సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1394వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి లీలామృతం
2. నమ్మిన భక్తుల యోగక్షమాలు చూసుకుంటారు బాబా
3. కోరుకున్న రూపురేఖలతో ఆరోగ్యవంతమైన బిడ్డని ప్రసాదించిన బాబా

సాయి లీలామృతం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! శ్రీ సాయినాథుని పాదపద్మములకు భక్తిపూర్వక ప్రణామాలు. సాయి లీలామృతం ద్వారా నన్ను బాబా దగ్గరకు చేర్చిన శ్రీభరద్వాజ మాస్టర్ గారికి, నా తల్లిదండ్రులకు భక్తితో పాదాభివందనం. సాయిబంధుకోటికి నమస్కారం. బ్లాగు నిర్వాహకులకు కృతజ్ఞతలు. నేను మీలానే ఒక సాయి భక్తురాలిని. 'సాయి మహరాజ్' మన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తారో, ఎన్ని విధాల మనల్ని ఆదుకుంటూ ఉంటారో ప్రతి సాయి భక్తునికి తెలిసిన విషయమే. ఇక నా జీవితంలోని బాబా ఆశీస్సులు మీతో పంచుకుంటాను. నా చిన్నప్పుడు మా నాన్నగారు పెద్ద సాయిబాబా ఫోటో ఒకటి మాఇంటికి తెచ్చారు. దానిపై 'సబ్ కా మాలిక్' అని హిందీలో వ్రాసి ఉండేది. కొద్దిరోజులకి నాకు కలలో శ్రీసాయిబాబా కనిపించారు. ఆ కలలో ఆయన పడుకుని ఉంటే నేను ఆయన కాళ్ళు పడుతున్నాను. నేను బాబాతో, "మీరూ, సత్యసాయిబాబా ఒకటేనా?" అని అడిగాను. అందుకు బాబా, "ఆయన్నే అడుగు" అన్నారు. అంతటితో ఆ కల ముగిసింది. అది బాబా నాకు ప్రసాదించిన మొదటి స్వప్న దర్శనం. ఆ తరువాత నాకు 20వ సంవత్సరాల వయసున్నప్పుడు కలలో శ్రీరాఘవేంద్రస్వామి కనపడి 'తీర్థజలం' నాపై చల్లారు. కొద్దిరోజుల్లో నాకు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి నెల్లూరు జిల్లాలోని గూడూరులో నేను ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాను. తరువాత ఒకరోజు కలలో శ్రీభరద్వాజ మాస్టర్ గారు శిష్య పరివారంతో కనిపించి నన్ను దగ్గరకి పిలిచి 'సాయిలీలామృతం' పుస్తకం ఇచ్చారు. నేను "ఈయన ఎవరు?" అని పక్కనున్నవాళ్ళను అడిగితే, "ఆయన భరద్వాజ మాస్టర్ గారు విద్యానగర్‍‍లో లెక్చరర్" అని చెప్పారు. అంతటితో నాకు మెలుకువ వచ్చింది. తర్వాత మాస్టర్ గారి గురించి వాకబు చేస్తే, అయన అప్పటికే సిద్ధి పొందారని తెలిసింది. కానీ అనూహ్యరీతిలో 'సాయి లీలామృతం' పుస్తకం నాకు అందింది. అప్పటినుంచి నేను ఆ పుస్తకం నిత్య పారాయణ చేస్తున్నాను. ఎన్నోసార్లు బాబా నాకు కలలో దర్శనమిచ్చారు.


నా వివాహమైన తర్వాత మావారు మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగిగా చేస్తుండేవారు. అప్పుడు మేము తరచూ శిరిడీ దర్శిస్తుండేవాళ్ళం. కొన్నాళ్ళకి మావారికి హైదరాబాద్ బదిలీ అయింది. కానీ రిలీవర్ ఎవరూ రాలేదు. సాయి లీలామృతంలో ఒక భక్తునికి బదిలీ అయి రిలీవర్ రాకపోతే, సప్తాహం చేయగానే రిలీవర్ వచ్చిన లీల ఉంది. అలా మావారు సప్తాహం చేస్తే, వెంటనే రిలీవర్ వచ్చారు. దాంతో మేము హైదరాబాద్ దగ్గర ఉన్న ముసాయిపేటకు వచ్చాము. అదంతా అటవీ ప్రాంతం. విషసర్పాల సంచారం చాలా ఎక్కువగా ఉండేది. అయినా నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఎలాంటి అపాయము కలగకుండా బాబా ఎన్నోసార్లు కాపాడారు.


ప్రస్తుతం నేను పనిచేస్తున్న ఆఫీసులో ఒకసారి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని చాలా మానసిక వేదనను అనుభవించాను. ఆ సమయంలో బాబా ఫోటో ముందు మొరపెట్టుకుని ఏడ్చేదాన్ని. సాయి లీలామృతం, 'సాయి క్వశ్చన్&ఆన్సర్స్'లలో "నీవు భయపడనక్కరలేదు" అని బాబా సందేశం వచ్చేది. ఇలా ఉండగా బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివాక నేను, "నా సమస్య తీరితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. వెంటనే నాకు ఆ బాధ తప్పింది. కానీ నేను ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకున్నాను. "నన్ను క్షమించండి బాబా".


ఇకపోతే మా అబ్బాయిల ఉద్యోగాల గురించి బాబాను ఎప్పుడు అడిగినా సాయిలీలామృతంలోని 'సమాధానమిచ్చే సమాధి' అనే అధ్యాయంలోని శ్రీమతి సుశీలమ్మగారికి సంబంధించిన లీల వచ్చేది.  అందులో ఆమె భర్త రిటైర్ అయ్యేలోపు వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని ఉంటుంది. మావారు ఈ సంవత్సరం అంటే 2022, జూలైలో రిటైర్ అయ్యారు. తరువాత ఆగస్టులో మా పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి. ఇలా సాయి లీలలకు అంతేముంది. శ్రీసాయినాథుడు సర్వాంతర్యామి. ఆయన సదా భక్తసులభుడు.


నమ్మిన భక్తుల యోగక్షమాలు చూసుకుంటారు బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. బాబా ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న తమ భక్తులను పిచ్చుక కాలికి దారం కట్టి ఈడ్చునట్లు తమ దగ్గరకు చేర్చుకుంటారు. అలా బాబా గూటికి చేరుకున్న ఒక భక్తురాలిని నేను. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ సాయే. ఆయన అన్నీ తామై తమను నమ్మిన భక్తుల యోగక్షేమాలను చూసుకుంటూ దగ్గరుండి ఎలా రక్షణనిస్తారో సాయి బంధువులమైన మనందరికీ తెలిసిందే! బాబా ఎన్నోసార్లు ఈ బ్లాగు ద్వారా నాకు ఎంతో ఊరటనిచ్చారు. ఇక నా అనుభవాల విషయానికి వస్తాను. ఒకసారి నేను నవగురువారం వ్రతం చేయాలనుకున్నాను. అయితే ఆడవాళ్లకు నెలసరి సమస్య ఉంటుంది. అందుచేత నేను, "బాబా! తొమ్మిది గురువారాలూ ఏ ఆటంకం లేకుండా వ్రతం పూర్తయ్యేలా చూడండి. ఒక్క గురువారం కూడా ఆటంకం లేకుండా నా వ్రతం పూర్తయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఒక్కసారి కూడా ఆటంకం కలగలేదు. తొమ్మిది గురువారాలు పూజ చక్కగా జరిగి ఉద్యాపన కూడా పూర్తయింది. అదీకాక వరలక్ష్మి వ్రతం, విజయదశమి మొదలైన పండగలు కూడా నెలసరి అడ్డు లేకుండా పూర్తి చేసుకునేలా బాబా అనుగ్రహించారు.


మా పాపకి పెళ్లి చేయాలని మేము ఎన్నో సంబంధాలు చూసాము. కానీ ఏ సంబంధమూ కుదరలేదు. ఒకానొక సమయంలో సంబంధం గురించి చెప్పేవారు కూడా లేకపోయారు. అటువంటి స్థితిలో నేను, "బాబా! మీరే మా అమ్మాయికి అన్ని విధాలా మంచి సంబంధం కుదిరేలా చేయాలి. మాకు తగిన సంబంధం కుదిరితే, మీ దయను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అంతే, మంచి సంబంధం వచ్చి, బాబా ప్రేరణతో ఆ సంబంధం కుదిరింది. బాబా తమ భక్తుల ఇళ్లల్లో శుభకార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా చేయిస్తారని మనం ఎంతోమంది భక్తుల అనుభవాలలో చదువుకున్నాము. మా అమ్మాయి వివాహం కూడా ఏ ఆటంకం లేకుండా జరిపించాలని బాబాను వేడుకుంటున్నాను.


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


కోరుకున్న రూపురేఖలతో ఆరోగ్యవంతమైన బిడ్డని ప్రసాదించిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు అదృశ్యరూపంలో ఉన్న  మహిమాన్విత మహోన్నత ఆధునిక దేవాలయం, సర్వ కష్టాలను, దుఃఖాన్ని హరించి సర్వ సుఖాలను ప్రసాదించే స్వర్గధామం. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు శ్రీనివాస్. నేను ఇప్పుడు బాబా నాపై చూపిన అనుగ్రహాన్ని మీతో విన్నవించుకుంటాను. మా అమ్మాయి డెలివరీకోసం మేము యు.ఎస్ వెళ్ళినప్పుడు దయతో మా ప్రయాణం బాగా జరిగేటట్టు చూశారు బాబా. ఆయన అన్నివిధాలా ప్రతిక్షణం రక్షిస్తున్నా ఎన్నో రకాల భయాలు, ఆందోళనలు మనల్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. మా అమ్మాయికి పుట్టబోయే బిడ్డ ఏ రకంగా పుడతాడో, ఎలా ఉంటాడో అని మాకు భయంగా ఉంటుండేది. అందుచేత నేను, "బాబా! పుట్టబోయే బిడ్డ మంచి రూపురేఖలతో ఆరోగ్యంగా బాగుండాలి. అలా జరిగితే, మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో తప్పనిసరిగా పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా కరుణాకటాక్షాలతో మేము కోరుకున్నట్లే మంచి రూపురేఖలతో, చక్కటి ఆరోగ్యంతో మగబిడ్డను ప్రసాదించారు. ఇంకో విశేషమేమిటంటే, మా అమ్మాయి తనకు పుట్టబోయే బిడ్డ రూపురేఖల్ని ఏవిధంగా ఉహించుకునేదో సరిగ్గా అలాగే ఉన్నాడు బాబు. బాబా అద్భుత లీలకు మేము ఆశ్చర్యపోయాము. బాబాకి అనంత కోటి ధన్యవాదాలు చెప్పినా తక్కువే! ఎందుకంటే, వారు మన లౌకికమైన కోరికలన్నీ తీరుస్తూ ఆధ్యాత్మిక ప్రగతిని కూడా ప్రసాదిస్తారు. సాయి గురుదేవునికి అనంతకోటి పాదాభివందనాలు.



6 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Sarvam sai mayam
    Jai sai ram🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. N. Chandra Sekhara Rao. OM SRISAIRAM.

    ReplyDelete
  5. om sai ram.. Baba please remove my karmas, My family members are like enemies. They keep on troubling me for past 14 years. My husband he is rude and making me cry for small things. Please save me baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo