సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1341వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి కృపావీక్షణాలు
2. ఫోన్ దొరికేలా అనుగ్రహించిన బాబా

శ్రీసాయి కృపావీక్షణాలు


నా పేరు భాగ్య. నేను హైదరాబాద్ వాసిని. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. ఈ బ్లాగ్ ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. నేను ఇంతకుముందు రెండు అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. బాబా దయవలన 2020, జూన్‍ నెలలో బెంచ్ మీద ఉన్న మావారిని ఒక ప్రాజెక్టులో వేశారు. అయితే కుటుంబ సమస్యలు మరియు సహోద్యోగుల సహకారం లేకపోవడం మరియు పైఉద్యోగులు మావారితో పని చేయించుకుని తాము చేసినట్టు చెప్పుకోవడం వంటి సమస్యలు మావారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. చివరికి 2022, జనవరిలో మావారు ఆ ఉద్యోగం వదిలేశారు. రెండు నెలల విరామం తరువాత మావారు మంచి ఉద్యోగం వస్తుందని బాబాపై పూర్తి నమ్మకముంచి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన ఐదు సంవత్సరాల క్రితం తను పనిచేసిన ఒక MNC కంపెనీలో ఉద్యోగం వస్తే బాగుంటుందని ఎంతగానో ఆశపడ్డారు. అయితే కొత్త టెక్నాలజీలు రావడం వలన ఎంత ప్రయత్నించినా మావారికి సరైన ఉద్యోగం లభించలేదు. ఎంత శ్రమించినా చివరి రౌండ్లో చాలా ఇంటర్వ్యూలు పోయాయి. ఆ విషయంగా నాకు, మావారికి మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. ఒకానొక సమయంలో నేను చాలా నిరాశపడి బాబాను నిందించాను. తరువాత 2022, జూలై నెలలో మావారికి ఒక ఉద్యోగం వచ్చింది. అది మంచి కంపెనీ. కానీ మావారి డేట్ ఆఫ్ బర్త్ ఆధా‍ర్‌లో ఒకలా, పిఎఫ్ అకౌంటులో ఒకలా ఉండటం వలన కంపెనీ జాయినింగ్ నియమ, నిబంధనలను అనుసరించి ఆధా‍ర్‌లో డేట్ ఆఫ్ బర్త్ మార్పు చేయాల్సి వచ్చింది. అంతకుముందు పదిరోజుల్లో అందరికీ డేట్ ఆఫ్ బర్త్  మార్పు జరిగితే, మావారి విషయానికి వచ్చేసరికి 40 రోజులు పట్టింది. ఈ పరిస్థితుల్లో కంపెనీవాళ్ళు రెండు నెలల పాటు జాయినింగ్ డేట్ మారుస్తూ వచ్చారు. మావారు ఆ కంపెనీవాళ్ళతో, "చాలా ఆలస్యం అవుతుంది. జాయిన్ అయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మారుస్తాను" అని చెప్పారు. అందుకు వాళ్ళు, "ఇది కంపెనీ రూల్. అది మార్చిన తర్వాతే కంపెనీలో జాయిన్ అవ్వాలి" అని చెప్పారు. తీరా ఆ సమస్య తీరేసరికి మరో సమస్య వచ్చింది. అంతలో మావారు తన పాత స్నేహితులను కలవడం, మాటల్లో ఉద్యోగ ప్రస్తావన రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు మావారికి ఇష్టమైన కంపెనీలో ఖాళీ ఉందని చెప్పారు. దాంతో మావారు ఆ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్లి, సెలెక్ట్ అయ్యారు. బాబా దయతో మావారికి ఇష్టమైన కంపెనీలో మంచి స్థాయి, మంచి ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చారు. రెండు నెలలుగా సాధ్యం కానిది కేవలం మూడు రోజుల్లో బాబా దయవల్ల సాధ్యమయ్యింది. మాకు కలలా అనిపించింది. మనకు ఇష్టమైనది ఎప్పుడు, ఎలా ఇవ్వాలో మన తండ్రి బాబాకి తెలుసు. శ్రద్ధ-సబూరీలతో వేచి ఉండటమే మనం చేయాల్సింది. మేము బాబాకి ఎంతగానో ఋణపడి ఉన్నాము. "థాంక్యూ సో మచ్ బాబా".  


సంవత్సరం క్రితం (2021 మధ్యలో) మావారి చేతి బొటనవేలు చాలా నొప్పిగా ఉండేది. డాక్టరుని సంప్రదిస్తే, ఒక నెలరోజులకి మందులిచ్చి, "ఈ మందులతో తగ్గకపోతే, సర్జరీ చేయాల్సి ఉంటుంది" అని చెప్పారు. మేము, "బాబా! మీపై మాకు పూర్తి నమ్మకం ఉంది. నెలరోజుల్లో ఎలాంటి సర్జరీ లేకుండా మీరే నయం చేయాలి. మీరే మాకు వైద్యుడు" అని బాబాతో చెప్పుకుని పూర్తి విశ్వాసంతో ఉండసాగాము. నేను రోజూ బాబా ఊదీని మావారి చేతికి రాస్తూ ఉండేదాన్ని. బాబా దయవలన ఎలాంటి సర్జరీ లేకుండా 40 రోజుల్లో మావారికి పూర్తిగా తగ్గిపోయింది. ఇంతవరకూ మళ్ళీ ఆ నొప్పి రాలేదు. "ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా. ".


నెలసరి విషయంలో బాబాకి ఎలాంటి పట్టింపులు ఉండవని నేను ఈ బ్లాగులో చదివినప్పటికీ నాకు ఎక్కడో కొద్దిగా అనుమానం ఉండేది. దాన్ని బాబా ఎలా తొలగించారో చూడండి. ఈమధ్య నాకు నెలసరి వచ్చినప్పుడు నేను అనుకోకుండా బాబా గుడి ముందుగా వెళ్ళాను. ఆ సమయంలో అక్కడ అన్నదానం జరుగుతోంది. నాతోపాటు మా అమ్మ, నాన్న ఉన్నారు. వాళ్ళు తమ కారణంగా మా తమ్ముడికి, మరదలికి మధ్య మనస్పర్థలొచ్చాయన్న బాధలో ఉన్నారు. ఆ బాధలో వాళ్ళు ఉదయం నుంచి ఏమీ తినలేదు. వాళ్ళకి నచ్చజెప్పి మా ఇంటికి తీసుకుని వెళ్తున్న నేను అన్నదానం చూడగానే అమ్మానాన్నల వయసు, ఆరోగ్యం దృష్ట్యా ముందు వాళ్ళ ఆకలి తీర్చాలని అనుకున్నాను. అందువల్ల 'నెలసరి సమయంలో అన్నదానానికి వెళ్ళాలా, వద్దా?' అని సంశయించినప్పటికీ తప్పనిసరై అమ్మానాన్నలతో పాటు అన్నదానానికి వెళ్లాను. అలా తప్పనిసరి పరిస్థితిని కల్పించి నా సందేహాన్ని బాబా పూర్తిగా తొలగించారు. "ధన్యవాదాలు బాబా! నా మరదలు కారణంగా మా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలున్నాయి. ఆమె మనసు మార్చి, మనస్పర్థలు తొలగించి అందరం మనశ్శాంతిగా ఉండేలా చూడు తండ్రీ. మా తమ్ముడు, మరదలు సంతోషంగా ఉండాలి. మా పిల్లల్ని, నన్ను, నా కుటుంబాన్ని, ఇంకా అందరినీ చల్లగా చూడు తండ్రీ. ఏమైనా మర్చిపోతే క్షమించండి సాయీ".


ఫోన్ దొరికేలా అనుగ్రహించిన బాబా


ఆత్మానందస్వరూపుడు, నిజ దైవం అయిన శ్రీసాయినాథునికి అనంతకోటి ప్రణామాలు. సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. నా పేరు మల్లీశ్వరి. మాది హైదరాబాద్. నేనింతకుముందు మూడు అనుభవాలు పంచుకుని చాలా తృప్తి పొందాను. ఇప్పుడు సాయికి మాటిచ్చిన మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. 2022, ఆగస్టు 31 రాత్రి నాకు కలలో నా సెల్‌ఫోన్ పోయినట్లు కనిపించింది. 'ఏమిటి బాబా, ఇలాంటి కల వచ్చింది?' అని మధనపడ్డాను. మరుసటిరోజు సెప్టెంబర్ 1, గురువారం ఉదయం నేను బాబా గుడికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాను. మా పాప ఆఫీసుకు వెళ్ళాక నేను  పనులన్నీ ముగించుకుని ముందురోజు శ్రీవినాయకచవితి సందర్భంగా పూజించుకున్న వినాయక విగ్రహాన్ని తీసుకుని, ఇంటికి తాళం వేయకుండా మా అపార్ట్‌మెంటులో కింద ఉంచిన వినాయకుడి దగ్గర పెట్టడానికి వెళ్ళాను. తర్వాత మా పాపకి ఫోన్ చేద్దామని చూస్తే, నా ఫోన్ కనిపించలేదు. ఆ ఫోన్‍లో మా పాప పెళ్ళికి సంబంధించి ముఖ్యమైన నెంబర్లు చాలా ఉన్నందున చాలా ఆందోళన చెంది ఇంట్లో అన్నిచోట్లా వెతికాను. కానీ, ఫోన్ కనిపించలేదు. దాంతో ఎవరినైనా ఫోన్ అడిగి, పాపకి ఫోన్ చేద్దామని బాబాను తలచుకుంటూ కిందకు వెళ్లాను. లిఫ్టులో వెళ్తూ నాకు తెలియకుండానే, "బాబా! ఫోన్ కనబడితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. కిందకి వెళ్ళాక వాచ్‌మన్ వైపు చూస్తుంటే, అపార్ట్‌మెంట్లో ఉండే ఒక అన్నయ్య, "ఏమిటి మేడం చూస్తున్నారు?" అని అడిగారు. నేను, "నా ఫోన్ కనపడట్లేదు. ఎవరినైనా ఫోన్ అడిగి అమ్మాయికి ఫోన్ చేద్దామని చూస్తున్నాను" అన్నాను. వెంటనే అతను, "నా ఫోన్ నుంచి చేసుకోండి" అని తన ఫోన్ ఇచ్చి, "మీ ఫోన్‍కి రింగ్ చేయండి మేడం. ఇంట్లో ఎక్కడైనా రింగ్ వస్తుందేమో చూడండి" అని అన్నారు. నేను నా ఫోన్‍కి రింగ్ చేస్తూ పైకి వెళ్ళాను. మా ఇంట్లో సోఫా దగ్గర ఫోన్ రింగ్ అవుతుంటే, సోఫా చుట్టూ వెతికాను. కానీ ఫోన్ కనపడలేదు. అప్పుడు బాబాని తలచుకుంటూ జాగ్రత్తగా గమనిస్తే, పర్సులో ఫోన్ దొరికింది. పొద్దున్న బాబా గుడికి వెళుతూ ఫోన్ ఆ పర్సులో పెట్టిన సంగతి నాకు అస్సలు గుర్తులేదు. ఏదేమైనా ఫోన్ కనపడేసరికి చెప్పలేని సంతోషంతో బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. "బాబా! మీరు అత్యంత దయామయులు. కరుణతో నా ఫోన్ కనపడేలా చేశారు. మీ పాదాలకు సంపూర్ణ శరణాగతి వేడుతున్నాను తండ్రీ".



5 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam she is suffering from pain and help her

    ReplyDelete
  4. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo