- శ్రీసాయి అనుగ్రహ లీలలు - పదిహేనవ భాగం
సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.
మా మనవడు సాయీష్ పంచెల మహోత్సవం: 2019, ఫిబ్రవరి 10వ తారీఖున శ్రీపంచమి వచ్చింది. అప్పటికి ఒక నెల రోజుల ముందు మా అమ్మాయి మాకు ఫోన్ చేసి, “సాయీష్‍కు పంచెల మహోత్సవం చేద్దామా? తాతయ్య(మా నాన్నగారు) ఎటూలేడు, అమ్మమ్మకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఎప్పుడో ఫంక్షన్ చేసే బదులు అమ్మమ్మ ఉన్నప్పుడే చేస్తే మంచిదనిపిస్తోంది. శ్రీపంచమినాడు జరిపించడానికి బాబా అనుమతి ఇస్తారేమో బాబాను అడిగి ఏ విషయమూ నాకు ఫోన్ చేసి చెప్పండి" అని అంది. వెంటనే మేము బాబాను అడిగితే, ఫంక్షన్ చేయడానికి అనుమతించారు. మేము ఆ విషయం మా అమ్మాయికి ఫోన్ చేసి చెప్పి ఆ రోజే ఫంక్షన్ చేయడానికి నిర్ణయించాము. అప్పుడు, "బాబా! మాకు పెద్దగా ఏమీ తెలియదు. అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళు లేరు. ఇంత త్వరగా అంటే డబ్బులు సమకూరడం కూడా కష్టమే. మొదలునుండి తుదివరకూ అన్నీ మీ దయతో సక్రమంగా జరిగేలా చూడు తండ్రి” అని బాబాకు చెప్పుకుని ఫంక్షన్‍కి సంబంధించిన పనులు మొదలుపెట్టాము. ముందుగా కార్డులు ప్రింటింగ్‍కి ఇద్దామని వెళ్ళాము. కానీ వాళ్ళు చూపే మోడల్స్ మాకు పెద్దగా నచ్చలేదు. మఖమల్ క్లాత్ మీద స్క్రీన్ ప్రింటింగ్ అయితే బాగుంటుందని, అదీకాక తాళపత్రంలా చుట్టేది కావాలని షాపుల్లో ఆడుతుంటుంటే మాకు కావాల్సిన విధంగా దొరకడం లేదు. షాపులన్నీ తిరిగి తిరిగి అలసిపోయాము. అటువంటి సమయంలో మా విద్యార్థి ఒకరు వచ్చి, ఒక షాపుకు తీసుకెళ్ళి, అన్నీ మాట్లాడి, సెటిల్ చేసి వెళ్ళిపోయాడు. ఆ విద్యార్థి రూపంలో బాబానే వచ్చి మొదటి పని పూర్తి చేసి పెట్టారని మా నమ్మకం. ఆ మోడల్ అందరికీ బాగా నచ్చింది. కొంతమందైతే వాళ్ళింట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అలాంటివే వేయించాలని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. మరి బాబా ప్రసాదించిన మోడల్ కదా!
మేము ఫంక్షన్ బాబా గుడిలోనే చేయాలనుకుని, మేము తరచూ వెళ్ళే చేబ్రోలులోని బాబా గుడి అయితే బాగుంటుందనుకున్నాం. కానీ బాబాను అడిగితే, 'అక్కడ వద్ద'ని, 'గుంటూరు హౌసింగు బోర్డు కాలనీలోని సాయిబాబా గుడిలో చేయమ'ని సమాధానమిచ్చారు. సరేనని అక్కడికి వెళ్ళాము. ఆ గుడి యాజమాన్యం, "ఆ రోజుకు వేరే ఏ ఫంక్షనూ బుక్ అవలేదు. ఖాళీగానే ఉంది" అని చెప్పారు. దాంతో అతి తక్కువ ఖర్చుతో ఫంక్షన్ హాల్ మా పేరు మీద బుక్ చేసాము. గుడి తరపున టెంట్ హౌస్, లైటింగు, పనివాళ్ళు అన్ని చాలా తక్కువ ఖర్చులో కుదిరిపోయాయి. మా అమ్మాయి పెళ్ళి ఆ గుడిలోనే జరిగింది. ఇప్పుడు వాళ్ళబ్బాయి పంచెల ఫంక్షన్ కూడా అక్కడే జరగడం బాబా దయ.
ఇక డెకరేషన్ విషయానికొస్తే, గుడి తరపున వ్యక్తి మాత్రమే డెకరేషన్ చేయాలి, బయటివాళ్ళని అనుమతించమని చెప్పడంతో వాళ్ళకే ఇరవైరోజుల ముందు అడ్వాన్స్ ఇచ్చాను. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా డెకరేషన్ చేసే అతను మమ్మల్ని కలవలేదు. బాబా ఏదో కారణం వల్ల అతన్ని ఆపి ఉంటారు అనుకున్నాము. చివరికి ఫంక్షన్ రేపనగా ముందురోజు రాత్రి అతను వచ్చి, “లక్ష రూపాయలు అవుతుంది డెకరేషన్‍కి” అని అన్నాడు. “బాబోయ్.. అంతా” అనుకోని ఉరుకున్నాము. బాబా మరొకర్ని పంపించి, 35 వేల రూపాయలకే చక్కగా డెకరేషన్ చేయించారు. సాయీష్ కూర్చోవడానికి మంచి సోఫా కూడా అతను ఏర్పాటు చేసాడు. బాబా దయవల్ల గుడి కమిటీ వాళ్ళెవరూ అభ్యంతరం చెప్పలేదు.
ఇకపోతే, అందర్నీ ఫంక్షన్‍కి ఆహ్వానించే విషయం: పదవ తారీఖు ఫంక్షనైతే 5వ తారీఖున 'కార్డులిచ్చి ఆహ్వానించడానికి వెళ్ళవచ్చా?' అని బాబాను అడిగితే, 'వద్దు' అని బదులిచ్చారు. సరేనని ఆరవ తారీఖున మళ్ళీ బాబాను అడిగాము. అప్పుడూ 'వెళ్ళ వద్ద'నే సమాధానం వచ్చింది. ఏడవ తారీఖు గురువారం. ఆ రోజు వెళ్ళడానికి బాబా అనుమతిస్తారని అనుకున్నాము. కానీ ఆ రోజు కూడా బాబా అనుమతించలేదు. దాంతో బంధువులు, “ఫంక్షన్‍కింకా రెండు రోజులే ఉన్నాయి. చాలా పనులున్నాయి. అవెప్పుడు చేస్తారు? ఎప్పుడు ఆహ్వానిస్తారు?" అని అనసాగారు. కానీ మేము తొందరపడకుండా బాబా అనుమతికోసం నిరీక్షించాము. మరుసటిరోజు 8వ తారీఖున బాబా అనుమతి లభించడంతో ఉదయం 7గంటలకే బయల్దేరి ముందుగా ఫంక్షను అనుకున్న హౌసింగ్ బోర్డు కాలనీలోని బాబా మందిరానికి వెళ్ళి, మొదటి కార్డు బాబా ముందుంచి ఆయనను ఆహ్వానించాము. తరువాత తీర్థప్రసాదాలు స్వీకరించి, పిలుపులకు వెళ్లి నాలుగు ఊళ్ళలో ఉన్న బంధువులందర్ని ఫంక్షనుకు ఆహ్వానించి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాము. ఏ మాత్రము అలసట అనిపించలేదు. అంతా బాబా దయ. "ధ్యాంక్యూ బాబా".
ఇకపోతే ఫంక్షనుకు వచ్చే మా అల్లుడుగారి స్నేహితులు, దూరం నుండి వచ్చే బంధువులకోసం హోటల్లో రూములు బుక్ చేయాలనుకుంటే మంచి హోటల్లో రూమ్ రెంట్ రోజుకు రూ. 4,000/- వరకూ ఉంది. పైగా అవి గుడికి బాగా దూరంగా ఉన్నాయి. పొరపాటున ఏదైనా మర్చిపోతే అంతదూరం వెళ్లాల్సి వస్తుంది. పోనీ గుడికి దగ్గరలో తీసుకుందామంటే మంచి రూమ్స్ లేవు. మరెలా అనుకుంటుండగా బాబానే పరిష్కారం చూపారు. ఎలాగంటే, గుడికి దగ్గరలో వరసకు అన్నయ్య అయ్యే ఒకతనికి ఫోన్ చేసి ఫంక్షనుకు ఆహ్వానిస్తూ మాటల మధ్యలో రూములు కావాలని చెప్తే, “ఒక డూప్లెక్స్ హౌస్ ఉంది, ఫంక్షన్లకు మాత్రమే అద్దెకు ఇస్తారు. చాలా బాగుంటుంది. పైగా గుడికి చాలా దగ్గరలో ఉంటుంది. వచ్చి చూసి, మాట్లాడుకోండి” అని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్ళాము. ఆ రూములు చాలా చాలా బాగున్నాయి. మేము మూడు రోజులకు కావాలంటే అద్దె సగానికి సగం తగ్గించి మరీ ఇచ్చారు. అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. బుక్ చేసుకుంది మూడు రోజులకే అయినా నాల్గవ రోజు కూడా ఇల్లు వాడుకుని, ఐదవరోజు ఖాళీ చేసాము. వాళ్ళు ఒక రూపాయి కూడా అదనంగా తీసుకోలేదు. అలా బాబా హోటల్ రూములకి బదులు తక్కువ ఖర్చులో మంచి డూప్లెక్స్ హౌస్ ఇప్పించారు. ఇదంతా బాబా దయకాక మరేమిటి?
మా ఇళ్ళల్లో ఏ ఫంక్షనైనా చలిపిండి (చలిమిడి) చేసి అందరికీ గిఫ్ట్ ప్యాక్‍లో వేసి పంచుతాము. అయితే అది చేయడం నా భార్యకు అస్సలు రాదు. ఆ విషయంలో "ఎవరిని సహాయం అడగాలి?" అని బాబాను అడిగితే ఒకరి పేరు సూచించారు. వాళ్ళకు ఫోన్ చేసి విషయం చెబితే, మామూలు బియ్యంతో చేస్తే, అంత రుచిగా ఉండదని ఆరు కేజీలు స్టోర్ బియ్యం వాళ్ళ ఇంట్లో ఉంటే పంపించారు. ఆ బియ్యం ఒక రోజంతా నానిన తర్వాత మర పట్టించాలి. కానీ చలిమిడి చేసేదెవరని నా భార్య ఆలోచిస్తుంటే, "చలిమిడి చేయటానికి ఎవర్నో ఒకర్ని పంపిస్తాలే, ధైర్యంగా నా మీద భారం వేసి బియ్యం నానబెట్టు" అని లీలగా ఆమెకు వినిపించింది. దాంతో సమయానికి బాబా ఎవరో ఒకరిని పంపిస్తారులే అనుకుని నా భార్య ధైర్యంగా ఉంది. రెండు రోజుల తర్వాత పిండి సిద్ధం చేసిన అరగంటలో ఊరి నుండి నా భార్య పిన్ని (సాయీష్ వాళ్ళ నాయనమ్మ) వచ్చింది. నిజానికి మరుసటిరోజే ఫంక్షన్ కాబట్టి ఆమె వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే, వాళ్ళ ఇంట్లో తనకి కూడా ఫంక్షన్‍కి సంబంధించిన పనులుంటాయి. అలాంటిది ఆమె వచ్చి చలిపిండి తయారుచేసి వెళ్ళింది. లేకపోతే ఆ బియ్యం అంతా వృధా అయిపోయేది. నా భార్య బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంది. చలిమిడి చాలా రుచిగా ఉందని బంధువులు అంటే, చల్లని బాబా దయ అన్నాము మేము.
ఇక స్వీట్ విషయానికొస్తే, గిఫ్ట్ ప్యాక్‍లో చలిమిడితోపాటు ఒక స్వీటు, హాటు, తాంబూలం వేసి ఇవ్వాలి. కొన్న స్వీట్లు బాగుండవు, చేయిస్తే రుచిగా ఉంటాయి. అందువలన చేయిద్దామని అనుకున్నాము. కానీ ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి? గుంటూరా? తెనాలా? అని అనుకుంటున్న సమయంలో ఒకరోజు మేము మా ఊరికి ప్రక్కనే ఉన్న చేబ్రోలులోని బాబా గుడికి వెళ్ళి వస్తూ ఒక షాపు ముందు బండి ఆపి ఆవకాయ పచ్చడి తీసుకుందామని లోపలికి వెళ్ళాము. ఆ షాపులో ఆమె అది ప్యాక్ చేస్తూండగా అక్కడున్న లడ్డూలు చూసి, “కేజీ ఎంత?" అని అడిగింది నా భార్య. “ముందు రుచి చూడండి” అని ఆమె నా భార్య చేతిలో ఒక లడ్డు పెట్టింది. నా భార్య ఆ లడ్డు తినకుండా దాని వైపే చూస్తూ, “ ‘స్వీటు ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి?’ అని అనుకుంటున్న సమయంలో చేతిలోకి ఈ లడ్డు వచ్చిందంటే, 'ఇక్కడే ఆర్డర్ ఇవ్వమ'ని బాబా సంకల్పమై ఉంటుంది” అని అంది. దాంతో అక్కడే ఆర్డర్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాము. మేము ఎవరో తెలియకపోయినా వాళ్ళు మా దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకోకుండా మరుసటిరోజు సాయంత్రానికల్లా లడ్డూలు రెడీ చేసి మాకు ఫోన్ చేసి చెప్పారు. ఇంకా మేము వెళ్ళి తెచ్చుకోవాలనగా మా స్టూడెంట్ ఒక అబ్బాయికి ఫోన్ చేసి “ఎక్కడ ఉన్నావు?” అని అడిగితే, ఎప్పుడూ పనులతో ఊళ్ళు తిరుగుతూ ఉండే ఆ అబ్బాయి లక్కీగా “చేబ్రోలులో ఉన్నాను” అని చెప్పాడు. వెంటనే విషయం చెప్పి, “వచ్చేటప్పుడు ఆ లడ్డూలు తెస్తావా?” అని ఫలానా షాపని అడ్రసు చెప్తే, అలాగేనని తన జేబులోని డబ్బులిచ్చి, లడ్డూలు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు మేము అతనికి డబ్బులిచ్చాము. అలా బాబా ఉన్న చోటుకే ఏ ఇబ్బంది లేకుండా లడ్డూలు పంపించారు.
ఇక ఫంక్షన్‍లో పూజ చేయటానికి పూజారి కావాలని మాకు తెలిసిన నలుగురు పేర్ల మీద బాబా ముందు చీటీలు వేస్తే, వాళ్ళల్లో ఎవరినీ బాబా అనుమతించలేదు. ఇప్పుడెలా అనుకుంటుండగా బాబా గుడి ప్రాంగణంలో ఉన్న శివాలయం పూజారి గురించి తెలియడం, బాబాను అడిగితే అనుమతి ఇవ్వడం, ఆ పూజారి వచ్చి చక్కగా చేయడం జరిగింది. బాబా మందిరంలో, ఆయన సమక్షంలో మేము బాబుకు నూతన వస్త్రాలు ఇచ్చి, అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూండగా అక్కడున్న బాబా విగ్రహానికి పెట్టిన ఒక గులాబీ పువ్వు జారిపడటం విశేషం. తద్వారా బాబా స్వయంగా సాయీష్‍ని ఆశీర్వదించారని అందరం ఎంతో ఆనందించాము. బాబా అనుగ్రహం వలన మా అమ్మాయి ఆయన(బాబా)కు కొత్త బట్టలు, పూలమాలలు సమర్పించుకుంది. పూజ అవ్వగానే పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి మొదలవడంతో వచ్చిన అతిధులంతా హారతిలో పాల్గొన్నారు. ఆ గుడి పూజారి, “గుడి కట్టిన తర్వాత పదిహేను సంవత్సరాలలో ఇంతమంది హారతికి హాజరవటం ఇదే మొదటిసారి” అని చాలా ఆనందంగా అన్నారు. హారతి అనంతరం బాబా ఆశీస్సులతో ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది. సాయీష్‍కు పంచెల బహూకరణ జరిగాక క్రింద ఉన్న ఫంక్షను హాలులో బాబా ఫోటో వద్ద సాయీష్‍తో దీపారాధన చేయించి సోఫాలో కూర్చోపెట్టాము. తరువాత అతిథులందరూ తనని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. విశేషమేమిటంటే, మధ్యాహ్నం 12-30కి వెలిగించిన దీపాలు సాయంత్రం 6-00 గంటల వరకూ వెలుగుతూనే ఉన్నాయి. ఇందులో పెద్ద విశేషం ఏముందనుకుంటున్నారా! ఫ్యాను ఫుల్ స్పీడులో తిరుగుతోంది మరి!
ఇకపోతే భోజనాల విషయం! మాకు క్యాటరింగ్ చేసే వాళ్ళెవరితోనూ పరిచయాలు లేవు. అందువల్ల ఆ పనిని మా తరపున బంధువుకు అప్పగిస్తే మా అల్లుడుగారి తరుపు వాళ్ళకు నచ్చుతాయో? లేదో? పేర్లు పెడతారేమో! పోనీ అల్లుడుగారి తరపు బంధువుకు అప్పగిస్తే, మా తరపువాళ్ళకు నచ్చుతాయో? లేదో? అని మేము పెద్ద సందిగ్ధంలో పడ్డాము. ఏం చేయాలో అర్ధంకాక “బాబా ఇది నీ గుడిలో, నీ ఒడిలో జరుగుతున్న వేడుక. ఆ వేడుక కోసం వండిన వంటకాలను ముందు మీరు నైవేద్యంగా స్వీకరించాక ఆ ప్రసాదం మా అందరికీ అందాలి. అది తిన్న వారందరికీ నచ్చి, సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళాలి. ఇక క్యాటరింగ్ ఎవరికి ఇప్పిస్తారో అంతా నీ ఇష్టం” అని బాబాకి విన్నవించుకున్నాను. రెండు రోజుల తర్వాత బాబా మా స్టూడెంట్ ద్వారా 'భరత్ కుమార్' అనే అతని పేరు సూచించారు. అప్పుడు అతని అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్ళాము. అతని ఇంట్లోకి వెళ్ళిన మాకు, సింహాసనం మీద కాలు మీద కాలు వేసుకుని ఆశీనులై ఉన్న బాబా ఫోటో దర్శనమిచ్చింది. అంతటితో అప్పటివరకు మాకున్న సంశయాలన్నీ పటాపంచలైపోయి, 'ఇక భోజనాల విషయం బాబానే చూసుకుంటార'ని ఆయనకి ధన్యవాదాలు చెప్పుకున్నాము. ఇకపోతే, ఆ 'భరత్ కుమార్' మంచివ్యక్తి, పద్ధతైన మనిషి. అతను మాతో చాలా బాగా మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందో వివరంగా చెప్పి, తయారు చేయాల్సిన వంటకాలను వ్రాసుకున్నారు. తదనుగుణంగా వంటకాలను సిద్ధం చేసి పంపించారు. అవి రాగానే మేము ఆ వంటకాలన్నిటిలో బాబా ఊదీ వేసి, బాబాకి నివేదించి, ఆ ప్రసాదాన్ని అందరికీ వడ్డించాము. ప్రతి ఒక్కరూ భోజనాలు చాలా రుచికరంగా ఉన్నాయని అన్నారు. మేము వాళ్లతో, “అంతా బాబా దయ. మాదేమీ లేదు" అని చెప్పాము. కొంతమంది వాళ్ళింట్లో ఫంక్షనుకు ఆర్డర్ ఇచ్చేందుకు భరత్ కుమార్ గారి నెంబర్ అడిగి తీసుకున్నారు. అలా బాబా భోజనాల విషయంలో ఒడ్డున పడవేశారు. ఇలా ప్రతి పనిలో బాబా మాకు టెన్షన్ లేకుండా సహాయం చేస్తూ, ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిపించారు. నూటికి నూరు శాతం అందరూ మెచ్చుకున్నారు. మేము ఇచ్చిన గిఫ్టులు కూడా అందరికీ బాగా నచ్చాయి. "కృతజ్ఞతలు బాబా".
నేను, “సాయీష్ పంచెల మహోత్సవం పూర్తయిన వెంటనే శిరిడీ వస్తాన”ని బాబాకి మొక్కుకున్నాను. అందువలన కార్యక్రమం పూర్తయిన తర్వాత నేనొక్కడినే శిరిడీ వెళ్ళడానికి సిద్ధమయ్యాను. నేను బయలుదేరే ముందు శిరిడీలో నాకు పరిచయమున్న ప్రసాద్‍గారికి ఫోన్ చేసి, "నేను శిరిడీ వస్తున్నాను" అని చెప్పాను. అప్పుడు అతను, “నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను. అయినా మీకు ఇబ్బంది కలగకుండా చూస్తాను. మీరు శిరిడీలో దిగిన వెంటనే నాకు ఫోన్ చేయండి” అని చెప్పాడు. నేను అలాగే అని శిరిడీ వెళ్లి, అతనికి ఫోన్ చేశాను. అతను తన తమ్ముడు హరి వివరాలు చెప్పి, ఫోన్ నెంబర్ ఇచ్చి, “వెళ్ళి, అతనిని కలవమ"ని అన్నారు. నేను వెళ్ళి హరిగారిని కలిశాను. అతను నన్ను స్కూటరుపై తీసుకువెళ్ళి, ప్రసాదుగారి ఇంట్లో దించారు. ఆ కుటుంబం మొత్తం పెళ్లికని విజయవాడ వెళ్లి ఉన్నారు. ఆ ఇంట్లో శ్రీను అని, వారి దూరపు బంధువు మాత్రమే ఉన్నాడు. నేను నాలుగు రోజులు(మంగళ, బుధ, గురు, శుక్రవారాలు) వాళ్ళింట్లోనే ఉన్నాను. ఆ సమయంలో ఒకరోజు ఛత్రపతి శివాజీ జన్మదినం రావడం వలన లక్ష మంది భక్తులు బాబా దర్శనం చేసుకున్నారు. ఆ ఒక్క రోజే రూము అద్దె 1500/- దాకా ఉంది. అలాంటిది నేను ప్రసాద్ గారింట్లో ఉన్నందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. పైగా కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ ఉచితంగా పెట్టి నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను నాలుగు రోజులూ బాబా దర్శనం చేసుకున్నాను. మధ్యాహ్న హారతికి బాబా ఎదురుగా కూర్చునే భాగ్యం దక్కింది. ప్రసాదాలు, రుద్రాక్షలు, బాబా లాకెట్లు బాబా మూర్తికి, సమాధికి తాకించి తెచ్చుకున్నాను. ఔషదాలలోకెల్లా అమోఘమైన దివ్య ఔషధం బాబా ఊదీ. అవి యాభై ప్యాకెట్లు లభించాయి. డొనేషను కౌంటరు వద్ద నిల్చొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి 3000/- రూపాయలు డొనేషను కడితే, అతనికి పెద్ద రుమాల్ అంత బాబా తలకి కట్టే వస్త్రం ఇచ్చారు. అది చూసిన నేను డొనేషను కట్టిన తర్వాత, "నాకు కూడా బాబా వస్త్రం ఇస్తారా?" అని అడిగితే, పెద్ద టవల్ సైజు బాబా వస్త్రం ఇచ్చారు. నాకు చాలా ఆనందమేసింది. శనివారం బాబా అనుమతి, ఆశీర్వాదాలతో తిరుగు ప్రయాణమై ఇంటికి వచ్చాను. ఒక్కడినే వెళ్లినా బాబా నాకు ఏ విషయంలోనూ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. "ధన్యవాదాలు బాబా".
తరువాయి భాగం వచ్చేవారం...
Sai nannu vamsi ni kalupu sai na kapuranni nilabettandi sai. Vamsi ki na midha kopam antha povali manaspurthiga ga Nannu barya ga swikarinchi kapuraniki thiskellali sai nenu vamsi kalisi shirdi vachi mi ashirbadham thiskuntam sai na anubhavamni blog lo pamchukune adhrustani prasadinchandi sai om sairam 😢🙏
ReplyDeleteJaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteSairam please help us , my husband should recover from his illness due to your grace,u should help me ,waiting for your grace.
ReplyDelete