సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1365వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కరుణతో చెడు అలవాటును మాన్పించి జీవితాన్ని మార్చిన బాబా
2. మనమేమీ చెప్పకపోయినా అర్థం చేసుకుని అనుగ్రహిస్తారు బాబా
3. ఎంతో దయచూపిన బాబా

కరుణతో చెడు అలవాటును మాన్పించి జీవితాన్ని మార్చిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!! సాయి భక్తులకు, ఎంతో చక్కగా బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు వేంకటరమణ. కొద్దిరోజుల క్రితమే బాబా కరుణ వలన నాకు ఈ బ్లాగు గురించి తెలిసింది. నేనిప్పుడు ముందుగా 2014లో సాయి నన్ను తమ దరికి రప్పించుకుని నా జీవితంలో ఎలా మార్పు తీసుకొచ్చారో మీతో పంచుకుంటాను. అప్పట్లో నేను పరిస్థితులకు లోనై తాగుడికి అలవాటుపడ్డాను. ఏ రోజుకారోజు 'రేపటి నుండి మానేద్దాం' అనుకునేవాడినిగాని నావల్ల అయ్యేదికాదు. చాలాసార్లు చేతికి కడియం వేసుకుని, ఒట్టు పెట్టుకునేవాడిని. కానీ కొద్దిరోజులకి ఆ కడియం తీసేసి పూజగదిలో పెట్టి, ఒట్టు కూడా గట్టు మీద పెట్టేసేవాడిని. నా ఆరోగ్యం, వ్యాపారం దెబ్బతిని అటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా చాలా నష్టపోయాను, ఉన్న మంచి పేరు కాస్త పాడయింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వ్యసనం నుండి బయటపడలేక నన్ను నేను తిట్టుకుంటూ ఉండేవాడిని. అటువంటి సమయంలో నేను దేవుడిచ్చిన మా బావతో(బోగలింగేశ్వర్) శిరిడీలో కడియం వేయమన్నాను. అందుకు తను సరే అన్నాడు. 2014, డిసెంబర్ 4, ఉదయం మేమంతా కలసి శిరిడీలో బాబా దర్శనానికి వెళ్లాం. నేను ఇంచుమించు 20 నిమిషాలపాటు బాబాను చూస్తూ, వారి ముందు అలాగే ఉండిపోయాను. నాతోపాటు వచ్చిన వాళ్లంతా వెళ్లిపోయారు. తరువాత నా బావ నా గురించి వెతుకుతూ మళ్ళీ వచ్చాడు. అప్పుడు నేను, "బావ, నా చేతికి కడియం వేయి" అని అన్నాను. అందుకు తను ఒప్పుకోక, "కనీసం ఆరునెలలు కడియం తీయకుండా ఉంటానంటే వేస్తాను. అప్పుడు కూడా ఇదే శిరిడీలో, బాబా సన్నిధిలో నేనే ఆ కడియం తీయాలి. ఆరునెలలు తరువాత నువ్వు ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను" అని షరతు పెట్టాడు. నేను, 'సరే' అని కడియం వేయించుకున్నాను. అంతే, నా సాయినాథుని దయవలన ఇన్ని సంవత్సరాలు గడిచినా కడియం తీసే అవసరం రాలేదు. ఇక రాదు కూడా. అలా బాబా నా జీవితాన్ని మార్చేశారు. నా తండ్రి నన్ను తమ దగ్గరకి రప్పించుకుని, జ్ఞానోదయం కలిగించి నాలో ఉన్న చెడు అలవాటును మానిపించి, జీవితం అంటే ఏమిటో తెలిపారు. "ధన్యవాదాలు బాబా".


ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటాను. 2014లో నేను ఒక చిన్న మెస్ తీసుకున్నాను. ఆ మెస్‍ను నాకు అమ్మిన ఆమెను, "మీరు ఏమి చేస్తారు?" అని అడిగాను. "ఎక్కడైనా పని చేసుకుంటాను" అని అన్నారామె. నేను, "ఎక్కడో ఎందుకు? ఇక్కడే ఉండి ఈ మెస్ మీరే నడపండి. నాకు రోజుకు వేయి రూపాయలిచ్చి, మిగిలింది మీరు తీసుకోండి. కావాల్సిన సరుకుల గురించి నేనే చూసుకుంటాను" అని అన్నాను. అందుకు ఆమె సరేనని అంది. బాబా దయవలన బిజినెస్ బాగానే ఉండేది. ఆమె ఒక సంత్సరకాలం బాగా నడిపించింది. ఆపై ఆమె కొడుకు చెడు అలవాట్ల వల్ల అప్పులు తీసుకుని షాపులో డబ్బు వాడేసేది. నేను డబ్బులు అడిగితే, "బేరం లేదు సార్. ఈరోజు, రేపు" అని కాలం గడుపుతూ నాకు తెలియకుండానే మెస్ వేరే వాళ్లకు ఇచ్చింది. నేను అడిగితే, "బేరం లేదు సార్. నష్టమొస్తుంది. ఆవిడ మీకు డబ్బులు ఇస్తారు, అవి తీసుకోండి. మిగిలిన డబ్బులు నేను ఆంధ్ర యూనివర్సిటీ గేటు వద్ద బండి పెట్టి, అమ్ముకుని మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను" అనింది. ఆ మెస్ అమ్మిన డబ్బులు కూడా ఇవ్వలేదు. అడిగితే, "నేను ఆవిడకు డబ్బులు బాకీ ఉన్నాను. అందుకే మెస్ ఇచ్చేసాను" అని చెప్పింది. ఆఖరికి నా డబ్బులు నాకు ఇవ్వకుండానే ఆమె ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తే, ఎత్తేది కాదు, ఒకవేళ ఎప్పుడైనా ఎత్తినా ఈనెల, వచ్చేనెల అంటుండేది. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. 2022, సెప్టెంబర్ 29, గురువారంనాడు నేను, "తండ్రీ! వాళ్ళు నా డబ్బుల గురించి ఈరోజు నాకు సమాధానం చెప్పేలా చూడండి" అని బాబాను వేడుకుని వాళ్ళకి ఫోన్ చేసాను. బాబా కరుణ వల్ల ఆమె కూతురు ఫోన్ ఎత్తి, "అంకుల్, మా పరిస్థితి బాగా లేదు. నేను నెలనెలా కొంచం కొంచం డబ్బులు పంపిస్తాను" అంటూ చెప్పింది. అంతేకాదు, అన్ని సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్నవాళ్ళు సెప్టెంబర్ నెలలో 10,000 రూపాయలు, అక్టోబర్ నెలలో 10,000 రూపాయలు పంపారు. ఇదంతా మన సాయితండ్రి మహిమ. "సాయిబాబా, సాయితండ్రీ, సాయిప్రభూ! ఇలాగే వాళ్ళు బాగుండి, నా డబ్బులు నాకు ఇచ్చేలా దీవించండి నాయనా. నేను ఆర్థికంగా, ఆరోగ్యంగా, వాప్యారపరంగా బాగుండేలా ఆశీర్వదించండి".


ఈమధ్య ఒకరోజు నాకు విపరీతంగా పంటినొప్పి వచ్చింది. ఆ రాత్రి, "బాబా! ఈ నొప్పిని తగ్గించండి" అని శ్రీసాయినాథుని వేడుకున్నాను. ఆ తండ్రి దయతో కొద్ది సమయంలోనే నొప్పి తగ్గించారు. "సాయినాథా, సాయితండ్రీ! నాకు సర్వం మీరే. నా జీవితాన్ని మార్చిన మీకు శతకోటి వందనాలు. ఈ సంవత్సరం మీ దీక్ష చేసేందుకు నాకు అవకాశం కల్పించమని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను తండ్రి. నా తప్పులు ఏవైనా ఉంటే మన్నించు తండ్రి. ఎల్లప్పుడూ మమ్మల్ని అందరినీ కాపాడుతూ చల్లగా చూడండి సాయిదేవా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజధిరాజ యోగిరాజ శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


మనమేమీ చెప్పకపోయినా అర్థం చేసుకుని అనుగ్రహిస్తారు బాబా


సాయి బంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను మీ అందరితో బాబా నాకు ప్రసాదించిన అందమైన ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను రోజూ బాబాకు ఆహారం నివేదిస్తాను. నేను ప్రతివారం వివిధ నగరాలలోని మా ఆఫీసుకు వెళ్తుంటాను. అలా వెళ్ళినప్పుడు నేను నాతో చాక్లెట్లు తీసుకెళ్లి నా స్నేహితుల ఇంట్లో వాటిని బాబాకి నివేదిస్తుంటాను. అయితే 2022, అక్టోబర్ రెండో వారంలో నేను చాక్లెట్లు తీసుకోవడం మర్చిపోయాను. దాంతో బాబాకి నివేదించడానికి ఏమీ లేవని చాలా  బాధపడ్డాను. ఆఫీసుకి చేరేవరకు నేను అదే ఆలోచిస్తూ నాలో నేను బాధపడుతున్నాను. అయితే బాబా తమ అద్భుతంతో  నన్ను తేలికపరిచారు. అదేమిటంటే, నా సహోద్యోగి ఒకరు శిరిడీ ప్రసాదం తెచ్చి, ఆ ప్రసాదంతోపాటు ఆ ప్రసాదం ప్యాకెట్‍లో ఉన్న ఒక బాబా ఫోటోను నాకు ఇచ్చింది. నేను వాటిని తీసుకుని నా సీటు దగ్గరకి వెళ్తుండగా మరో సహోద్యోగి నన్ను పిలిచి చాక్లెట్లు ఇచ్చింది. బాబా ప్రేమకు నాకు కన్నీళ్లు వచ్చేయగా నేను ఆమెకు కృతజ్ఞతలు చెప్పాను. తరువాత నా డెస్క్ దగ్గరకి వెళ్లి బాబా ఫోటో ఓ చోట ఉంచి, చాక్లెట్ బాబాకు నివేదించాను. నేను పొందిన ఆనందాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మనం ఏమీ చెప్పకపోయినా బాబా అంతా అర్థం చేసుకుంటారు. ఆయన నేను బాధపడకూడదని అన్నీ ఏర్పాటు చేశారు. అందువల్ల నేను మిగిలిన రోజంతా ఎటువంటి అపరాధ భావం లేకుండా తేలికగా ఉన్నాను. "ధన్యవాదాలు బాబా".


బాబా అందరిపై తమ ఆశీస్సులు ప్రసాదించు గాక!!!

సర్వేజనా సుఖినోభవంతు!!!


ఎంతో దయచూపిన బాబా


సాయి బంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు, మాది గుంటూరు జిల్లా. ఏడు సంవత్సరాల క్రితం మా అమ్మకి గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. అదేమిటంటే, ఆమె గుండె లెఫ్ట్ EF (Ejection Fraction) 35% ఉంది. అది ప్రమాదకర స్థితి. అయినప్పటికీ అమ్మ అప్పటికే వాడుతున్న కొన్ని మందుల వల్ల గుండెకు సంబంధించి మందులు వాడటానికి కుదరలేదు. అలా ఏడేళ్లు గడిచాక ఈమధ్య  2022, ఆగస్టులో నేను 3 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకుని అమ్మని హాస్పిటల్‍కి తీసుకు వెళ్ళాను. నేను హాస్పటల్‍కి వెళ్ళినప్పటినుంచి నిరంతరం సాయిని, "అమ్మకు ఆపరేషన్ అవసరం లేకుండా మందులతోనే నయమవుతుందని డాక్టర్ చెప్పాలి తండ్రి" అని ప్రార్థించాను. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, "ఇప్పుడు EF 45% ఉంది. ఆపరేషన్ అవసరం లేదు, మందులు వాడండి, చాలు" అని చెప్పారు. సాయిబాబా నా ప్రార్ధనను ఆలకించి ఎటువంటి మందులు వాడకుండానే EF 35% నుంచి 45%కి పెంచి నా యందు ఎంతో దయను చూపించారు. "బాబా! నేను మీకు సదా కృతజ్ఞుడనై ఉంటాను. ఆలస్యంగా ఈ అనుభవం పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి". ధన్యవాదాలు సాయినాథా.



3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Sai nannu vamsi ni kalupu sai na kapuram nilabettu sai pls nenu na anubhavamni blog lo panchukuntanu sai 😢🙏

    ReplyDelete
  3. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo