడు అంబాడేకర్ ఏడు సంవత్సరాలపాటు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నిసార్లు శిరిడీ దర్శించినా అవి తొలగలేదు. చివరికి అతను ‘బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరుజన్మైనా బాగుండవచ్చ’ని తలచి 1916లో శిరిడీ చేరాడు. అతడు దీక్షిత్ వాడా వద్ద కూర్చొని ఆలోచిస్తుంటే, సగుణమేరూనాయక్ అతనికొక పుస్తకమిచ్చాడు. దానిని తెరవగానే వచ్చిన ఘట్టమిది: అక్కల్కోటస్వామి భక్తుడొకడు కష్టాలకు ఓర్వలేక ఒక బావిలో దూకాడు. స్వామి అతనిని రక్షించి, "అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి. పూర్వజన్మ కర్మ అయిన కుష్టువ్యాధిని గానీ, ఇతర రోగాల బాధలను గానీ పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్యా ప్రయత్నం ఏం చేయగలదు? అనుభవించాల్సిన కర్మ పూర్తికాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో. ఆత్మహత్య చేసుకోకు!" అన్నారు. ఆ తర్వాత అంబాడేకర్ మసీదు చేరగానే, "నీవు అక్కల్కోటస్వామి చెప్పినదానినే అనుసరించు" అన్నారు బాబా. అలా ఆ భక్తుణ్ణి ఆత్మహత్య నుండి కాపాడినట్లే ఆయీని కూడా బాబా తప్పకుండా కాపాడేవారు.


వచ్చేవారం తరువాయి భాగం....   

source: రేగే లెటర్స్, శ్రీసాయి సచ్చరిత్ర,
డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అఫ్ సాయిబాబా.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 



సాయిభక్తుల అనుభవమాలిక 881వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ‘ఇదంతా బాబా లీల’
2. నా సద్గురువు నాపై చూపిన కరుణ
3. బాబా కృపతో తగ్గిన కడుపునొప్పి

‘ఇదంతా బాబా లీల’


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయితండ్రికి నా శతకోటి సాష్టాంగ నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక అభినందనలు. నేను 2020, అక్టోబరు నుండి ఈ బ్లాగులో ప్రచురిస్తున్న సాయిభక్తుల అనుభవాలు చదువుతున్నాను. ఇది ఒక ‘ఆధునిక సచ్చరిత్ర’లాగా నాకు అనిపిస్తుంది. ఇది చదువుతున్నప్పటినుండి, బాబా అనుగ్రహంతో నాకు కలిగిన అనుభవాలను కూడా బ్లాగులో పంచుకోవాలనిపించేది. కానీ ఎలా పంచుకోవాలో కొన్నాళ్ళవరకు తెలియలేదు. తెలిసిన తరువాత ధైర్యం చాలలేదు. చివరికి, 2021, గురుపూర్ణిమ పర్వదినాన ధైర్యం చేసి నా అనుభవాన్ని మొట్టమొదటిసారిగా రాయడం మొదలుపెట్టాను. నా పేరు సాయిశ్రీ. నేను బాబాకు చిరుభక్తురాలిని. 30 సంవత్సరాల క్రితం (నా డిగ్రీ అయిపోతుండగా) బాబా నాకు పరిచయమయ్యారు. మా ఊరిలోవాళ్ళు ఒక చిన్న గదిలో సాయిబాబా ఫోటో పెట్టి పూజించేవారు. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి సాయిని దర్శించుకున్నాను. అదే మొదటిసారి నేను సాయిని చూడటం. ఆ తరువాత నేను పీజీ చేయడం కోసం యూనివర్సిటీ క్యాంపస్‌కి వెళ్ళిపోయాను. నేను యూనివర్సిటీకి వెళ్ళిన తరువాత మా ఊరిలో అంతకుముందు బాబా ఫోటో పెట్టి పూజించిన చోటనే మందిరాన్ని నిర్మించి బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారని తెలిసింది. కానీ నేను అంతగా పట్టించుకోలేదు. ఆ తరువాత నేను హాస్టల్లో ఉంటున్నప్పుడు మా రూమ్‌మేట్ సాయిభక్తురాలని తెలిసింది. తన దగ్గర ‘శ్రీసాయిలీలామృతం’ పుస్తకం ఉన్నది. ఒకరోజు అనుకోకుండా నేను ఆ పుస్తకం కొంచెం చదివాను. సాయిలీలలు నాకు చాలా బాగా నచ్చాయి. అందులో ఉన్న ప్రార్థనాష్టకం నేర్చుకుని రోజూ పాడుకునేదాన్ని. అలా మా రూమ్‌మేట్ వల్ల నేను సాయిభక్తురాలినయ్యాను. నా పీజీ అయిపోయి మా ఊరికి వచ్చిన తరువాత నాకు బాబా దయవల్ల గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అప్పటినుండి బాబాను నమ్మడం మొదలుపెట్టాను. ప్రతి గురువారం మా ఊరిలోని బాబా మందిరానికి వెళ్ళేదాన్ని. ఆ తరువాత బాబా దయవల్ల నాకు మంచి సంబంధం దొరికి వివాహం జరిగింది. నాతోపాటు మావారు కూడా ప్రతివారం బాబా మందిరానికి వచ్చేవారు. వివాహమైన రెండున్నర సంవత్సరాల తరువాత నేను గర్భవతినయ్యాను. ఏడవ నెల వచ్చేవరకు అంతా బాగానే ఉంది. ఆ తరువాత నాకు బీపీ ఎక్కువ అయింది. కడుపులో బిడ్డ సరిగా తిరుగుతున్నట్టు అనిపించట్లేదు. డాక్టర్ దగ్గరకు వెళితే, “ఉమ్మనీరు తగ్గింది. ఇకనుంచి వారానికి ఒకసారి ఐవి ఫ్లూయిడ్లను సెలైన్‌తో పాటు ఎక్కించాలి” అని చెప్పి డెలివరీ వరకు ఫ్లూయిడ్లు ఎక్కించారు. బాబాపై నమ్మకం ఉంచి మందులు వాడసాగాను. 


ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. నా డెలివరీ డేట్‌కి 5 రోజుల ముందు మా డాక్టర్ నాతో, “నాకు ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉంది, రావడానికి వారంరోజులు అవుతుంది” అని చెప్పి, నాకు డెలివరీ చేయమని వేరే డాక్టరుకు చెప్పింది. కానీ, నాకేమో మా డాక్టరే డెలివరీ చేస్తే బాగుంటుందని కోరిక. మావారు కూడా ‘మన డాక్టర్ చేస్తేనే బాగుంటుంద’న్నారు. అందువల్ల మా డాక్టర్ వచ్చేవరకు వెయిట్ చేస్తానని ఈ డాక్టరుతో చెబితే, “ఆ డాక్టర్ వచ్చేవరకు ఆగితే బిడ్డ వెయిట్ తగ్గే అవకాశం ఉండవచ్చు” అని చెప్పింది. అయినప్పటికీ నేను బాబా మీదనే నమ్మకం ఉంచి ప్రతిరోజూ చెకప్ చేయించుకుంటూ మా డాక్టర్ వచ్చేవరకు వేచివున్నాను. వారం రోజుల తరువాత మా డాక్టర్ వచ్చాక డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. కానీ, ‘నాకు ఆపరేషన్ అంటే చాలా భయమనీ, నార్మల్ డెలివరీకి అవకాశముంటే చెయ్యమనీ’ చెప్పాను. ఆ సమయంలో డాక్టర్లు నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేయకుండా దాదాపు అందరికీ సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. పైగా నాకు నొప్పులు కూడా రావట్లేదు. అందువల్ల, ‘ఆపరేషన్ అయితేనే బెటర్’ అని డాక్టర్ చెప్పారు. కానీ నేను బాబాపై భారం వేసి నొప్పులు రావడం కోసం ఇంజక్షన్ తీసుకున్నాను. నాతోపాటు ఇంకో పేషంట్ కూడా నొప్పులు రావడానికి ఇంజక్షన్ తీసుకున్నారు. కానీ ఆమె నొప్పులు తట్టుకోలేక ఆపరేషన్ చేయించుకుంది. నాకు మరుసటిరోజు నొప్పులు మొదలయ్యాయి. ఈలోపు డాక్టర్ ప్రతి రెండు గంటలకు ఒకసారి వచ్చి, “కాసేపు చూసి ఆపరేషన్ చేస్తాను” అంటున్నారు. కానీ నేను బాబాపై భారంవేసి, బాబా ఊదీని నుదుటికి పెట్టుకుని, ఊదీ ప్యాకెట్టుని తలక్రింద పెట్టుకుని నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేశాను. మా అమ్మావాళ్ళు కూడా “ఇంత మొండితనం వద్దు, ఆపరేషన్ చేయించుకో!” అన్నారు. కానీ, నేను బాబాపై నమ్మకముంచి ఎవరిమాటా వినలేదు. ఆరోజు అర్థరాత్రిపూట నొప్పులు ఎక్కువై నాకు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది అయింది. ఆ సమయంలో డాక్టర్ హాస్పిటల్ పైనే ఉన్న తన ఇంట్లో నిద్రపోతున్నారు. నా పరిస్థితి చూసి నర్సులు హడావిడిగా నన్ను లేబర్ రూములోకి తీసుకెళ్ళి, వెంటనే ఆక్సిజన్ పెట్టారు. బిపి 240కి చేరింది. మావాళ్ళందరూ చాలా భయపడ్డారు. నేను బాబాను తలచుకుంటూ ఉన్నాను. కాసేపట్లో నర్సులు నాకు నార్మల్ డెలివరీ చేశారు. బాబానే ఆ నర్సుల రూపంలో వచ్చి నన్ను కాపాడారు. ఇంతలో మా డాక్టరుకి సమాచారం అందటంతో క్రిందికి వచ్చి, తనను ముందుగానే లేపనందుకు నర్సులను కోప్పడ్డారు. ఏదైతేనేమి, క్రిటికల్‌గా ఉన్న డెలివరీ సక్సెస్ అయింది. బాబు వెయిట్ కొంచెం తక్కువైనా బాబా దయవల్ల ఆరోగ్యంగా పుట్టాడు. డాక్టర్ నన్నేమో మొండిదానిననీ, బాబునేమో గట్టివాడనీ మెచ్చుకున్నారు. నేనైతే ‘ఇదంతా బాబా లీల’ అనుకున్నాను. ఇప్పటికీ ఈ బాబా లీల నా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. “థాంక్యూ వెరీ మచ్ బాబా. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. నా అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా!”. సుదీర్ఘమైన నా అనుభవాన్ని చదివినందుకు సాయిబంధువులకు నమస్కారాలు.


నా సద్గురువు నాపై చూపిన కరుణ

 

ప్రతీ మనిషికి తొలి గురువులు తల్లిదండ్రులే. వాళ్లు నేర్పిన అనేక విషయాలు చిన్నప్పుడే నా మనసులో బలంగా నాటుకుపోయాయి. వాటిలో, సాయిపై అపార నమ్మకం, భక్తి ఒకటి. ఇవి నా తల్లి నాకు నేర్పిన పాఠాలు. సాయి వల్లనే చిన్నప్పటినుండి నేను అనేక అపాయాల నుంచి బయటపడ్డాను. అందులో ఒకటి జలగండం. దానినుంచి నేను మూడుసార్లు సాయి దయతో తప్పించుకుని క్షేమంగా తిరిగి వచ్చాను. చిన్నప్పుడు నేను చదివే స్కూలు మా గ్రామం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉండేది. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఒక ఆదివారంనాడు ప్రైవేట్ క్లాసుకని స్కూలుకు వెళ్ళాను.  క్లాసు పూర్తయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లకుండా అక్కడికి దగ్గరలో ఉన్న వాగులో స్నానం చేసేందుకు నా స్నేహితులతో పాటు దిగాను. కొద్దిసేపటికి ఈత రాని నేను నీళ్ళలో మునిగిపోసాగాను. మునుగుతు, తేలుతూ కొంత లోతుల్లోకి వెళ్తున్నాను. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతోంది. తక్షణమే, "ఎంతటి కష్టంలోనైనా పిలిస్తే, సాయి పలుకుతాడు, ఆదుకుంటాడు" అని అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే నేను బాబా స్మరణ చేయడం మొదలుపెట్టాను. ఇంతలో ప్రక్కనే ఉన్న ఒక పెద్దాయన వచ్చి నన్ను బయటకు లాగి ఒడ్డుకు చేర్చాడు. అంతేకాదు, ఈత రాకపోయినా నీళ్లలో దిగినందుకు నా చెంపమీద కొట్టాడు. అలా బాబా దయవల్ల ఆనాడు నేను రక్షించబడ్డాను. బాబా స్మరణ మరణాన్ని తప్పిస్తుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


బాబా కృపతో తగ్గిన కడుపునొప్పి


నేనొక బాబా భక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక నా అనుభవం విషయానికి వస్తే, నాకు ఒకరోజు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. సమయానికి ఇంట్లో టాబ్లెట్లు కూడా లేవు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగాను. అయినా సరే నొప్పి తగ్గలేదు. రోజంతా నొప్పితో బాధపడుతూనే ఉన్నాను. దాంతో మరోసారి బాబాకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుని మరికొన్ని ఊదీనీళ్లు త్రాగి, "బాబా! ఈ కడుపునొప్పి తగ్గితే నా అనుభవాన్ని వెంటనే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అద్భుతం! ఐదు నిమిషాల్లో కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా! మమ్మల్ని ఎప్పుడూ ఇలానే రక్షిస్తూ ఉండండి తండ్రీ. ఎప్పటినుంచో నేను అనుభవిస్తున్న మానసిక వేదన నుంచి నాకు విముక్తి కలిగించి, నా మనస్సుకు ప్రశాంతతను చేకూర్చు తండ్రీ. నిన్నే నమ్ముకుని జీవిస్తున్న మాకు అడుగడుగునా మనోధైర్యాన్ని ప్రసాదించు తండ్రీ. తప్పకుండా మీరు నా సమస్యను పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను తండ్రీ. ఆ అనుభవాన్ని కూడా ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకోవడం కోసం ఎదురుచూస్తున్నాను తండ్రీ".


 ఓంసాయి  శ్రీసాయి జయజయసాయి.


సాయిభక్తుల అనుభవమాలిక 880వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1.కోరుకున్నట్లే ఆశీర్వదించిన బాబా
2. బిడ్డలు ఎక్కడున్నా వెన్నంటి ఉండి కాపాడతారు బాబా
3. ధైర్యాన్నిచ్చిన బాబా

కోరుకున్నట్లే ఆశీర్వదించిన బాబా


అందరికీ నమస్కారం. నా పేరు సాయిలక్ష్మి. ఇంతకుముందు నేను మీతో కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, జూన్ 10న మా అక్కావాళ్ళ బాబుకి మొదటి పుట్టినరోజు వేడుక వైజాగ్‌లో చేయాలని నిశ్చయించి, ఆ వేడుకకి నన్ను కూడా రమ్మని ఆహ్వానించారు. నాకూ వెళ్ళాలని చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో మా నాన్న నన్ను వైజాగ్ పంపడానికి ఒప్పుకోలేదు. చాలామంది నాన్నను ఒప్పించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! నాన్న నన్ను వైజాగ్ పంపిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా ఏం అద్భుతం చేశారోగానీ వెంటనే నాన్న నేను వైజాగ్ వెళ్లడానికి అనుమతించారు. నేను చాలా సంతోషించి బాబాకు ధన్యవాదాలు తెలుపుకుని, "వైజాగ్ వెళ్లి వచ్చాక నాకు కోవిడ్ లక్షణాలేవీ రాకుండా చూడమ"ని బాబాను ప్రార్థించాను. నేను కోరుకున్నట్లే నాపై ఎటువంటి కోవిడ్ ప్రభావమూ పడకుండా కాపాడారు బాబా. "ధన్యవాదాలు తండ్రీ".


మరో అనుభవం:


నాకు నిశ్చితార్థమయింది. కానీ కరోనా కారణంగా పెళ్లికి ముహూర్తం నిశ్చయించలేదు. నన్ను చేసుకోబోయే అబ్బాయి కూడా మొదట్లో, "ఇప్పుడే పెళ్ళి వద్దు. కరోనా తగ్గాక ఘనంగా చేసుకుందామ"ని అన్నారు. కొన్ని రోజులకు మా ఇంట్లోవాళ్ళు తొందరపెట్టడంతో వెంటనే పెళ్ళిచేసుకోవటానికి నేను అంగీకరించాను. కానీ, ఆ అబ్బాయి ఒప్పుకోకపోతే గొడవలు జరుగుతాయేమోనని భయమేసి, "సాయీ! ఆ అబ్బాయి మనసు మార్చి ఎవరూ బాధపడకుండా ముహూర్తాలు కుదిరేటట్టు చేసి, మా పెళ్లి వేడుక బాగా జరిగేటట్లు చూడండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. నేను కోరుకున్నట్లే ఆశీర్వదించారు బాబా. ముందు నా పెళ్లి ముహూర్తం శుక్రవారం ఉదయమని పంతులు చెప్పారు. కానీ నేను బాబా వైపు చూస్తూ, "బాబా! ఒక్కరోజు ముందు ముహూర్తం పెట్టేటట్టు చేయొచ్చు కదా!" అని మనసులో అనుకున్నాను. అంతలోనే ఆ పంతులు, "గురువారం ఇంకా మంచి ముహూర్తం ఉంద"ని చెప్పారు. అలా నా పెళ్లి గురువారమే నిశ్చయమయ్యేలా బాబా ఆశీర్వదించారు. ఇదంతా నేను సాయి దివ్యపూజ చేసిన 4వ వారం జరిగింది. బాబా ఆశీస్సులతో నా పెళ్లి చాలా అందంగా జరిగింది. ఇంకా, నాకు సంబంధించిన అన్ని వేడుకలు కూడా గురువారంనాడే జరిగేలా అనుగ్రహించారు బాబా. "థాంక్యూ సో మచ్ బాబా". చివరిగా, నా అనుభవాన్ని పంచుకోవడానికి అవకాశమిచ్చిన సాయిబంధువులకు నా కృతజ్ఞతలు.


బిడ్డలు ఎక్కడున్నా వెన్నంటి ఉండి కాపాడతారు బాబా


'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయిబంధువులందరికీ ధన్యవాదాలు. నా పేరు శ్రీదేవి. ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా కొన్ని అనుభవాలను మీతో పంచుకున్న నేను ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకోబోతున్నాను. 2021, జూలై 18న నేను మా బంధువులతో కలిసి గుంటూరులో ఉన్న మా మేనత్తను చూడటానికి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా ఒక అపార్ట్‌మెంటులో పట్టుచీరలు అమ్మే ఒకరి ఇంటికి వెళ్ళాము. ఇంట్లోకి వెళ్ళగానే ద్వారకామాయిలో కూర్చుని ఉన్న ఫోటో రూపంలో బాబా నాకు దర్శనమిచ్చారు. బాబాను, ఆ ఇంట్లో ఉన్న శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథాన్ని చూశాక ఆ ఇంటావిడ బాబా భక్తురాలని నాకు అర్థమైంది. ఆనందంగా నేను బాబాకు నమస్కరించుకుని, "ఇక్కడ కూడా బాబా ఉన్నార"ని మా బంధువులతో చెప్పాను. తరువాత చీరలు కొనుక్కొని తిరిగి వస్తూ లిఫ్ట్ ఎక్కాము. అయితే, లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌కి వచ్చిన తరువాత తలుపులు తెరుచుకోలేదు. పైగా లిఫ్ట్ దానంతట అదే ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళడం, మళ్లీ గ్రౌండ్ ఫ్లోర్‌కి రావడం, పెద్ద శబ్దం చేస్తూ ఆగిపోవడం జరగసాగింది(నాలుగుసార్లు). లిఫ్టులో ఉన్న మాకు ఏం చేయాలో అర్థంకాక చాలా భయపడుతూ వాచ్‌మెన్‌ని పిలుస్తూ, "ఏమైందో చూడమ"ని కేకలు పెట్టాము. అతను, "ఏదో ఒకటి చేస్తాన"ని అన్నాడు. కానీ అంతలోనే లిఫ్ట్ పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ పైకి, క్రిందకి తిరుగుతోంది. అప్పుడు నేను, "బాబా! మమ్మల్ని కాపాడు. లిఫ్ట్ తలుపులు తెరుచుకునేలా చేయి. ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతలో లిఫ్ట్ మళ్లీ ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చింది. ఎదురు ఫ్లాట్‌లో ఉండే ఆమె గబగబా వచ్చి లిఫ్ట్ డోర్ పట్టుకుని గట్టిగా నెట్టింది. మేము రెండో డోర్ కూడా నెట్టి తొందర తొందరగా అందరం బయటకి వచ్చేశాము. అప్పుడామె, "ఈ లిఫ్ట్ సరిగా పనిచేయడం లేదు. పైగా ముగ్గురు మాత్రమే ఎక్కాల్సిన ఈ లిఫ్టులో మీరు ఆరుగురు ఎక్కారు. మీకు వాచ్‌మెన్ చెప్పలేదా?" అని అడిగింది. నేను ఆమెతో, "మాకు ఆ విషయాలేమీ తెలియద"ని చెప్పాను. తరువాత ఆమె రూపంలో మా అందరినీ రక్షించిన బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుని ఆ అపార్ట్‌మెంట్ నుండి బయటకు వచ్చాము. బాబా కృపకు ఎంతగానో సంతోషించాము. నా సాయితండ్రి తన బిడ్డలు ఎక్కడున్నా వెన్నంటి ఉండి కాపాడుతారు.


ధైర్యాన్నిచ్చిన బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నా పేరు లత. ఇంతకుముందు ఒకసారి నేను నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఇటీవల సాయితండ్రి మా మనవరాలి అన్నప్రాశనను దగ్గరుండి తమ సన్నిధానంలో నిర్విఘ్నంగా జరిపించారు. అందుకు నాకు చాలా సంతోషం కలిగింది. ఇకపోతే, నాకు ఈమధ్య కోవిడ్ వచ్చి సాయితండ్రి దయవలన తగ్గింది. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత చాలామంది ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు గురై ఎంతో బాధపడుతున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో నాకు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందేమోనని నేను ప్రతిరోజూ ఎంతో భయపడుతుండేదాన్ని. అప్పుడొకరోజు నా తండ్రి బాబా, "ఎదుటివాళ్ళకు వచ్చిన ప్రతిదీ నీకూ వస్తుందని భయపడకు. నీకు ఏమీ రాదు. నీ ఇంట నేనున్నాను. నేనుండగా నీకు భయమేల? దిగులుచెందకు" అని అభయమిచ్చారు. అంతటితో నాకు భయం పూర్తిగా పోయింది. ఇలాగే నా సాయితండ్రి అన్నీ తానై నా చేయి పట్టుకుని అనుక్షణం కంటికి రెప్పలా రక్షణనిస్తున్నారు. నేను ఎన్నని చెప్పగలను? "నా బంగారుతండ్రి బాబా! మీ దయ ఎప్పటికీ నా యందు ఇలాగే ఉండాలి తండ్రీ! నన్ను, నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడు తండ్రీ. నేను మీకు ఎల్లప్పుడూ ఋణపడివుంటాను. మీకు నేను సర్వస్యశరణాగతి చేస్తున్నాను. మీ పాదాల చెంత నన్ను సదా ఉండనివ్వండి. నేను మీకు మాట ఇచ్చిన ప్రకారం బ్లాగులో నా అనుభవాన్ని పంచుకున్నాను".


శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిభక్తుల అనుభవమాలిక 879వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అన్నీ విధాలా బాబా చూపుతున్న అనుగ్రహం
2. బాబా సర్వాంతర్యామి
3. దయార్ద్రహృదయుడైన బాబా కరుణ

అన్నీ విధాలా బాబా చూపుతున్న అనుగ్రహం


అందరికీ నమస్కారం. నా పేరు అంజలి. బాబానే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ. ఆయన లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. బాబా నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నారు. ఇటీవల బాబా మాపై చూపిన ప్రేమను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇటీవల నాకు కరోనా వచ్చినప్పటికీ బాబా దయవలన ఎలాంటి ప్రమాదం లేకుండా తొందరగానే తగ్గిపోయింది. అయితే కరోనా తగ్గి రెండు నెలలు అయినప్పటికీ ఈమధ్య బాగా నీరసంగా అనిపిస్తోంది. ఎందుకలా అనిపిస్తుందో తెలియలేదుగానీ, దానివల్ల ఇంటిపనులు, ఆఫీసుపనులు చూసుకోలేకపోయేదాన్ని. అట్టి స్థితిలో నాకు బాబానే దిక్కు, ఆయనే నన్ను కాపాడగలరని బాబాను శరణువేడి, "ఎలాగైనా ఈ నీరసం తగ్గేలా చేయండి బాబా" అని కన్నీళ్లు పెట్టుకొని వేడుకున్నాను. అంతేకాదు, ‘సంకల్ప పారాయణ’ గ్రూపులో పారాయణ కూడా చేయించాను. బాబా దయవలన ఆ పారాయణ అయినరోజు నుండి నాకు నీరసం తగ్గుతూ వచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఈ విషయం బ్లాగులో పంచుకుంటానని మీకు మాటిచ్చాను, కొంచెం ఆలస్యమైనందుకు క్షమించండి బాబా. నువ్వే మాకు దిక్కు. ఈ దీనురాలిని, నా కుటుంబాన్ని, ఇంకా అందరినీ కాపాడు బాబా".


మరో అనుభవం:


నాకు కరోనా తగ్గిన తరువాత సత్యనారాయణస్వామివ్రతం చేసుకుందామనుకున్నాను. అయితే, ఆ వ్రతాన్ని గురుపూర్ణిమరోజున నకిరేకల్ బాబా మందిరంలో చేసుకుంటే ఇంకా బాగుంటుందని అనుకున్నాను. మేము ఉండేది నల్గొండలో. ‘గురుపూర్ణిమకి ఎలాగైనా నకిరేకల్‌లోని బాబా మందిరానికి వెళ్ళి, బాబా దర్శనం చేసుకుని, సత్యనారాయణవ్రతం చేసుకునేలా అనుగ్రహించమ’ని బాబాను వేడుకున్నాను. దయగల సాయితండ్రి నేను కోరుకున్నట్లుగానే నన్ను అనుగ్రహించారు. గురుపూర్ణిమరోజున నేను, నా భర్త, పిల్లలు అందరం కలిసి నకిరేకల్ బాబా మందిరానికి వెళ్ళాము. ఆరోజు మందిరానికి చాలామంది భక్తులు వచ్చారు. చాలా కన్నులపండుగగా ఉంది. బాబా అద్భుతమైన దర్శనాన్ని ప్రసాదించారు. బాబాను చూడటానికి రెండు కళ్ళూ సరిపోలేదు. బాబా దర్శనం చేసుకుని, బాబా సన్నిధిలో సత్యనారాయణస్వామివ్రతం చేసుకున్నాను. ‘ఏ సమస్యా లేకుండా అందరం క్షేమంగా ఇంటికి చేరేలా అనుగ్రహించమ’ని బాబాను కోరుకుని, ‘అందరం క్షేమంగా ఉంటే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల అందరం క్షేమంగా ఉన్నాము


మరొక అనుభవం:


ఒకరోజు మావారికి ఒంట్లో అనీజీగా అనిపించింది. నేను బాబాకు నమస్కరించుకుని, ‘తెల్లవారేసరికి మావారు యాక్టివ్‌గా ఉండేలా అనుగ్రహించమ’ని కోరుకున్నాను. ఆ రాత్రి మావారికి బాబా ఊదీ పెట్టి, కొద్దిగా ఊదీని నీళ్ళలో కలిపి త్రాగించాను. బాబా దయవల్ల తెల్లవారేసరికి తను యాక్టివ్‌గా ఉన్నారు.


మరో అనుభవం:


నాకు కొన్ని రోజుల క్రితం బ్రష్ చేస్తున్నప్పుడు నోట్లోనుండి రక్తం వచ్చింది. భయం వేసి వెంటనే బాబాకు నమస్కరించుకుని, ఈ సమస్యను తీర్చమని వేడుకున్నాను. తరువాత నీళ్ళలో బాబా ఊదీ వేసుకుని త్రాగి, ‘ఈ సమస్య తీరితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని అనుకున్నాను. బాబా దయవల్ల  తెల్లవారేసరికి సమస్య తీరిపోయింది


మరో అనుభవం:


నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయి. ఇటీవల నేను బాబాకు నమస్కరించుకుని, “ఎలాగైనా నాకు డేట్ తెప్పించండి బాబా” అని కోరుకున్నాను. బాబా దయవల్ల నాకు పీరియడ్స్ వచ్చాయి. హ్యాపీగా మన బ్లాగులో పంచుకుంటున్నాను. నాకు అజీర్తి సమస్య కూడా ఉంది. బాబా దయవల్ల అది పూర్తిగా తగ్గిపోగానే ఆ అనుభవాన్ని కూడా మన బ్లాగులో పంచుకుంటాను. 


మా పిల్లలు కూడా బాబా దయవల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. “వాళ్ళు చక్కగా చదువుకునేలా, వాళ్ళను మంచి పిల్లలలాగా తీర్చిదిద్దే బాధ్యత నీదే తండ్రీ. మమ్మల్ని అందరినీ చల్లగా చూడు. కరోనా నుండి ఈ మానవాళిని రక్షించు తండ్రీ. నా ఫ్యామిలీ అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలా చూడు స్వామీ!” 


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా సర్వాంతర్యామి


నా పేరు సోను. 2021, జూలై 24, గురుపౌర్ణమిరోజున బాబా అనుగ్రహంతో నాకు కలిగిన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను 2021, మార్చి నెలలో అమెరికా వచ్చాను. ఇండియాలో ఉన్నప్పుడు నేను ప్రతిరోజూ ఉదయం ఆరతికి బాబా మందిరానికి వెళ్ళేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తరువాత బాబాకు పూజ చేయాలంటే కనీసం పువ్వులు కూడా దొరికేవి కావు. పువ్వులు కావాలంటే కాస్త దూరం వెళ్ళి బొకేలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక నా అనుభవానికి వస్తే... గురుపౌర్ణమిరోజున బాబాకు పువ్వులతో పూజ చేయాలనుకుని, ‘బయటికి వెళ్ళి పూలబొకే తీసుకురమ్మ’ని మావారితో చెప్పాను. కానీ మావారు వెళ్ళలేదు. నాకు చాలా ఏడుపొచ్చింది. ‘ఇండియాలో ఉంటే మంచి మంచి పువ్వులు తెచ్చి నీకు అలంకరించి పూజ చేసేదాన్ని కదా బాబా’ అని అనుకున్నాను. అప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చింది, ‘భక్తిగా ఒక పుష్పంగానీ, నీరుగానీ, ఏది సమర్పించినా భగవంతుడు స్వీకరిస్తాడు కదా’ అని. మేము క్రొత్తగా వచ్చిన ఆ అపార్ట్‌మెంట్ బయట కొన్ని చెట్లు ఉన్నాయి. వాటికి కొన్ని పువ్వులున్నాయి. కానీ ఆ పువ్వుల పేర్లు ఏమిటో నాకు తెలియదు. ఆ పువ్వులను చూస్తూ, “ఏ పువ్వులైనా సరే బాబాకు మనస్ఫూర్తిగా పెడితే చాలు, పువ్వుల పేర్లు తెలియాల్సిన అవసరం లేదు” అనుకున్నాను. అయితే, నాకెందుకో ఆ పువ్వులు పెట్టడానికి మనస్కరించటం లేదు. నాకు బాబాను పువ్వులతో అలంకరించడం అంటే ఇష్టం. నేను ప్రతి సంవత్సరం గురుపౌర్ణమిరోజున బాబాను రకరకాల పువ్వులతో అలంకరించి చక్కగా పూజ చేసేదాన్ని. కానీ, ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు. సన్నజాజులు, విరజాజులు వంటి పువ్వులు లేకపోయినా ఇక్కడ దొరికిన ఆ పూలతోనే బాబాను అలంకరించాను. మావారు పువ్వుల కోసం వెళ్లనందుకు, తనకు బాబాపై అంతగా భక్తి లేనందుకు చాలా బాధేసింది. అయితే, బాబా దయవల్ల మావారు నన్ను బాబా మందిరానికి తీసుకువెళ్లారు. ఎంతో బాధతో, ఏదో తెలియని లోటుతో మావారితో కలిసి బాబా మందిరంలోకి అడుగుపెట్టిన నేను, ఇంట్లో ఏ పువ్వులైతే బాబాకు పెట్టానో అవే పువ్వులు ఇక్కడ బాబా పాదాల దగ్గర ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇలా జరుగుతుందని నేనస్సలు ఊహించలేదు. ‘ఇంటి దగ్గర ఎదురుగా పువ్వులు ఉన్నాయి, వాటిని భక్తితో బాబాకు పెడితే చాలనుకుని పెట్టేశాన’ని నాకు చాలా ఏడుపు వచ్చింది. అంతలోనే బాబా ముఖంలో చిరునవ్వు చూసి ఎంతో ఆనందము, చక్కని అనుభూతి కలిగాయి. “ఐ లవ్ యు బాబా!” అని గట్టిగా అరవాలనిపించింది. అప్పుడు అర్థమైంది నాకు, ‘బాబా సర్వాంతర్యామి అనీ, ఆయన ఎల్లప్పుడూ మనలోనే ఉన్నారనీ, ప్రతిక్షణం మనతో ఉండి మనల్ని నడిపిస్తారనీ’. నిజంగా ఆ సద్గురు ప్రేమకు మనం ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము, కేవలం ఒక ప్రేమ తప్ప!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


దయార్ద్రహృదయుడైన బాబా కరుణ


సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు లత. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేను ఇంతకుముందు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటాను. ఇటీవల మా అమ్మకి కరోనా వచ్చింది. ఆ కారణంగా మా నాన్నగారు అమ్మను హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. దాంతో మా అమ్మ దగ్గరే ఉండే మా తొమ్మిది సంవత్సరాల బాబు ఇంట్లో ఒక్కడే ఉండాల్సి వచ్చి, చిన్నపిల్లవాడైనందున తన నాయనమ్మ దగ్గరకి వెళ్లాడు. అయితే అక్కడకు వెళ్లిన రెండురోజులకి బాబుకి బాగా జ్వరం వచ్చింది. టెస్ట్ చేయిస్తే, తనకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే తన నాయనమ్మ బాబుని మా దగ్గరికి తీసుకుని వచ్చింది. బాబుకి వేరుగా ఉండటం తెలీదు. పైగా వాడికి ఒక వారంరోజులపాటు జ్వరం చాలా తీవ్రంగా ఉంది. అందువల్ల రోజూ బాబుకి ఒళ్లు తుడవడం, అన్నం తినిపించడం, ట్యాబ్లెట్స్ వేయించడం చేయాల్సి వచ్చేది. ఇదంతా చేస్తూ దూరం పాటించడం చాలా కష్టం. అయితే తనతో సన్నిహితంగా ఉన్నప్పటికీ బాబా దయార్ద్రహృదయం వల్ల మాకెవరికీ కోవిడ్ ఎఫెక్ట్ కాలేదు. మన బాబా మమ్మల్ని కరుణించి బాబుకు తొందరగా నయం చేశారు. అయితే, ఒకరోజు బాబు వాళ్ల నాయనమ్మ, ‘నాకు కొంచెం జ్వరంగా ఉంది, ఒళ్లంతా చలిగా ఉంది’ అంది. ఆవిడలో కోవిడ్ లక్షణాలేమన్నా బయటపడుతున్నాయేమోనని నాకు చాలా భయమేసి, "బాబా! నీవే మాకు దిక్కు" అని బాబా ఫోటో ముందు దణ్ణం పెట్టుకున్నాను. చల్లని తండ్రి బాబా ఉండగా మనకు భయమేల? మూడు గంటల్లోనే ఆవిడకి జ్వరం తగ్గిపోయింది. ఆవిడ మామూలుగానే ఉంది, కోవిడ్ ఎఫెక్ట్ కాలేదు. ఇకపోతే, చల్లని తండ్రి బాబా దయవల్ల అమ్మ కూడా పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు అమ్మ మామూలుగానే ఉంది. నాన్న కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లో అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇదంతా దయార్ద్రహృదయుడైన బాబా కరుణ. "బాబా! నేను మీకు ఎంతో ఋణపడివున్నాను. మీ నామస్మరణ చేయడం తప్ప ఇంకేమి చేయగలను సాయీ? సదా మీ నామస్మరణలోనే ఉండేలా అనుగ్రహించండి సాయీ". చివరిగా తోటి సాయిభక్తులకు నాదొక విన్నపం... ఎటువంటి క్లిష్టపరిస్థితుల్లోనూ అధైర్యపడకండి. బాబా దయవల్ల అందరూ చల్లగా ఉంటారు.


సాయిభక్తుల అనుభవమాలిక 878వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. సచ్చరిత్ర పారాయణ - బాబా కృప
2. సాయి చూపిన దయ
3. అడగకున్నా మనకు కావాల్సింది బాబా ఇస్తారు

సచ్చరిత్ర పారాయణ - బాబా కృప


ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిభక్తులకు నా నమస్సుమాంజలి. ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. నా పేరు సాహిత్య. మావారికి ప్రతిభ ఉన్నప్పటికీ చాలాకాలంగా తక్కువ జీతం వస్తోంది. అందువల్ల నేను మావారికి ఉద్యోగంలో ప్రమోషన్ గానీ లేదా వేరే కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం గానీ రావాలన్న కోరికతో సాయిబాబా సచ్చరిత్ర సప్తాహపారాయణ చేయాలని సంకల్పించాను. అనుకున్నట్లే, 2021, జూలై 7, బుధవారంనాడు నేను పారాయణ మొదలుపెట్టి జూలై 12, సోమవారంనాడు పూర్తిచేశాను. అంటే, ఆరురోజుల్లోనే నా పారాయణ పూర్తయింది. అందుచేత ఏడోరోజు విష్ణుసహస్రనామాలు చదువుకున్నాను. కాకపోతే, నేను గర్భవతినైనందున నేలమీద పడుకోవడం, ఉపవాసం ఉండటం వంటివి ఏమీ చేయకుండా పారాయణ చేశాను. బుధవారంనాడు మావారు తనకి ఆ ముందురోజు, అంటే మంగళవారంనాడు 'సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ త్వరలో ఉంటుంది' అని అంతకుముందు తను మొదటి రౌండ్ ఇంటర్వ్యూ పూర్తిచేసిన ఒక కంపెనీ నుండి మెసేజ్ వచ్చిందని చెప్పారు. విచిత్రం ఏమిటంటే, మావారు ఫస్ట్ రౌండ్ అటెండ్ అయి దాదాపు రెండు నెలలు కావస్తోంది. అప్పటినుండి ఇప్పటివరకూ ఆ కంపెనీ నుండి ఎలాంటి స్పందనా లేదు. అలాంటిది పారాయణ పూర్తిచేసిన వెంటనే మెసేజ్ రావడం నిజంగా పెద్ద మిరాకిల్. బాబా కృపకు నేను చాలా ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. మరో విషయం ఏమిటంటే, 7 రోజులు పారాయణ చేయాలన్న సంకల్పంతో 7వ తేదీన పారాయణ ప్రారంభించిన నేను 7+7=14 అంటే 14వ తేదీకి పారాయణ పూర్తిచేయాలని అనుకున్నాను. కానీ నా లెక్క తప్పు. 13వ తేదీకే నా పారాయణ పూర్తిచేయాలి. అయితే ఆ విషయం నేను గ్రహించకపోయినా బాబా ఎంతో దయతో ఏడురోజుల్లో నా పారాయణ పూర్తిచేయించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". నేను అనుకున్న జీతం మావారికి తప్పకుండా వస్తుందని బాబా యందు ఉంచిన నమ్మకం నిజమైంది. ఆగస్టు 9న మావారికి తను పనిచేస్తున్న ఆఫీసువాళ్ళు ఫోన్ చేసి, ‘10% జీతం పెంచుతున్నామ’ని చెప్పారు. వాళ్ల ఆఫీసు చరిత్రలోనే అంత హైక్ ఇవ్వడం ఇదే మొదటిసారట. ఇదంతా బాబా దయ. పారాయణ పూర్తయిన నెలలోనే బాబా మాకు ఇంత అద్భుతమైన వార్త అందించారు. మేము చెప్పలేని ఆనందంతో బాబాకు మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఈ ఆనందాన్ని కూడా మీ అందరితో పంచుకోవాలనిపించింది. "మరోసారి థాంక్యూ సో మచ్ బాబా. ఇంకా నా అనుభవాలు ఒక్కొక్కటీ ఈ బ్లాగులో పంచుకుంటాను బాబా. ఆలస్యమై ఉంటే క్షమించండి. మా అమ్మానాన్నల ఋణబాధలు తీర్చండి బాబా".


ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః.


సాయి చూపిన దయ


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. నా పేరు పి.సి.శేఖర్. నేను 7 సంవత్సరాలుగా సాయిభక్తుడిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను. నేను ప్రతిరోజూ ‘గురుగీత’ వింటుంటాను. అయితే, 2021, జూన్ 19, సాయంత్రం యూట్యూబ్‌లో గురుగీత గురించి ఎంత వెతికినా కనిపించలేదు. అప్పుడు నేను సాయిని ప్రార్థించాను. ఆ రాత్రి మళ్లీ వెతికితే, సాయిబాబా దయవల్ల 'who is guru?(మన ఊహలకి అందనివాడు గురువు)' అన్న టైటిల్‌తో వచ్చింది. నేను చాలా సంతోషించాను. మరోసారి గురుగీత 29వ టాపిక్ కోసం చాలా వెతికాను, కానీ అది కనిపించలేదు. అప్పుడు కూడా నేను సాయిని ప్రార్థించాను. అయినా నాకు కావలసిన ఆ టాపిక్ రాలేదు. కొంతసపటి తరువాత నేను స్నానం చేసి వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేస్తే, నేను సెర్చ్ చేయకుండానే దానంతటదే నాకు కావాల్సిన టాపిక్ వచ్చింది. నేను ఆనందాశ్చర్యాలకు లోనై బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


మా అమ్మ వణుకు సమస్యతో బాధపడుతుంటే 2021, జులై 17, రాత్రి డాక్టర్ మా అమ్మకు హై డోస్ (ఎక్కువ మోతాదు) మందిచ్చారు. మరుసటిరోజు అమ్మకి వాంతులయ్యాయి. నాకు చాలా భయం వేసింది. వీడియో కాల్ చేసి అమ్మ పరిస్థితిని డాక్టరుకి చూపిద్దామంటే, ఆరోజు ఆదివారం. అయినప్పటికీ ఫోన్ చేస్తే డాక్టరు మరుసటిరోజు చేయమన్నారు. సోమవారం వీడియో కాల్ చేస్తే, అమ్మ పరిస్థితి చూసిన డాక్టరు మందుల డోస్ తగ్గించారు. ఆ మందులతోపాటు బాబాను ప్రార్థించి, ఊదీని నీళ్లలో కలిపి అమ్మకి ఇవ్వసాగాను. బాబా దయవల్ల అమ్మ పరిస్థితి కొంతవరకు మెరుగైంది. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ ఇలాగే మాపై దయచూపండి బాబా. మీ కృపతో అమ్మకి వణుకు సమస్య పూర్తిగా నయం కావాలి తండ్రీ". చివరిగా, ఈ అవకాశమిచ్చిన బాబాకి, సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు చాలా చాలా కృతజ్ఞతలు.


అడగకున్నా మనకు కావాల్సింది బాబా ఇస్తారు

 

శ్రీ సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. ఈ బ్లాగును ఏర్పాటు చేయించి, తోటి భక్తుల అనుభవాలు చదివే అవకాశం కల్పించిన బాబాకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సురేష్. నేను విశాఖపట్నం నివాసిని. నేను, నా భార్య ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నాము. మా ఇద్దరికీ వచ్చే నెల జీతం తప్ప మా కుటుంబానికి వేరే స్థిరాస్తులంటూ ఏమీ లేవు. గత ఏడు సంవత్సరాలుగా మేము ఒక అపార్ట్‌మెంటులో అద్దెకు ఉంటున్నాము. ఆ ఇంటి యజమాని ఈ సంవత్సరం(2021) జనవరి నెలలో మా ఇంటికి వచ్చినప్పుడు, "మీరు అద్దెకు ఉంటున్న ఈ ఇంటిని మీరే కొనుక్కోవచ్చు కదా!" అని మమ్మల్ని ప్రోత్సహించి, ధర కూడా మాకు సౌకర్యవంతంగానే చెప్పారు. అందుకు మేము, "మాకు బ్యాంకు లోన్ ఇస్తే కొనుక్కుంటాం" అని చెప్పాము. అదే నెలలో మేము బ్యాంక్ లోన్‌కి దరఖాస్తు చేసుకున్నాము. బ్యాంకువాళ్ళు మా అర్హతలు చూసి, మేము లోన్ తీసుకోవడానికి అర్హులమని నిర్ధారించి ఏప్రిల్ నెలలో లోన్ మంజూరు చేశారు. మే, జూన్ నెలల్లో లాక్‌డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొద్దిగా ఆలస్యమై, చివరికి జూలై 14న రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మాకు స్తోమత లేదని భావిస్తూ, "మాకు ఒక సొంత ఇల్లు కావాల"ని బాబాను మేమెప్పుడూ అడగలేదు. మేము అడగకున్నా ఊహించని రీతిలో మాకొక సొంత ఇంటిని అమర్చారు బాబా. "వేల వేల ధన్యవాదాలు బాబా". బాబాను నమ్ముకుంటే, మనం దేనికి అర్హులమో దాన్ని మనం అడగకుండానే ఆయన మనకు ప్రసాదిస్తారు.


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

- ఐ. సురేష్.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo