1. సాయితండ్రి కరుణ
2. తల్లిదండ్రులమయ్యే అదృష్టాన్ని ప్రసాదించిన బాబా
3. విన్నవించుకున్నంతనే జ్వరం నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా
సాయితండ్రి కరుణ
ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిబంధువులకి నా నమస్కారాలు. నా పేరు సరిత. నేను ఇంతకుముందు నాలుగుసార్లు నా అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటాను. ముందుగా నా జీవితంలో జరిగిన చాలా గొప్ప సాయిలీలను చెప్తాను. రెండేళ్ళ క్రితం కరోనా ప్రభావం వలన మావారి ఉద్యోగం పోయింది. అప్పటివరకు మావారు చేసిన ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే. అయితే, ఈసారి కరోనా కారణంగా తను దాదాపు రెండు సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఉన్నారు. అసలు ఉద్యోగం లేకుండా రెండేళ్ళ పాటు మేము పడిన బాధ వర్ణించలేనిది. ఆ రెండు సంవత్సరాలు నేను ఎంతో మధనపడుతూ, “బాబా! మాపై దయచూపి, మావారికి ఒక పర్మినెంట్ ఉద్యోగాన్ని ప్రసాదించు” అని బాబాకి చెప్పుకునేదాన్ని. ఆ సమయంలోనే నేను మావారి ఉద్యోగం కోసం ‘సాయి దివ్యపూజ’ చేశాను. తరువాత శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుని, మా బాధను విన్నవించుకున్నాను. చివరికి నా సాయితండ్రి నన్ను కరుణించి మావారికి చాలా మంచి కంపెనీలో పర్మినెంట్ రోల్‌తో మంచి ఉద్యోగాన్ని ప్రసాదించారు. మా ఇద్దరి ఆనందానికి అవధుల్లేవు. మాపై ఇంత కరుణను కురిపించిన నా సాయితండ్రిని కీర్తించడానికి నాకు మాటలు సరిపోవట్లేదు. అంతా సాయి కృప.
ఈమధ్య నేను బతుకమ్మ ఆడుతుంటే నా మెడ, భుజం పట్టేసి చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు నేను, “నా నొప్పి తగ్గిస్తే నా అనుభవాన్ని బ్లాగులో షేర్ చేసుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. బాబా దయతో మూడు రోజుల తరువాత నొప్పి తగ్గిపోయింది. ఇలా నా జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చేసిన నా తండ్రి సాయినాథునికి నా శతకోటి నమస్కారాలు.
ఈమధ్య మా అమ్మ ఆరోగ్యం చాలా పాడైపోయింది. ఒకసారి హార్ట్ బీట్ ఎక్కువవడంతో తనను రెండు రోజుల పాటు ICUలో ఉంచారు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! అమ్మని మీరు ఆరోగ్యంగా ఇంటికి తీసుకొస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల అమ్మ పూర్తిగా కోలుకుంది. ఎన్నో సంవత్సరాల నుండి మా అమ్మావాళ్ళు స్వంతిల్లు కట్టుకోవాలని అనుకుంటుండేవారు. కానీ డబ్బు సమస్య కారణంగా చాలాకాలం పాటు తమ కలను నెరవేర్చుకోలేకపోయారు. చివరికి బాబా దయవల్ల కొంచెం పొలం అమ్మి ఇల్లు కట్టుకుని, బాబా కృపతో గృహప్రవేశం కూడా చేసుకున్నారు. ఇదంతా కేవలం సాయినాథుని మహిమ. “థాంక్యూ బాబా!”
తల్లిదండ్రులమయ్యే అదృష్టాన్ని ప్రసాదించిన బాబా
సాయి బంధువులకు నమస్కారాలు. బ్లాగు నిర్వాహకులకు కృతఙ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు శ్రీలక్ష్మి. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ మాకు పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటళ్ళ చుట్టూ తిరిగాము. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. నేను బాబాను, "నాకు సంతాన భాగ్యం ప్రసాదించండి" అని ఎంతగానో అడుగుతుండేదాన్ని. మా ఆయన ఏ పిల్లల్ని చూసినా, "మనకెప్పుడు పుడతారో!" అని చాలా బాధపడేవాళ్ళు. చుట్టాలు, పక్కింటివాళ్ళు "మనవడినో, మానవరాలినో ఎప్పుడు ఇస్తావు?" అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక నేను మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయేదాన్ని. బాబా మందిరానికి వెళ్లి అక్కడ కూర్చొని, "నేను ఎంతలా బాధపడుతున్నానో మీకు తెలుసు బాబా" అని ఒంటరిగా ఏడ్చుకునేదాన్ని. ఒకసారి బాబా మందిరం నుండి ఇంటికొచ్చి ఏడుస్తూ పడుకుని, "వాళ్ళు, వీళ్ళు, చుట్టాలు అనే మాటలకి సగం చచ్చిపోయాను బాబా. ఇంకా నన్ను ఎందుకు ప్రాణాలతో ఉంచుతున్నావు తండ్రి" అని మనసులో అనుకుంటూ నిద్రపోయాను. ఆ మర్నాడు పొద్దుపొద్దున్నే వాంతులు అయ్యాయి. అదికాక నెలసరి రాలేదు. వాటిని బట్టి 'బాబా నాకు వరమిస్తున్నారేమో!' అనుకుని, ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్టు చేసుకుందామనుకుని, టెస్టు చేసుకునే ముందు బాబా ఆశీస్సులు తీసుకుందామనుకున్నాను. ఎందుకంటే, అదివరకు ఒకసారి ఇలాగే నెలసరి రాలేదు. అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్టు చేసుకుంటే నెగెటివ్ వచ్చింది. "ఎందుకు ఇలా చేశావు తండ్రి?" అని బాబాని అడిగి చాలా ఏడ్చాను. అందుకే ఈసారి బాబా మందిరానికి వెళ్లి, "బాబా! ఈసారి ప్రెగ్నెన్సీ టెస్టులో పాజిటివ్ రావాలి, అలా వస్తే గనక పుట్టబోయే పాప లేదా బాబుకి 'సాయి' అని కలిసి వచ్చేలా పేరు పెట్టుకుంటాను తండ్రి" అని బాబాను ప్రార్థించాను. తరువాత టెస్టు చేసుకున్నాను. మావారు నా పక్కనే ఉన్నారు. ఏదో తెలియని భయంతో నేను మనసులో 'సాయి సాయి' అని బాబా నామం జపించాను. ఐదు నిమిషాల్లో బాబా దయవల్ల టెస్టు రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. మా ఆనందానికి హద్దులు లేవు. సంతోషంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. నన్ను నేను చాలా నియంత్రించుకోవాల్సి వచ్చింది. నేను బాబాను తప్ప ఏ దైవాన్ని 'నాకు సంతానం కావాల'ని అడగలేదు. అంతలా బాబాను నమ్ముకున్నందుకు నా బాధ చూడలేక ఆ తండ్రి కరుణించారు. ఇన్ని రోజులకు తల్లిదండ్రులమయ్యే అదృష్టం మాకు దక్కింది. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నాకు నేను, మావారు, నా కడుపులోని బిడ్డ ముగ్గురం ఒకసారి శిరిడీ దర్శనం చేసుకోవాలని ఉంది. వీలైనంత త్వరగా నా కోరికను నెరవేర్చు తండ్రి. నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడండి తండ్రి. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే మాపై ఉండాలి బాబా".
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
విన్నవించుకున్నంతనే జ్వరం నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నాపేరు భారతి. చాలా సంవత్సరాల నుంచి దివ్యస్వరూపుడైన శ్రీసాయినాథుడు నాకు అన్ని విషయాలలో తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నారు. ఈమధ్య బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఒకరోజు మా చిన్నబ్బాయికి విపరీతమైన జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇంజక్షన్ చేసి, టాబ్లెట్లు ఇచ్చారు. ఆ టాబ్లెట్లు వేసుకున్నా చాలాసేపటివరకు బాబుకి జ్వరం తగ్గలేదు. నాకు చాలా భయమేసింది. అర్ధరాత్రి వరకు వేచి చూశాక ఆ సాయినాథుడే బాబుకి జ్వరం నుంచి ఉపశమనం కలిగించగలరని విశ్వసించి, "బాబా! బాబుకి జ్వరం తగ్గితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు విన్నవించుకున్నాను. ఆ తండ్రి దయవల్ల కొంత సమయం గడిచేసరికి బాబుకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. "వేల వేల వందనాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Baba na vaipu kuda chudu sai yenno samvasarlnunchi ni dagara nilchone unna sai na midha miku jali kalagatledha sai 😢😢😢
ReplyDeleteNannu na vamsi ni kalupu sai na kapuranni nilabettu sai thanu manasu manchi ga marchu sai
ReplyDelete