సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1361వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అన్ని విషయాలలో మనకు 'బాబా ఉన్నారు'
2. సచ్చరిత్ర పారాయణలో తెలియకుండానే తగ్గిపోయిన నొప్పులు
3. సాయి దేవుడు ఎంతో దయగలవాడు

అన్ని విషయాలలో మనకు 'బాబా ఉన్నారు'


నా పేరు సావిత్రి. ఎంతోమంది సాయి భక్తులు తమ అనుభవాలను పంచుకోవడానికి అనువుగా ఒక గొప్ప వేదికను(బ్లాగు) ఏర్పాటు చేసిన ఈ బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఈమధ్య నేను మరో ముగ్గురితో కలిసి తొమ్మిదిరోజుల కాశీయాత్రకు వెళ్లాను. ప్రయాణానికి ముందు నాకు మోకాలి సమస్య తీవ్రంగా వచ్చి నడవలేని పరిస్థితి ఏర్పడింది. నేను నా బాధను బాబాతో చెప్పుకుని, "బాబా! నేను క్షేమంగా కాశీ వెళ్ళొస్తే, నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని  మొక్కుకున్నాను. నాకెందుకో బాబా శ్యామాతో "మీ కంటే ముందే గయ చేరుకుంటాను" అని చెప్పి అతనికి అక్కడ దర్శనం ఇచ్చినట్లు, ఆయన నాతో కూడా ఉంటూ కాశీలో దర్శనమిస్తారని అనిపించింది. అదే నిజమైంది. మేము కాశీలో ట్రైన్ దిగి ఆటోలో వెళుతుంటే దారిలో పెద్ద బాబా ఫోటో కనిపించింది. అంతేకాదు బస చేయడానికి రూమ్ కోసం వెతుకుతుంటే ఒక బాబా గుడి కనిపించింది. బాబా మా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు నాకు అనిపించి నా సంతోషానికి అంతులేకుండా పోయింది. మేము మహాపారాయణలో భాగంగా రెండు వారాల పారాయణ సంతోషంగా చేసుకున్నాం. కాశీలో ఒక్క స్నానం, ఒక్క దర్శనం అయిన చాలు అనుకుని కాశీ చేరుకున్న నేను బాబా దయతో రోజూ దర్శనం మరియు మూడు స్నానాలతో తొమ్మిది రోజుల యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని చాలా తృప్తిగా తిరిగి వచ్చాను.


నేను కాశీ వెళ్లొచ్చిన తరువాత వారంలోపు ఒకరోజు మా అబ్బాయి నా భర్త అస్థికలు నిమజ్జనం చేయడానికి ఒక్కడే కారు డ్రైవ్ చేసుకుంటూ శ్రీశైలం వెళ్ళాడు. సాయంత్రమవుతున్నా తను ఇంటికి రాకపోయేసరికి నేను ఫోన్ చేస్తే, "అక్కడ వర్షం లేదు గానీ ఇక్కడ నిరంతరాయంగా వర్షం పడుతుంది. కారు చక్రాలు వర్షానికి బురదలో ఇరుక్కుపోయి డ్రైవింగ్ చాలా కష్టంగా ఉంది. అందుకే ఆలస్యమవుతుంది. పైగా డ్యామ్ గేట్లు ఎత్తేయడంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. అయినా ఎలాగో అస్థికలు నిమజ్జనం చేసి పైకి వచ్చాను" అని చెప్పాడు. దాంతో నాకు భయం మొదలై, "బాబా! బాబు సురక్షితంగా ఇంటికి వస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకుని నిరంతరాయంగా బాబా నామస్మరణ చేశాను. బాబా దయవల్ల ఆలస్యమైనా బాబు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. ఇలా అన్ని విషయాలలో మనకు 'బాబా ఉన్నారు' అనే ధైర్యం కలిగిస్తున్న 'సాయి మహారాజ్ సన్నిధి'కి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. బాబా, ఈ బ్లాగు ఒకటేనని ఒక భక్తురాలు చెప్పింది నిజమే అనిపిస్తుంది.


ఒకరోజు మా అబ్బాయి పనిచేసే ఆఫీసులో తనకి, తన పైఅధికారికి మధ్య చిన్న గొడవ మొదలై అది పెద్దది అయింది. మా బాబు ఇంటికి వచ్చి, "రేపు నాకు ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వొచ్చు" అని నాతో చెప్పాడు. దాంతో నాకు టెన్షన్ మొదలై నిరంతరాయంగా బాబా నామం చేసుకుంటూ రాత్రంతా, "బాబా! మమ్మల్ని ఈ ఆపద నుండి గట్టెక్కిస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం మా అబ్బాయి ఆఫీసుకు వెళ్లేటప్పటికీ తన ఆఫీసర్ నవ్వుతూ తనని పలకరించి వర్క్ ఇచ్చారు. ఈవిధంగా నాకెవరూ లేరనుకునే వాళ్ళందరికీ 'మీకు నేనున్నాను' అని బాబా తోడుగా ఉంటున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సచ్చరిత్ర పారాయణలో తెలియకుండానే తగ్గిపోయిన నొప్పులు


బాబా భక్తులకు నమస్కారం. నా పేరు మాధవి. మాది ఒంగోలు. నేను సాయిభక్తురాలిని. నాకు ఏ కష్టం వచ్చినా నేను బాబాతోనే చెప్పుకుంటాను. నేను ఏ కష్టంలో ఉన్నా, ‘బాబా’ అని పిలిస్తే చాలు, బాబా పలుకుతారు. నేను ఇంతకుముందు ఒకసారి బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటాను. ఈ సంవత్సరం (2022) దసరా సెలవులకు మేము శిరిడీ వెళ్లాలని ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాము. మేము శిరిడీ వెళ్లాలంటే మా ఊరినుండి బయలుదేరి విజయవాడ వెళ్లి, అక్కడ శిరిడీ వెళ్ళే ట్రైన్ ఎక్కాలి. నేను డయాబెటిక్ పేషెంటుని. ఈమధ్య నాకు షుగర్ టెస్ట్ చేసినప్పుడు, ఆ రిపోర్టులు పరిశీలించిన డాక్టర్ నాకు షుగర్ ఎక్కువగా ఉందని చెప్పి, అప్పటివరకు నేను వేసుకుంటున్న మందులను మార్చి క్రొత్త మందులు ఇచ్చారు. ఈ సమయంలోనే మేము శిరిడీకి బయలుదేరాము. ఆ మందుల ప్రభావమో ఏమోగానీ ఒంగోలు నుండి విజయవాడ వెళ్లేటప్పటికి నాకు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చి గుండెల్లో, వీపులో నొప్పి మొదలైంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. “బాబా! ఏంటి నాకీ సమస్య? నన్ను నీ దగ్గరకి రానివ్వవా?” అని బాధగా అనుకుంటూ, "నొప్పి తగ్గించమ"ని బాబాను వేడుకున్నాను. తరువాత ఆ నొప్పితోనే శ్రీసాయిసచ్చరిత్ర పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టాను. నిజానికి నేను శిరిడీకి బయలుదేరేముందే అనుకున్నాను, 'ట్రైనులో ఖాళీగా కూర్చునే బదులు సచ్చరిత్ర చదువుతూ వెళ్లాలని, శిరిడీ వెళ్ళేటప్పటికి ఒకసారి పారాయణ పూర్తిచేయాల'ని. సచ్చరిత్ర చదువుతూ ఉండగానే, ఎప్పుడు ఎలా తగ్గిపోయిందో నాకు తెలియలేదుగానీ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఆరోజే కాదు, శిరిడీలో ఉన్న నాలుగు రోజులు నాకు ఎటువంటి సమస్యా రాలేదు. ఇదంతా కేవలం బాబా దయే. ఆయనే లేకపోతే నేను ఎంత ఇబ్బందిపడేదాన్నో! నా అడుగడుగునా బాబానే నాకు తోడుగా ఉన్నారు. “బాబా! నీ దయ, నీ కరుణ నాపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ”.


సాయి దేవుడు ఎంతో దయగలవాడు


సాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. సాయి దేవునికి మాటిచ్చినట్లు ఈమధ్య  జరిగిన ఒక అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటున్నాను. ఒకరోజు అర్ధరాత్రి హఠాత్తుగా నా కాలి బొటనవేలి గోరు కింద భాగంలో జివ్వుమని నొప్పి మొదలైంది. ఆ నొప్పి కారణంగా నాకు అస్సలు నిద్రపట్టలేదు. ఏం చేయాలో అర్థంకాక బాధతో కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి. "హఠాత్తుగా ఈ కష్టమెందుకు వచ్చింది" అని సాయి దేవున్ని అడుగుతూ ఇంట్లో ఉన్న పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపిస్తూ, "ఎలాగైనా నొప్పి తగ్గి, ఒక గంట అయిన నిద్రపోనివ్వు సాయి ప్రభు" అని బాబాను వేడుకుని టాబ్లెట్ వేసుకున్నాను. బాబా దయ చూపారు. నొప్పి తగ్గి సరిగ్గా ఒక గంట నిద్రపోయి లేచాను. ఆరోజు ఆదివారం కావడంతో డాక్టర్ వద్దకి వెళ్లకుండా మన సాయిదేవుని ప్రార్థిస్తూ ఇంట్లో ఉన్న మందులు వాడాను. ఆ తండ్రి దయతో నొప్పి తగ్గింది. మన సాయి దేవుడు ఎంతో దయగలవాడు. ఇలాగే భవిష్యత్తులో కూడా నేను అనుకున్న ప్రతి పనిని త్వరగా పూర్తిచేయించి నన్ను సంతోషపెడతారని సాయి దేవుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


3 comments:

  1. Sai nannu na vamsi ni kalupu sai na kapurani nilabettu sai na bartha nannu kapuraniki thiskellela chudu sai nenu na anubhavamni sai blog pamchukune adhrustani prasadinchandi sai om sairam

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo