నిన్నటి తరువాయి భాగం..
శ్రీమతి రమాదేవిగారు మరికొన్ని అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు.
అప్పటివరకు తన లీలల ద్వారా తనపైన నాకున్న నమ్మకాన్ని పెంచుతూ వచ్చిన బాబా నా నమ్మకాన్ని పరీక్షించడానికి అన్నట్లు నాకు ఒక సమస్యని ఇచ్చారు. నేను 2009 అమెరికాలో ఉన్నప్పుడు నా మూత్రం ఎందుకో తెల్లగా చిక్కని మజ్జిగలాగా వచ్చేది. అసలే పిల్లలు బాధలో ఉన్నారు, ఈ విషయం చెప్పి ఇంకా వాళ్ళ మనసులను కలతపెట్టడం ఇష్టంలేక వాళ్ళతో నేనేమీ చెప్పలేదు. మా వియ్యంకులు అమెరికా వచ్చాక నేను సెప్టెంబరులో ఇండియాకి వచ్చేశాను. ఇంటికి వచ్చాక మావారితో విషయం చెప్పాను. ఈ సమస్యకి అసలు కారణం ఏమిటో తెలుసుకుందామని మావారు డాక్టరుతో మాట్లాడారు. డాక్టర్ మావారికి కారణం చెప్పి, కొన్ని మందులు సూచించి, “ఇవి వాడి చూడండి. వీటితో నయం కాకపోతే చిన్న ఆపరేషన్ లాంటిది చేద్దాము” అన్నారు. ఒకసారి మావారికి విషయం చెప్పి, ఆయన డాక్టరుతో మాట్లాడి మందులు తీసుకొచ్చాక నేను వాడకపోతే తను బాధపడతారని నేను ఆ మందులు వేసుకున్నాను. మందులు వేసుకున్నప్పుడు మూత్రంలోని చిక్కదనం కొద్దిగా తగ్గినా, మందులు మానేశాక మళ్ళీ సమస్య మామూలే. దాంతో నేనే మావారితో, “ఫరవాలేదులెండి, కొద్దిరోజులు చూద్దాము. సమస్య తగ్గకపోతే చెప్తానులెండి” అన్నాను. కానీ, సమస్య అలాగే ఉందన్న విషయం ఆయనకు చెప్పలేదు. నా సమస్య నివారణ కోసం బాబా ఊదీనే వాడుతూ వచ్చాను. కానీ నాలో నేనే భయపడుతూ ఉండేదాన్ని. సబూరి అనేది సంతోషంతో కూడిన ఓర్పు కదా! అదే కదా విశ్వాసం అంటే. అందుకని అలాగే రోజలు గడుపుతూ ఉండేదాన్ని. కానీ నన్ను బాబా రెండు సంవత్సరాలు ఆ సమస్యతో ఉంచారు. ఒకవైపు భయపడుతూనే ఉన్నప్పటికీ బాబాపై భారం వేసి మందులు వేసుకోనందుకేమో, నా విశ్వాసంలో పరిపూర్ణత లేకపోయినా వేరే పెద్ద సమస్యకు దారితీయకుండా కరుణ చూపించి, రెండు సంవత్సరాల తరువాత నా ఆరోగ్యాన్ని కుదుటపరిచారు బాబా. మూత్రంలోని చిక్కదనం తగ్గి నార్మల్ అయింది.
2011 తర్వాత నాకు చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నొప్పి ఉన్నప్పటికీ, బాబా ఊదీపై నమ్మకం ఉంటే డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళకపోయినా తప్పకుండా ఆ నొప్పి కూడా తగ్గిపోయివుండేదేమో! కానీ, బాబా నాకు చక్కటి అనుభవాలు ఎన్నో ఇచ్చినా, ఆయన నాకు పెట్టిన పరీక్షలో ఓడిపోయాను. నేను డెంటిస్ట్‌ను సంప్రదించాను. ‘రూట్ కెనాల్ తప్పనిసరిగా చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుందని’ గట్టిగా చెప్పారు డాక్టర్. మందులు వాడటం కూడా తప్పనిసరి అయింది. ఇంకోసారి రాత్రిపూట విపరీతమైన కడుపునొప్పితో పాటు ఆగకుండా నీళ్ళవిరేచనాలు అవ్వసాగాయి. మావారు నా బాధ చూడలేక, “మందులు వేసుకో, లేకపోతే రేపు సెలైన్ ఎక్కించాల్సి వుంటుంది” అన్నారు. అప్పుడు కూడా తన మాట విని మందులు వేసుకున్నాను. ఇలా నా విషయానికి వచ్చేసరికి బాబాపై నమ్మకంలో జారిపోతూ వచ్చాను. మనస్సంతా ఎంతో వెలితిగా అనిపించేది.
అన్నింటికంటే పెద్ద పరీక్ష ఇప్పుడే మొదలైంది. 2009లో నాకు వచ్చిన మూత్రసమస్య గురించి నేను భయపడ్డప్పటికీ, మందులు వేసుకోకుండా ఉన్నందుకు ఆ మూత్రసమస్యను తగ్గించారో, ఇప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా మందులు వేసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ పరీక్ష పెట్టారో తెలియదుగానీ 2022, మే నెలలో మూత్రసమస్య మళ్ళీ మొదలైంది. అయితే, ఈసారి మజ్జిగలాగా తెల్లగా కాదు, ఎర్రగా! అంటే రక్తం తప్ప మూత్రంలో ఇంకేమీ లేదు. అది కూడా గడ్డలు గడ్డలుగా. కానీ ఈసారి ఈ సమస్య గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదు, మావారికి కూడా. బాబాపై భారం వెయ్యాలనిపించింది. జూన్ నెలలో బెంగళూరులో ఉన్న మా పిల్లల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను. జూన్ నెలంతా కూడా ఆ సమస్య అలాగే ఉంది. నా శరీరబరువు బాగా తగ్గసాగింది. ఈసారి ఎందుకో నాకు భయం చాలా ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా బాబా ఊదీ అసాధ్యాలను సుసాధ్యాలుగానూ, మృతజీవులను కూడా సజీవులుగానూ చేయగల మహిమాన్వితమైనదన్న సత్యం నాకు తెలుసున్నప్పటికీ ఆ సత్యానికి ప్రయోజనం లేకపోయింది. నమ్మకం-అపనమ్మకాల మధ్య, సహనం-అసహనాల (శ్రద్ధ, సబూరీల) మధ్య మనస్సు ఊగిసలాడటం మొదలుపెట్టింది. అప్పుడు నాకు అర్థమైంది ఒక్కటే – 'బాబాపై పూర్తిగా ఆధారపడి ఆయనకు పగ్గాలు అప్పగించాలంటే (అంటే, ఆయనకి పరిపూర్ణ శరణాగతి చేసుకోవాలంటే) ఎంతో సాధన కావాలి, ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి. అటువంటివారు ధన్యజీవులు, పుణ్యాత్ములు. అవి నాలో లేవు' అని. కానీ, సాయి దయామయుడు కదా! నా ఆర్తిని ఆయనకి కాక ఇంకెవరికి విన్నవించుకోనని ఒక లేఖ ద్వారా నా బాధను విన్నవించుకున్నాను. బాబా నా బాధను అర్థం చేసుకున్నారు. మా సాయిబంధువు ద్వారానే నా సమస్యకు సమాధానం పంపించారు, “అమ్మా! ఈ సృష్టి అంతా బాబా రచనే కదా? అటువంటప్పుడు ఊదీలో ఉన్నా, మందులలో ఉన్నా అంతా ఆయన కరుణయే!” అని. నిజమే, బాబా సంకల్పం లేకుండా, కరుణ లేకుండా ఏదీ జరగదు. ఈ సమాధానం నాకు ఎంతో సాంత్వన ఇచ్చింది. నా భర్తకి విషయం చెప్పాను. మూత్రం చూసి ఆయన చాలా ఆందోళన చెందారు. వెంటనే డాక్టరుతో మాట్లాడారు. డాక్టర్ చెప్పిన మొదటి విషయం – ‘ముందు క్యాన్సర్‌కి సంబంధించిన టెస్టులు చేయించండి’ అని. నాకు తెలుసు, ఆరోజు రాత్రి మావారు నిద్రపోలేదని. కానీ మా అమ్మాయి వాళ్ళ నాన్నకి బాగా ధైర్యం చెప్పింది. మా పెద్దబ్బాయి కుటుంబం బెంగళూరులోనే ఉన్నా, అబ్బాయి ఎక్కువగా ఆఫీసు పనులతో ముంబాయిలోనే ఉంటాడు. తను మా దగ్గరకు వస్తానంటే, ‘అవసరమైతే చెప్తాములే’ అన్నాము. ఇంక మా అమ్మాయి తన కారుని, డ్రైవరుని మాకే ఇచ్చింది. తను ఆఫీసులో ‘వర్క్ ఫ్రం హోమ్’కి పర్మిషన్ తీసుకుంది. మరుసటిరోజు హాస్పిటల్‌కి టెస్టుల కోసమని వెళ్ళాము. మా అమ్మాయి, మా కోడలు ఇద్దరూ మాతో వచ్చారు. హాస్పిటల్‌కి వెళుతుంటే దారిలో ఎదురుగా వ్యాన్ పైన బాబా నవ్వుతూ కనిపించారు. బాబాను చూడగానే, ‘నాతో ఉన్నావు కదూ బాబా’ అనుకున్నాను. ఆ రోజంతా అన్ని టెస్టులూ చేశారు. బాబా ఉన్నారు కదా! రిపోర్టులు చూసిన డాక్టర్లు, ‘క్యాన్సర్‌కి సంబంధించినవేవీ లేవ’న్నారు. కానీ అక్కడితో సమస్య తీరలేదు. “మూత్రసంచి (బ్లాడర్) పూర్తిగా రక్తంతో నిండివుంది. రేపు చిన్న ఆపరేషన్ (సిస్టోస్కోపీ) చేసి, అది క్లియర్ చేసి బయాప్సీకి పంపిద్దాము, అప్పుడుగానీ సమస్యేమిటో మనకు స్పష్టంగా తెలీదు” అన్నారు. అంటే, మళ్ళీ ఇంకొక పరీక్ష. మా అమ్మాయి, మా కోడలు మావారిని ఒంటరిగా వదిలిపెట్టలేదు. మరుసటిరోజు జూలై 13, గురుపూర్ణిమ. బాబా ఆరోజు కోసమే అలా ప్లాన్ చేశారేమో! ఆరోజు సిస్టోస్కోపీ కోసం మళ్ళీ హాస్పిటల్‌కి వెళుతుంటే, ‘నేనున్నాను’ అని ఆటోపై బాబా దర్శనమిచ్చారు. “చాలు బాబా, ఇంత దయ చాలు తండ్రీ!” అని అనుకున్నాను. ఆరోజు ఆపరేషన్ పూర్తయ్యాక డాక్టరు మావారితో, “బయాప్సీ అవసరం లేదు, భయపడాల్సింది ఏమీ లేదు” అన్నారు. ఇక మావారి హృదయం పూర్తిగా తేలికపడింది. ఇంతటితో సమస్య పూర్తిగా పోలేదు. “రక్తం మూత్రసంచిలోకి ఎలా, ఎక్కణ్ణించి వస్తోందో తెలియటంలేదు. కాబట్టి ఇంకో ఆపరేషన్ ద్వారా మూత్రనాళాల నుండి కిడ్నీ వరకు ట్యూబులు పెట్టి 3 రోజుల పాటు ప్రతిరోజూ ఇన్ఫెక్షన్ తగ్గటానికి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంద”ని అన్నారు. ఈసారి ఆపరేషన్‌కి నాకు అస్సలు ధైర్యం లేదు. ఎందుకంటే, ఈసారి రెండు ట్యూబులు అమర్చుతారు. ఒకటి మూత్రం బయటికి రావడానికి, రెండోది ఇంజెక్షన్ ఇవ్వడానికి. ‘చాలా (painful procedure) బాధగా ఉంటుంది’ అని వాళ్లే చెప్పారు. నేను ఒప్పుకోలేదు. కానీ నా భర్త, పిల్లలు, డాక్టర్ అందరూ ‘సమస్యను ఎప్పటికైనా పూర్తిగా నివారించాలి’ అని వివరించి నాకు ధైర్యం చెప్పారు. సరే, ఇక ఒప్పుకోక తప్పలేదు. మొదటి ఆపరేషన్ జూలై 13 గురుపూర్ణిమ బుధవారంనాడు అయితే రెండవ ఆపరేషన్ 14వ తేదీ గురువారంనాడు అయింది. చిత్రంగా ఆ 3, 4 రోజులు బాబా నాకు తోడుగా ఉన్నారనిపించింది. ఎందుకో తెలుసా? ఎంతో బాధగా ఉంటుందని భయపడ్డాను కదా! బాబా కేవలం నేను ఓర్చుకునే నొప్పినే నాకు ఇచ్చారు. అంతగా బాధ తెలియలేదు. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులూ పగలంతా మా అమ్మాయి మాతోనే ఉంటూ అక్కడే ఆఫీస్ పని చేసుకునేది. రాత్రిపూట మా కోడలు మాకు తోడుగా ఉండేది. మా అబ్బాయిలిద్దరూ ఉదయం, సాయంకాలం ఫోన్లు చేస్తూ మాకు ధైర్యం చెబుతుండేవారు. ఇక మా అల్లుడు నాకు ఇంకో కొడుకు. ఆ అబ్బాయి సహకార సహాయాలే కదా మా అమ్మాయికి ముఖ్యం. వీళ్లందరూ బాబా నాకిచ్చిన వరాలు. ఇకపోతే, ఇంటికి వచ్చాక వారంరోజుల్లోనే నేను కోలుకున్నాను. నా సమస్య తీరింది. ఇప్పుడు నా సాయితండ్రి కృపవల్ల నా ఆరోగ్యం కుదుటపడింది. అయితే అంత జరిగినా నా మనస్సులో ఒక వెలితి మాత్రం అలాగే ఉంది, 'ఎన్నెన్నో అమూల్యమైన అనుభవాలు(వ్రాయనివి ఎన్నో) నా సాయితండ్రి నాకు ప్రసాదించినా, ఆయన కోరిన దక్షిణను ఆయనకు ఇవ్వలేకపోయాన'ని. అందుకే బాబానే ప్రార్థిస్తూ యాచిస్తున్నాను – ‘ఎప్పటికైనా, ఏ జన్మకైనా పరిపూర్ణ శరణాగతి చేసే భాగ్యాన్ని, ఆయన కోసం తపించే ప్రేమని, ఆయన కోరిన దక్షిణను సమర్పించుకునే యోగ్యతని నాకు ప్రసాదించమ’ని. “ఇక నీ చిత్తం – నా భాగ్యం స్వామీ!”.
నా మూత్రం సమస్య, ఆపరేషన్ గురించి, బాబా కరుణల గురించి మీకు వివరంగా చెప్పాను కదా. ఆదే సమయంలో మా అమ్మాయి తన గర్భసంచి ఆపరేషన్ గురించి ఆలోచిస్తుండేది. అప్పటికే సంవత్సరం నుంచి తను గర్భసంచికి సంబంధించిన సమస్యతో కష్టపడుతోంది. ఎలాగో మందులతోనే కాలం గడుపుతోంది. కానీ ఈసారి ఆపరేషన్ తప్పనిసరి అన్నారు డాక్టర్లు. అసలు మేము బెంగళూరు రావటానికి గల ముఖ్య కారణం కూడా తనే. అయితే అంతలోనే నా మూత్ర సమస్యతో అందరూ చాలా కంగారుపడ్డారు. “ముందు నీ సమస్య తీరనీ అమ్మా. ఇన్ని రోజులు ఆగినదాన్ని, ఇంకొక 2 వారాలు ఆగలేనా?” అన్నది మా అమ్మాయి. తనది గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్. తనకి బాగా రెస్ట్ కావాలి. కానీ తనకి ఆఫీస్ పనులు చాలా ఉంటాయి. ఎక్కువ సెలవులు తీసుకోవడానికి కూడా ఉండదు. “ఇటువంటి పరిస్థితుల్లో దానికి నేనేం చెయ్యగలను సాయీ?” అని చాలా బాధపడుతూ ఉండేదాన్ని. బాబా దయవల్ల ఒక వారంరోజుల్లోనే నేను కోలుకున్నాను. తరువాత వారంరోజులకు మా అమ్మాయి ఆపరేషన్ అనుకున్నాము. నేను కోలుకున్న వెంటనే మా అమ్మాయి ఆపరేషనుకు ముందే బాబా గుడికి వెళ్లి, నాకు తోడుగా ఉండి, ఆపరేషన్ విజయవంతంగా జరిపించి, నన్ను త్వరగా కోలుకునేలా చేసినందుకు సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆ తర్వాత, “అమ్మాయికి కూడా తోడుగా ఉంటావు కదా బాబా?” అని బాబాను అడిగాను. “ఉంటాను” అనడానికి బాబా ఎంత చక్కని నిదర్శనం ఇచ్చారో చూడండి! అన్నదానానికి డబ్బులు కట్టాలని గుడి ఆఫీసుకి వెళ్ళాను. డబ్బులు కట్టిన తరువాత అక్కడున్న కార్యదర్శి రశీదుతో పాటు బాబా క్యాలెండరు నా చేతికి ఇచ్చారు. పెద్ద క్యాలండరు, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క బాబా ఫోటో. బాబాను చూడగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మా అమ్మాయి ఇంట్లో పూజలో బాబా విగ్రహం ఉంది, కానీ బాబా ఫోటోలు లేవు. ‘ఒక్కటైనా బాబా ఫోటో ఉంటే బాగుండేది’ అని నాకు అనిపించేది. ఇలా ఆ కొరత తీరింది. అంతేకాదు, బాబా నాతోపాటు ఇంటికి వచ్చి తోడుగా ఉంటానని ధైర్యం ఇచ్చారు. ఇక ఆపరేషన్ టైంలో మా అమ్మాయికి తోడుగా ఉన్నారని బాబా నాకు ఎలా చెప్పారో చూడండి...
ఆపరేషన్ రోజు నేను ఇంట్లో పూజ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటున్నాను. మావారు, అల్లుడు హాస్పిటల్లో ఉన్నారు. ‘8 గంటలకు అమ్మాయిని ఆపరేషన్ కోసం ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళారనీ, రెండు గంటల్లో ఆపరేషన్ అయిపోతుంద’నీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. కానీ సమయం 11 గంటలవుతున్నా వాళ్ళనించి నాకు ఫోన్ రాలేదు. దాంతో నేనే వాళ్ళకు ఫోన్ చేస్తే, “ఇంకా అమ్మాయి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాలేదు. డాక్టర్లు కూడా ఎవ్వరూ బయటికి రాలేదు. మాకు కూడా కంగారుగానే ఉంది” అన్నారు. అరగంట తర్వాత ఫోన్ చేసి, “ఆపరేషన్ అయిపోయింది. అమ్మాయి అబ్జర్వేషన్ రూములో ఉంది, బాగానే ఉంది” అని చెప్పారు. ఆ సాయంకాలం నేను హాస్పిటల్‌కి వెళ్తే తెలిసింది, ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినందువల్ల ఆపరేషన్ కష్టం అయిందని. ఆ సమయంలో మా అమ్మాయిని బాబా కాకపోతే ఎవరు కాపాడివుంటారు చెప్పండి? 4 రోజుల తర్వాత అమ్మాయిని ఇంటికి పంపించారు. నాకంటే తన భర్తే తనని చాలా బాగా చూసుకున్నారు. అంతటి మంచి భర్తని మా అమ్మాయికి ప్రసాదించినందుకు బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా అమ్మాయి త్వరలోనే బాబా దయవల్ల కోలుకుంది. ఇంటిపనులు, ఆఫీసు పనులు అన్నీ మామూలుగా చేసుకుంటోంది. “సాయీ! ఎప్పటికీ ఇలాగే మాకు తోడునీడగా ఉంటూ మమ్మల్ని నీ దయామయ దృష్టితో చల్లగా కాపాడు తండ్రీ!”.
ఇటీవల జరిగిన మరో చిన్న అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. అనుభవం సామాన్యమైనదే అయినా కేవలం నా తలపును, నా నమ్మకాన్ని బాబా ఎలా కాపాడిందీ పంచుకుంటాను. ఇది 2022, డిసెంబర్ నెలలో జరిగింది. నేను ఒక మండలం రోజులు సాయినాథుని చాలీసాను రోజుకు 108 సార్లు పఠించాలని సంకల్పించుకున్నాను. తప్పు, ఆ తండ్రే నాకు ఆ సంకల్పం ఇచ్చారు. దాన్ని నేను డిసెంబరులో మొదలుపెట్టాను. నేను రోజూ తెల్లవారక ముందే నిద్రలేచి, స్నానం చేసి పూజ చేసుకుంటాను. అలాగే ఒకరోజు స్నానం చేసేటప్పుడు ముఖం రుద్దుకుంటుంటే నా ఎడమచెవి ఖాళీగా ఉన్నట్లు గమనించాను. అంటే, చెవికి ఉండాల్సిన కమ్మ, మాటీ (చెవి రంధ్రం జారిందని మాటీ పెట్టుకుంటాను), మర ఏవీ లేవు. ఒక్కక్షణం నాకేమీ తోచలేదు. బాత్రూం అంతా చూశానుగానీ, ఏవీ కనిపించలేదు. 'సరే, నిద్రలో పక్కమీద పడివుంటాయేమో' అనుకొని స్నానం చేసి బయటకు వస్తూనే ముందు పక్కమీద చూశాను. బాబా దయవల్ల కమ్మ అయితే కనిపించిందిగానీ మిగిలినవి కనిపించలేదు. సరే, ముందు పూజ ముగించుకొద్దామని వెళ్లి పూజ చేసుకున్నాను. ఈలోపల తెల్లవారింది. మావారు నిద్రలేస్తే విషయం చెప్పి, 'ఒకసారి పక్క బాగా విదిలించి చూడమ'ని అన్నాను. అయన అలాగే చేశారు. కానీ, అవి కనిపించలేదు. నేను బాత్రూంలోకి వెళ్లి విప్పిన చీర బాగా విదిలించి చూశాను. కానీ ప్రయోజనం కనిపించలేదు. అప్పుడు ఇలా అనుకున్నాను: “బాబా! 'బంగారం, ఫైల్స్ ఏవైనా కనిపించకపోతే నీ బ్లాగులో పంచుకుంటామనుకోగానే అవి దొరికాయ'ని బ్లాగులో భక్తుల అనుభవాలలో చదివాను. వెంకటేశ్వరస్వామిని ఆపదమొక్కులవాడనీ, ఆయనకు మొక్కుకుంటే ఏ ఆపద నుంచి అయినా గట్టెక్కిస్తారనీ అంటారు. కానీ, నీకు పెద్ద పెద్ద మొక్కులేవీ అవసరం లేదు తండ్రీ. కేవలం ‘బ్లాగులో పంచుకుంటే చాల’ని భక్తుల అనుభవాలు చెప్తున్నాయి. నాకూ మాటీ, మర దొరికితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను సాయీ” అని. అలా అనుకుని మరోసారి బాత్రూంలోకి వెళ్లాను. అదివరకు ఎన్నిసార్లు, ఎంత జాగ్రత్తగా చూసినా కనిపించని మాటీ అక్కడే ఒక మూలన గోడకు ఆనుకొని కనిపించింది. ఆశ్చర్యంతో ‘ఇక మర మిగిలింది’ అని అనుకున్నాను. మా పనమ్మాయి వస్తే విషయం చెప్పి, "కొంచెం జాగ్రత్తగా చిమ్ము. మర చిన్నది కదా! కనిపిస్తుందేమో చూడు" అని అన్నాను. తను జాగ్రత్తగా చిమ్మి, "నాకు కనిపించలేదమ్మా" అని అంది. మావారు, "ఇంక ఆ విషయం మర్చిపో! మరే కదా, కొత్తది కొందాం" అన్నారు. అప్పుడు నా మనసులో ఎందుకో ఒక తలపు వచ్చింది, 'మర చిన్నది కదా! అది కనిపిస్తే మటుకు అది నీ అద్భుతమే సాయీ' అని. మరి అలా అనుకుంటే సాయి అద్భుతం చూపించకుండా ఉంటారా? బాత్రూంలో చీర ఉతికి, చీపురుతో బాత్రూం కడుగుతుంటే తలుపు వేసే చోట మూల నుండి మర బయటికి వచ్చింది. ఆనందంతో నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మర దొరికినందుకు కాదు, బాబా చూపిన అద్భుతానికి. "ధన్యవాదాలు బాబా. నీవు నీ పిల్లల మీద చూపించే కృప మాటలకు అందనిది తండ్రీ. ఈ అనుభవాన్ని పంచుకునే క్రమంలో ఏమైనా తప్పులుంటే క్షమించు సాయీ. నీ దయ, క్షమ, ప్రేమ మాకు జీవనాధారం ప్రభూ". చివరిగా, ఈ బ్లాగుననుసరించే సాయిబంధువులకు, బ్లాగును నిర్వహిస్తున్న సాయికి, సాయి బృందానికి సాయితండ్రి సంపూర్ణ కరుణాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ...
సాయి పాదదాసి.
ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. |
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha.
Om Sairam
ReplyDeleteSai always be with me