సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1382వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అందరి అంతరంగాలకు అధిపతి బాబా
2. మంచి జరిగితే అది బాబా వల్లనే

అందరి అంతరంగాలకు అధిపతి బాబా


ఓం సాయినాథాయ నమః!!! ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వాహకులకు మరియు సాయిబంధువులందరికీ సాయితండ్రి ఆశీస్సులు ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను. నా పేరు అనురాధ. మేము హైదరాబాదులో ఉంటాము. నాకు సర్వం సాయితండ్రే. నాకు ఎలాంటి సమస్య ఎదురైనా, అది చిన్నదైనా, పెద్దదైనా బాబాతో చెప్పడం అలవాటు. బాబా నాపై ప్రేమతో ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇంతకుముందు మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను.


నాకు పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలని కోరిక. ఎవరైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళివచ్చారని తెలియగానే, “బాబా! నాకెప్పుడు ఆ అవకాశాన్ని ఇస్తారో?” అని మనసులోనే అనుకునేదాన్ని. కానీ,  మా అత్తగారి కుటుంబంలోనివారు నాస్తికులు. అదృష్టవశాన మావారికి దైవంపై నమ్మకం ఉంది. కానీ మా అత్తగారి సమక్షంలో పూజ చేసినా, శిరిడీ వెళ్ళిన విషయం తెలిసినా విమర్శలు తప్పేవి కావు. కాబట్టి నాకు పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం ఉండేది కాదు. అందువల్ల, మా అక్కావాళ్ళ కుటుంబంతో కలిసైనా నేను పుణ్యక్షేత్రాలను దర్శించాలని మనస్సులో అనుకునేదాన్ని. 2022, దసరా తరువాత ఒకరోజు మా అక్క నాకు ఫోన్ చేసి, “మేము శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం దర్శించుకోవడానికి అక్టోబరు 8వ తేదీన బయలుదేరి వెళుతున్నామ”ని చెప్పింది. ఆ మాట వినగానే, “బాబా! నాకు కూడా వాళ్ళతో వెళ్లాలనిపిస్తోంది” అని మనస్సులో అనుకున్నాను. మా అక్కావాళ్లందరికీ టికెట్స్ బుక్ అయ్యాయి. అక్టోబరు 7న మా అక్కకూతురు నాకు ఫోన్ చేసి, “పిన్నీ, నేను కూడా అమ్మావాళ్లతో వెళుతున్నాను” అని చెప్పింది. అప్పుడు నేను తనతో, “నాకు కూడా మీతోపాటు రావాలనుంది, ఇంకా రెండు టికెట్స్ ఉన్నాయా?” అని అడిగాను. అంతే! బాబా అనుగ్రహంతో ఒక గంట వ్యవధిలో నాకు, మా బాబుకి టికెట్స్ బుక్ అవడం జరిగిపోయింది. అందరి అంతరంగాలకు అధిపతి అయిన బాబా తన బిడ్డలను నిరాశపరచరు కదా! సాయితండ్రి తన బిడ్డల మనోభీష్టాలను తీర్చడంలో సదా సిద్ధంగా ఉంటారు. అదీ తన బిడ్డలపై బాబా మాతృప్రేమ. అయితే, అది నెలసరి వచ్చే సమయమనే విషయం టికెట్స్ బుక్ అయిన తర్వాత నాకు గుర్తుకు వచ్చింది. కానీ ఎలా? నాకేమో వెళ్లాలనుంది. బిడ్డ తనకు సమస్య ఎదురైతే తన తల్లి దగ్గరకు ఎలా వెళుతుందో, అలాగే నేను బాబాను తలచుకున్నాను. “బాబా! నీకు అంతా తెలుసు తండ్రీ. పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం నాకు ప్రతిసారీ రాదు. నా పరిస్థితులను నీకంటే ఎవరూ అర్థం చేసుకోలేరు. నెలసరి సమస్య నన్ను ఇబ్బందిపెట్టకుండా, నాకు దివ్యమైన దర్శనాలను (అనుభూతిని) కలిగించి, క్షేమంగా హైదరాబాదు తిరిగివచ్చేలా దీవించు తండ్రీ” అని వేడుకుని, “నీ ఆశీస్సులతో అంతా చక్కగా జరిగితే నీవు నాపై చూపించే ప్రేమను సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటాను” అని బాబాకు మాట ఇచ్చాను. బాబా అనుగ్రహంతో ఎటువంటి ఇబ్బందీ లేకుండా పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాను. హైదరాబాదు తిరిగి వచ్చిన తర్వాతే నాకు నెలసరి వచ్చింది. బాబాకు మాట ఇచ్చిన ప్రకారమే బాబా ప్రేమను మీ అందరితో పంచుకుంటున్నాను.


మా బాబు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాస్తున్నప్పుడు, “మంచి మార్కులతో వాడిని పాస్ చేయించి, వాడిపై వాడికి నమ్మకాన్ని (ఆత్మవిశ్వాసాన్ని) పెంచేలా అనుగ్రహించమ”ని బాబాను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. బాబా ఆశీర్వాదం, తన కృషి ఫలితంగా 461/470 మార్కులతో మా బాబు అందరి ప్రశంసలందుకున్నాడు.


నేను, మా బాబు నిత్యం స్నానానంతరం బాబా ఊదీని నుదుటిపై ధరిస్తాము. బాబా ఊదీ మాకు సంజీవిని. మా ఇంట్లో ఎవరికి ఆరోగ్యం సరిగా లేకపోయినా మంచినీటిలో బాబా ఊదీ వేసుకుని సేవిస్తాము. ఆ క్రమంలో ఒకసారి ‘ఊదీ నిండుకోవడానికి ఇంకా ఎక్కువ రోజులు పట్టదు’ అనిపించింది. ఊదీ లేకపోతే నాకు ఏమీ తోచదు. ఎందుకంటే, బాబా ఊదీని నేను బాబా ఆశీర్వాదంగా భావిస్తాను. ఆ సమయంలో బాబా చరిత్ర సప్తాహపారాయణ చేస్తున్నాను. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీరు నా పారాయణను ప్రేమతో స్వీకరిస్తే, ఎవరితోనైనా శిరిడీ నుండి ఊదీని మీ ఆశీర్వాదంగా పంపించండి” అని కోరుకున్నాను. ఆ సమయంలో మా కజిన్ వాళ్లు శిరిడీ వెళ్ళారని తెలిసి ఆనందంతో ‘ఊదీ ప్యాకెట్ తెమ్మ’ని వారికి మెసేజ్ చేశాను. ఆ తరువాత నేను ఊరు వెళ్ళవలసి వచ్చింది. బాబా నన్ను ఊదీ తీసుకోవడం కోసమే ఊరికి పంపిస్తున్నారని అనిపించి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. కానీ అక్కడకు వెళ్ళిన తరువాత ఊదీ గురించి మర్చిపోయి, తిరిగి హైదరాబాదు వచ్చేశాను. తిరిగివచ్చిన తరువాత ఊదీ సంగతి గుర్తుకు వచ్చి, “బాబా, నేను పారాయణను శ్రద్ధగా చెయ్యలేదా? లేక, నాపై ప్రేమ లేదా? మరి ఊదీ సంగతి నువ్వు నాకు ఎందుకు గుర్తు చెయ్యలేదు?” అని బాధపడ్డాను. సరిగ్గా రెండు రోజుల తర్వాత మా అపార్టుమెంటులోని వారు శిరిడీ వెళ్ళొచ్చి, ఊదీతో పాటు బాబా ప్రసాదం కూడా మా ఇంటికి పంపించారు. ఆ క్షణం అద్భుతం! బాబా ప్రేమకు నా కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. అప్పుడు నేను అనుభవించిన బాబా ప్రేమను మాటలలో వివరించలేను. బాబాకు తన బిడ్డలపై ఉండే ప్రేమ అనంతం. ఆ ప్రేమమూర్తికి తెలుసు, ఏది ఎప్పుడు ఎలా మనకు ఇవ్వాలో. కానీ మనం కొన్ని సందర్భాలలో బాబా చెప్పిన మూలమంత్రం ‘శ్రద్ధ’, ‘సబూరి’ని పూర్తిగా మర్చిపోయి బాబాను నిందిస్తాము. “బాబా! నీ సచ్చరిత్రే మాకు భగవద్గీత. నువ్వు చెప్పిన బాటలో మమ్మల్నందరినీ నడిపించి మమ్మల్ని తండ్రికి తగ్గ బిడ్డలను చెయ్యి బాబా. ఇదే నా ప్రార్థన.” 


మనవి: బాబా ఎల్లప్పుడూ మన హృదయాలలో కొలువై మన ఆలోచనలను అన్నిటినీ గమనిస్తూనే ఉంటారు. అందుకే మనం కొన్ని విషయాలు బాబాను అడగకపోయినా మనకు మంచిదైతే అనుగ్రహిస్తారు. మనం బాబాను అడిగినా కొన్ని జరగకపోతే నిరాశపడకండి. అవి మనకు ఆ సమయంలో మంచివి కావని గుర్తుంచుకోండి. ‘మన ఆలోచనలలో దోషం ఉన్నా బాబాకు తెలుస్తుంది’ అని బాబా భక్తులు గుర్తుంచుకోవాలి. బాబా ప్రేమను ఆస్వాదించే ప్రతి భక్తుడు/భక్తురాలు బాబా చెప్పిన బాటలో నడవటం ఆయనపై మనకు గల ప్రేమను తెలియజేయడమేనని నా ప్రగాఢ విశ్వాసం. బాబా చెప్పిన బాటలో నడిచి, ఆ తండ్రికి తగ్గ బిడ్డలమవడమే మనం ఆయనకు ఇచ్చే విలువైన కానుక.


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


మంచి జరిగితే అది బాబా వల్లనే


నా పేరు కృష్ణవేణి. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, విజయదశమికి పది రోజులు ముందు మా అమ్మకి వాంతులు, విరోచనాలు అయ్యాయి. కళ్ళు కూడా పచ్చగా అయిపోయాయి. మాకు అనుమానం వచ్చి తెలిసిన ల్యాబ్‍లో టెస్ట్ చేయిస్తే, కామెర్లు అని రిపోర్టు వచ్చింది. వెంటనే హాస్పిటల్‍కి వెళ్తే, స్కానింగ్ చేసి, "బ్లాడర్‍లో స్టోన్స్ ఉన్నాయి. బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయింది. రెండు సర్జరీలు చేయాలి. మొదటి సర్గరీలో స్టోన్స్ తీసేసి, కామెర్లు తగ్గాక రెండో సర్జరీ చేసి బ్లాడర్ తీసేయాలి" అని చెప్పారు. సరేనని మేము అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. అమ్మని ఆపరేషన్ గదిలోకి తీసుకువెళ్లిన 30 నిమిషాల తర్వాత డాక్టర్ మమ్మల్ని ఆ గదిలోకి పిలిచి, "సర్జరీ కాలేదు. ఎండోస్కోపీ పైప్ లోపలికి వెళ్ళటం లేదు. నేను 30 నిమిషాల నుంచి ప్రయత్నిస్తున్నా పైపు బ్లాడర్ దగ్గరకి వెళ్లడం లేదు. బ్లడర్ దగ్గర ప్రాపిల్లా అని చిన్న భాగం ఉంటుంది. అది అందరికీ ఎడమ వైపు ఉంటే మీ అమ్మకి కుడివైపు ఉంది. దానివల్ల సర్గరీ కొంచెం క్రిటికల్ అవుతుంది. రెండు వారాల తరువాత రండి మళ్ళీ ప్రయత్నిస్తాను. అప్పుడు కూడా సర్జరీ చేయడం సాధ్యపడకపోతే పెద్ద సర్జరీ చేయాలి" అని అన్నారు. మాకు భయమేసి అమ్మని  వేరే హాస్పిటల్‍కి తీసుకెళ్లి చూపించాము. ఆ డాక్టర్ మందులిచ్చి ఒక వారం తరువాత రమ్మన్నారు. సరేనని వారం ఆగి వెళ్తే, మళ్లీ ఒక వారం ఆగి రమ్మన్నారు. ఇంతలో కామెర్లు ఎక్కువయ్యాయి. అయినా ఆ డాక్టర్ ఒక వారం ఆగమన్నారు. అలా రోజురోజుకు చికిత్స ఆలస్యమవుతుంటే మాకు టెన్షన్‍గా అనిపించింది. ఆ నెల రోజులూ నేను బాబాను, "అమ్మకి తొందరగా నయం కావాల"ని ప్రార్థిస్తుండేదాన్ని. చివరికి మా బంధువులు, తెలిసిన ఒక డాక్టర్ హైదరాబాద్ తీసుకుని వెళ్లామన్నారు. దాంతో మేము అమ్మను హైదరాబాద్ తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాము. 2022, అక్టోబర్ 27న హైదరాబాద్ వెళ్తామనగా ముందురోజు నేను, "బాబా! మీదే భారం. మీ దయతో అమ్మకి నయం కావాలి. తనని కాపాడండి. అమ్మ ఆపరేషన్ విజయవంతమైతే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని గట్టిగా బాబాను ప్రార్థించాను. ఆ మర్నాడు మావాళ్లు అమ్మను హైదరాబాదులోని AIG హాస్పిటల్‍కి తీసుకెళ్లారు. వాళ్ళు మా దగ్గర ఉన్న రిపోర్టులు చూసి పరిస్థితి విషమంగా ఉందని మళ్లీ ఏ టెస్టులు చేయకుండా గంటలో సర్జరీ చేసారు. అలా వెంటనే ఆపరేషన్ చేస్తారని మేము అస్సలు అనుకోలేదు. ఆరోజు గురువారం కావడం, ఆపరేషన్ జరిగి విజయవంతమవడం బాబా చేసిన అద్భుతం. డాక్టరు కొన్ని రోజుల తరువాత బ్లాడర్  తొలిగిద్దామని చెప్పారు. "అమ్మని ఈ కష్టం నుంచి కాపాడినందుకు, నన్ను, నా కుటుంబాన్ని అన్ని సమస్యల నుంచి కాపాడుతున్నందుకు మీకు కోటికోటి కృతజ్ఞతలు బాబా. ఇంకా అమ్మ బ్లాడర్ తీసివేయాల్సి ఉంది. అది కూడా మీరే ఏ సమస్య లేకుండా జరిపించండి బాబా. నాకు ఏదైనా మంచి జరిగితే అది మీ వల్లనే తండ్రి. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు".



3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Baba nenu ante miku istam ledha sai nenu anubhvanni psmchukune adhristam ledha said 😪

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo