1. నమ్ముకున్న వారి వెన్నంటే ఉండే దేవుడు మన సాయి
2. బిడ్డ ఆశపడిన చిన్న కోరికను తీర్చిన బాబాతండ్రి
నమ్ముకున్న వారి వెన్నంటే ఉండే దేవుడు మన సాయి
నా పేరు మహేష్. ముందుగా శ్రీసాయిబాబాకు మరియు తోటి సాయిబంధువులకు నమస్కరిస్తూ బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. మేము ప్రతి సంవత్సరంలాగే 2023లో మా యూత్ ఆధ్వర్యంలో దసరా సందర్భంగా శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుపుకున్నాము. ఆ సమయంలో నేను, "బాబా! ఎలాంటి సమస్యలు, ఆటంకాలు లేకుండా ఉత్సవాలు బాగా జరిగేలా చూడమ"ని శ్రీసాయిబాబాను వేడుకున్నాను. ఉత్సవాలలో భాగంగా మా యూత్ సభ్యులు రోజుకు ఒకరు చొప్పున పూజలో పాల్గొన్నాము. అందుకోసం సభ్యుల పేరు మీద చీటీలు వేసినప్పుడు గురువారం పూజకు నా పేరు వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ముందు సంవత్సరం కూడా చీటీలో నాకు గురువారమే వచ్చింది. ఇదంతా బాబా అనుగ్రహమని బాబాని స్మరించుకున్నాను. కానీ, నాకు మొదటిరోజు పూజ చేయాలనిపించి మొదటిరోజు పూజ చెయ్యాల్సిన యూత్ సభ్యునితో, "నేను మొదటిరోజు పూజ చేస్తాను. నువ్వు గురువారం చేస్తావా?" అని అడిగాను. అందుకతను సరేనని ఒప్పుకున్నాడు. దాంతో నేను అనుకున్నట్లే మొదటిరోజు పూజ చేశాను. బాబా ఆశీస్సులతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఒకసారి పాస్ బుక్ అవసరం పడి మా నాన్నగారు, "నీ పట్టా పాస్ బుక్ తీసుకురా" అని నాతో అన్నారు. నేను సాధారణంగా డాక్యుమెంట్లు పెట్టే కవర్లలో చూస్తే నా పట్టా పాస్ బుక్ కనపడలేదు. ఎంత వెతికినా దొరకలేదు. నాకు చాలా కంగారుగా అనిపించి బాబాని తలచుకుని, 'సాయిరాం సాయిరాం' అని నామస్మరణ చేస్తూ మరోసారి వెతికితే వెంటనే దొరికింది. ఇంకోసారి నా కారణంగా మా అమ్మానాన్న గొడవపడ్డారు. నేను వెంటనే బాబాని తలుచుకుంటే గొడవ సద్దుమణిగింది. "ధన్యవాదాలు బాబా. మా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేలా చూడండి బాబా".
నాకు ఇదివరకు బాబా అప్పుడప్పుడు స్వప్న దర్శనమిస్తుండేవారు. కానీ ఈమధ్య బాబా స్వప్న దర్శనమివ్వట్లేదు. ఒకరోజు నేను, 'ఎందుకు బాబా నాకు స్వప్నంలో కనిపించడం లేదు' అని అనుకున్నాను. మరుసటిరోజు నేను పూజ చేస్తుంటే బాబా పాటలు వినిపించసాగాయి. కొద్దిసేపటికి ఆ పాటలు మా ఇంటి ముందే వినిపించేసరికి నేను పూజగది నుండి ఇంటి బయటకి వెళ్లి చూస్తే, మా ఇంటి ముందు శ్రీసాయిబాబా వారి రథం ఉంది. నేను చాలా అశ్చర్యపోయాను. ఈ మధ్య స్వప్నంలో కనిపించడం లేదని మనసులో అనుకుంటే ఏకంగా మా ఇంటి ముందుకే రథంలోని విగ్రహం రూపంలో వచ్చి దర్శనం ఇచ్చారు బాబా అని నేను చాలా చాలా ఆనందించాను. ఆ రథం వారికి దక్షిణ ఇచ్చి, కొంచెం బియ్యం కూడా సమర్పించుకున్నాము. ఇంకా కొన్ని పువ్వులు ఇస్తే బాబాకి అర్పించారు. ఈ అనుభవంతో నేను చాలా ఆనందించాను.
నాకు హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం చేయడం చాలా ఇబ్బందిగా అనిపించి, "బాబా! మా గ్రామంలో నా కుటుంబంతో ఉంటూ, పరిసర ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడేలా చూడండి" అని బాబాతో చెప్పుకుని, "నా కోరిక నెరవేరినట్లయితే శిరిడీ వస్తాన"ని మ్రొక్కుకున్నాను. బాబా నేను కోరిన విధంగానే నాకు ఉద్యోగం ఏర్పాటు చేశారు. శ్రీసాయి మీద నమ్మకంతో ఉంటే ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. "ధన్యవాదాలు బాబా. ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా అనుకూలంగా ఉండేలా చూడండి సాయి".
మా అన్నయ్య, వదిన హైదరాబాద్‍లో ఉంటారు. 2022, నవంబర్ మొదటివారంలో మా అన్నయ్య 8నెలల గర్భవతి అయిన మా వదినకి కడుపులో చాలా ఇబ్బందిగా ఉందని మాతో చెప్పాడు. నేను అప్పుడు అన్నయ్యతో, "బాబా ఊదీ నీటిలో కలిపి వదిన చేత త్రాగించు" అని చెప్పాను. అన్నయ్య నేను చెప్పినట్లే ఊదీ తీర్థాన్ని వదిన చేత త్రాగించాడు. నేను, "బాబా! వదిన సమస్య పరిష్కారమై ఏ ఇబ్బంది లేకుండా తన ఆరోగ్యం మంచిగా ఉన్నట్లైతే, మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు పొద్దున్నే నేను అన్నయ్యకి ఫోన్ చేస్తే, "ప్రస్తుతం బాగానే ఉంది" అని చెప్పాడు. ఆ మాట విన్న నేను ఆనందంతో బాబాకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
మేము ఈసారి మా వరి పంటను కోత కోయించి వడ్లను మా గ్రామంలోని ప్రభుత్వ ఐకేపి మార్కెట్‍లో ఇద్దామనుకున్నాము. కానీ అప్పటికే ఆ సీజన్లో ఓపెన్ కావాల్సిన మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు. అందువల్ల మార్కెట్‍కి కొంచెం దూరంగా మా వడ్లు పోసాము. తరువాత మార్కెట్ ఓపెన్ అయింది. ఆ మార్కెట్ సిబ్బంది చాలా కఠినంగా ఉంటారు. పోయిన సీజన్‍లో వాళ్ళకి, నాకు మధ్య కొంచెం గొడవ జరిగింది. వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకుని వడ్లు దూరంగా పోసామన్న నెపంతో మా వడ్లు కొనుగోలు చేయడంలో బాగా ఆలస్యం చేస్తారేమోనని మేము అనుకున్నాము. ఏదేమైనా నేను సాయి మీద నమ్మకం ఉంచి తరచూ నా మనసులో, "త్వరగా వడ్లు కొనుగోలు చేసేలా అనుగ్రహించి అంతా మంచి జరిగేలా చూడండి బాబా" అని బాబాని వేడుకుంటుండేవాడిని. సాయి ఎంతో దయతో మార్కెట్ సిబ్బంది మేము వడ్లు పోసిన చోటుకే వచ్చి కొనుగోలు చేసేలా చూసి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుగ్రహించారు. తరువాత మా నాన్నగారి ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాసుబుక్ జిరాక్స్ కాపీలు ఇచ్చాము. వాటిని ఆన్లైన్‍లో సబ్మిట్ చేస్తుంటే ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేదని వచ్చింది. దాంతో మరుసటిరోజు ఆధార్ కేంద్రానికి వెళ్లి వాటిని లింక్ చేయించాము. అయితే రెండు రోజులు తరువాత అది రిజెక్ట్ అయింది. దాంతో మళ్ళీ అధార్ కేంద్రానికి వెళ్ళాము. అప్పుడు నేను మన సాయిని వేడుకుని ఆధార్ అప్డేట్ చేయించి, ఫోన్ నెంబర్ లింక్ చేయించాను. సాయి దయవల్ల మరుసటిరోజుకల్లా ఫోన్ నెంబర్ లింక్ అయింది. తరువాత ఆన్లైన్‍లో వడ్లు కొనుగోలు వివరాలు తెలిపి వివరాలు నమోదు చేస్తే, వెంటనే ప్రాసెస్ విజయవంతం అయింది. చిన్న, పెద్ద ఎలాంటి సమస్యలైనా బాబాకి చెప్పుకుంటే చాలా సులభంగా పరిష్కరిస్తారు. నమ్ముకున్న వారి వెన్నంటే ఉండే దేవుడు మన సాయి. పిలిచిన పలికే దైవం మన సాయి.
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కి జై!!!
బిడ్డ ఆశపడిన చిన్న కోరికను తీర్చిన బాబాతండ్రి
'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును అనుసరిస్తున్న భక్తులకి నమస్కారం. బ్లాగు నిర్వహిస్తూ బాబా ప్రేమను అందరికీ అందిస్తున్న అన్నయ్యకి, బృందానికి ధన్యవాదాలు. "నమస్కారం అన్నయ్యా! ఇటీవల బ్లాగులో మీరు పెట్టిన అభ్యర్థనని చదివాను. అందరిలానే 'బ్లాగులో పంచుకుంటే అనుకున్నది జరిగిపోతుంద'న్న ఆలోచనతో ఏ చిన్న సమస్య వచ్చినా 'బ్లాగులో పంచుకుంటాన'ని నేను అనుకుంటూ ఉంటాను. అలా బ్లాగులో పంచుకుంటానని మ్రొక్కుకోవడం తప్పని కాదుగానీ, సమస్య వచ్చినప్పుడు మన పరిస్థితి ఏమిటి? బాబాపై ఎలా ఆధారపడ్డాం? ఆ సమస్యను బాబా ఎలా పరిష్కరించారు? ఆ క్రమంలో బాబా మనకి చేసిన సహాయం వంటివేమీ వ్రాయకుండా, కేవలం 'బ్లాగులో పంచుకుంటామంటే బాబా సమస్యని పరిష్కరించార'ని వ్రాయటం ఎంత తప్పో మీరు చక్కగా చెప్పడం ద్వారా అనుభవాలను బాబా ప్రేమ వ్యక్తమయ్యేలా ఎలా వ్రాయాలో నాకు అర్థమయ్యేలా చేశారు".
నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలు మా ఇంటి దైవమైన శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులతో పంచుకుంటున్నాను. ఈ మధ్య తరుచుగా నాకు తలనొప్పి వస్తుండేది. ఒకసారి తల పైభాగంలో, ఇంకోసారి ఇంకోచోట ఒక్కమాటలో చెప్పాలంటే ఒక్కోసారి ఒక్కోచోట నొప్పి ఉంటుండేది. అదేమంత పెద్ద నొప్పి కాకపోయినప్పటికీ నిరంతరాయంగా వస్తుండటం వల్ల నాకు చికాకుగా, ఇబ్బందిగా ఉంటుండేది. చివరికి నేను మా ఇంటి దైవమైన శ్రీసుబ్రమణ్యస్వామిని, బాబాని, "నొప్పి తగ్గిపోయేలా చేయండి". అని ప్రార్థించాను. అలాగే, "నా ఈ నొప్పి తగ్గితే, ప్రసాదం చేసి పెడతాన"ని బాబాకి మ్రొక్కుకునాను. శ్రీసుబ్రహ్మణ్యస్వామి దయతో, బాబా కరుణతో రెండు రోజుల్లో నొప్పి తగ్గిపోయింది. శ్రీసుబ్రహ్మణ్యస్వామికి, బాబాకి చాలా చాలా ధన్యవాదాలు.
ఇప్పుడొక చాలా చిత్రమైన అనుభవం పంచుకుంటాను. ఈమధ్య మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి ఒక పర్యటనకి వెళ్ళాము. మేము ఒక చోటుకి చేరుకుని పర్వతాధిరోహణ చేయాల్సి ఉండగా ఆ చోట మా వాహనం పార్కింగ్ చేసేందుకు ఖాళీ ప్రదేశం దొరకలేదు. దాదాపు 30నిమిషాలు వేచి చూసినా పార్కింగ్ చేయడానికి చోటు దొరకలేదు. దాంతో అందరం పార్కింగ్ చేయడానికి చోటు దొరకదు, మనం ఈ ప్రదేశం చూడలేము అని అనుకున్నాము. ఎందుకంటే, పర్వతాధిరోహణ పూర్తిచేసి అదేరోజు మధ్యాహ్నం ఫ్లైట్ అందుకోవాల్సి ఉంది. అటువంటి స్థితిలో నేను నా మనసులో బాబాను తలుచుకుని, 'పార్కింగ్ ప్లేస్ దొరికితే బాగుంటుంది" అని అనుకున్నాను. కేవలం బాబాను తలుచుకున్నాను. ఏ మ్రొక్కుమ్రొక్కులేదు, బ్లాగులో పంచుకుంటానని కూడా అనుకోలేదు. ఆయన దయతో ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతున్న క్షణంలో మాకు పార్కింగ్ ప్లేస్ దొరికింది. చిత్రమేమిటంటే ఒక్క మా కారుకే పార్క్ చేయడానికి అనుమతి ఇచ్చారు. మా వెనక, ముందు ఉన్న కార్లను పార్కింగ్ లేదని వెనక్కి పంపేశారు. మా ముందు కార్లను వదలకుండా మమ్మల్ని మాత్రమే అలా ఎలా వదిలారని మా గ్రూపులో అందరూ షాక్ అయ్యారు. కానీ ఒక బిడ్డ ఆశపడిన చిన్న కోరికను ఆ బాబాతండ్రి తీర్చారని నాకు మాత్రమే తెలుసు. మేము సంతోషంగా పర్వతాధిరోహణ చేసాము. నేను పైకి వెళ్ళగానే మనసులోనే బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. అక్కడ అత్యంత అందమైన ప్రదేశాలను చూసి బాబా ఆశీస్సులతో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me