సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1351వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహంతో ఫలించిన కోరికలు
2. సాయంత్రానికల్లా డబ్బు చేతికి అందేలా అనుగ్రహించిన బాబా
3. చెప్పుకున్నంతనే సమస్యకి పరిష్కారం చూపిన బాబా

బాబా అనుగ్రహంతో ఫలించిన కోరికలు


సాయిబంధువులందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నా పేరు సౌదామిని. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నాకు ఏ కష్టం వచ్చినా గుర్తు వచ్చేది ఈ 'సాయి మహరాజ్ సన్నిధి'. ఈ బ్లాగ్ ద్వారా బాబా పక్కనే ఉన్నట్లుగానూ, ఆయనను తలచుకుని సమస్యను చెప్పుకుంటే నేరుగా బాబాతో చెప్పుకున్నట్లుగానూ ఉంటుంది. బాబా కొండంత అండగా ఉండి నాకు ధైర్యం చెప్పి అన్ని సమస్యల నుండి సులభంగా బయటపడేస్తున్నారు. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. 2022, సెప్టెంబర్ 9న మా అమ్మాయి పుష్ప అలంకరణ వేడుక పెట్టుకున్నాము. మా అపార్ట్‌మెంట్ క్రింద సెల్లార్లో ఫంక్షన్ కోసం అన్నీ సిద్ధం చేసుకుని, 15 మందిని ఆహ్వానించాము. ముందురోజు విపరీతమైన వర్షం పడేసరికి నాకు భయమేసి బాబా గుడికి వెళ్లి, "బాబా! మా ఇంట వేడుక బాగా జరగాలి. కార్యక్రమానికి వచ్చినవాళ్ళందరూ తిరిగి వాళ్ళ ఇళ్లకు క్షేమంగా చేరేవరకు ఏ ఇబ్బందీ లేకుండా చూడండి" అని ప్రార్థించి, ధునిలో టెంకాయ వేసి నమస్కరించుకుని వచ్చాను. ఆ తండ్రి దయవల్ల మధ్యాహ్నం నుంచి వర్షం ఆగిపోయింది. అంతేకాదు, ఎండ తీవ్రత తక్కువగా ఉండి చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. కార్యక్రమానికి వచ్చినవాళ్ళందరూ చాలా ఆనందంగా గడిపి వెళ్లారు. ఇదంతా నా తండ్రి దయ. ఆ మరుసటిరోజు నా చేతి వేలికున్న తాబేలు ఉంగరం ఎక్కడో జారిపడిపోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. "బాబా! అది కనిపిస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. 15 నిమిషాల తర్వాత ఆ ఉంగరం డైనింగ్ టేబుల్ వెనుక కనిపించింది. "ధన్యవాదాలు బాబా". 


2022, ఆగస్టు 8వ తేదీన మా పిల్లలిద్దరూ ఆడుకుంటూ గొడవపడ్డారు. ఆ క్రమంలో మా అబ్బాయి మెట్ల మీద నుండి జారి పడిపోయాడు. తన ఎడమచేతికి గాయమైంది. మరుసటిరోజుకి నొప్పి బాగా ఎక్కువై, చేయంతా వాచిపోయింది. డాక్టర్ ఎక్స్-రే తీసి, ఎముక విరిగిందని బ్యాండేజ్ వేసి, "ఐదువారాలపాటు చేతికి విశ్రాంతి ఇవ్వాలి" అని చెప్పారు. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, బాబుని ఒక వారంరోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకోనిచ్చి తర్వాత స్కూలుకు పంపించాను. ఎందుకంటే, బాబు పదవ తరగతి చదువుతున్నాడు. తను తరగతులు మిస్ కాకూడదని నేనే తనని స్కూల్లో వదిలిపెట్టి, తిరిగి తీసుకుని వస్తుండేదాన్ని. కానీ చేయి కదిలించకుండా స్కూల్లో ఉండగలగడం ఇబ్బందని భయమేసి, "బాబా! బాబుకి ఏ బాధ కలగకుండా ఐదు వారాలు గడిచి, ఆ తర్వాత ఎక్స్-రేలో నార్మల్ వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. ఐదు వారాల తరువాత డాక్టర్ ఎక్స్-రే తీసి, "బాగానే ఉంది. అయినా మూడు నెలల వరకు బరువులు ఎత్తకుండా జాగ్రత్తగా ఉండాలి" అని చెప్పారు. "బాబా! మీకు శతకోటి వందనాలు. ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది బాబా. మీరు మా పక్కనే ఉండి కంటికిరెప్పలా కాపాడుతూ ఉంటారనే నమ్మకం నాకు కలిగింది నాయనా. ఇలాగే నా బిడ్డల క్షేమాన్ని ఎల్లప్పుడూ చూసుకోవాలని వేడుకుంటున్నాను తండ్రీ".


2022, జూలై 28వ తేదీన నేను లాకర్ తాళంచెవి ఎక్కడో దాచిపెట్టి మర్చిపోయాను. శ్రావణమాసం దేవుడికి నగలు పెట్టడానికి కూడా లేకుండా పోయింది. మొత్తం 25 రోజులు ఎంత వెతికినా దొరకలేదు. ఎక్కడ పెట్టానో అస్సలు గుర్తురాలేదు. ఇంతలో మావారు, "బంగారం పెట్టి అప్పు తీసుకోవాల్సిన అవసరముంది. లాకర్ తాళంచెవి ఎక్కడ పెట్టావ"ని ఒత్తిడి చేయసాగారు. నాకు భయమేసి బాబాకి దణ్ణం పెట్టుకుని, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే మంత్రం 1,001 సార్లు పఠించి, "బాబా! లాకర్ తాళంచెవి ఎక్కడుందో కనిపిస్తే, వెంటనే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకుని పడుకున్నాను. మరుసటిరోజు ఉదయం మా పిల్లలు 8:30కి స్కూలుకు వెళ్ళగానే, "బాబా! ఇదే నా ఆఖరి ప్రయత్నం" అని నా పుస్తకాల అలమరాలో వెతికితే ఆ లాకర్ తాళంచెవి దొరికింది. నా సంతోషం చెప్పనలవి కాదు. బాబాని నమ్ముకుంటే చాలు, ఎంతటి ప్రతికూల పరిస్థితి అయినా అనుకూలంగా మారిపోతుంది. అయితే అటువంటి పరిస్థితులు మన ఓర్పుకు అయన పెట్టే పరీక్షా సమయం. నమ్మకం ద్వారా మాత్రమే మనం ఆ పరీక్ష పాస్ అవుతాం. ఇది ముమ్మాటికీ సత్యమని నిరూపించారు బాబా.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయంత్రానికల్లా డబ్బు చేతికి అందేలా అనుగ్రహించిన బాబా


నేను ఒక సాయిభక్తురాలిని. ముందుగా, సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. సాయితో నాకున్న అనుభవాలను అందరితో పంచుకునే అదృష్టాన్ని కలిగించిన 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగువారికి నా కృతజ్ఞతలు. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి నాకు సాయి దర్శనభాగ్యం లభించింది. మా ఊళ్లో కొత్తగా నిర్మించిన శ్రీసాయిబాబా గుడికి వెళ్లి బాబా దర్శనం చేసుకోగానే నాకు దుఃఖం తన్నుకొచ్చింది. అలౌకికమైన ఆనందంతో నా మనసు నిండిపోయింది. నేను నా కుటుంబసభ్యులతో తరచూ దైవదర్శనం చేసుకుంటుండేదాన్ని. కానీ ఎప్పుడూ కలగని ఆనందం సాయిని చూసినప్పుడు కలిగింది. అప్పటినుండి బాబా నా జీవితంలో ఎన్నో మహిమలు చూపారు. కష్టసమయంలో తోడు-నీడ, తల్లి-తండ్రి అన్నీ తానై నన్ను కాపాడుతూ ఉండేవారు. అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన ఈమధ్యకాలంలో, అనగా 2022 సెప్టెంబరులో జరిగింది. మేము ఒకరోజు అత్యవసరమై మా అమ్మాయి ఫీజు డబ్బులు వేరే విషయంగా ఖర్చు పెట్టవలసి వచ్చింది. సరే, తర్వాత సర్దుబాటు చేసి ఫీజు కడదామని అనుకున్నాం. కానీ డబ్బులు చేతికి అందకపోగా ఇతరత్రా ఖర్చులు కూడా వచ్చి పడ్డాయి. ఆలోగా కాలేజీవాళ్ళ నుండి మా ఫోన్‍కి, 'ఫీజు కట్టని కారణంగా కాలేజీ ఆఫీసు రూముకి రమ్మ'ని మెసేజ్ వచ్చింది. దాంతో ఆర్థిక సమస్యల నుండి ఎలా గట్టెక్కాలో మాకు తోచలేదు. అటువంటి స్థితిలో నాకున్న ఒకే ఒక దారి బాబా. వెంటనే బాబాను తలచుకుని, "బాబా! వీటన్నిటికీ నువ్వే పరిష్కారం చూపించాలి. అదీ ఒక్కరోజులో నీ మహిమ చూపు తండ్రీ. నువ్వు నా కష్టం తీరిస్తే, నేను వెంటనే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ఆర్తిగా ప్రార్థించాను. విచిత్రం! సాయంత్రానికి అవసరమైన డబ్బులు మా చేతికి అందాయి. "ధన్యవాదాలు బాబా! ఇంకొక ముఖ్యమైన కోరిక మిమ్మల్ని కోరాను. మీరు తప్పక తీరుస్తానని మాట ఇచ్చారు. దానికోసమే ఎదురుచూస్తున్నాను బాబా. అది కూడా నెరవేరితే మరలా నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను".


చెప్పుకున్నంతనే సమస్యకి పరిష్కారం చూపిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు. నా పేరు కల్పన. నేను ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్తాను. అలాగే 2022, సెప్టెంబరు 22, గురువారంనాడు బాబా గుడికి వెళ్లాను. నేను గత కొంతకాలంగా ఒక సమస్యతో బాధపడుతున్నాను. ఆ సమస్య గురించి బాబాకి చెప్పుకుని, "బాబా! ఆ సమస్య నుండి త్వరగా నన్ను విముక్తురాలిని చేయండి" అని వేడుకున్నాను. అంతే, ఆ మరుసటిరోజు సాయంత్రానికల్లా నా సమస్యకు పరిష్కారం దొరికింది. ఇదంతా బాబా మహిమ. 'సాయీ' అని పిలిస్తే ఎక్కడున్నా బాబా మన సమస్యకి పరిష్కారం చూపి, తామున్నామని నిరూపిస్తారు.



6 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  3. Baba na korika neeaverchandi sai nenu na anubhavanni blog lo panchukutanu sai

    ReplyDelete
  4. Om sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Ome sri sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo