సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ గంగగిర్ మహారాజ్ - 171వ అఖండ హరి నామ సప్తాహం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

శ్రీసాయిబాబా శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో 2018, ఆగస్టు 16 నుండి ఆగస్టు 23 వరకు 171వ అఖండ హరినామ సప్తాహం పవిత్ర శిరిడీక్షేత్రంలో మహావైభవంగా నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, శిరిడీ గ్రామస్థులు మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల పౌరులు పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక కీర్తిపతాకాన్ని ఎగరవేశారు.

యోగిరాజ్ సద్గురు గంగగిర్ మహారాజ్ గొప్ప సాధుసత్పురుషులు. ఆయన చాలామంది ప్రజల జీవితాలను మార్చి, సరైన దిశలో పురోగతి మర్గాన నడిపించారు. ఆయన కేవలం సాధారణ ప్రజలను సరైన మార్గంలో పెట్టడమే కాకుండా మారుమూల కుగ్రామమైన శిరిడీలో వెలసిన సాయిసత్పురుషులలో దాగి ఉన్న దివ్యాత్మని గుర్తించి "నక్షత్రాలవంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివార"ని చెప్పారు. అలా ఆయనే తొలిసారిగా ప్రపంచానికి శ్రీ సాయిబాబాను పరిచయం చేశారు. ఒకసారి  కొంతమంది భక్తులతో పాటు గంగగిర్ మహారాజ్ శిరిడీ వచ్చి భక్తులతో సద్గోష్టి చేస్తున్నారు. ఆ సమయంలో బావి నుండి స్వయంగా మట్టికుండలతో నీటిని పట్టుకొని వస్తున్న ప్రకాశవంతమైన యువకుడిని గమనించారు. ఆ తొలిచూపులోనే ఆ యువకునిలోని దైవికశక్తిని గంగగిర్ మహారాజ్ గుర్తించి శిరిడీ పౌరులతో, "ఇతను గొప్ప తపస్వి" అని చెప్పారు. ఈ వివరాలు శ్రీ సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయంలో 35 నుండి 38 వరకు వరకు ఉన్న ఓవీలలో ఈక్రింది విధంగా చెప్పబడి ఉన్నాయి. 

35. ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు, గృహస్థు, పుణతాంబే నివాసి, గంగగిర్ శిరిడీకి తరచూ వచ్చేవారు.

36. సాయి రెండు చేతులతోనూ మట్టి కుండలను పట్టుకొని బావి నుంచి నీరు మోసుకొని రావటం చూచి మొదట గంగగిర్ ఆశ్చర్యపోయారు.

37. అలా సాయిని ముఖాముఖి చూచి
"ఈ అమూల్య రత్నాన్ని పొందిన శిరిడీ ప్రజలు భాగ్యవంతులు, వారు ధన్యులు" అని చెప్పారు.

38. 
"ఈ రోజు ఇతడు భుజాన నీరు మోస్తున్నాడు. కాని ఇతడు సామాన్యుడు కాదు. ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఏదో ఉండబట్టే ఈ స్థలంలో లభ్యమయ్యాడు" అని చెప్పారు.
  
పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు కూడా గంగగిర్ మహారాజ్ గురించి శ్రీ సాయి లీలామృతంలో క్రింది విధంగా రచించారు.

    పుణతాంబేకు చెందిన గంగగిర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవారు. ఒకసారి ఆయన శిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్టి చేస్తున్నారు. అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ ప్రక్కగా మశీదుకు వెళుతుంటే చూచి గంగగిర్ ప్రసంగం ఆపి, లేచి నమస్కరించి, వారి వెనుకనే మశీదుకు వెళ్ళారు. అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగ్గానే గంగగిర్ ఆయనకు నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి "దేవాలయం యీ మశీదుకు వచ్చిందే! మంచిది. మనమిద్దరమూ ఒకే కుటుంబంలోని వారము. ఎంతోకాలంగా కలసి వుంటున్నాము. ప్రజలను సన్మార్గములో పెట్టమని భగవంతుడు మనలను పంపాడు. కాని యీ రోజులలో ప్రజలు కించిత్తు గూడా పరివర్తనం చెందడం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే, హరి మన నెత్తిపై ఆవుపాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూచి నవ్వి, పాలకుండపై రాళ్ళు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ, అతడు చెప్పేది వినకండి. సాయి నన్ను పూనాడని చెప్పి ప్రజలచేత ఈతకల్లు త్రాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడినంటున్నారు. కొందరు పాలు తీసుకొని గూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్ళవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసము, గౌరవమూ పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నార"ని ఎంతో బాధగా గంగగిర్ చేతులు పట్టుకొని"పోయేవాడు పోతాడు, నిలిచేవాడే నిలుస్తాడు. చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని" అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగగిర్ తన భక్తులతో"పేడకుప్పవంటి యీ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది! నక్షత్రాలవంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు. మీరు పిచ్చివాళ్ళు గనుక ఈయనను విడచి ఎక్కడెక్కడో వెదుకుతున్నారు" అన్నారు.

అలా తొలిసారిగా గంగగిర్ మహారాజ్ ప్రపంచానికి సాయిబాబాను పరిచయం చేశారు.

శ్రీ 
గంగగిర్ మహారాజ్ 1847వ సంవత్సరంలో ప్రజా సంక్షేమం కోసం 'అఖండ హరినామ సప్తాహం' ప్రారంభించారు. అలా మొదలైన ఈ కార్యక్రమం 171 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రతి సంవత్సరం నిర్వహింపబడుతూ వస్తుంది. ఈ నామసప్తాహం ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పంచమినాడు ప్రారంభమై, ద్వాదశినాడు ముగుస్తుంది. ఈ సప్తాహంలో చాలా ప్రాధాన్యత కలిగివున్న అంశం - "అన్నదానం". సమాజములో ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం అందించాలని, కరువు, వ్యసనాల నుండి విముక్తి కలిగించాలన్న దూరదృష్టితో ఆయన ఈ సప్తాహాన్ని ప్రారంభించారు.

   ఈసంవత్సరం ఈ సప్తాహానికి 20 నుండి 25 లక్షల మంది భక్తులు వందలాది గ్రామాల నుండి పాల్గొని భక్తి భావనలతో ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడాలన్న లక్ష్యంతో సుమారు 350 నుండి 400 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ హరినామ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. సప్తాహ సమయంలో శ్రీ సాయిబాబా పాదుకలను, శ్రీ గంగగిర్ మహారాజ్ పాదుకలను భక్తుల దర్శనార్ధం ఉంచారు. భక్తులు ఏకకాలంలో ఇద్దరు మహాత్ముల పాదుకలు దర్శించుకొని వారి ఆశీర్వాదాలతో పరిశుద్ధులయ్యారు. లక్షలాది సాయిభక్తులు ఇందులో పాల్గొని ప్రయోజనం పొందారు.

భక్తులందరికీ విరివిగా అన్నదానం ఏర్పాటు చేసారు. శిరిడీలోని గృహస్తులంతా భాక్రి, చపాతీలు తయారుచేసి ఈ సప్తాహానికి సహాయపడ్డారు. రోజుకు వంద ట్యాంకర్ల పప్పు తయారుచేసారు. సప్తాహం రోజులలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఈవిధంగా సప్తాహం ఎంతో ఘనంగా నిర్వహించబడింది.


 శ్రీసాయిబాబా పాదుకలు
 శ్రీ గంగగిర్ మహారాజ్ పాదుకలు
























1 comment:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌹🥰🌸🤗🌺

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo