సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1375వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అనుక్షణం వెన్నంటే ఉండి మనకోసం ఎన్నో చేసే బాబా
2. బాబా ప్రసాదించిన మధుర క్షణాలు

అనుక్షణం వెన్నంటే ఉండి మనకోసం ఎన్నో చేసే బాబా


సదా నింబవృక్షస్య మూలాధివాసాత్|

సుథాస్రావిణం తిక్తమప్య ప్రియంతం|

తరుం కల్పవృక్షాధికం సాధయంతం|

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్||


నేను సాయిబాబా భక్తురాలిని. నా పేరు శ్రీదేవి. మా ఊరు నాగార్జునసాగర్ దగ్గర హాలియా. ముందుగా తోటి సోదర, సోదరీమణులకు నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న ఆత్మబంధువులకు నా నమస్కారాలు. నేను ఇంతకుముందు నా అనుభవం వ్రాసినప్పుడు బ్లాగు నిర్వాహకులు, 'మీ అనుభవం ఇంకొంచెం వివరంగా వ్రాస్తే బాగుంటుంది. అప్పుడే బాబా ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది. చదివేటప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది' అని చెప్పారు. వారు ప్రేమ పూర్వకంగానే చెప్పినప్పటికీ నాలో ఉన్న అహంకారం వలన అపార్థం చేసుకుని, 'నేను జీవితంలో ఇంకే అనుభవాలు ఈ బ్లాగుకి వ్రాయను" అని అనుకున్నాను. అందుచేత మా బాబు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బాగా వ్రాసి, ఉత్తీర్ణుడైతే తనతోనే అనుభవం వ్రాయించి, తన ఫోన్ నుండి బ్లాగుకు పంపిద్దాం అనుకున్నాను. కానీ బాబు ఫెయిల్ అయ్యాడు. 'తప్పు నేను చేస్తే, శిక్ష వాడికి పడింది అని బాధపడి, బాబాని ఎంతగానో వేడుకుని క్షమాపణ చెప్పాను. బాబా బాబుకోసం నవగురువార వ్రతం చేయమని సూచించారు. నేను అలాగే చేశాను. బాబు సప్లిమెంటరీ వ్రాశాడు. ఈసారి సప్లిమెంటరీ వ్రాసిన వాళ్లకు స్టార్ గుర్తులేదని చెప్పారు. అది తెలిసి నేను, 'బాబా! ఏమి లీల తండ్రి నీది?' అని అనుకున్నాను. ఆయన దయతో బాబు మంచి మార్కులతో పాస్ అయ్యాడు. తనకి గురునానక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. "బాబా! మీ దయతో బాబు మంచిగా చదువుకోవాలి. మీ దీవెనలు సదా వాడికి ఉండాలి".


నేను చిరుధాన్యాల వ్యాపారం చేస్తున్నాను. ఈమధ్య ఒక పాత పిండి మిల్లు తీసుకుని షాపులో పెట్టాము. ఒక వర్కర్ వచ్చి ఆ మిల్లు మరమ్మత్తు చేసి వెళ్ళాడు. అయితే అతను సరిగా మరమ్మత్తు చేయలేదు. దాంతో పిండి మాడిపోయి పొగలు రావడం, మాడిన వాసన రావడం జరుగుతుండేది. నాకు చాలా బాధేసి, "నాకు ఈ పరీక్ష ఏమిటి బాబా? నేను పెట్టమన్నాని మావారు ఈ మిల్లు పెట్టించారు. కానీ నాకు పిండి పట్టడం రావడం లేదు. నా మనసు మనసులా ఉండటం లేదు. చాలా చికాకుగా ఉంటుంది" అని బాబాతో మొరపెట్టుకున్నాను. రోజూ ఉదయం లేవగానే అదే గుర్తుకు రావటంతో, "ఇంత చేసినా ఏ ఫలితం లేదా బాబా. దయచేసి ఏదైనా మార్గం చూపండి" అని రోజూ బాబాను వేడుకుంటూ ఉండేదాన్ని. అలా నాలుగు రోజులు గడిచాయి. ఆరోజు ఉదయం నేను, "బాబా! ఇలా అయితే వ్యాపారం ఎలా? నా యందు దయ ఉంచి మమ్మల్ని నవ్వులపాలు చేయకు బాబా, ప్లీజ్. మిల్లు మంచిగా అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. మధ్యాహ్నం ఒక వర్కర్ వచ్చి పిండి శుభ్రంగా వచ్చేలా మిల్లు బాగు చేసి, "ముందు మరమత్తు చేసిన అతను రాయి సరిగా పెట్టకపోవడం వల్ల అలా అయింద"ని చెప్పాడు. "థాంక్యూ సో మచ్ బాబా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ థాంక్యూ సో మచ్ బాబా".


మావారు ధాన్యం, పత్తి వ్యాపారం చేస్తారు. గత మూడు సంవత్సరాలుగా ఆ వ్యాపారం సరిగా లేదు. అందువలన కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచించారు. కానీ పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేకపోవటం వల్ల ఏం చేయాలని మావారు చాలా బాధపడుతూ నిద్ర కూడా సరిగా పోయేవారు కాదు. అలాంటి సమయంలో బాబా నాకు ఒక సందేశం ఇచ్చారు. నేను ప్రతిరోజు ఉదయం యూట్యూబ్‍లో సాయి సందేశం వింటుంటాను. అలా ఒకరోజు విన్నప్పుడు, "నూతన వ్యాపారం ప్రారంభించు. అంతా సవ్యంగా ఉంటుంది" అని బాబా సందేశం వచ్చింది. నాకు చాలా సంతోషమేసింది. బాబా దయ చూడండి. అనుకోకుండా ఒక దుకాణం ఖాళీ అయి మావారి పరిశీలనలోకి వచ్చింది. ఆరోజు గురువారం. మా ఊరి గుడిలో ప్రతి గురువారం సచ్చరిత్ర పారాయణ, భజన, పల్లకిసేవ జరుగుతాయి. నేను ఆ గుడిలో బాబా పారాయణలో ఉండగా మావారు నాకు ఫోన్ చేసి, "షాప్ యజమానికి అడ్వాన్స్ ఇవ్వాలి. ఫోన్ పే చేయి" అని చెప్పారు. కానీ ఆ షాప్ యజమాని, "ఈరోజు అమావాస్య, ఇప్పుడు డబ్బులు ఇవ్వకండి. రేపు ఇవ్వండి" అని అన్నారు. మేము అలాగే చేసాము. మావారు ఆ షాపులో టెంట్ హౌస్ పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయనకి షాపు తను ఒక్కరే నడపడం ఇష్టంలేక వేరొకరు ఉంటే బాగుంటుందని భాగస్వామికోసం వెతికారు. కానీ ఎవరూ దొరకలేదు. దాంతో మావారు తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. నేను ఆయనతో, "ఏం భయం లేదు. మీరు గుడికి వెళ్లి బాబాను దారి చూపమనండి. అంతా అదే సవ్యంగా జరుగుతుంది" అని అన్నాను. కానీ షాపు ఓపెన్ చేయడానికి రెండు రోజులే ఉన్నాయి. తరువాత మంచి రోజులు లేవు. ఆ సమయంలో మావారు గుడికి వెళ్లి, బాబాకి దణ్ణం పెట్టుకుని వచ్చారు. అదేరోజు ఒకరు వచ్చి, "మేము భాగస్వామ్యం ఉంటాము" అన్నారు. దాంతో చివరిరోజున మేము షాపు ఓపెన్ చేసాము. అలా బాబా తమ కృపను చూపారు. షాపు ఓపెన్ చేయడమైతే చేసాం కానీ తగినంత పెట్టుబడి లేదు. పైగా షాపుకి కావలసిన సామాను దొరకలేదు. ఒకటి, రెండు చోట్ల సామాను చూసినప్పటికీ బేరం కుదరలేదు. ఆలోగా భాగస్వామ్యం ఉంటానని వచ్చిన వ్యక్తి, "నేను ఉండను" అని వెళ్లిపోయారు. అతను వెళ్లిన రెండు గంటలకే మావారికి, "సామాను ఇస్తాము, రండి" అని ఫోన్ వచ్చింది. దాంతో మావారు వెళ్లి సామాను తెచ్చుకుని ఒక్కరే షాపు చూసుకుంటున్నారు. "బాబా! మీకు ఎంత దయ తండ్రి. అనుక్షణం వెన్నంటే ఉండి మాకోసం ఎన్నో చేసే మీకు శతకోటి ప్రణామాలు".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


బాబా ప్రసాదించిన మధుర క్షణాలు


నేను ఒక సాయి భక్తురాలిని. సాయి బంధువులందరికీ నమస్కారం. ఎక్కడెక్కడో ఉన్న భక్తులందరినీ ఒకచోట చేర్చి మన సమస్యలకు బాబా చూపే పరిష్కారాలను ఒకరితో ఒకరు పంచుకునేందుకు అనువుగా ఈ బ్లాగును ఏర్పాటు చేసిన సాయికి చాలా కృతజ్ఞతలు. నేను ఈ బ్లాగు ద్వారానే బాబా గురించి చాలా తెలుసుకున్నాను. ఇప్పుడు నేను బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. మా చిన్నమ్మాయికి మైగ్రేన్ తలనొప్పి ఉంది. అప్పుడప్పుడు తను ఆ నొప్పిని తట్టుకోలేక చాలా బాధపడుతూ ఏడుస్తుంటుంది. ఈమధ్య తనకి పరీక్షలు జరుగుతున్నప్పుడు తెల్లవారితే పరీక్ష అనగా తలనొప్పితో ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు నేను, "బాబా! మీ దయతో అమ్మాయి తలనొప్పి తగ్గి, చక్కగా చదువుకుని తెల్లవారి పరీక్ష మంచిగా వ్రాస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని చాలాసేపటివరకు జపించాను. అమ్మాయి కాసేపు పడుకుని ఒక గంటన్నర తర్వాత లేచి చదువుకుని, మరునాడు పరీక్షకు వెళ్ళి బాగా వ్రాసింది.


మా పెద్దమ్మాయి తనకి ఉద్యోగం వస్తే, మొదట జీతం బాబాకి ఇస్తానని మ్రొక్కుకుంది. బాబా దయతో తనకి ఉద్యోగం వచ్చింది. తను మ్రొక్కుకున్నట్లే మొదటి జీతం అందగానే ఆ డబ్బులు మా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టింది. తను, నేను ఆ డబ్బులు మా ఊరిలోని బాబా గుడిలో ఇవ్వాలని అనుకున్నాం. కానీ మావారు శిరిడీ వెళ్లి, ఆ డబ్బులు అక్కడ సమర్పిద్దాం అన్నారు. ఆయన ఎంత చెప్పినా మేము మా ఊరి గుడిలోనే ఇద్దామని నాలుగు నెలలు వేచి చూసాము. అంతలో హఠాత్తుగా మావారు శిరిడీ ప్రయాణానికి టికెట్లు తీసుకున్నారు. దాంతో మేము, మా అమ్మానాన్న, మా ఇద్దరు చెల్లెల్లు, వాళ్ళ కుటుంబాలు, మా చిన్నమ్మ కుటుంబం శిరిడీ వెళ్ళాము. నేను ఎక్కడికి వెళ్లినా బాబా తన పేరుతో లేదా ఫోటో రూపంలో నాకు దర్శనమిచ్చి నా వెంటే ఉంటారు. శిరిడీలో ఎటువైపు చూసినా బాబా పేరుతో ఉన్న నేమ్ బోర్డులే దర్శనమిస్తుంటే వాటిని చూస్తూ నేను చుక్కల లోకంలో విహరించాను. ఆ తరువాత మేమందరం సంతోషంగా బాబా దర్శనం చేసుకున్నాం. మా అమ్మాయి జీతం డబ్బులు డొనేషన్ కౌంటరులో కడితే శేజారతికి టికెట్లు ఇచ్చారు. చాలా దగ్గర నుంచి బాబాను చాలాసేపు దర్శించుకున్నాం. ఆరోజు ఆరతి సమయంలో బాబా వేసుకున్న ఎర్రటి డ్రస్సు, ఆ సంగీత వాయిద్యాల ధ్వని నన్ను ఒక అద్భుత లోకంలోకి తీసుకెళ్లాయి. ఆ మధుర క్షణాలు నా మనసులో ఎప్పటికీ సజీవంగా ఉండిపోతాయి. చివరి రోజున మా నాన్న దారి తప్పిపోయినప్పటికీ బాబా దయవల్ల తొందరగానే దొరికారు. అలా కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా అందరం క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకున్నాం. మేము వద్దన్నా మావారు శిరిడీకి తీసుకెళ్లడం, మాకు ఆరతి దర్శనం లభించటం అంతా ఆ సాయితండ్రి దయే. ఆయన దయతో లభించిన ఈ శిరిడీ దర్శనం నా జీవితంలో మరిచిపోలేని ఒక సజీవ జ్ఞాపకంగా మిగిలిపోయింది. "తండ్రీ! మీకు వేలవేల నమస్కారాలు. ఎల్లప్పుడూ ఇలాగే నాకు తోడుగా ఉండండి బాబా".


ఓం శ్రీసాయినాథాయ నమః.


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Akhilanda koti brahmanda nayaka rajadhi raja yogi raja prabrahma
    SRI satchidananda sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. శ్రీదేవి గారు మాది కూడా హాలియా అండి . నేను కూడా సాయి భక్తురాలిని మీకు అభ్యంతరం లేకపోతే మీ నెంబరు నాకు mail చేయండి
    aakulakomali991@gmail.com

    ReplyDelete
  5. Sai nannu vamsi ni kalupu sai na kapuranni nilabettu sai na vamsi ante naku Chala istam sai na pelli guruvaram roju mi ashirbadham tho jarigindhi sai nannu ma barthani kalipindhi mire sai kani malli naku ee pariksha yenti sai thanu yendhuku ala nagitive iyyado theliyadhu sai nenu thanaki dhuram ga undalenu sai 😢 na korinkalo nyayam unte nannu na bartha ni kalupu sai na vamsi nannu kapuraniki thiskellu manchi ga chuskunte nenu na anubhavanni sai sannidhi blog lo panchukuntanu sai. nenu na vamsi kalisi shirdi vachi mi ashirvadgam thiskunta sai 😢😢😢😢😢😢😢😢😢😢

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo