సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1355వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనోవాంఛలను నెరవేర్చే బాబా
2. సాయినాథుని ఆశిస్సులతో విజయవంతమైన శస్త్రచికిత్సలు
3. బాబా మహిమ అంటే ఇదేనేమో!

మనోవాంఛలను నెరవేర్చే బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ప్రతిరోజు సాయిభక్తుల అనుభవాలను అందిస్తూ, బాబాపై మరింత భక్తి, విశ్వాసాలను, నమ్మకాన్ని పెంచుతున్న ఈ బ్లాగును నిర్వహించే సాయికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బాబా ఆశీస్సులు మీ అందరిమీదా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయిభక్తురాలిని. మాది గుంటూరు అయినప్పటికీ మావారి ఉద్యోగరీత్యా మేము చెన్నైలో ఉంటున్నాము. మా పెద్దబ్బాయికి చాలా రోజుల వరకు మాటలు రాలేదు. మేము ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు, "మా అబ్బాయికి మాటలు వస్తే, నేను కాలినడకన కొండెక్కుతాను స్వామీ" అని శ్రీవెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నాము. తరువాత మూడున్నర సంవత్సరాల వయసప్పుడు 2020లో మా అబ్బాయి మాట్లాడటం మొదలుపెట్టాడు. అది కోవిడ్ సమయం కావడం వలన మేము తిరుపతికి వెళ్లలేకపోయాము. ఇప్పుడు మా అబ్బాయికి ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి. చాలా బాగా మాట్లాడుతున్నాడు. మేము తిరుపతి వెళ్లి మ్రొక్కు తీర్చుకోవాలని 2022, ఆగస్టులో తిరుపతి వెళ్లేందుకు మే నెలలో 300 రూపాయల టికెట్లు ఆన్లైన్లో బుక్ చేశాము. అయితే ప్రయాణ సమయానికి నాకు నెలసరి సక్రమంగా రాక సమయం దాటిపోయినా నెలసరి రాలేదు. నాకు చాలా భయమేసింది కానీ బాబాపై భారం వేసి తిరుపతికి ప్రయాణమయ్యాను. కొండ దిగువన నన్ను దింపి, మావారు మా ఇద్దరు పిల్లల్ని, మా పెద్దమ్మని తీసుకుని కారులో కొండపైకి బయలుదేరారు. అప్పుడు నన్ను వదిలి ఎప్పుడూ ఉండని సంవత్సరం తొమ్మిది నెలల వయస్సున్న మా చిన్నబాబు బాగా ఏడ్చాడు. నాకు కష్టంగా అనిపించి బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! బాబు ఏడవకుండా చూడండి. అలాగే ఇబ్బంది లేకుండా నేను కొండెక్కి మ్రొక్కు తీర్చుకునేలా అనుగ్రహించండి. మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా ఎంతో దయతో ఎలాంటి సమస్య రానివ్వకుండా నా మొక్కు తీర్చుకునేలా అనుగ్రహించారు. "ధన్యవాదాలు బాబా".


మా అక్కావాళ్ళు శ్రీగర్భ రక్షాంబికా అమ్మవారి గుడికి వెళ్లాలని చెన్నైలోని మా ఇంటికి వస్తే, తిరుపతి నుండి వచ్చిన నాలుగు రోజులకి మేము శ్రీగర్భ రక్షాంబిక అమ్మవారు, శ్రీస్వామి మలై, శ్రీచిదంబరం, శ్రీఅరుణాచలం దర్శనాలకి వెళ్ళాము. అప్పుడు నేను, "బాబా! ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యాత్ర బాగా జరగాలి. దర్శనాలు మంచిగా జరిగి మేము సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తే, నా అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటాను"  అని బాబాకి మాటిచ్చాను. యాత్ర అంతా సంతోషంగా, సురక్షితంగా జరిగేలా బాబా దయచూపారు. "థాంక్యూ సో మచ్ బాబా".


వినాయకచవితి నవరాత్రుల సమయంలో ఒక గురువారంనాడు మేము చీర కొనాలని చెన్నైలోని మైలాపూర్ వెళ్లాలని అనుకున్నాము. అప్పుడు నేను వినాయకుడికి నైవేద్యంగా ఇద్దామని ఉండ్రాళ్ళు తయారుచేసి సాయంత్రం ఇంటినుండి బయలుదేరాము. దారిలో వినాయకుడు కనిపిస్తే అక్కడ ఉండ్రాళ్ళు ఇవ్వాలన్నది నా ఆలోచన. మా ఇంటి దగ్గరలో ఒక వినాయకుడిని పెట్టడం నాలుగురోజులు ముందు మేము చూశాం. "అక్కడ ఉండ్రాళ్ళు ఇద్దాము" అన్నారు మావారు. కానీ నేను అందుకు ఒప్పుకోక, "ముందు ముందు ఇంకా పెద్ద వినాయకుడిని పెట్టి ఉంటారు. అక్కడ నివేదిద్దాం" అని అన్నాను. అయితే మేము వెళ్లే దారిలో ఒక్క వినాయకుడూ కనిపించలేదు. మైలాపూర్ చేరుకున్నాక అక్కడొక చోట బాగా లైటింగ్స్ పెట్టి ఉంటే నేను, నా భర్త చాలా ఆశతో అక్కడికి వెళ్ళాము. కానీ అక్కడ ఉన్నది వినాయకుడు కాదు. దాంతో అక్కడివాళ్ళను, "ఈ ప్రాంతంలో ఎక్కడ వినాయకుడిని పెడతారు?" అని అడిగాము. వాళ్ళు, "చెన్నైలో వినాయకుడిని ఇన్ని రోజులు ఉంచరు. ఎప్పుడో తీసేశారు" అని చెప్పారు. మేము మనవైపు తొమ్మిది రోజులు ఉంచుతారు కదా! అలాగే ఇక్కడ కూడా ఉంచుతారనుకున్నందున వాళ్ళు అలా చెప్పేసరికి చాలా నిరాశచెందాం. దాంతో చీర కొనాలన్న ఆసక్తి లేకుండా పోయింది. కానీ చీర తప్పనిసరిగా కొనాల్సి ఉంది. అందువల్ల షాపుకి వెళ్లి ఐదు నిమిషాల్లో ఏదో ఒక చీర తీసుకున్నాను. షాపు నుండి బయటకు వచ్చాక నేను నా భర్తతో, "బాబా గుడికి వెళదామా?" అని అడిగాను. ఆయన సరేనని గుడికి తీసుకెళ్లారు. మైలాపూరులోని ఆ బాబా గుడి చాలా ఫేమస్. అదీకాక, ఆరోజు గురువారం అవటం వల్ల చాలామంది జనం ఉన్నారు. అయినా క్యూలోకి వెళ్లి, 30 నిమిషాల్లో బాబా దగ్గరకి చేరుకున్నాం. నేను రెండు బాక్సుల్లో ఉండ్రాళ్ళు తీసుకెళ్ళాను. వాటిలో ముందుగా ఒక బాక్స్ బాబాకి నివేదించమని అక్కడున్న పూజారికి ఇచ్చాను. కానీ నేను, నా భర్త 'కోవిడ్ సమయం కదా, మనం ఇచ్చేవి బాబాకి నివేదిస్తారా?' అని లోలోపల భయపడుతూ ఉన్నాము. కానీ పూజారి బాక్సులోని ఉండ్రాళ్ళు తీసుకుని బాబా నోటి దగ్గర పెట్టారు. బాబా రూపంలో వినాయకుడే నైవేద్యం తీసుకున్నారని మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. బాబా మనల్ని ప్రతిక్షణం కనిపెట్టుకుని ఉంటారు. మన ప్రతి కోరిక నెరవేరుస్తారు.  "థాంక్యూ బాబా".


సాయినాథుని ఆశీస్సులతో విజయవంతమైన శస్త్రచికిత్సలు


సద్గురు శ్రీ శిరిడీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు శ్రీకాంత్. నేను గతంలో పంచుకున్న ఒక అనుభవంలో పరీక్షల సమయంలో మా అమ్మాయి అపెండిక్స్ సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురైందని, 'పరీక్షలు పూర్తయ్యేవరకు నా బిడ్డకు ఎలాంటి ఆపద కలగకుండా చూడమ'ని శ్రీసాయినాథుని వేడుకున్నామని పంచుకున్నాను. ఆ తండ్రి ఆశీస్సులతో మా అమ్మాయి పరీక్షలు బాగా వ్రాసి, మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. దసరా సెలవులలో సమస్య నుండి పూర్తిగా విముక్తురాలిని చేయాలని మా అమ్మాయికి మళ్ళీ స్కానింగ్ చేయిస్తే అప్పటివరకు ఉన్న అపెండిక్స్ సమస్యతోపాటు మరో సమస్య గర్భాశయంలో చిన్న గాలిబుడగ ఉన్నట్టు బయటపడింది. డాక్టరు శస్త్రచికిత్సలు చేయాలని అన్నారు. మేము చాలా ఆందోళన చెంది మనసులో ఆ సాయినాథుని తలచుకుని, "నా బిడ్డకు ఎలాంటి ఆపద, ఇబ్బంది లేకుండా శస్త్రచికిత్స సులభంగా అయ్యేవిధంగా చూడండి బాబా" అని వేడుకున్నాము. తరువాత రక్తపరీక్షలు నిర్వహించి, థైరాయిడ్ సమస్య కూడా ఉందని అనుమానంగా చెప్పడంతో మేము చాలా భయపడి మళ్ళీ ఆ సాయినాథుని, "థైరాయిడ్ సమస్య లేకుండా నా కూతురిని కాపాడండి" అని వేడుకుని మరోసారి రక్తపరీక్ష చేయించాము. నా బాధను ఆలకించిన ఆ శిరిడీ సాయినాథుడు నా బిడ్డకు థైరాయిడ్ సమస్య లేకుండా చేశారు. అప్పుడు నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే డాక్టరు, "అపెండిక్స్ మరియు గర్భాశయానికి సంబంధించి రెండు శస్త్రచికిత్సలు ఒకేసారి చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదో ఒక ఆపరేషన్ ముందు చేస్తాము" అని చెప్పారు. నేను, "బాబా! ఎలాగైనా నా బిడ్డకు రెండు ఆపరేషన్లు ఒకేసారి అయ్యేలా చూడు తండ్రీ. మీ అనుగ్రహాన్ని తప్పకుండా బ్లాగులో పంచుకుంటాను" అని ఆ సాయినాథుని వేడుకున్నాను. మొదటి ఆపరేషన్ పూర్తయిన తర్వాత డాక్టరు నన్ను ఆపరేషన్ థియేటర్‌లోనికి పిలిచి, "రెండో ఆపరేషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను" అని చెప్పారు. ఇది ఆ శిరిడీ సాయినాథుని ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. ఇప్పుడు మా అమ్మాయి ఆరోగ్యం కుదుటపడింది. నాకు, నా కుటుంబానికి ఆ సాయినాథుడే దిక్కు. ఆయన ఆశీస్సులు మాపై ఉన్నాయన్న దృఢవిశ్వాసంతోనే మేము జీవిస్తున్నాము. "ధన్యవాదాలు బాబా".


శ్రీ శిరిడీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబా మహిమ అంటే ఇదేనేమో!


నా పేరు మౌనిక. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.  నేను కొన్నిరోజులపాటు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడ్డాను. ఒక నెలరోజులు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చివరికి వరుసగా మూడు రోజులు నేను ఏం తిన్నా చాలా నొప్పి వస్తుండేది. నేను ఆ నొప్పిని  తట్టుకోలేక చాలా ఏడ్చాను. అప్పుడొక రోజు నేను, నా ఫ్రెండ్ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే తను నాతో శ్రీసాయినాథ స్తవనమంజరి గురించి, బాబా మహిమల గురించి, ఇంకా తన అనుభవాల గురించి నాతో పంచుకుని, స్తవనమంజరి పుస్తకం నాకు ఇచ్చింది. వాస్తవానికి నేనూ సాయిభక్తురాలినే. కానీ నాకు స్తవనమంజరి గురించి  తెలియదు. నా ఫ్రెండ్ ఆ బుక్ గురించి చెప్పగానే నాకు చాలా సంతోషం కలిగింది. అప్పుడు నేను, "బాబా! ఈ గ్యాస్ట్రిక్ సమస్య శాశ్వతంగా నయమైతే నేను ఈ స్తవనమంజరి మూడుసార్లు చదువుతాను. అలాగే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. మూడు రోజుల తరువాత నేను అనుకోకుండా మా సొంతూరు వెళ్లాను. అక్కడ ఆయుర్వేద మందులు వాడటంతో నా ఆరోగ్యం నార్మల్ అయిపోయింది. బాబా మహిమ అంటే ఇదేనేమో! ఈ అనుభవం ద్వారా 'నేను ఉన్నాను నీకు' అంటూ బాబా ధైర్యాన్ని ఇచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". నా ఫ్రెండ్‌కి కృతజ్ఞతలు.



5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and leg pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  3. Om sairam nannu na barthani kalupu sai na kapuram nilabettu sai nenu na anubhavanni blog lo panchukuntanu sai

    ReplyDelete
  4. Dhayachesi kapadu baba please Aya nenu xhala rojulu nunchi na pelli vishyamalo naku manasuki nachina abbaine kavi Lani evaru enana nuvu vunavane assha tone vunanu kadha Aya ipudu edhite jaragakudadhu anukunano akadike nanu netesav anta sunyam ga vundhi naku e pelli istam ledhu age ayidhani relatives andharu matalu antunaru naku chachipovalani pistundhi dhayachesi kapadu please baba chala narakam ga vundhi na namakanj odichaku asalu naku bhatukumedha ashe chachipotundhi please

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo