సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా అనుగ్రహాన్ని పొందిన కొంతమంది


    1) హరిద్వార్‌బువా                  2)అబ్దుల్ ఖాదిర్
    3)మహమ్మద్ ఖాన్                  4)నూరుద్దీన్
    5)షేక్ అబ్దుల్లా                         6)అన్వర్ ఖాన్
    7)హిడాబేగ్                                8)అన్వర్‌ఖాన్ కాజీ
    9)మద్దూషా ఫకీరు                    10)ఒక మహమ్మదీయుడు

ఇమాంభాయ్ చోటేఖాన్ చెప్పిన కొన్ని వివరాలు:

హరిద్వార్‌బువా

శిరిడీలో ఎనిమిది రోజులుండిన హరిద్వార్‌బువాకు ఒక గొప్ప అనుభవం కలిగింది. అతను శిరిడీ పొలిమేరలోనున్న సెలయేటిలో స్నానం చేయడానికి బయలుదేరే సమయానికి ఒక పిచ్చుక వచ్చి అతని తలపై కూర్చునేది. అతను సెలయేట్లో స్నానం చేస్తున్నప్పుడు మాత్రం పిచ్చుక అక్కడున్న వేపచెట్టు పైకి వెళ్ళి వేచివుండేది. అతను స్నానం ముగించిన తరువాత తిరిగి వచ్చి తలపై కూర్చునేది. నేను, ఇతర భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూశాము. మేమందరం బాబా వద్ద ఉన్న సమయంలో, "ఈ దృశ్యం దేన్ని సూచిస్తుందో చెప్పమ"ని బాబాను అర్థించాడు బువా. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటీవాడాను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు:

"లా ఇల్ల ఇల్లిల్లాహ్ క్యా బడా దర్బార్ హై౹౹
మున్షీజీతో అందాయి హై, సర్దార్‌జీ చుతీ హై॥
అల్లా మాలిక్ హై, అల్లా అచ్ఛాకరేగా౹౹"

బాబా మాటలు (1917-18లో) నిర్మాణంలో ఉన్న బూటీవాడాను సూచిస్తున్నాయి. ఆ బూటీవాడానే నేడు ఎందరో భక్తులను ఆదరిస్తున్న పెద్ద దర్బార్. మున్షీజీలు, సర్దార్లు మొదలైన ఎంతోమంది అక్కడికి వస్తున్నారు.

అబ్దుల్ ఖాదిర్


1915వ సంవత్సరంలో అబ్దుల్ ఖాదిర్ అనే అతను శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడొకరోజు తకియా వద్ద కూర్చుని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్, "నాకు సన్యాసి కావాలని ఉంది. నాకు 'సన్యాసం' (ఫకీరీ)' ఇవ్వండి" అని బాబాను అర్థించాడు. పిడికిలిలో ఉన్న వస్తువేదో విసురుతున్నట్లు బాబా తమ పిడికిలిని అబ్దుల్ వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏదీ ఉన్నట్లు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటలలోను, ప్రవర్తనలోను మార్పు వచ్చింది. బాబా వలె మాట్లాడుతూ అందరికీ నైతిక సలహాలిచ్చేవాడు. ఒక్కొక్కసారి అర్థంకాని మాటలేవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు, రాళ్ళతో కొడతానని బెదిరించేవాడు. అతను భరించలేని విధంగా తయారయ్యాడు. అతని ప్రవర్తన వలన అతని సంబంధీకులు విసుగుచెంది అతన్ని అసహ్యించుకోసాగారు. బలవంతంగా తెచ్చుకున్న ఫకీరు స్థితిలో ఒకటిన్నర నెల గడిపాక ఒకరోజు అబ్దుల్ ఖాదిర్ మసీదు మంటపం దగ్గర ఉన్నప్పుడు బాబా ఎదురుపడి, "లావ్ బలే ఇదర్” అని పలుకుతూ పిడికిలితో అతని నుండి ఏదో లాక్కుంటున్నట్లు లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తరువాత 15 రోజులు శిరిడీలో ఉండి బాబా అనుమతితో కిర్కి వెళ్ళి అక్కడ బాబాజాన్ సమాధి ఉన్న వేపచెట్టు ఎదురుగా బీడీకొట్టు పెట్టుకుని జీవనం సాగించాడు.

అబ్దుల్ ఖాదిర్ మదర్‌ఆలీకి గురువు. మదర్‌ఆలీ ఒక ఖాజా. అతను అప్పట్లో శిరిడీలో ఉండేవాడు. తరువాత కాలంలో అతడు ఏవలాలో ఉన్నాడు. అబ్దుల్ ఖాదిర్ ఇతర మహమ్మదీయులతో కలిసి ‘నమాజ్’, ‘అజర్’ చేసేవాడు. ప్రతిదినం పగటిపూట మసీదులో బాబా ముందు మౌలూ నిర్వహించబడేది. ఉదయం వేళల్లో తబలా, సారంగీ మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్వహించబడేది. మండపంలో 'తబోత్' నిర్మించమని ఆదేశించి, దాని నిర్మాణానికి అవసరమైన డబ్బులు కూడా ఇచ్చారు బాబా. తబోత్ నిర్మాణ సమయంలో మాంసం, కిచిడీ తయారుచేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండప నిర్మాణం జరిగిన తరువాత ఆ కార్యక్రమాలు నిలిపివేశారు. బాబా తాము స్వయంగా 'ఫత్యా' చదవడంగానీ, ఇతరులచే చదివించడంగానీ చేసేవారు. బాబా సశరీరులై ఉన్నప్పుడు, ముస్లింలందరూ మసీదులో నమాజు చేయడానికి వచ్చేవారు. అది ఈనాటికీ కొనసాగుతోంది. బాబా కూడా వారితో కలసి నమాజు చేసేవారు. “బాబా ధుని దగ్గర నిలుచుని నమాజు చేయడం స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరులవలె మోకాళ్ళపై కూర్చోవడంగానీ, వంగడంగానీ చేసేవారు కాదు” అని ఇమాంభాయ్ చోటేఖాన్ చెప్పాడు.

మహమ్మద్ ఖాన్

నేవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా శిరిడీ వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెరవెనుక బాబా మహల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోపలికి చూశాడు. ఆశ్చర్యమేమిటంటే, అతనికి బాబా కనిపించలేదు. అంతటితో అతనికి మతి చలించి వింతగా ప్రవర్తించసాగాడు. అతనిని తీసుకుని వెళ్ళటానికి నేవాసా నుండి అతని తమ్ముడు శిరిడీ వచ్చాడు. బాబా అతనికి ఊదీ ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు.

నూరుద్దీన్ 

ఒకసారి నూరుద్దీన్ అనే సైనికదళానికి చెందిన ఒక అశ్వసైనికుడు శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. వెంటనే తిరిగి వెళ్ళడానికి బాబాను అనుమతి కోరాడు. బాబా వెంటనే వెళ్లేందుకు అనుమతించక, "మరుసటిరోజు వెళ్ళమ"ని చెప్పారు. అందుకతను ‘తన దళం ముందుకు వెళ్తున్నందున తానక్కడ ఆగలేన’ని చెప్పాడు. బాబా అతని చేతిలో ఊదీ పెట్టి ఉర్దూలో ఏవో మాటలు అన్నారు. వాటి అర్థం ఏమంటే "గొయ్యి త్రవ్వు - ఊదీ తిను!” అని. అతను ఊదీ తీసుకుని గుర్రంపై స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపర్‌గాఁవ్ వద్ద అతనికి శవాన్ని మోసుకుంటూ వెళ్తున్న దృశ్యమొకటి కనిపించింది. అతను తన గమ్యం చేరుకున్నాడు. కానీ ఆ శవదృశ్యం మాత్రం అతనిని వీడిపోలేదు. ఆ శవదృశ్యం కనపడినరోజు అతను తృప్తిగా భోంచేసేవాడు. ఆ దృశ్యం కనపడనిరోజు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల భోజనం చేయలేకపోయేవాడు. దీనితో విసిగిపోయిన అతను తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. బాబా మాటలు విననందుకే తనకు ఈ దుస్థితి ప్రాప్తించిందని తెలుసుకుని తిరిగి శిరిడీ చేరి ఆరునెలల పాటు అక్కడ గడిపాడు. క్రమేణా అతను ఆ శాపం నుండి విముక్తుడయ్యాడు. తరువాత బాబా అనుజ్ఞ తీసుకుని వెళ్లిపోయాడు. తరువాత అతను దెవ్లాలిలో కిరాణాకొట్టు నడుపుకుంటూ జీవనం సాగించాడు.

షేక్ అబ్దుల్లా

బాబా నాకు తెలిసిన ఇద్దరు మహమ్మదీయుల ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడ్డారు. వజాపూర్‌కి చెందిన షేక్ అబ్దుల్లా శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనితో వైరాగ్యంగా మాట్లాడుతూ, “మనం ఈరోజు చనిపోయినా, ఎల్లుండికి మూడవరోజు! ఇల్లు, భూములు, ఆస్తుల వల్ల మనకేమి ఉపయోగం?” అన్నారు. అబ్దుల్లా తిరిగి స్వగ్రామానికి వెళ్లి ఇంటిని, ఆస్తిని భార్యాబిడ్డలకి అప్పగించి విరాగియై వీధుల వెంబడి తిరగడం ప్రారంభించాడు. రాత్రిళ్ళు సమాధుల వద్ద ఏదో గొణుగుకుంటూ గడిపేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదంటే ఆహార విషయం పట్టించుకోక పస్తుండేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాలు జీవించి ఆ తరువాత మరణించాడు. ఆ 12 సంవత్సరాలలో అతనికి అద్భుతశక్తులు ప్రాప్తించాయి. ఒకసారి ఇమాంభాయ్ చోటేఖాన్ పనిమీద వెళుతుంటే అబ్దుల్ అతన్ని ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి, ఆ ప్రదేశంలో పాముందని హెచ్చరించాడు. వెళుతున్నది పగటిపూటే కాబట్టి చోటేఖాన్ అతని మాటలు లక్ష్యపెట్టకుండా వెళ్ళాడు. కానీ చిత్రంగా అతను చెప్పిన ప్రదేశంలోనే పాము కనిపించింది. ఆ ఊరిలో అబ్బాస్ సేఠ్ అనే బీడీ వర్తకుడు ఒకడుండేవాడు. అతనొకసారి అబ్దుల్లాను, "ఎందుకిలా భార్యాబిడ్డలను వదిలి పిచ్చివాడిలా తిరుగుతున్నావు?" అనడిగాడు. అందుకు అబ్దుల్లా, “నువ్వు తెలుసుకుంటావులే!" అన్నాడు. “తెలుసుకునేదేముంది? ఇది నిజంగా పిచ్చే!" అన్నాడు అబ్బాస్ సేఠ్. అబ్దుల్లా పిడికిలి బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్‌పై విసురుతున్నట్లు విసిరి, “నువ్వూ అలాగే అయిపో!” అన్నాడు. అంతటితో అబ్బాస్ సేఠ్ భార్యాబిడ్డలను, వ్యాపారాన్ని అన్నింటినీ విడిచిపెట్టి పిచ్చివాడై వీధుల వెంబడి తిరగసాగాడు.

అన్వర్ ఖాన్

భోపాల్‌లో (వర్షడ్, బెహర్) అన్వర్‌ఖాన్ అనే ముస్లిం ఉండేవాడు. అతడొకసారి శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతను బాబాతో, “నాకు ఈ సంసారం వద్దు" అని చెప్పాడు. అతను చావడిలో 12 నెలలు నివసించాడు. బాబా అతనికి ఖురాన్ మొదటి అధ్యాయంలోనున్న "బిస్‌మిల్లా కుళియ హియో వల్కఫిరోనో నాబుడో మాబుదానా" అనే మంత్రాన్ని 101 మార్లు అర్థరాత్రి వల్లించమని ఆదేశించారు. తరువాత “దవూత్” వల్లించమన్నారు. బాబా అతనికి పేడా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్‌కు వెళ్ళమని ఆదేశించారు. అన్వర్‌ఖాన్ శిరిడీ నుండి బొంబాయి వెళ్ళాడు. అక్కడ కాశిం అనే హాజీ కలిసి ప్రయాణపు ఖర్చులిచ్చి అతనిని అరేబియా పంపాడు. అన్వర్ అరేబియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు.

హిడాబేగ్

ఔరంగాబాదు సమీపంలోని కనాడ్‌కు చెందిన హిడాబేగ్ అనునతడు ఒకసారి శిరిడీ వచ్చి కొన్నిరోజులు గడిపాడు. అప్పుడు ఢిల్లీకి చెందిన మౌల్వీ యాకూబ్ కూడా శిరిడీలోనే ఉన్నాడు. అతను రాత్రిగానీ, పగలుగానీ మంటపంలో కూర్చుని ఖురాన్ చదువుతూ ఉండేవాడు. ఒకరాత్రి 8 గంటల సమయంలో బాబా హిడాబేగ్‌తో, “నువ్వు ఇక్కడ ఉండవద్దు. కనాడ్ (ఔరంగాబాద్) దగ్గర ఉన్న కంటోన్మెంటుకు వెళ్లు! నీ పేరు ‘పంజాబ్ షా’గా మార్చుకో! అక్కడ కూర్చుని దొరికింది తిను!” అన్నారు. అతడలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. అతడిని ఒక గొప్ప సాధువుగా అందరూ గౌరవిస్తారు.

అన్వర్‌ఖాన్ కాజీ

అహ్మద్‌నగర్‌కు చెందిన 65-70 సంవత్సరాల అన్వర్‌ఖాన్ కాజీ, తేలీకాకూట్‌లో ఉన్న మసీదును పునర్నిర్మించాలని సంకల్పించాడు. దానికి కావలసిన నిధుల కోసం అతను శిరిడీ వచ్చి బాబాను అభ్యర్థించాడు. మూడు, నాలుగు రోజుల తరువాత ఒకనాడు బాబా మసీదు ఎదురుగానున్న రాతిపై కూర్చుని ఉన్నారు. ఇమాంభాయ్ చోటేఖాన్ కూడా అక్కడున్నాడు. బాబా అన్వర్‌ఖాన్‌తో, “ఆ మసీదు నీ నుండి కానీ, ఇతరుల నుండి కానీ డబ్బు స్వీకరించదు. తనకు కావల్సిన సొమ్ము అదే సమకూర్చుకుంటుంది. మసీదులోని నింబారు క్రింద మూడడుగులు త్రవ్వితే నిధి లభిస్తుంది. దానితో మసీదు పునర్నిర్మాణం చేయి!" అని చెప్పారు. కాజీ అహ్మద్‌నగర్ వెళ్ళి నింబారు వద్ద త్రవ్వితే నిధి లభించింది. ఆ డబ్బుతో మసీదును పునర్నిర్మించాడు. తరువాత అతను శిరిడీ వచ్చి తకియాలో కూర్చుని ఉన్న చోటేఖాన్ తదితరులతో ఆ విషయం చెప్పాడు.

మద్దూషా ఫకీరు

ఖాందేష్‌లోని జలగాంలో ఉన్న మీరాన్‌కు చెందిన మద్దూషా ఫకీరు సుమారు 1913 ప్రాంతంలో శిరిడీ వచ్చాడు. అతను బాబాను దర్శించి, తనకు అత్యవసరంగా 700 రూపాయలు కావాలని దుఃఖించాడు. బాబా అతనికి 700 రూపాయలు ఇవ్వమని బాపూసాహెబ్ జోగ్‌తో చెప్పారు. జోగ్ 700 రూపాయల వెండినాణేలు తెచ్చి బాబా ముందు పెట్టాడు. కొండాజీ కొడుకు గులాబ్, లక్ష్మణ్ బాలాభాస్కర్ షింపీ అను ఇద్దరు బాలురను పిలిచి ఆ డబ్బును మంటపం దగ్గర కూర్చుని ఉన్న ఫకీరుకు ఇవ్వమని బాబా ఆదేశించారు. ఆ బాలురు ఆ డబ్బులోనుండి 200 రూపాయలు కాజేసి, మిగిలిన 500 రూపాయలను ఫకీరుకిచ్చారు. ఫకీరు తిరిగి బాబా దగ్గరకొచ్చి తనకు 500 రూపాయలు మాత్రమే ముట్టాయని శోకించాడు. రెండు మూడు రోజులు అతడు అసంతృప్తిగా ఏదో గొణుగుకుంటూ గడిపాడు. బాబా మాత్రం మౌనంగా ఉన్నారు. తరువాత బాబా అతనికి ఊదీ ఇచ్చారు. దాంతో అతను బాబా వద్ద అనుమతి తీసుకుని వెళ్లిపోయాడు. అతను నడుచుకుంటూ శిరిడీ నుండి రెండు మైళ్ళ దూరంలో ఉన్న నీంగాఁవ్ చేరుకునేసరికి ఒక టాంగా వచ్చి అతని ముందు ఆగింది. నిజాం రాష్ట్రంలో తాహసీల్దారుగా పనిచేస్తున్న ఐరస్ షా అను పార్శీమతస్థుడు టాంగా నుండి దిగి ఫకీరును పలకరించాడు. ముందు ఫకీరుకు ఆహారం పెట్టి, తరువాత 200 రూపాయలు ఇచ్చి, “ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా?" అని అడిగాడు. తరువాత ఐరస్ షా శిరిడీ వచ్చి, తూర్పుదిశగా గ్రామ సరిహద్దులో ఉన్న తాత్యాపాటిల్ క్రొత్తింటికి వెళ్ళి అక్కడున్న వారందరితో, “తనకు గతరాత్రి బాబా కలలో కన్పించి, “టాంగాలో శిరిడీ రమ్మని, నీంగాఁవ్ సమీపంలో పులితోలు చంకన పెట్టుకుని నడిచివస్తున్న ఫకీరొకడు ఎదురుపడతాడని, ఫకీరు ఆకలిగా ఉంటాడు కాబట్టి అతడికి ఆహారం పెట్టమని, తరువాత అతనికి 200 రూపాయలు ఇవ్వమ”ని ఆదేశించినందువల్ల తాను ఆహారం, డబ్బు తీసుకుని టాంగాలో వచ్చి వాటిని ఆ ఫకీరుకు ఇచ్చాన”ని చెప్పాడు.

ఒక మహమ్మదీయుడు

నైజాం రాష్ట్రంలో వైజాపూర్ తాలూకాలో ఉన్న లాసుర్ గ్రామానికి చెందిన ఒక మహమ్మదీయుడు ఒకసారి శిరిడీ వచ్చాడు. అతను బాబాను దర్శించి తనకు అత్యవసరంగా 4000 రూపాయలుగానీ, 5000 రూపాయలుగానీ కావాలని అభ్యర్థించాడు. బాబా అతడిని 'మర్రిచెట్టు క్రింద మలవిసర్జన చేయమని, అప్పుడతనికి నాణేలు నిండి ఉన్న బిందె ఒకటి దొరుకుతుంద'ని చెప్పారు. మరుసటి ఉదయం అతను మలవిసర్జన చేశాక శుభ్రం చేసుకునేందుకు లేచి నాలుగడుగులు వేయగానే అతని కాలికి బరువైన బిందె తగిలింది. దానినిండా నాణేలున్నాయి. అది చాలా బరువుగా ఉన్నందువల్ల అతను దాన్ని లేపలేకపోయాడు. దాంతో అతను చావడిలో ఉన్న బాబా దగ్గరికి వచ్చాడు. మరొకరిని తోడు తీసుకుని తిరిగి వెళ్ళేసరికి ఆ బిందె అక్కడ లేకపోవడంతో అతను శోకించాడు. “ఆ బిందెను రూయీకి చెందిన గణూకాడు అనునతడు తీసుకుని వెళ్ళిపోయాడని, ఇక తామేమీ చేయలేమ”ని బాబా చెప్పారు. ఆ మహమ్మదీయుడు తన దురదృష్టానికి దుఃఖిస్తూ వెనుదిరిగాడు. ఆ నిధిని తీసుకుపోయిన గణూకాడు గొప్ప ధనవంతుడయ్యాడు.

Source: http://saiamrithadhara.com/mahabhakthas/chote_khan.html
devotee’s experience of saibaba by b.vi. narasimha swamy. 

సాయిభక్తుల అనుభవమాలిక 518వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సాయి దివ్యపూజ సమయంలో బాబా ప్రసాదించిన అనుభవాలు - మొదటి భాగం 

సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకి బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:

ఓం సద్గురవే నమః 
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి 

ఓం ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయినే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే, పంచమం పరమాత్మాయ, షష్టంచ శిరిడివాసినే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే, నవమం నిరాడంబరాయ,  దశమం దత్తావతారనే - ఏతాని దశనామాని త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వ కష్ట భయోన్ముక్తో సాయినాథ గురోకృపా!

‘సాయి మహారాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి, సాయిబంధువులకు నా నమస్కారాలు. శ్రీ శిరిడీ సాయినాథుని దివ్యపాదాలకు నమస్కరిస్తూ సాయి దివ్యపూజ సమయంలో బాబా ప్రసాదించిన అద్భుతలీలలను సాయిబంధువులతో పంచుకోబోతున్నాను. 

మొదటి అనుభవం: 

ప్రతి ఉదయం బాబా దర్శనాలతో మేల్కొనే నాకు 2020, జనవరి చివరివారంలో బ్రాహ్మీముహూర్తంలో బాబా దర్శనమిచ్చారు. అప్పుడు బాబా తమ నోటిలో తెల్లటి పొగ వంటి వాయువును బంధించి ఉన్నారు. ‘బాబా తమ నోటిలో తెల్లటి వాయువును ఎందుకు బంధించారా?’ అని ఆలోచించాను. నాకేం అర్థం కాలేదు. మరొకరోజు ‘రామరక్షాస్తోత్రం’ చదవమని బాబా సూచిస్తున్నట్లు దర్శనమైంది. “సాయీశ్వరుడు ఉండగా భయమెందుకు? అంతా ఆ సద్గురువే చూసుకుంటార”ని నిశ్చింతగా ఉండిపోయాను. ఆ తరువాత, నవగురువార వ్రతం చేసే నాకు సాయి దివ్యపూజ చేయాలని గాఢంగా అనిపించింది. ఐదు వారాలు పూజ చేయాలని సంకల్పించుకుని, కోరకనే సర్వం ప్రసాదిస్తున్న సాయీశ్వరునికి మనసారా సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుకుని, కోరికలతో కాకుండా దివ్యపూజను బాబాకు ప్రేమతో చేయాలని 2020, ఫిబ్రవరి 27, గురువారంనాడు సాయి దివ్యపూజ ప్రారంభించాను. అయితే, దివ్యపూజలో ‘కోరికలు చెప్పుకొని ముడుపుకట్టాలి’ అని ఉంది. దాంతో, ‘నా తండ్రి సాయీశ్వరునికి కాక ఎవరికి చెప్పుకోను నా కోరికలను?’ అని అనుకుని, ఒక బిడ్డగా కొన్ని కోరికలను నా సాయితండ్రికి విన్నవించుకుని రెండు రూపాయలు ముడుపుకట్టాను. 108 నామాలతో, 108 పువ్వులతో పూజ చక్కగా, శ్రద్ధగా చేశాను. కిచిడీ తయారుచేసి బాబాకు నైవేద్యంగా సమర్పించుకున్నాను. హారతి పూర్తి కాగానే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ ప్రశాంత మనస్సుతో బాబాను ధ్యానించాను. అద్భుతం! అపారప్రేమతో బాబా క్షణాల్లో నాకు ధ్యానస్థితిని కలిగించారు. ధ్యానంలో, పచ్చని పంటపొలాలు, ఆ పొలంలో రైతులు కనిపించారు. నేను ఆ రైతులను చూస్తున్నాను. వాళ్ళు నన్ను కోపంగా చూస్తున్నట్లుగా ఉన్నారు. సూర్యకిరణాల తీవ్రతకు వాళ్ళ మొహాలు అలా కనబడుతున్నాయేమోనే భ్రమతో నేను పొలంలోకి వెళ్ళాను. ఆ రైతులు పొలం సరిహద్దులగుండా వెళ్తున్నారు. ఆ రైతులను నేను గమనిస్తున్నాను. నేను చూస్తుండగానే ఆ రైతులలో ఒకరు తెల్లటి వస్త్రాలతో, భుజాన జోలెతో సాయిబాబాగా దర్శనమిచ్చారు. క్షణాలలో జాగ్రదావస్థలోకి వచ్చాను. నా మనసు చాలా ప్రశాంతంగా, తేలికగా ఉంది. ఆ పచ్చని పంటపొలాలు, రైతులు, సరిహద్దులు, బాబా ప్రత్యక్షమవడం చాలా స్పష్టంగా ఉంది. ఆ మధ్యాహ్నం భోజనం చేద్దామని కూర్చున్నాను. అప్పుడు, కిచిడీలో ఉప్పు వేయడం మరచిపోయానని గుర్తుకు వచ్చి, బాబాకు క్షమాపణలు చెప్పుకుని, మిగిలిన కిచిడీలో ఉప్పు వేసి బాబాకు నైవేద్యంగా సమర్పించి, హారతి ఇచ్చి, భోజనానికి కూర్చున్నాను. ధ్యానంలో నాకు బాబా పొలంలో ఉన్నట్టు దర్శనమిచ్చారని మావారితో చెప్పాను. ‘దాని అర్థం ఏమై ఉంటుందా?’ అని ఇద్దరం ఆలోచించాము, కానీ మాకు ఎంతకీ బోధపడలేదు. ఆ తరువాత కూడా ఆ విషయం గురించే ఆలోచించసాగాను. నేను కిచిడీలో ఉప్పు వేయడం మరచిపోయినా బాబా నా పూజను స్వీకరిస్తున్నారని, నేను కోరనివాటిని కూడా తాను చూసుకుంటానని చెబుతున్నట్లుగా అనిపించింది.

మేము కొంతకాలం క్రితం ఒక భూమిని కొనుక్కున్నాం. ఆ భూమిని మాకు అమ్మినవాళ్లు ఇటీవల ఫోన్ చేసి, "ఆ భూమి సర్వే నెంబర్, వేరొకరి సర్వే నెంబర్ ఒకటిగా ఉన్నందువలన రెండు మూడు రోజుల్లో భూమిని మళ్ళీ ఒకసారి సర్వే చేసి, సరిహద్దులు సరిగా ఉన్నాయో లేదో చూడాల"ని చెప్పారు. అయితే అసలు వాస్తవమేమిటంటే, మేము కొన్న భూమిని లాక్కొని, అదే సర్వే నెంబర్ మీద పనికిరాని వేరొక పొలాన్ని మాకు ఇవ్వాలనే దురుద్దేశ్యంతో వాళ్ళు ఫోన్ చేశారు. రాబోయే ఈ సమస్యనే నేను దివ్యపూజ ప్రారంభించిన రోజున బాబా నాకు ధ్యానంలో చూపించి, సరిహద్దులను చక్కగా చూపించారు. ముందుగానే సమస్యను పసిగట్టి మాలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు బాబా. అయితే వాళ్ళ దురుద్దేశ్యం తెలిసి మావారు కంగారుపడుతుంటే, “సద్గురువు సాయినాథుడు ఉండగా భయమెందుకు? అంతా బాబా చూసుకుంటారు” అని మావారికి ధైర్యం చెప్పాను. మేము పూర్తిగా బాబాపై విశ్వాసముంచాము. మేము విశ్వసించినట్లే బాబా దయతో మాకు రావాల్సిన భూమి మాకు వచ్చింది. దురుద్దేశ్యంతో మా భూమిని లాక్కోవాలని చూసి సర్వే జరిపించినప్పటికీ బాబా దయతో మునుపటి సరిహద్దుల కంటే ఇప్పుడు సరిహద్దులు చక్కగా ఉన్నాయి. ధ్యానంలో బాబా ఎక్కడెక్కడ సరిహద్దులు తిరిగారో అక్కడివరకు బాబా దయతో మాకు వచ్చింది. “మీకు నేనున్నాను” అని భూమి సరిహద్దులను కాపాడి బాబా మాకు న్యాయం చేశారు. "నా భక్తుల గృహకృత్యాదులలో కూడా సహాయం అందిస్తాను" అన్న బాబా మాటలు పొల్లుపోలేదు. "సర్వకాల సర్వావస్థలందు నేనున్నాను" అని బాబా అంటారు. అది నిజం! 'సాయిబాబా ఇప్పటికీ సజీవులే' అని నాకు మరోసారి దృఢవిశ్వాసం కలిగింది. “బాబా! మీరు అప్పుడూ ఇప్పుడూ సాకారంగా, నిరాకారంగా, నిశ్శబ్దంగా ఉంటూ భక్తులను కాపాడుతున్నారు” అని ఆనందాశ్రువులతో బాబాకు మనసారా నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కానీ, కొంతభాగం భూమిని అన్యాయంగా సర్వే నెంబర్ ఆధారం చేసుకుని మరొకచోట చూపారు. అయితే సద్గురు సాయి అండగా ఉండగా మాకు న్యాయం జరుగుతుంది. బాబా ప్రణాళికలు అద్భుతం. వాటిని మనం ఊహించలేము. అందుకే సహనంగా ఉన్నాము. సాయి తన బిడ్డలను ఎన్నటికీ నష్టపోనివ్వరు. “బాబా! మీ పాదాలే శరణం”.

రెండవ అనుభవం:

ఒకరోజు సాయిబాబా నన్ను రామరక్షాస్తోత్రాన్ని పఠించమని సూచిస్తున్నట్లుగా మెలకువ సమయంలోనే నాకు గాఢంగా అనిపించింది. అప్పటికే ఒకసారి ‘రామరక్షాస్తోత్రం’ పఠించమని బాబా సూచిస్తున్నట్లు దర్శనమై ఉన్నందువలన దాన్ని పఠించాలని అనుకున్నాను. నియమం ప్రకారం ప్రతి గురువారం సాయి దివ్యపూజ చేస్తున్న ఆ సమయంలోనే వీలుచూసుకుని రాత్రి వేళల్లో రామరక్షాస్తోత్రాన్ని పఠించడం ప్రారంభించాను. శ్రీరామచంద్ర ప్రభువు దివ్యమంగళరూపాన్ని బుధకౌశికమహర్షి వర్ణిస్తూ, రామరక్షాస్తోత్రాన్ని చదివే భక్తుని శరీరభాగాలను రామచంద్ర ప్రభువు రక్షిస్తారని వర్ణించారు. ‘రామా, రామా’ అని ఘోషించడం సంసార బీజాలను వేయించేది, సమస్త సంపత్తులను ప్రాప్తింపజేసేది, యమదూతలను భయభీతులనొనర్చునదై ఉన్నది. శంకర భగవానుడు ‘రామా’ అనే నామంలోనే లయమై ఉంటానని పార్వతీదేవికి చెప్పే సందర్భంలో నేను ఆనందానికి లోనయ్యాను. రామరక్షాస్తోత్రాన్ని నన్ను చదవమని బోధించడం ద్వారా ‘బాబా నన్ను ఎంతలా కనిపెట్టుకొని ఉన్నారా!’ అని నా కళ్లలో ఆనందాశ్రువులు పొంగిపొర్లాయి. రామరక్షాస్తోత్రం చదవడం ప్రారంభించాక, నాకు హనుమాన్ ప్రభువు రామనామాన్ని జపిస్తూ దర్శనమిచ్చారు. మరోసారి ఉదయం మెలకువలోనే నాకు ఒక ఏనుగు కనిపించింది. ఆ  ఏనుగు మూలాధార చక్రం (గుదస్థానం) నుండి నేను లోపలికి ప్రవేశించాను. లోపలంతా ఎర్రటి వర్ణంలో ఉంది. నేను వెళ్ళగా వెళ్లగా సహస్రారచక్రం వద్ద ధ్యానంలో కూర్చున్న ఆంజనేయస్వామి దర్శనమిచ్చారు.

మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో పంచుకుంటాను.


సాయిభక్తుల అనుభవమాలిక 517వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ప్రేమబంధాన్ని నిలిపిన బాబా
  2. బాబా ఆశీస్సులతో వచ్చిన ఉద్యోగం

ప్రేమబంధాన్ని నిలిపిన బాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు: 

అందరికీ హాయ్! నేను సాయిభక్తురాలిని. బాబా నాకు చాలా అద్భుతమైన అనుభవాలను ప్రసాదించారు. వాటిలో ఒకదాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. బాబా పట్ల నాకున్న కృతజ్ఞతాభావాన్ని తెలియజేయడానికి ఇది ఒక మార్గమని నేను భావిస్తున్నాను. నేనొక వ్యక్తిని ఇష్టపడ్డాను. అతను నన్ను చాలా బాగా అర్థం చేసుకున్న వ్యక్తి. జీవితంలో కావాల్సినంత ఆనందాన్ని నాకు ఇవ్వడానికి తనవంతు ఎంతో గొప్పగా ప్రయత్నించాడు. అయితే త్వరగా నిగ్రహాన్ని కోల్పోయే స్వభావం నాది. క్షణాల్లో నాకు కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో నేను అనే మాటలపై నాకు నియంత్రణ ఉండేది కాదు. శాంతస్వభావి అయిన తను మాత్రం చెడు సమయాల్లో సైతం నాతో చక్కగా నడుచుకునేవాడు. అలా తనతో నా అనుబంధం ఆరున్నర సంవత్సరాలు చాలా చక్కగా సాగింది. అందుకు నేనెంతో అదృష్టవంతురాలిగా భావించాను. 

అతని అభిరుచులు ఇష్టపడి తనతో ఒక స్త్రీ మాట్లాడుతుండేది. అతను నాకే సొంతమన్న స్వార్థంతో నేను అది సహించలేక అతనితో గొడవపడ్డాను. అంతటితో అతను ఆ స్త్రీతో మాట్లాడటం మానేయడంతో నేను చాలా సంతోషించాను. అయితే కొన్నినెలల తర్వాత ఆ స్త్రీ మళ్ళీ నాకు సమస్యగా మారింది. ఆ సమయంలో అతను తన స్వేచ్ఛని కోల్పోతున్నానని, మొదటినుండి అనేక విషయాలలో రాజీపడుతూ జీవితం గడపాల్సి వస్తోందని భావించాడు. ఇలాంటి జీవితాన్ని గడపడంలో అర్థం లేదని నన్ను విడిచిపెట్టి మా సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతటితో అతను నాతో మాట్లాడటం మానేశాడు.

తరువాత నేను అతని విలువను గ్రహించాను. నా జీవితంలోకి అతను తిరిగి రావాలని కోరుకున్నాను. నేను నా ఆత్మాభిమానాన్ని వదులుకుని మరీ అతన్ని ఒప్పించటానికి అన్నివిధాలా ప్రయత్నించాను, కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు బాబా పట్ల పూర్తి విశ్వాసమున్న నేను, "బాబా! మేము మళ్ళీ కలిసేలా ఆశీర్వదించి మమ్మల్ని శిరిడీకి రప్పించుకోండి" అని బాబాను మనసారా ప్రార్థించాను. అంతేకాదు, "మమ్మల్ని శిరిడీకి పిలిచేవరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల తర్వాత నేను ఆహారాన్ని తీసుకోను" అని బాబాకు చెప్పుకున్నాను. ఆ సమయంలో నా స్నేహితురాలు '9 గురువారాల సాయి వ్రతం' చేయమని నాకు సలహా ఇచ్చింది. నేను వెంటనే వ్రతాన్ని ప్రారంభించాను. 5వ గురువారం అద్భుతం జరిగింది. అతను తిరిగి నా జీవితంలోకి వస్తాడన్న ఆశ ఏమాత్రం లేకపోయినప్పటికీ, నన్ను నేను నియంత్రించుకోలేక అతనికి ఒక సందేశాన్ని పంపించాను. అతను ప్రత్యుత్తరం ఇస్తాడని నేను అస్సలు అనుకోలేదు. కానీ నేను ఆశ్చర్యపోయేలా అతను సమాధానం ఇచ్చాడు. అకస్మాత్తుగా పరిస్థితుల్లో మార్పు ప్రారంభమైంది, తిరిగి మా బంధం పూర్వపు రూపాన్ని సంతరించుకుంది. ఆ క్షణాన నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నాకు స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది. ఈ అద్భుతాన్ని ప్రసాదించిన బాబాకు చాలా చాలా కృతజ్ఞతలు. "బాబా! మీ ఆశీస్సులు ఎప్పటికీ మాపై ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యు బాబా!"

బాబా ఆశీస్సులతో వచ్చిన ఉద్యోగం

యు.ఎస్ నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

1993 నుండి నేను సాయిభక్తుడిని. నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను నా భార్య ద్వారా సాయిబాబా అద్భుతలీలలకు సంబంధించిన ఒక ఫేస్‌బుక్ పేజీ గురించి తెలుసుకున్నాను. అప్పటినుండి నేను సాయిభక్తుల అనుభవాలను చదవడం మొదలుపెట్టాను. నిజంగా అవి చాలా అద్భుతమైనవి. చదువుతుంటే మనసుకెంతో హాయిగా ఉండేది. తరువాత నాకు కూడా ఒక చక్కటి అనుభవం జరిగింది. అప్పట్లో నేను చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన కాంట్రాక్టు ముగిసింది. నేను అన్ని జాబ్ పోర్టల్స్‌లో నా రెజ్యూమ్ అప్‌లోడ్ చేసి, ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో శోధిస్తూ దరఖాస్తు చేయడం ప్రారంభించాను. అయితే రెండు వారాలు గడిచినా నాకు ఇంటర్వ్యూ కాల్స్ రాలేదు. ఆ సమయంలో నా భార్య నాతో, "మీరెందుకు ఈ గురువారం సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి, వచ్చే గురువారానికి పూర్తిచేయకూడదు?" అని అడిగింది. సరేనని నేను సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి బుధవారం నాటికి పూర్తిచేశాను. అదేరోజు నాకొక పాత వెండర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ వద్ద ఒక పొజిషన్ ఉందని, అదివరకటి ఒకానొక పాత కంపెనీలోని నా సహోద్యోగి వద్ద నుండి నా రెజ్యూమ్ సేకరించి కాల్ చేస్తున్నామని చెప్పి ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. నేను గురువారంనాడు క్లయింట్‌తో పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరయ్యాను. బాబా కృపవలన వాళ్ళు నా ఇంటర్వ్యూతో సంతృప్తి చెంది ఆరోజే నా ఉద్యోగాన్ని నిర్ధారణ చేశారు. ఇదంతా బాబా ఆశీస్సుల వల్లనే జరిగింది. నేను బాబాను నమ్ముతున్నప్పటినుండి నా జీవితంలో ఇలా చాలా అనుభవాలు జరిగాయి. "జీవితంలో మీరు ఇచ్చిన ప్రతిదానికీ నా ధన్యవాదాలు బాబా. మీ భక్తులందరినీ అనుగ్రహించి వారికి మనశ్శాంతిని ప్రసాదించండి". 

ఓం సాయిరామ్!



సాయిభక్తుల అనుభవమాలిక 516వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో చేకూరిన ఆరోగ్యం - పనిచేసిన లాప్‌టాప్
  2. సాయిఅమ్మ దయవల్ల మా బాబు ఆరోగ్యం కుదుటపడింది

బాబా అనుగ్రహంతో చేకూరిన ఆరోగ్యం - పనిచేసిన లాప్‌టాప్

సాయిభక్తురాలు శ్రీమతి అనుపమ తనకు, తన అత్తగారికి బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. మా అత్తగారికి బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఆవిడ తరఫున నేను పంచుకుంటున్నాను. గత నెలలో మా అత్తగారికి ఉన్నట్టుండి ఒళ్ళునొప్పులు మొదలయ్యాయి. ఆ తరువాత రెండు రోజులకు కొద్దిగా జ్వరం కూడా వచ్చింది. ఏమీ తినాలని కూడా అనిపించేది కాదు. పైగా ఈ లక్షణాల వల్ల తనకు కరోనా వచ్చిందేమో అని అనుమానం. ఇంటిపనులు చేయడానికి పనిమనిషి వస్తోంది. తన వల్ల ఆ అమ్మాయికి ఎక్కడ కరోనా సోకుతుందేమోనని ఆవిడ భయపడ్డారు. ఎందుకంటే, పనమ్మాయికి కరోనా వస్తే తనకు ఎవరూ పని ఇవ్వరు. ఇప్పుడున్న కష్టకాలంలో తనకు పని ఉండదు. వాళ్ళకు అదే ఆధారం కదా! అందుకే, ‘తనకు వచ్చిన లక్షణాలు కరోనాకి సంబంధించినవి కాకూడదు’ అని బాబాను వేడుకున్నారు. ఆ తరువాత రెండు రోజులకు మా అత్తగారికి తలలో ఒకవైపు నొప్పి మొదలైంది. ఆ తలనొప్పి ఎంత తీవ్రంగా ఉండేదంటే, అంతటి తలనొప్పిని ఆవిడ భరించలేకపోయారు. దాంతో ఆవిడ తన బాధను బాబాకు చెప్పుకుంటూ, “బాబా! ఈ తలనొప్పిని భరించటం నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ తలనొప్పిని ఎలాగైనా తగ్గించు తండ్రీ!” అని ఒకరోజు రాత్రంతా బాబాను వేడుకుంటూనే ఉన్నారు. ఇంకా తనకున్న తలనొప్పి, ఒళ్ళునొప్పులన్నీ తగ్గిపోయి ఆరోగ్యం బాగుంటే తన అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని, స్తవనమంజరి రోజుకు మూడుసార్లు చొప్పున 11 రోజుల పాటు పారాయణ చేస్తానని కూడా ఆవిడ బాబాకు మ్రొక్కుకున్నారు. ఆ రాత్రి ఎప్పుడో తెల్లవారుఝామున తనకు నిద్ర పట్టింది. అప్పుడు కలలో రెండు రాక్షసబల్లులు తలలో నుండి వెళ్ళిపోయినట్టు ఆవిడకు అనిపించింది. బాబా అనుగ్రహంతో మరుసటిరోజు నుండి తన తలనొప్పి తగ్గిపోయింది. దాంతోపాటు ఒళ్ళునొప్పులు కూడా తగ్గిపోయాయి. “బాబా! మా వెన్నంటే ఉండి కాపాడుతున్నందుకు శతకోటి ప్రణామాలు తండ్రీ!”.

నేను మరొక అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. వారంరోజుల క్రితం మావారు నా వద్దకు వచ్చి, తన లాప్‌టాప్ సడన్‌గా పనిచేయట్లేదని అన్నారు. “వారం రోజుల నుండి అందులో ఒక వర్క్ చేసిపెట్టుకున్నాను. ఇప్పుడు లాప్‌టాప్ పనిచెయ్యకపోతే ఆ వర్కంతా మళ్ళీ చేయాలి, ఎందుకంటే బ్యాకప్ ఏమీ తీసుకోలేదు” అని చెప్పి, “సరే, నేను స్నానానికి వెళ్ళొచ్చి మళ్ళీ చూస్తాను” అని బాత్రూంకి వెళ్ళారు. నేను ఆ సమయంలో వంటగదిలో వంట చేస్తూ, “బాబా! నేను బ్లాగులో చాలా అనుభవాలు చదివాను, ‘బాబాను కోరుకుంటే మా లాప్‌టాప్ వర్క్ అయింది’, ‘మా మొబైల్ వర్క్ అయింది’ అంటూ. అవన్నీ నిజమే అయితే మావారు స్నానం చేసి వచ్చి చూసేసరికి తన లాప్‌టాప్ మళ్ళీ వర్క్ అయ్యేలా చేయండి” అని మనసులో అనుకున్నాను. ‘అలా జరిగితే నేను సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో ఈ అనుభవాన్ని పంచుకుంటాను’ అని బాబాకు మ్రొక్కుకున్నాను. మావారికి కూడా చెప్పలేదు ఇలా కోరుకున్నట్టు. ఇంతలో మావారు స్నానం చేసి వచ్చి, మళ్ళీ లాప్‌టాప్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించి, ‘ఇప్పుడు లాప్‌టాప్ వర్క్ అవుతోంది’ అన్నారు. అప్పుడు అనిపించింది, “ఏంటి, నేను బాబాకు పరీక్ష పెట్టానా? ఎంత సిల్లీగా ఆలోచించాను!” అని. “క్షమించండి బాబా! అందరినీ చల్లగా చూడండి బాబా!”

సాయిఅమ్మ దయవల్ల మా బాబు ఆరోగ్యం కుదుటపడింది

సాయిభక్తురాలు శ్రీమతి పావని తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకోవటానికి బాబా నాకు అవకాశమిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు పావని. మా బాబు పేరు నాగసాయివిష్ణుభరద్వాజ్. బాబు వయసు 5 నెలలు. మా పుట్టింట్లో బాబుకి బారసాల వేడుక జరుపుకున్న తరువాత మేము మా అత్తగారింటికి వచ్చాము. ఇక్కడి వాతావరణం వల్లనో లేదా వేరే కారణం వల్లనో తెలియదుగానీ మా బాబుకి విరేచనాలు మొదలయ్యాయి. దాంతో బాబు నీరసించిపోయాడు. మరుసటిరోజుకి విరేచనాలు తగ్గి బాబు ఆరోగ్యం బాగయిపోతుందని అనుకున్నాము. కానీ, మరుసటిరోజుకి బాబుకి జ్వరం వచ్చేసింది. ఎప్పుడూ బాగా హుషారుగా ఉండే మా బాబు జ్వరంతోను, విరేచనాలతోను బాగా నీరసించిపోయాడు. తనను అలా చూస్తుంటే నాకు చాలా భయమేసింది. ఏడుపు కూడా వచ్చేసింది. ఆ సమయంలో మా అమ్మ నాకు అండగా ఉండి ధైర్యం చెప్పింది. బాబానే మా అమ్మ రూపంలో నాకు దారిచూపుతున్నారనిపించింది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! బాబు జ్వరం, విరేచనాలతో బాగా నీరసించిపోయాడు. మీ అనుగ్రహంతో జ్వరం, విరేచనాలు తగ్గి బాబు హుషారుగా ఉంటే ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించి, బాబుకి సిరప్ వేసి నిద్రపుచ్చాను. బాబా అనుగ్రహంతో మరుసటిరోజు ఉదయానికల్లా బాబుకి జ్వరం, విరేచనాలు కూడా తగ్గిపోయాయి. నా సాయిఅమ్మ (బాబా) దయవల్ల మా బాబు ఆరోగ్యం కుదుటపడింది. ఇప్పుడు బాబు బాగానే ఉన్నాడు. నిజంగా సాయిఅమ్మ నా దగ్గరే ఉన్నారని అనిపించింది. “సాయిఅమ్మా! నాకు చాలా ఆనందంగా ఉంది. మా బాబు త్వరగా కోలుకునేలా అనుగ్రహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సాయి అమ్మా! మీకు ఎన్నిసార్లు నమస్కరించినా తక్కువే సాయిఅమ్మా!”


సాయిభక్తుల అనుభవమాలిక 515వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా కృప
  2. గొంతునొప్పి తగ్గించి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
  3. బాబా కృపతో నెగిటివ్ వచ్చిన కోవిడ్ ఫలితాలు

బాబా కృప

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నా నమస్కారం. ‘బాబాను గట్టిగా నమ్మితే అన్నీ ఆయనే నడిపిస్తారు’ అని అంటారు కదా! బాబా మరోసారి ఆ విషయాన్ని నిరూపించిన అనుభవాన్ని మీతో పంచుకోవటానికి మీ ముందుకు వచ్చాను. మా పిన్ని(మా అమ్మ చెల్లెలు) బాబా భక్తురాలు. జులై నెల చివరి వారంలో వాళ్ళింటికి కరోనా పాజిటివ్ ఉన్న ఒకావిడ వచ్చి వెళ్ళారు. మా పిన్నికి, తన కుటుంబసభ్యులకు ఆ విషయం తెలియక ఆవిడతో సన్నిహితంగా మెలిగారు. తరువాత ఆవిడకి కరోనా ఉందని తెలిసి మా పిన్ని కుటుంబసభ్యులంతా చాలా భయపడ్డారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు. కరోనా భయంతో ఉన్న వాళ్ళకు దానికి సంబంధించి కొన్ని లక్షణాలు కనిపించటం మొదలుపెట్టాయి. దాంతో మా పిన్ని కుటుంబం మొత్తం కోవిడ్ పరీక్షలు చేయించుకుంది. నాకు ఆ విషయం తెలిశాక నేను బాబాకు నమస్కరించి, “వాళ్ళందరికీ కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ రావాలి బాబా! అలా వస్తే నేను ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. అక్కడ వారందరూ క్షేమంగా ఉండాలని నేను ఇక్కడ బాబాను తలచుకుని బాబా ఊదీని నా నుదుటన దిద్దుకున్నాను. ఆ సాయితండ్రి అద్భుతం చేశారు. వాళ్ళ కోవిడ్ రిపోర్టులు వచ్చాయి. బాబా దయవల్ల అందరికీ నెగిటివ్ వచ్చింది. ఆ వార్త విని నేను ఎంతో సంతోషంతో బాబాకు నమస్కరించి, మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ సాయితండ్రి కరుణ అందరిమీదా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

గొంతునొప్పి తగ్గించి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులకు నా నమస్కారం. ఈ బ్లాగుని నిర్వహిస్తూ మా అనుభవాల్ని సాటి సాయిభక్తులతో పంచుకోవటానికి అవకాశం కల్పించిన సాయికి ప్రత్యేక ధన్యవాదాలు. 

బాబా నన్ను ఎంతో ప్రమాదం నుంచి తప్పించారు. అదేమిటంటే, కరోనా కేసులు విపరీతంగా పెరిగినందుకు మేము చాలా భయపడుతున్న ఈ సమయంలో, అంటే 2020, ఆగష్టు 8వ తేదీ రాత్రి నాకు గొంతునొప్పి మొదలైంది. ఆ విషయం నేను మావారితో చెప్తే, “నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఏమి ఉండదులే!” అన్నారు. కానీ నొప్పి ఎక్కువగా ఉన్నదని చెప్పేసరికి టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమని చెప్పి, ఆవిరి పట్టమనీ, వేడినీటితో స్నానం చేయమనీ చెప్పారు. అవన్నీ చేసినా నాకు ఉపశమనంగా అనిపించలేదు.

తరువాత నా తండ్రి బాబాతో, “బాబా! నాకు చాలా భయమని నీకు తెలుసు. ఈ కరోనాతో భయపడుతున్న సమయంలో ఈ నొప్పివలన ఇంకా చాలా భయంగా ఉంది. నా గొంతునొప్పి తగ్గించు తండ్రీ!” అని చెప్పుకుని, బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని రెండుసార్లు త్రాగి బాబానే స్మరించుకుంటూ పడుకున్నాను. 9వ తారీఖు అంతా మగతగా ఉండి, నిదానంగా సాయంత్రానికి గొంతునొప్పి తగ్గిపోయింది. నాకు తోడుగా ఉండి నాకు నొప్పి తగ్గించినందుకు బాబా ఋణం ఏ విధంగా తీర్చుకోవాలి? “బాబా! నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణు వేడుతున్నాను. మా భారాలు నీ భుజాలమీద వేసుకుని మమ్మల్ని నడిపించు తండ్రీ!”

బాబా కృపతో నెగిటివ్ వచ్చిన కోవిడ్ ఫలితాలు

పేరు వెల్లడించని ఒక సాయి భక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఈమధ్యన లాక్‌డౌన్ సమయంలో ఒకసారి నా భార్యకు దగ్గు, జ్వరం వచ్చాయి. డాక్టర్ కోవిడ్ పరీక్ష చేయించుకోమని సలహా ఇచ్చారు. మేము చాలా భయపడి బాబాను ప్రార్థించాము. తరువాత నేను, నా భార్య, మా అబ్బాయి కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాము. బాబా ఆశీస్సుల వలన మా అందరికీ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. "బాబా! మీ పాదపద్మములకు మా శతకోటి ప్రణామములు. ఎల్లప్పుడూ ఇలాగే మీ అనుగ్రహం మాపై ఉండాలి తండ్రీ!"


ఇమాంభాయ్ చోటేఖాన్




శ్రీసాయిబాబా భక్తుడైన ఇమాంభాయ్ చోటేఖాన్ ఔరంగాబాద్ జిల్లాలోని వజాపూర్ నివాసి. అతనికి, అతని మేనత్తకి (అత్తగారు కూడా) మధ్య చాలా రోజులుగా ఒక భూ వివాదం పరిష్కారం కాకుండా ఉంది. పైగా అతని ఉద్యోగంలో కూడా చిక్కులొచ్చాయి. ఈ రెండు సమస్యల విషయంగా అతను నాందేడులోని ‘దర్వేష్ షా’ అనే ఫకీరుని ఆశ్రయించాడు. ఆ ఫకీరు అతనితో, "సాయిబాబా దర్శనానికి వెళ్ళమ"ని చెప్పి, వారు గొప్ప మహాత్ములని తెలిపే మార్గం కూడా చెప్పాడు. చాటుగా బాబా వెనుకకు జరిగి మనసులో ఖురాన్‌లోని ఒక మంత్రం వల్లిస్తే, ఆయన వెనక్కి తిరిగి అతనిని పలకరిస్తారని, ఆయన పైకమిస్తే తీసుకోవద్దని చెప్పాడు. 

దాంతో చోటేఖాన్ 1910వ సంవత్సరంలో మొదటిసారి సాయిబాబా దర్శనానికి శిరిడీ వెళ్ళాడు. ఆ సమయంలో దీక్షిత్‌వాడా నిర్మాణం జరుగుతోంది. అతను శిరిడీ చేరేసరికి గోండ్కర్ ఇంటి సమీపంలో ఉన్న సందులో బాబా నిలుచుని ఉన్నారు. బాబా వద్ద మద్రాసుకి చెందిన విజయానందస్వామి నిలబడి ఉన్నాడు. ఒక స్త్రీ బాబాకు నమస్కరిస్తోంది. దర్వేష్ షా చెప్పినట్లే చోటేఖాన్ బాబా వెనుక నిలబడి ఖురాన్‌లోని మొదటి అధ్యాయాన్ని పఠించబోయాడు. అతను 'బిస్మిల్లా!' అని మొదలుపెట్టగానే బాబా ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆవేశంతో, "ఎవరు నీవు? నువ్వేదో నా తండ్రివైనట్లు నన్నేదో అడగడానికి ఎందుకు వచ్చావు?" అని అతనిని తిట్టిపోశారు. అతను భయపడిపోయాడు. బాబా అర్థంకాని రీతిలో ఏదో మాట్లాడుతూ మసీదుకు వెళ్లారు. ఆ మాటలు చోటేఖాన్‌కి అర్థం కాలేదు. బాబా అనుమతి లేకుండా అతను మసీదులోకి ప్రవేశించలేక మసీదు ముంగిటనే కూర్చున్నాడు. రెండురోజుల వరకు బాబా అతనికి మసీదులోకి ప్రవేశించటానికి అనుమతి ఇవ్వలేదు. మూడవరోజు కాకాదీక్షిత్ తదితరులు అతని తరఫున మధ్యవర్తిత్వం చేశారు. దీక్షిత్ చోటేఖాన్‌ను చూపిస్తూ, ‘బాబా! అతను మీ బిడ్డడే కదా! అతనిపై మీకు కోపమెందుకు?" అని అన్నాడు. అందుకు బాబా, "వాడు నా బిడ్డ అంటావా? అతను ఒక టీచరుని కొట్టాడు" అని అన్నారు. నిజమే! అతను నిజాం రాష్ట్రంలో ఒక పోలీసు. ఒక నేరపరిశోధనలో సత్వర సమాచారం ఇవ్వనందున అతనొక క్రైస్తవ టీచరుని కొడితే, అతను ఒళ్ళంతా రక్తం కారి స్పృహతప్పి పడిపోయాడు. అతనికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపొమ్మని మామలతదారు సలహా ఇచ్చాడు. దాంతో అతను ఉద్యోగానికి రాజీనామా చేసి నిజాం రాష్ట్రాన్ని వదిలి పారిపోయాడు. కానీ న్యాయవిచారణ జరిగి తనకు శిక్షపడవచ్చని అతను భయపడ్డాడు. ఆ భయమే అతను బాబాను దర్శించడానికి గల కారణం.

దీక్షిత్ బాబాతో మాట్లాడినప్పటికీ చోటేఖాన్ భయపడి మసీదులోకి వెళ్ళలేదు. రెండు, మూడు రోజుల తరువాత, బడేబాబా కుమారుడు కాశిం, జోగ్, దీక్షిత్‌లు చోటేఖాన్‌ను మసీదు లోపలికి తీసుకుని వెళ్లారు. అతను బాబా దర్శనం చేసుకోగా, బాబా అతని శిరస్సుపై తమ హస్తాన్ని ఉంచి, "భయపడకు. భగవంతుడే యజమాని, విచారణ ఏమీ ఉండబోదు" అని అభయమిచ్చారు. తరువాత అతను సుమారు రెండు నెలలు శిరిడీలోనే ఉండిపోయాడు. ఒకరోజు బాబా, "నువ్వు సంతోషంగా తిరిగి వెళ్ళు. నీకున్న భూ వివాదం పరిష్కారమవుతుంది. నీ బంధువులందరూ నీతో సఖ్యంగా మెలుగుతారు!" అని ఆశీర్వదించారు. తన సమస్య గురించి చెప్పకముందే బాబా అలా చెప్పేసరికి అతను ఆశ్చర్యపోయాడు. బాబా ఆజ్ఞానుసారం అతను ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన అత్తగారిపై కోర్టులో దావా వేశాడు. ఆ కేసు ఏడు సంవత్సరాల పాటు నడిచి చివరకు అతని భూములు అతని స్వాధీనమయ్యాయి.

రెండవసారి చోటేఖాన్ శిరిడీ వెళ్ళినప్పుడు మహల్సాపతి, మావిసీబాయిలు బాబా చెంత ఉన్నారు. అతను మసీదు లోపలికి వెళ్ళగానే బాబా మావిసీతో, "జనం నా మాట వినరు. దుష్టులు దూరంగా వెళ్లి బాధపడతారు. ముల్లువలన గాయమై తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోతారు" అని అన్నారు. బాబా మాటలు అతనికేమీ అర్థం కాలేదు. అతను బాబా అనుమతి లేకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఇల్లు చేరిన రెండురోజుల తరువాత, అతని తల్లి కట్టెలు సేకరించడానికి వెళ్ళినప్పుడు ఆమె పాదాలలో ఒక ముల్లు గుచ్చుకుంది. అది సెప్టిక్ అయి కాలు బాగా వాచిపోయి పది రోజుల్లో ఆమె మరణించింది. బాబా మావిసీతో అన్న మాటలకు అర్థం అప్పుడు అతనికి బోధపడింది.

ఉద్యోగం లేని కారణంగా తల్లి ఉత్తరక్రియలు జరిపేందుకు చోటేఖాన్ వద్ద డబ్బులు లేవు. ఆ డబ్బులు బాబా ఇస్తారనే ఆశతో తల్లి మరణించిన నాల్గవ రోజున అతను మూడవసారి శిరిడీ వెళ్ళాడు. అతను సుమారు 34 రోజులు శిరిడీలో ఉన్నాడు. ఒకరోజు అతను బాబా సమక్షంలో ఉన్నప్పుడు బాబా మావిసీతో, "తప్పనిసరిగా ఊదీ తీసుకుని సెలవు తీసుకోవాలి" అని అన్నారు. ఆ మాటలు విన్న అతను 'తిరిగి వెళ్లేందుకు బాబా తనకు అనుమతిస్తున్నార'ని అనుకున్నాడు. ఎందుకంటే, ఒకరిని ఉద్దేశించి మరొకరితో పరోక్షంగా చెప్పడం బాబా పద్ధతి. మరుసటిరోజు ఉదయం అతను బాబా వద్దకు వెళ్ళగానే, ఆయన ఊదీనిస్తూ, "ఇంటి గుమ్మం దగ్గర ఒక వృద్ధురాలు నిలబడి ఉంటుంది. ఆమె ఏదో ఇస్తుంది, దాన్ని ఉపయోగించి కార్యక్రమాన్ని జరిపించాలి. అతిథులు వచ్చారు. వారితో కలిసి విందు ఆరగించాలి" అని అన్నారు. ఆ సమయంలో అతను బాబా మాటలను అర్థం చేసుకోలేకపోయాడు. తరువాత అతను తన తల్లి నలభయ్యవరోజు కార్యక్రమాన్ని జరిపించడానికి ఇంటికి వెళ్లగా, వృద్ధురాలైన (కీర్తిశేషులు) కాజీగారి భార్య ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉంది. ఆమె ప్రేమతో 50 రూపాయలు అతని చేతిలో పెట్టి, “కార్యక్రమాన్ని జరిపించు" అని చెప్పింది. 

అతను ఇంట్లో లేని సమయంలో కార్యక్రమం కోసమని అతని నలుగురు అక్కచెల్లెళ్ళు తమ భర్తలతో కలిసి తన ఇంటికి వచ్చి ఉన్నారు. బాబా చెప్పిన అతిథులు వాళ్లే. తమపై ఆధారపడ్డ భక్తుడు చోటేఖాన్ కష్టం తెలిసిన బాబా కార్యక్రమానికి కావలసిన నిధులు సమకూర్చి అతనికి సహాయం చేశారు. నాలుగవసారి అతను శిరిడీ సందర్శించినప్పుడు బాబా అతనితో, “గులాబ్ మీ ఇంటికి వచ్చాడు" అని అన్నారు. అతను తిరిగి ఇంటికి వెళ్లి చూస్తే, తన భార్య ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చి ఉంది. బాబా 'గులాబ్' అని చెప్పింది ఆ బిడ్డ గురించే అని తలచి, బిడ్డకి ‘గులాబ్’ అని పేరు పెట్టారు.

తరువాత ఒకసారి చోటేఖాన్ శిరిడీ వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణానికి అనుమతి అడిగితే, బాబా తమ అనుమతిని నిరాకరిస్తూ, "ప్రజలు వెళ్లకూడదు. వెళితే తుఫానులొస్తాయి, అగ్నిగోళాలు (పిడుగులు) వర్షిస్తాయి, తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి" అని అన్నారు. ఆ మాటలు తననుద్దేశించినవిగా కాక ఏదో సాధారణ ధోరణిలో బాబా చెప్పినట్లు అతనికి అనిపించింది. దాంతో, తిరిగి వెళ్ళాలనే ఆతృతలో ఉన్న అతను బాబా అనుమతి లేకుండానే శిరిడీ విడిచాడు. అతను నడుస్తూ, చిన్న చిన్నగా పరుగులు తీస్తూ గంటకు 5 మైళ్ళ వేగంతో ప్రయాణం సాగించాడు. సాయంత్రం గం. 5.50 ని.లకి శిరిడీకి 12 మైళ్ళ దూరంలో ఉన్న 'వారి' నది ఒడ్డుకు చేరుకున్నాడు. నది ఒడ్డున నడక సాగిస్తూ సురళ గ్రామం చేరుకునేసరికి సూర్యస్తమయమైంది. ఆ గ్రామపాటిల్ అతనితో, "వెళ్లవద్దు. ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం వచ్చే సూచన కనిపిస్తోంది. వెళితే అవస్థల పాలవుతావు" అని హెచ్చరించాడు. కానీ చోటేఖాన్, "ఇక్కడికి మా గ్రామం నాలుగు మైళ్ళ దూరంలోనే ఉంది. కాబట్టి నేను వెళ్ళిపోతాను" అని ముందుకుసాగాడు. అతను మూడు మైళ్ళ దూరం నడిచేసరికి ఉరుములు, మెరుపులతో పెద్ద తుఫాను మొదలైంది. అతని ముందున్న పెద్ద రావిచెట్టుపై పిడుగుపడి, భీకరమైన శబ్దంతో చెట్టు రెండుగా చీలి మండసాగింది. పిడుగుపడినప్పుడు మిరుమిట్లుగొలిపే మెరుపు మెరిసింది. ఆ కాంతిని చూడలేక చోటేఖాన్ తల వెనుకకు తిప్పుకున్నాడు. అక్కడ బాబా ఉన్నారు. ఆయన వెనుక రెండు చిన్న కుక్కలు కూడా ఉన్నాయి. అతను నమస్కరించగానే బాబా అదృశ్యమయ్యారు. అతను తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అతని గ్రామానికి సమీపంలో ఒక నది ఉంది. దాన్ని దాటే అతను తన గ్రామానికి చేరుకోవాలి. ఆ నది లోతెంతో సరైన అవగాహన లేకనే అతను నదిలో దిగాడు. మోకాలిలోతు నీళ్లలో నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుని యథాలాపంగా వెనక్కి తిరిగి చూసి విభ్రాంతి చెందాడు. కారణం, నీరు రెండు గట్లను తాకుతూ పొంగి ప్రవహిస్తోంది. నదిలోతు కనీసం ఇరవై అడుగులు ఉంటుంది. అంత లోతైన ప్రవాహాన్ని ఎలా దాటగలిగానా అని అతను విస్తుపోయాడు. మొత్తానికి అతను సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. "తుఫానులొస్తాయి, అగ్నిగోళాలు (పిడుగులు) వర్షిస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి" అన్న బాబా మాటలు సత్యమైనప్పటికీ ఆయన అతని వెంటే ఉండి రక్షణనిచ్చారు.

1918లో (బాబా సమాధి చెందడానికి కొన్ని నెలల ముందు) ఒకరోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో బాబా అప్పాభిల్‌తో, "నాలుగు కోళ్ళు తీసుకునిరా, అతిథులు వస్తున్నారు!” అన్నారు. ఆ వచ్చే అతిథులు ఎవరోనని చోటేఖాన్ ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి అతను మసీదులో తెరవెనుక దాగి మెలకువగా ఉన్నాడు. రాత్రి 2 గంటల తరువాత అడుగు పైగా వ్యాసమున్న ఒక పెద్ద అగ్నిగోళం మసీదులోనికి దూసుకువచ్చింది. అది పడమర దిక్కునున్న నింబారు(గూడు) వద్ద కాసేపు నిలిచి, తరువాత మసీదు పైకప్పుకెగసి ఛిన్నాభిన్నమై అసంఖ్యాకమైన తునకలు మసీదంతా ఆవరించాయి. అప్పుడు మసీదు మిరుమిట్లుగొలిపే కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని చూడలేక అతను కళ్ళు మూసుకుని తల దించుకున్నాడు. అతనితో ఉన్న అప్పాభిల్ కూడా అలాగే చేశాడు. అప్పుడు బాబా ధుని వద్దకు వెళ్లి, వంచి ఉన్న తమ మెడపై సట్కా కొనను ఉంచి అరబిక్‌లో పది పదిహేను నిమిషాలపాటు ఏదో ఉచ్ఛరించారు. బాబా ధుని వద్దకు వెళ్ళగానే మసీదును ఆవరించి ఉన్న కాంతి అదృశ్యమైంది.

బాబా మరుసటి ఉదయం అప్పాభిల్ చేత నాలుగు కోళ్లు తెప్పించి, వాటి మాంసంతో వంటకం తయారుచేయించారు. మంటపం దగ్గరున్న పొయ్యిపై బాబా పోళీలు తయారుచేశారు. తరువాత బడేబాబా కొడుకు కాశింకి బాబా కొన్ని పోళీలు, మాంసం పెట్టి అతనితో, "నువ్వు ఔరంగాబాద్ వెళ్లి శంషుద్దీన్‌మియా ఫకీరును దర్శించి, ఈ 250 రూపాయలు వారికిచ్చి, ‘మౌలూ (దేవుని స్తుతిస్తూ పాడే పాటలు), కవ్వాలి (తాళాలు వాయిస్తూ సాధువుల గురించి పాడే పాటలు), న్యాస్(అన్నసంతర్పణ) జరిపించమ'ని చెప్పు. తరువాత బన్నేమియా ఫకీరు వద్దకు వెళ్లి, నేనిచ్చే పూలమాల వారి మెడలో వేసి వారితో, 'తొమ్మిదవరోజు అల్లా వెలిగించిన దీపాన్ని ఆయనే తీసుకుంటారు. ఆయన దయ అలా ఉన్నది (నవ్ దిన్, నవ్ తారిఖ్, అల్లామియానే అప్నా దునియా లేగయా, మర్జీ అల్లాకీ)’ అని చెప్పు” అని 250 రూపాయలను, చేమంతి పూలమాలను ఇచ్చారు. కాశిం ‘ఆ ప్రదేశాలు తనకి క్రొత్త’ అని చెప్పాడు. బాబా అతనితోపాటు వెళ్ళమని చోటేఖాన్‌కి చెప్పారు.

బాబా ఆదేశానుసారం చోటేఖాన్, కాశిం, అతని సేవకుడు అమీర్ కలిసి ప్రయాణమై మధ్యాహ్నం మూడు గంటలకి ఔరంగాబాద్ స్టేషనుకి చేరుకున్నారు. శంషుద్దీన్ ఫకీరు స్టేషనుకి వచ్చి, "సాయి ఫకీరు వద్ద నుంచి వచ్చిన అతిథులు ఎవరు?" అని విచారిస్తున్నారు. ఆయన చోటేఖాన్‌కి అదివరకే తెలుసు. ముగ్గురూ వెళ్లి ఆయనకు నమస్కరించారు. శిరిడీలో బాబా వాళ్ళకిచ్చిన ఆదేశాలన్నింటినీ శంషుద్దీన్ పొల్లుపోకుండా చెప్పి, వాళ్ళని కోటలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. అప్పుడు వాళ్ళు బాబా ఇచ్చిన 250 రూపాయలను ఆయనకిచ్చారు. ఆయన ఎంతోమందిని ఆహ్వానించి న్యాస్ (అన్నసంతర్పణ) చేశారు. తరువాత మౌలూ, కవ్వాలి జరిపించారు. ఆ రాత్రికి బాబా చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయి.

చోటేఖాన్, కాశిం, అమీర్‌లు ముగ్గురూ మరుసటిరోజు ఉదయం బన్నేమియా ఇంటికి చేరుకున్నారు. అక్కడ బన్నేమియా ఒక చేయి పైకెత్తి, మరో చేయి క్రిందకి పెట్టి నిలబడి ఉన్నారు. అక్కడున్న అరబ్బులు చోటేఖాన్, అతని స్నేహితులతో బన్నేమియా దగ్గరకు వెళ్లవద్దనీ, వెళితే వారు ఉగ్రులవుతారనీ చెప్పారు. దాదాపు గంటసేపు వేచి ఉన్న తరువాత చోటేఖాన్ ధైర్యం తెచ్చుకుని, బన్నేమియాను సమీపించి, బాబా ఇచ్చిన పూలమాలను వారి మెడలో వేశాడు. అప్పుడు బన్నేమియా పైకెత్తి ఉన్న తన చేతిని క్రిందకు దించారు. బాబా చెప్పిన మాటలను అతనితో చెప్పాడు చోటేఖాన్. అది విని బన్నేమియా తదేకంగా ఆకాశంకేసి చూస్తూ ఉండిపోయారు. వారి కళ్ళనుండి కన్నీళ్ళు కారసాగాయి. ఈ ప్రపంచం నుండి సాయి నిష్క్రమించే సమయం ఆసన్నమైందని వారు బాధపడ్డారు. తరువాత చోటేఖాన్, అతని స్నేహితులు బన్నేమియా వద్ద సెలవు తీసుకుని తిరిగి శిరిడీ వచ్చారు. సరిగ్గా నాలుగు నెలల తరువాత, తొమ్మిదవ నెల, తొమ్మిదవరోజున బాబా మహాసమాధి చెందారు.

1936లో గులాబ్‌ వివాహ విషయంగా చోటేఖాన్‌కి మళ్ళీ డబ్బు అవసరమైంది. ఆ కారణంగా అతను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని, ఆ రాత్రి మసీదులో వారి సన్నిధిలో నిద్రించాడు. కలలో అతనికి బాబా దర్శనమిచ్చి ఆశీర్వదిస్తూ, "పూనా వెళ్లినట్లైతే నువ్వు లబ్ది పొందుతావు" అని చెప్పారు. దాంతో అతను పూనాకు బయలుదేరాడు. అక్కడ తీవ్రమైన మొలల వ్యాధితో బాధపడుతున్న లడ్కర్ అనే వ్యక్తి అతన్ని కలిశాడు. చోటేఖాన్ అతనితో తనకు ఒక సాధువు (సాయిబాబా) చేసే వైద్యం తెలుసనీ, దానితో మొలలు నయమవుతాయనీ చెప్పాడు. ఆ మందు తనకివ్వమని అతను అడిగాడు. చోటేఖాన్ మందు తయారుచేసి అతనికిచ్చాడు. దాంతో అతనికి ఉపశమనం లభించింది. తరువాత అతను పూనాలో జరిగే గుర్రపుపందేలకు వెళ్లి ఒక గుర్రంపై కొంత సొమ్ము పెట్టుబడి పెట్టాడు. ఆ గుర్రం గెలిచి అతనికి 1,100 రూపాయలు వచ్చాయి. అందులోనుండి అతను చోటేఖాన్‌కు 700 రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బుతో గులాబ్ వివాహం జరిపించాడు చోటేఖాన్.

1936వ సంవత్సరంలోనే ఒకరాత్రి చోటేఖాన్, మాధవ్‌ఫస్లే మసీదులో నిద్రిస్తున్నారు. మధ్యరాత్రిలో “మాథో, లే! నేను లఘుశంక తీర్చుకోవాలి” అని మాధవ్‌ను లేపుతున్నట్లు బాబా స్వరం చోటేఖాన్‌కి వినిపించింది. కానీ మాధవ్ గాఢనిద్రలో ఉండి లేవలేదు. ఉదయం లేచి చూస్తే, బాబా మామూలుగా కూర్చునే చోటుకి ప్రక్కనే ఒక గుంటలో నీళ్ళు ఉన్నాయి. అవి సువాసన వెదజల్లుతున్నాయి. చోటేఖాన్ రాత్రి విన్న బాబా మాటల దృష్ట్యా వారక్కడ మూత్రవిసర్జన చేశారని అర్థమవుతుంది. అది సువాసన వెదజల్లడమే అద్భుతం!

ఇమాంభాయ్ చోటేఖాన్ చెప్పిన కొన్ని వివరాలు తరువాయి భాగంలో:

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

source : http://saiamrithadhara.com/mahabhakthas/chote_khan.html
devotee’s experience of saibaba by b.vi. narasimha swamy.

సాయిభక్తుల అనుభవమాలిక 514వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో తీరిన చింతలు
  2. సాయిపూజకు చిగురించిన తమలపాకుల తీగ 

బాబా అనుగ్రహంతో తీరిన చింతలు

నా పేరు అంజలి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. 2020, జూలై 23వ తారీఖున ఆఫీసులో ఒక క్రొత్త వర్క్ పూర్తయింది. ఆరోజు ఆఫీసుకి మా ఆఫీసర్లందరూ వచ్చారు. తరువాతిరోజు ఉదయం మా ఆఫీసులో పనిచేసే ఉద్యోగి నాకు ఫోన్ చేసి, “నాకు డెట్టాల్ వాసన రావటం లేదు, కోవిడ్ పరీక్ష చేయించుకుంటాను” అని చెప్పాడు. అంతకుముందు రోజు ఆఫీసులో అందరం ఒకేచోట కలిసి పనిచేశాము. ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. దాంతో నాకు చాలా ఆందోళనగా అనిపించి, “బాబా! అతనికి కోవిడ్ నెగిటివ్ వచ్చేలా చేయండి, లేదంటే అతని వలన అందరం ఎఫెక్ట్ అవుతాము” అని బాబాను కోరుకున్నాను. మన బాబా లీల చూపించారు. అతను కోవిడ్ పరీక్ష చేయించుకోగా రిపోర్టు నెగిటివ్ వచ్చింది. అంతా బాబా దయ. ఆయన తలుచుకుంటే కానిది ఏముంది? అందరం హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. నా ప్రార్థన మన్నించినందుకు బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

మరో అనుభవం: 

నేను ప్రతి నెలా మొదటి తారీఖున ఆఫీస్ లాప్ టాప్ లో రీడింగ్స్ తీయాలి. అలాగే ఈసారి కూడా రీడింగ్ తీస్తుంటే ఒకచోట మధ్యలో ఆగిపోతోంది. ఎంత ప్రయత్నించినా రీడింగ్ రావటం లేదు. దాంతో నేను బాబాను వేడుకున్నాను, ‘ఎలాగయినా ఈ రీడింగ్ వచ్చేలా చూడు బాబా’ అని. అప్పటివరకు రాని రీడింగ్స్ నేను బాబాను కోరుకున్న వెంటనే వచ్చాయి. అంతా బాబా అనుగ్రహమే. సంతోషంగా బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను.

మరో అనుభవం: 

ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతం చేసుకున్నాను. బాబా దయవలన వ్రతం బాగా జరిగింది. ప్రతి సంవత్సరం బంగారపు లక్ష్మీరూపుని పూజలో పెట్టుకొని, పూజ పూర్తయిన తరువాత మెడలో వేసుకుంటాను. ఈసారి కూడా అలాగే వేసుకున్నాను. మరుసటిరోజు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఆ లక్ష్మీరూపు మెడలోనే వుంది. సాయంత్రం ఆఫీసునుండి వచ్చి స్నానం చేసి కూర్చొని మెడలో చూసుకుంటే లక్ష్మీరూపు కనపడలేదు. చాలా బాధపడ్డాను. ఎంత వెతికినా ఎక్కడా కనపడలేదు. ‘నా పూజలో ఏం లోపం జరిగిందో ఇలా అయింది’ అని అనుకున్నాను. బాబాకు చెప్పుకుని బాధపడ్డాను. బాబా తన భక్తుల బాధ చూడలేరు కదా. బాబాకు చెప్పుకున్న తరువాత నేను హాల్లోకి వెళ్లి కుర్చీలో కూర్చోబోతుంటే అదే కుర్చీలో లక్ష్మీరూపు కనపడింది. అంతా బాబా దయ. ఆయన దయ మా కుటుంబం మీద, ఇంకా అందరి మీదా ఇలాగే ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను. “లవ్ యు సో మచ్ బాబా! మీరు ఎల్లప్పుడూ మాతో ఉండండి” 

ఈ అనుభవాలన్నింటినీ ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పాను. “కాస్త ఆలస్యంగా ఈ అనుభవాలను పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!” మరలా మరికొన్ని అనుభవాలతో త్వరలోనే మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. 

ధన్యవాదాలు బాబా...
ప్రేమతో మీ భక్తురాలు.

సాయిపూజకు చిగురించిన తమలపాకుల తీగ 

సాయిభక్తురాలు శ్రీమతి విజయ ఇటీవల తనకు కలిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ముందుగా బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను, తద్వారా మేము పొందిన ఆనందాన్ని తోటి సాయిభక్తులతో పంచుకునే అవకాశం కల్పిస్తున్న 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.

నేను చాలా వారాలుగా నవగురువార వ్రతం చేస్తున్నాను. ప్రతి గురువారం వ్రతం చేసి బాబాకు పాలకోవాతోపాటు కేసరి లేదా ఇంకేదైనా స్వీట్ నైవేద్యంగా పెడుతున్నాను. వాటితోపాటు బాబాకు తాంబూలం కూడా సమర్పిస్తున్నాను. ఇదివరకు మేము బెంగళూరులో ఉన్నప్పుడు బయట షాపులో తమలపాకులు కొని బాబాకు తాంబూలం సమర్పించేదాన్ని. అలా బయట తీసుకొస్తున్న ప్రతిసారీ, 'ప్రొద్దుటూరులో అత్తవారింట ఉంటే ఎంత బాగుండేది! ఇంటిలోనే తమలపాదు ఉంది కాబట్టి ఎంచక్కా తాజా తమలపాకులు బాబాకు సమర్పించుకొనేదాన్ని కదా!' అని అనుకుంటూ ఉండేదాన్ని. అయితే కోవిడ్ కారణంగా ఎటూ వెళ్లలేక 11 వారాల పూజ బెంగళూరులోనే చేశాను. తరువాత ప్రొద్దుటూరుకి వచ్చేశాము. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే, తమలపాదు తెగులు పట్టి పూర్తిగా ఎండిపోయి కనిపించింది. దాంతో నేను, "తాజా తమలపాకులతో మనసారా మీకు తాంబూలం సమర్పించుకుందామంటే ఇలా అయ్యిందేమిటి బాబా" అని చాలా బాధపడ్డాను. భక్తులు ప్రేమతో ఏదైనా చేయాలనుకుంటే బాబా తప్పక అనుగ్రహిస్తారని మనకు తెలిసిందే కదా! ఆయన అద్భుతం చూపించారు. శనివారంనాడు పూర్తిగా ఎండిపోయి కనిపించిన తమలపాకుల తీగ మరుసటి గురువారానికి, అంటే సరిగ్గా 5 రోజుల్లోనే తీగనిండా ఆకులతో దర్శనమిచ్చింది. నా సంతోషానికి అవధులు లేవు. తాజా తమలపాకులతో ప్రేమగా బాబాకు తాంబూలం సమర్పించి చాలా ఆనందించాను. తీసివేయాలనుకున్న తమలపాకుల తీగ మళ్లీ బాబా కోసమే చిగురించిందని నా విశ్వాసం. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


కాలేమామ




కాలేమామ అలియాస్ రామచంద్ర బాపూజీ కాలే శ్రీసాయిబాబాను భౌతికదేహంతో ఉండగా దర్శించిన అదృష్టవంతుడు. ఇతను నాటి మరాఠా పాలకుల నగరమైన కొల్హాపూర్‌లో జన్మించాడు. ఇతని తండ్రి బాపూజీ కాలే కొల్హాపూర్ మహారాజు ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. రాజవంశస్థులతో సంబంధాలు కలిగి ఉన్న అటువంటి ప్రభావవంతమైన కుటుంబంలో జన్మించిన కాలేమామ బాల్యం, యవ్వనం అత్యుత్తమంగా సాగాయి. అతను బొంబాయిలో సివిల్ ఇంజనీరుగా పట్టభద్రుడయ్యాడు. కొల్హాపూర్ మునిసిపల్ కార్పొరేషనులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా, ధూలే మునిసిపల్ కార్పొరేషన్ కార్యదర్శిగా, అక్కల్కోట సంస్థాన్‌లో స్టేట్ ఇంజనీరుగా ఉజ్వలమైన జీవితాన్ని సాగించాడు.

1908-09 ప్రాంతంలో కాలేమామ బుర్హాన్‌పూర్‌లోని రైల్వేస్టేషనుకి సమీపంలో ఉన్న బుర్హాన్‌పూర్ తపతి మిల్లు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుండేవాడు. ఒకరోజు అతనితో ఒక స్నేహితుడు ‘శ్రీ సద్గురు నారాయణ మహరాజ్ ఆరోజు ఖాండ్వా వెళుతున్నారని, బుర్హాన్‌పూర్ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కబోతున్నారని’ సమాచారం ఇచ్చాడు. దాంతో కాలేమామ తన స్నేహితులతో కలిసి రైల్వేస్టేషనుకు వెళ్లి నారాయణ మహరాజ్ దర్శనం చేసుకున్నాడు.

తరువాత 1910, ఏప్రిల్ నుండి 1911, మే వరకు కాలేమామ పండరిపురంలో మునిసిపల్ కార్పొరేషన్ కార్యదర్శిగా పనిచేశాడు. ఈ కాలంలోనే సాయిబాబా కీర్తి మహారాష్ట్ర అంతటా వ్యాపించింది. ఎంతోమంది ప్రభుత్వాధికారులు, విద్యావేత్తలు బాబా భక్తులయ్యారు. వాళ్లలో పండరీపురానికి చెందిన రాళే, పట్వర్థన్‌లు ఉన్నారు. వాళ్ళు ఒకసారి, "శ్రీసాయిబాబా గొప్ప మహాత్ములు, శిరిడీ వెళ్లి వారి దర్శనం చేసుకోమ"ని కాలేమామను అభ్యర్థించారు. అందుకతను అంగీకరించాడు. అంతలో కొంతమంది ప్రభుత్వాధికారులు మరియు బొంబాయిలోని ప్రముఖ న్యాయవాదులు 1910, డిసెంబరు నెల చివరివారంలో తమ కుటుంబాలతో శిరిడీలో రెండురోజులపాటు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఆ కార్యక్రమానికి హాజరై బాబా దర్శనం చేసుకుందామని కాలేమామ, రాళే, పట్వర్థన్‌లు అనుకున్నారు. వాళ్లతోపాటు పండరీపురం న్యాయమూర్తి హత్యాంగడి కూడా శిరిడీ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. వాళ్లంతా శిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. బాబా దర్శనంతో కాలేమామ ఎంతగానో ఆనందించాడు. శీతాకాల సెలవుల్లో సన్నిహితుల కుటుంబాలతో శిరిడీలో గడిపినందుకు కూడా అతను చాలా సంతోషించాడు. వాళ్లంతా రెండురోజులు అక్కడ గడిపి తిరిగి పండరీపురం చేరుకున్నారు.

కొంతకాలం తర్వాత 1911 ఫిబ్రవరి ఒకటవ తారీఖున కాలేమామ అన్నయ్య కృష్ణాజీ (అన్నా కాలే) మొదటి భార్య ప్లేగు వ్యాధితో షోలాపూరులో మరణించింది. భార్య మరణంతో దుఃఖితుడైన అన్నాజీ మనశ్శాంతి కోసం మార్పును ఆశించి పండరీపురంలోని కాలేమామ వద్దకు వచ్చాడు. అప్పటికే కాలేమామ సన్నిహితులలో ఒకరైన జస్టిస్ నూల్కర్ తన ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని శ్రీసాయిబాబా సేవ చేసుకుంటూ శిరిడీలో గడుపుతున్నాడు. నూల్కర్ స్నేహితుడైన భాటే కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి శిరిడీలో సాయిబాబా సేవ చేసుకుంటున్నాడు. ఒకరోజు కాలేమామకి నూల్కర్ వద్ద నుండి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో కాలేమామ అన్నయ్య కృష్ణాజీకి భాటే కుమార్తెనిచ్చి వివాహం చేయాలన్న తమ తలంపును తెలియజేస్తూ, అందుకోసం వారివురూ శిరిడీ వచ్చి సాయిబాబా దర్శనం చేసుకుని, వారి అనుమతి తీసుకోవాల్సిందిగా నూల్కర్ ప్రతిపాదించారు. దాంతో కాలేమామ తన అన్నయ్యతో కలిసి 1911 ఫిబ్రవరి లేదా మార్చిలో శ్రీసాయిబాబా దర్శనానికి రెండవసారి శిరిడీ వెళ్ళాడు.

వారిద్దరూ శిరిడీ చేరుకుని తమ సామాను ఒకచోట భద్రపరచి శ్రీసాయిబాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళారు. అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటిగంట అయింది. మసీదులో బాబా ఒంటరిగా ఉన్నారు. వారిద్దరూ లోపలికి వెళ్లి భక్తితో బాబాకు నమస్కరించారు. శ్రీసాయిబాబా వారిని రెండు రూపాయలు దక్షిణ అడిగారు. కాలేమామ జేబులో కేవలం రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి. వెంటనే అతను వాటిని బాబాకు సమర్పించాడు. ఆ రెండు రూపాయలు అందుకున్న బాబా మరో నాలుగు రూపాయలు దక్షిణమ్మని అడిగారు. అయితే కాలేమామ జేబులో డబ్బు లేదు. అతని జేబులో ఉన్న ఏకైక వస్తువు ఏమిటంటే, అతని సూట్‌కేసు తాళాలు. వాటినే అతడు శ్రీసాయిబాబాకు అప్పగిస్తూ తన అన్నతో, "బసకు వెళ్లి సాయిబాబా అడుగుతున్న డబ్బు తీసుకుని రమ్మ"ని చెప్పాడు. అతని అన్న వెంటనే డబ్బు తీసుకుని రావడానికి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేలోపు సాయిబాబా కాలేమామతో, "నువ్వు మాలో ఒకడివి. మళ్ళీ ఎప్పుడు వస్తావు?" అని అడిగారు. అందుకతను, "ఎప్పుడైనా మీరు నన్ను మీ దగ్గరకు రప్పించుకోవచ్చు బాబా!" అని బదులిచ్చాడు. అంతలో అతని అన్న నాలుగు రూపాయలు తీసుకొచ్చి శ్రీసాయిబాబాకు సమర్పించాడు. తరువాత కొంతసేపు వారిరువురూ బాబా సమక్షంలో గడిపి తిరిగి తమ బసకు చేరుకున్నారు. "నువ్వు మాలో ఒకడివి" అన్న బాబా మాటలకు కాలేమామ ఎంతో ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. అతడు ఒక పుస్తకంలో ఇలా రాసిపెట్టుకున్నాడు: "ఆ సందర్శనలో మమ్మల్ని కలిసినందుకు సాయిబాబా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరచి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు" అని. అయితే అతను తరువాత తన జీవితంలో బాబా మాటలకు ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వలేకపోయాడు. మరోవిషయం, అతను తన అన్న వివాహ విషయంలో బాబా ఏమి చెప్పారో తెలియజేయలేదు.

1926లో కాలేమామ మెహర్ బాబాని ఆశ్రయించి జీవితాంతం ఆయనకు అంకితమయ్యాడు. 1927లో ఒకసారి, మరోసారి ధుమాళ్‌తో కలిసి అతడు శిరిడీ వెళ్లి సాయిబాబా సమాధి దర్శనం చేసుకున్నాడు.

సమాప్తం........


సాయిభక్తుల అనుభవమాలిక 513వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. మా కుటుంబంపై బాబా అనుగ్రహం
  2. బాబా పాదతీర్థంతో త్వరగా కోలుకున్న భక్తురాలు
  3. బాబా దయ

మా కుటుంబంపై బాబా అనుగ్రహం

బెంగుళూరు నుండి శ్రీమతి లక్ష్మిగారు తమకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయి బృందానికి నా ధన్యవాదాలు. బాబా నాకు ప్రసాదించిన రెండు చిన్న అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 

మొదటి అనుభవం: 

2011లో మా చిన్నబ్బాయికి మెడమీద కణితి వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించి దాన్ని బయాప్సీ చేశారు. మరో రెండు రోజుల్లో రిపోర్ట్ వస్తుందని చెప్పారు. ఆ సమయంలో నేను తప్పనిసరిగా ఒక ఫంక్షనుకి హాజరవ్వాల్సి వచ్చి హైదరాబాదుకు వెళ్ళాను. మనసు బాగాలేక బాబాను స్మరించుకుంటూనే ఫంక్షన్ హాలుకు వెళుతూ ఉంటే, ముందు వెళ్ళే వాహనాల మీద సాయిబాబా ఫోటోలు కనిపించసాగాయి. బాబా నాకు తోడున్నారని నా మనస్సుకు అనిపించి, బాబాపై నమ్మకంతో రిపోర్ట్ కోసం ఎదురుచూస్తూ ఫంక్షనుకు హాజరై తిరిగి బెంగుళూరు చేరుకున్నాను. ఆ మర్నాడు, అంతా నార్మల్ గా ఉందని, థైరాయిడ్ సమస్య కొంచెం ఉందని రిపోర్టు వచ్చింది. అది చూసి నా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంతో సంతోషంతో బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. 
      
రెండవ అనుభవం:

మా చిన్నబ్బాయి తన కుటుంబంతో 2020 జూలై 26వ తేదీన తన వదినగారి కూతురి పెళ్ళికి హైదరాబాదు వెళ్ళాడు. కరోనా సమయం కదా, నాకు చాలా ఆందోళనగా అనిపించి, వాళ్ళు పెళ్ళికి వెళ్ళి వచ్చేవరకు నేను సాయి నామాన్నే స్మరిస్తూ గడిపాను. బాబా దయవలన వాళ్ళు ఏ ఇబ్బందీ లేకుండా తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఒక వారం రోజులపాటు క్వారంటైన్లో ఉన్నారు. బాబా అనుగ్రహంతో ఇప్పుడు అంతా క్షేమంగా ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి నుండి అందరినీ బాబా కాపాడాలని కోరుకుంటున్నాను

బాబా పాదతీర్థంతో త్వరగా కోలుకున్న భక్తురాలు

సాయిభక్తుడు శ్రీకాంత్ తనకు తెలిసిన సాయిబంధువులకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో ఉండే సాయిబంధువులు చీమకుర్తి సత్యనారాయణ, శ్రీమతి తులసీ అన్నపూర్ణ దంపతుల కుమార్తె రోజాకు యాక్సిడెంట్ అయినప్పుడు బాబా అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదించారు. 2008లో 10వ తరగతి పరీక్షలు వ్రాసిన తరువాత జూన్ నెలలో రోజాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కారణంగా తను మంచం మీద ఉన్నప్పుడు ఆ కుటుంబానికి పరిచయస్థుడైన తులసీరాం అనే అబ్బాయి ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు బాబా మందిరానికి వెళ్ళి, బాబాకు అభిషేకం చేసి, బాబా పాదతీర్థం తీసుకొచ్చి వాళ్ళకు ఇచ్చేవాడు. అలా 41 రోజుల పాటు బాబా పాదతీర్థాన్ని ఇచ్చాడు. అలా తులసీరాం తెచ్చిన బాబా పాదతీర్థాన్ని ప్రతిరోజూ త్రాగటం వలన బాబా అనుగ్రహంతో రోజా చాలా త్వరగా కోలుకుంది. రోజా అంత త్వరగా కోలుకోవడం చూసిన డాక్టర్లు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. “41 రోజుల పాటు బాబా మందిరం నుండి పాదతీర్థం తెచ్చి ఇచ్చేలా తులసీరాంను బాబానే ప్రేరేపించటం, బాబా పాదతీర్థాన్ని సేవించి రోజా అంత త్వరగా కోలుకోవటం ఎప్పుడు తలచుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది. మా కుటుంబసభ్యులమంతా బాబాకు, తులసీరాంకు చాలా చాలా ఋణపడివుంటామ”ని సత్యనారాయణగారు ఎంతో ఉద్వేగంగా చెబుతుంటారు. అదేకాకుండా, రోజా కోలుకున్నాక బాబా అనుగ్రహంతో మంచి IIIT కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. ఇలా వారి కుటుంబానికి బాబా చాలా అనుభవాలను ప్రసాదించారు.

బాబా దయ

సాయిబాబాకు నా వందనాలు. నా పేరు అరుణ. మేము విజయవాడలో నివాసముంటున్నాము. బాబా దయవల్ల మాకొక అద్భుతం జరిగింది. ఈమధ్య మా పక్క ఫ్లాట్‌లో ఉండేవాళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మాకు చాలా భయమేసింది. దానికి తోడు నాకు తీవ్రమైన తలనొప్పి, రుచి తెలియకపోవడం, విపరీతమైన కాళ్ళనొప్పులు వచ్చాయి. నాకు చాలా ఆందోళనగా అనిపించి బాబాను తలచుకొని, "నాకు ఏమీ ఉండకూడదు బాబా" అని ప్రార్థించాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి నాకు ఏమీ లేవు. అంతా బాబా దయ.

శ్రీగణపతిరావు బోడస్




బాబా సశరీరులుగా ఉన్నపుడు ఆయనను దర్శించిన అదృష్టవంతులలో శ్రీగణపతిరావు బోడస్ ఒకరు. ఈ మరాఠీ నటుని గురించి శ్రీసాయి సచ్చరిత్ర 14వ అధ్యాయంలో ‘దక్షిణ మీమాంస’ అనే శీర్షికలో ప్రస్తావించబడి ఉంది. గణపతిరావు 1940లో తన ఆత్మకథ "మాఝీ భూమిక(My Role)" లో బాబాతో తనకు కలిగిన అనుభవాన్ని పొందుపరిచారు. ఆ వివరాలను మీ ముందు ఉంచుతున్నాము.

గణపతిరావుకు మహాత్ములన్నా, సాధువులన్నా అస్సలు ఇష్టముండేది కాదు. ఆ అయిష్టం ఎంతగా ఉండేదంటే, తన స్నేహితులెవరైనా మహాత్ములను దర్శిస్తే వారిని హేళన చేసేవాడు. ఒకసారి గణపతిరావు అహ్మద్‌నగర్‌లో కొంతకాలం ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో అతనికి శిరిడీ వెళ్లాలనే తీవ్రమైన తపన కలిగింది. గణపతిరావు స్నేహితుడైన బాలాసాహెబ్ మిరీకర్ ఆ సమయంలో కోపర్‌గాఁవ్‌లో మామల్తదారుగా పనిచేస్తున్నాడు. బోడస్ మిరీకర్‌ను కలుసుకొని శిరిడీకి వెళ్ళాలన్న తన కోరికను అతనికి తెలియచేశాడు. ఇద్దరూ కలిసి ఒక ఆదివారంనాడు శిరిడీకి వెళ్ళారు. బాబా దర్శనానికి మసీదుకు వెళ్లి, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. బోడస్ బాబాకు కొబ్బరికాయను, పొగాకును సమర్పించాడు. బాబా అతనిని దక్షిణ ఇమ్మని అడిగారు. బోడస్ ఒక రూపాయిని బాబాకు దక్షిణగా సమర్పించాడు. బాబా తమ చిలిమును పొగాకుతో నింపమని బోడస్‌కి చెప్పారు. ఎంతో అదృష్టవంతులకు మాత్రమే ఇంతటి మహద్భాగ్యం లభిస్తుంది. తరువాత బాబా తమ విశిష్ట ధోరణిలో బోడస్ క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత బాబా, "ప్రజలు తమలో తాము తగవులాడుకుంటుంటే మనం ఏం చేయగలం?" అన్నారు. ఆ సమయంలో బోడస్ తన సహాయకునితో గొడవపడి ఉన్నాడు. తరువాత బాబా బోడస్‌ని భోజనం చేయమని చెప్పారు.

బాబా ఆదేశం ప్రకారం బోడస్ భోజనం చేయటానికి భోజనశాలకి వెళ్లాడు. అక్కడ ఒక వ్యక్తి బోడస్‌ను, “బాబాకు దక్షిణగా ఎంత సమర్పిద్దామని అనుకుంటున్నారు?” అని అడిగారు. బోడస్ జవాబిచ్చే లోపలే మళ్ళీ, "బాబా మిమ్మల్ని దక్షిణ కోరితే మీ దగ్గర ఉన్న ధనం మొత్తం దక్షిణగా సమర్పించాలి" అని అన్నాడు. బోడస్‌కు ఆ వ్యక్తి చెప్పిన సలహా ఎంతగానో నచ్చి, ఈసారి బాబా తనను దక్షిణ కోరితే తన వద్ద ఉన్న ధనమంతా బాబాకు దక్షిణగా సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. తరువాత బోడస్ శిరిడీ నుంచి బయలుదేరేముందు బాబా అనుమతి కోసం మసీదుకు వెళ్లాడు. బాబా అతనికి అనుమతిని ప్రసాదించి, దక్షిణ ఇమ్మని అడిగారు. బోడస్ ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఎంతో సంతోషంతో తన పర్సులో ఉన్న ధనమంతా బాబాకు దక్షిణగా సమర్పించాడు. బాబా బోడస్ నుదుటిపై ఊదీపెట్టి, "నువ్వు ఎలా అయితే నాకు దక్షిణ సమర్పించావో, అలాగే ఆ నారాయణుడు నీకు సమృద్ధిగా సంపదను ప్రసాదిస్తాడు" అని ఆశీర్వదించారు.

బోడస్ శిరిడీ సందర్శించిన తరువాత బాబా అనుగ్రహంతో మంచి నటుడిగా ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించాడు. పేరుతో పాటు అతనికి సిరిసంపదలు కూడా సమృద్ధిగా లభించాయి. బోడస్ తన స్మృతులలో ఇలా అంటాడు: “శిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్న తరువాత నాకు డబ్బు విషయంలో ఎలాంటి లోటూ రాలేదు. బాబాకు సమర్పించిన దక్షిణకు లక్షల రెట్లు బాబా నాకు తిరిగి ఇచ్చారు” అని.

శ్రీ గణపతిరావు బోడస్ 1965లో తుదిశ్వాస విడిచారు.

సమాప్తం.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo