- శ్రీసాయి అనుగ్రహ లీలలు - పదహారవ భాగం
సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.
దైవ దర్శనాలు - తీర్థయాత్రలు :
ఒకసారి నా భార్య బాబాయ్ స్వామి ఉత్తర భారత దేశ యాత్రకు వెళ్లడానికి నాకు, నా భార్యకు టిక్కెట్లు రిజర్వేషన్ చేయించారు. కాని బాబా నాకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే, బాబాకు భవిష్యత్తు తెలుసు, మా ఇంట్లో నేను తప్పనిసరిగా ఉండవలసిన పరిస్థితి ఉంది గనుక. అదేమిటంటే, నా భార్య వెళ్ళిన రోజు నుండి రెండు రోజులు ఆగకుండా పెద్ద వర్షం కురిసింది. నీళ్ల కోసం మోటరు ఆన్ చేస్తే, ఒక నిమిషం పనిచేసి ఆగిపోయింది. పాతికేళ్లలో అలా ఎప్పుడూ జరగలేదు. ఫ్యూజు పోయిందేమోనని చూస్తే, బాగానే ఉంది. కానీ మోటార్ చాలా వేడెక్కిపోయింది. ఎలక్ట్రీషియన్‍ని పిలిచి చూపిస్తే, లోపల వైర్లు కాలిపోయాయి అని తెలిసి వెంటనే బాగు చేయించాను. నేను యాత్రకి వెళ్లి ఉంటే అద్దెకున్న వారు మోటార్ వేసినప్పుడు వైర్లు కాలి ఏదైనా ప్రమాదం జరిగేదేమో! వాళ్ళు ఇబ్బంది పడేవారేమో! అందుకే బాబా నన్ను యాత్రకి వెళ్ళకుండా ఆపి, ప్రమాదం జరగకుండా కాపాడారు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఒకసారి ఇలాగే మా ప్రక్క ఇంట్లో వైర్లు కాలి ప్రమాదం జరిగింది. కానీ మనకు బాబా ఉన్నారు కదా!
ఒకసారి నాకు, నా భార్యకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం వచ్చింది. కానీ ఇద్దరమూ యాత్రకు వెళ్తే ఇంట్లో బాబా పూజ ఎలాగని నేను వెళ్ళకుండా ఆగిపోయాను. అందువలన నా భార్య మాత్రమే ఆ తీర్థయాత్రకు వెళ్ళింది. అప్పుడొక గురువారం నాటి ఉదయం నేను యధావిధిగా ఆవుపాలతో బాబాకి అభిషేకం చేసి పూజ చేశాను. అదే రోజు నా భార్య తన యాత్రలో భాగంగా శిరిడీలో బాబా దర్శనం చేసుకుంది. ఆమె అక్కడ ధూప్ హారతికి హాజరవ్వగా, నేను ఇక్కడ ఇంట్లో భక్తి టీవీలో ప్రసారమయ్యే ధూప్ హారతి చూసాను. మామూలుగా భక్తి టీవీలో పాత సిడిలు ప్లే చేసి బాబా హారతులు ప్రసారం చేస్తుంటారు. కానీ ఆ రోజు శిరిడీ నుండి ధూప్ హారతి ప్రత్యక్ష ప్రసారమైంది. అలా నాకు, నా భార్యకు ఒకే సమయంలో ధూప్ హారతి వీక్షించే భాగ్యాన్ని బాబా ప్రసాదించారు. ఇంకోసారి నా భార్య తన యాత్రలో భాగంగా గుజరాత్‍లోని ద్వారకలో ఉన్న శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళింది. సరిగ్గా అదే సమయానికి ఇంట్లో ఉన్న నాకు టీవీలో అదే మందిరంలోని పూజా విధానమంతా కళ్ళకు కట్టినట్లు చూపించారు బాబా. మరోసారి యాత్రలో భాగంగా చార్‍ధామ్, కాశీ, శిరిడీ, అయోధ్య మొదలైన ప్రదేశాలను నా భార్య దర్శించిన అదే సమయంలో బాబా నాపై కృపతో నా కళ్ళకు కట్టినట్టు టీవీలో ఆయా క్షేత్ర దర్శనాలు చేయిస్తుండేవారు. నిజమైన సాయి భక్తులకు సాయే 33 కోట్ల దేవతలు, దేవుళ్ళు, సకల పుణ్యక్షేత్రాలు. అందుకే 'శిరిడీయే మా పండరిపురము' అన్నారు అప్పటి పెద్దలు. అది ముమ్మాటికీ సత్యం. "వందనం సాయిదేవా!".
2013లో నేను, నా భార్య, మనవడు ముగ్గురం కలిసి మధురై, కన్యాకుమారి, రామేశ్వరం యాత్రకు వెళ్ళాము. కన్యాకుమారిలో మధ్యాహ్నం కొన్ని దేవాలయాలు చూసిన తర్వాత, “బాబా! ఈరోజు గురువారం కదా, నీ దర్శనం ఇప్పించావా?" అని మనసులో అనుకున్నాము. తరువాత అన్నీ చూసుకుని బస్సు ఎక్కబోతుండగా మాకు బాబా హారతి వినిపించింది. అంతే, మేము డ్రైవర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా, "ఇప్పుడే వస్తామ"ని చెప్పి హారతి వినిపిస్తున్న వైపు వెళ్ళాము. అక్కడ ఒక బాబా మందిరం ఉంది. లోపలికి వెళ్ళి హారతి అయ్యేదాకా ఉండి, ప్రసాదం తీసుకుని వచ్చాము. మనసులో అనుకోగానే బాబా తమ దర్శనం ఎలా ఇప్పించారో చూశారా!
2015లో మేము విజయవాడ శ్రీకనకదుర్గమ్మ దర్శనానికని పాత మెట్ల దారి గుండా కొండెక్కాము. తీరా పైకి వెళ్ళాక అక్కడి సెక్యూరిటీ గార్డు, “మీరు ఇలా దర్శనానికి వెళ్లడానికి వీలులేదు. క్యూలైన్‍లో రావాలి” అని అన్నాడు. అతని ప్రక్కనున్న పూజారి కూడా అలాగే అన్నారు. ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు. క్యూలైనులోకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి చాలా దూరం నడవాలి. కానీ మేము అలవాటులేని కారణంగా మెట్లు ఎక్కి బాగా ఆయాసపడుతున్నాము. పైగా కాళ్లు బాగా లాగుతున్నాయి. మాకు ఏం చేయాలో తోచక, "సహాయం చేయమ"ని బాబాని తలుచుకుని ఒక్క నిమిషం అక్కడే నిలబడ్డాము. అంతలో ప్రక్క గదిలో నుండి ఆ ఆలయ అధికారి ఒకరు బయటికి వచ్చి, మమ్మల్ని చూసి, విషయం తెలుసుకుని, ఒక వ్యక్తిని పిలిచి, “వీళ్ళని తీసుకెళ్లి, నేను చెప్పానని చెప్పి, నేరుగా అమ్మవారి దర్శనం చేయించు" అని అతనితో మమ్మల్ని పంపి అమ్మవారి దర్శనం చేయించారు. తరువాత వెంట వెంటనే మేము మరో రెండుసార్లు అమ్మవారిని దర్శించుకున్నాము. 2016లో ఇంకోసారి మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. అప్పుడు మేము ఉచిత దర్శనం లైనులో వెళ్తుంటే, ఓ చోట ఒక వ్యక్తి ప్రక్కనున్న చిన్న గేటు తీసి మమ్మల్ని వంద రూపాయల లైనులో నుండి పంపించాడు. మేము అమ్మవారిని దగ్గరగా, తృప్తిగా దర్శించుకున్నాము. పై రెండు సందర్భాలలో ఆయా వ్యక్తుల రూపంలో చాలా సులభంగా అమ్మవారి దర్శనం మాకు చేయించింది బాబానే.
ఒకసారి మేము మైసూరు శ్రీచాముండేశ్వరి గుడికి వెళ్ళాము. మేము వెళ్లిన బస్సువాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకుని రావడానికి ఒక గంట సమయమే ఇచ్చారు. ఆ గుడి కొండ మీద ఉంటుంది. పైగా దర్శనానికి చాలా జనం ఉన్నందువల్ల చాలా సమయం పట్టేటట్లు ఉంది. అందువల్ల 'అమ్మవారి దర్శనం చేసుకోకుండా తిరిగి ఎలా వెళ్ళడం?' అని బాబాని ప్రార్ధించి, గుడి ప్రాంగణంలో ఒక ప్రక్కన నిల్చున్నాము. అంతలో ఎవరో ఒక వి.ఐ.పి. దర్శనానికి వచ్చారు. వారిని గర్భ గుడి వరకు తీసుకుని వెళ్తుంటే, వారితో పాటు మమ్మల్ని కూడా అక్కడున్న సెక్యూరిటీ గార్డు లోపలికి పంపించాడు. బాబా దయవల్ల ఆ వి.ఐ.పితో పాటు మేము అమ్మవారిని దగ్గరగా దర్శించుకుని, పూజ చేయించుకుని అరగంటలోనే బస్సు దగ్గరకు తిరిగి వచ్చాము.
2016, మే నెల చివరిలో నా భార్య బాబా అనుమతి తీసుకుని కొంతమందితో కలిసి నెలరోజులు ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళింది. ఆ యాత్రలో భాగంగా వాళ్ళు 29వ తేదీన హరిద్వార్ చేరుకున్నారు. వాళ్లలో కొంతమంది వాళ్లలోవాళ్లే మాట్లాడుకుని కేదార్‌నాథ్, బద్రినాథ్ కూడా దర్శిద్దామని నిర్ణయించుకుని, స్వెటర్లు సిద్ధం చేసుకుని బయలుదేరుతున్నారు. భక్తిప్రపత్తులు గల నా భార్య కూడా వాళ్లతో కలిసి కేదార్‌నాథ్ వెళ్ళాలనుకుంది. అయితే ఆ విషయంలో తనకు బాబా అభిప్రాయం కూడా తెలుసుకోవాలనిపించి, నాకు ఫోన్ చేసి ‘బాబాను అడగమని చెపుదామనుకుని’ నాకు ఫోన్ చేసింది. కానీ నా ఫోన్ కలవలేదు. తను దాదాపు 10-15 సార్లు ప్రయత్నించాక ఫోన్ ఎంతకీ కలవట్లేదని ప్రక్కనున్న ఇద్దరు, ముగ్గురిని ఫోన్లు అడిగి, ఆ ఫోన్లతో నాతో మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. కారణం ఆ సమయంలో నాకెందుకో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయాలనిపించి, స్విచ్చాఫ్ చేశాను. నిజానికి మేము రోజూ 2, 3 సార్లు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. సరే, అందరూ బయలుదేరి వెళ్ళిపోయాక నా ఫోన్ కలిసింది. నా భార్య నాతో విషయం చెప్పాక నేను తనతో, "ఇది బాబా లీల. వద్దంటే నువ్వు బాధపడతావని, ఒకవేళ వెళ్ళమంటే నువ్వు అక్కడ కష్టపడతావని, నిన్ను కష్టపెట్టకూడదని, నిన్ను పంపడం ఇష్టంలేని బాబా అసలు ప్రశ్న అడగకుండా చేశారు" అని అన్నాను. ఆ తర్వాత ఒక గంటకి చార్‌ధామ్‍లో వరదలు అని, తెలుగువారు కష్టాలు పడుతున్నారని టివిలో వార్తలు వచ్చాయి. అదే విషయం నేను నా భార్యకు ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు ఆమె, "బాబాకు భవిష్యత్తు తెలుసు కనుక నన్ను వెళ్ళకుండా ఆపారు. వెళ్ళినవాళ్ళు సగం దూరం నుండే తిరిగి వస్తున్నారు" అని చెప్పింది. అలా సమయం, డబ్బు వృధా కాకుండా, ఆపదలో చిక్కుకోకుండా బాబా నా భార్యను రక్షించారు. అంతేకాదు మరుసటి సంవత్సరం బాబా నా భార్య చేత గంగోత్రి, యమునోత్రి, శ్రీకేదార్నాథ్, శ్రీబద్రీనాథ్ యాత్రలు ఏ ఇబ్బందీ లేకుండా చేయించారు.
2016లో నా భార్య మొట్టమొదటిసారి కాశీ వెళ్ళి ఉదయాన్నే శ్రీవిశ్వేశరుని దర్శించుకుంది. దర్శనానంతరం బయటికి వస్తుండగా ఎవరి ద్వారానో 'ఉదయం 4 నుండి 4-30 వరకు మన స్వహస్తాలతో శివలింగాన్ని తాకి నమస్కరించుకోవచ్చు' అనే విషయం తెలిసింది. దాంతో నా భార్య, "అయ్యో! ఒక గంట ముందే వచ్చి ఉంటే బాగుండేది. స్పర్శ దర్శనం చేసుకునేదాన్ని" అని ఆ రోజంతా బాధపడింది. ఇలా ఉండగా మరుసటిరోజు తెల్లవారుఝామున 3 గంటలకు అయోధ్య, ప్రయోగ వెళ్ళాలని కొందరు బస్సు మాట్లాడుకున్నారు. నా భార్య కూడా వాళ్లతో వెళ్లాలని అనుకుని, మరుసటిరోజు అందరికన్నా ముందే తయారై, క్రిందకు వచ్చి ఆ కాంపౌండులోనే ఉన్న చిన్న శివుని గుడిలో కూర్చుని వాళ్ళకోసం ఎదురు చూసింది. కానీ ఎవరూ గదుల్లో నుండి బయటికి రాలేదు. అంతలో బాబా దయవల్ల నా భార్యకి, “ఇప్పుడే కాశీ విశ్వనాథుని స్పర్శ దర్శనానికి వెళ్ళి, క్యూలైన్‍లో నిలబడితే, శివలింగాన్ని తాకి నమస్కరించుకోవచ్చు కదా!' అని ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తను గేటు వద్దకు వెళ్ళి, "గేటు తీయమ"ని, వాచ్మెన్‍ని అడిగింది. అందుకతను, “ఈ సమయంలో ఒక్కరే ఎలా వెళ్తారు? నేను గేట్ తీయను" అని అన్నాడు. నా భార్య తన మనసులో, 'ఒక్కదాన్నే ఏమిటి, బాబా తోడు ఉన్నారుగా' అని అనుకుని, అతన్ని మళ్ళీ, “గేటు తీయమ”ని అడిగింది. కానీ అతను హిందీలో, “ఎవరినైనా తోడు తెచ్చుకోండి" అని తాళం తీయలేదు. నా భార్యకు ఏమి చేయాలో పాలుపోలేదు. వివరంగా అతనికి చెప్పాలంటే, తనకి హిందీ రాక, 'ఇప్పుడెలా?' అని అనుకుంది. రెండు నిమిషాల్లో ఒక గది తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరు ఆడవాళ్ళు బయటికి వచ్చి గేటు దగ్గరకు వచ్చారు. నా భార్య వాళ్ళని, “గుడికి వెళ్తున్నారా?” అని అడిగింది. వాళ్ళు “అవునని” చెప్పడంతో వాచ్‍మెన్ గేటు తీయడం, ముగ్గురూ కలిసి గుడికి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకోవడం జరిగాయి. అయితే వీళ్ళు గుడికి వెళ్లిన అరగంటకి అయోధ్య, ప్రయోగ వెళ్లే వాళ్ళందరూ బస్సులో వెళ్లిపోయారు. గుడి నుండి వచ్చాక నా భార్యకి ఆ విషయం తెలిసినా తను వెళ్ళలేకపోయానని బాధపడకుండా, 'అంతా నా మంచికే జరిగింది. వాళ్ళతో వెళ్లుంటే స్పర్శ దర్శన భాగ్యం నాకు దక్కేది కాదు కదా' అని ఆనందంతో బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుంది. తర్వాత రోజు నా భార్య నాకు ఫోన్ చేసి, "ఆడవాళ్లు పితృకార్యం చేయవచ్చా అని బాబాని అడిగి, సమాధానం నాకు చెప్పండి" అని అడిగింది. నేను బాబాని అడిగితే, “చేయవచ్చు” అని సమాధానం వచ్చింది. నేను ఆ విషయం నా భార్యకి చెప్తే తను కొంతమందితో కలిసి గంగ నది తీరాన ఉన్న ఒక ఘాట్ వద్దకు వెళ్ళి, పితృకార్యం చేసింది.
తర్వాత నా భార్య శ్రీవిశ్వేశ్వరుని దర్శించుకుని అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక మఠంలో కోటి శివలింగాలు ఉన్నాయని తెలిసి అచ్చటికి వెళ్ళింది. అక్కడ తను తన చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్ళి అరగంట తర్వాత బయటికి వచ్చి చూస్తే చెప్పులు కన్పించలేదు. కొత్త చెప్పులు కావడంతో తను వాటికోసం చాలాసేపు వెతికింది. కానీ అవి కన్పించలేదు. దాంతో నా భార్య, "బాబా! బాగా ఎండగా ఉంది. కాళ్ళు కాలుతున్నాయి. కొత్త చెప్పులు కొనుక్కుంటే, అవి కూడా వేరే చోట పోవచ్చు, నేను ఇంకా ఈ కాశీలో వారం రోజులు ఉండాలి" అని అనుకుని తన రూముకు వెళ్ళిపోయింది. మరుసటిరోజు తను ఏదో గుడికి వెళ్ళి, దర్శనమయ్యాక, బయటికి వచ్చి ఆటో మాట్లాడుకుని తానుండే రూముకి బయలుదేరింది. ఆటోవాడు ఆటోని తిన్నగా ముందురోజు చెప్పులు పోయిన మఠం ముందుకి తీసుకెళ్లి ఆటో అపి నా భార్యని దిగమన్నాడు. "ఇదేంటి, మా రూము ఇక్కడ కాదు. నువ్విక్కడ ఆటో అపావేంటి?" అని నా భార్య ఆ ఆటోవాడిని అడిగింది. వాడు హిందీలో ఏదో చెప్పాడు. వాడికి తెలుగు రాదు, ఈమెకు హిందీ అంతగా రాదు. ఒకరు చెప్పేది ఒకరికి అర్ధంకాక నా భార్య ఆ ఆటోవాడికి డబ్బులిచ్చి ఆటో దిగేసింది. అంతలో తనకి, “ఏదో కారణం లేనిదే బాబా ఈ మఠం ముందే ఎందుకు ఆటో ఆపిస్తారు. లోపల చెప్పులున్నాయేమో!” అనిపించి లోపలికి వెళ్ళి చూస్తే, ముందురోజు అంతసేపు వెతికినా కనబడని చెప్పులు ఒక్క సెకనులో కన్పించాయి. తరువాత తను, 'ఇన్ని యాత్రలు చేసినా ఎక్కడా పోని చెప్పులు, ఇక్కడే పోయాయంటే ఏదో కారణం ఉండే ఉంటుంది' అని ఆలోచిస్తుంటే, 'కాశీలో చెప్పులు వేసుకుని నడవకూడదు' అనే విషయం గుర్తొచ్చి, "థాంక్యూ బాబా" అని మనసులోనే బాబాకి చెప్పుకుని ఆ చెప్పులు కవరులో పెట్టుకుని తన రూముకి వెళ్ళింది. మనం ఎంత దూరం వెళ్ళినా బాబా కృపాదృష్టి మనపై ఉండి తీరుతుంది.
కాశీలో శ్రీవిశ్వేశ్వరుని దర్శనమయ్యాక మొత్తం వందమంది రిజర్వేషన్ చేయించుకుని ట్రైన్‍లో ఉదయం ఆరు గంటలకు మన్మాడ్ చేరుకున్నారు. అప్పటికే శిరిడీ వెళ్ళే రైలు వేరే ప్లాట్‍ఫారం నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. టిక్కెట్లు తీసుకుని ఆ రైలు ఎక్కుదామంటే టికెట్ కౌంటర్ వద్ద క్యూలైన్ చాలా ఉంది. ఆ రోజు గురువారం కావడంతో నా భార్య త్వరగా శిరిడీ చేరుకుని బాబా దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో పక్కనున్న వారితో, "నేను ఈ రైలులో శిరిడీ వెళ్ళి త్వరగా బాబా దర్శనం చేసుకుంటాను” అని చెప్పి టికెట్ లేకుండానే గబగబా ఒక బోగి లోకి ఎక్కేసింది. తన వెనకే మరో నలుగురు ఆడవాళ్ళు కూడా ఎక్కేసారు. అంతే రైలు బయలుదేరింది. కంగారుగా ఇంకో ఆరుగురు ఆడవాళ్లు వేరే బోగీలో ఎక్కారు. మిగిలిన వాళ్ళంతా ఆ రైలు తప్పిపోయి ఎక్కువ డబ్బులిచ్చి వ్యాన్‍లో శిరిడీకి బయలుదేరారు. నా భార్య ఒక సీటులో కూర్చుని, “బాబా! మీరే నన్ను క్షేమంగా శిరిడీ చేర్చి, మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి" అని వేడుకుంది. అయితే టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం. కాబట్టి నా భార్య, తనతో ఉన్న నలుగురు టీసీ వస్తే జరిమానా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ టీసీ వాళ్ళ వద్దకు రాలేదు. వాళ్లలో బాబాను త్వరగా దర్శించాలనే తపన తప్ప ఏ స్వార్ధం లేదు. అందుకే బాబా వాళ్ళను పైసా ఖర్చు లేకుండా, ఏ ఇబ్బందీ లేకుండా శిరిడీ చేర్చారు. ఇకపోతే ప్రక్క బోగీలో ఎక్కిన ఆరుగురికీ ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున టీసీ జరిమానా విధించాడు. వాళ్ళు ముందుకు, వెనుకకూ ఊగిసలాడారు కాబట్టి వారికి జరిమానా పడింది. బాబా విషయంలో నమ్మకం ముఖ్యం. కళ్ళు మూసుకుని నీళ్ళల్లో దూకమన్నా, దూకడానికి సిద్ధంగా ఉండాలి.
తరువాయి భాగం వచ్చేవారం...
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam
ReplyDeleteOme sri sai nathaya namaha
ReplyDeleteOme sri sai nathaya namaha🙏🙏🙏🙏🙏
ReplyDelete