సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా చూపిన కరుణను పొగిడేందుకు నాకు మాటలు రాలేదు


నేను భువనేశ్వర్ నుండి మాధవి. సాయిబంధువులందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీతో పంచుకోబోయే లీలను ఎలా వర్ణించాలో నాకు అర్థం కావటం లేదు. దీన్ని సాయి లీల అనేదానికన్నా, ఆయనకు తన భక్తుల మీద చెప్పనలవికాని కరుణ అంటే బాగుంటుంది. ఇది యు.ఎస్.ఏలో ఉంటున్న ఒక సాయిభక్తుని అనుభవం. గురువారం(తేది. 20.09.2018) నాడు తనపై బాబా చూపిన కృపను వెంటనే నాతో పంచుకున్నారు. తన పేరు వెల్లడి చేయవద్దని చెప్పినందువలన ఇక్కడ ఆయన పేరు ప్రస్తావించడం లేదు. ఇక అసలు విషయాన్ని ఆయన మాటలలోనే విందాము. 

సాయిరామ్ అమ్మా మాధవీ! ఈరోజు బాబా చూపిన లీల నీతో పంచుకోవాలనిపించింది తల్లీ! నా ఆనందాన్ని ఆపుకోలేక మీకిప్పుడు అర్థరాత్రి అని తెలిసినా ఈ లీలను మెసేజ్ చేస్తున్నాను తల్లీ. మొన్న సోమవారం మాఇంటి తోటలో పసుపు గులాబీ మొక్కకు రెండు మొగ్గలు ఉన్నాయి. గురువారంనాడు బాబా పూజకు ఇవి అద్భుతంగా ఉంటాయి అని అనుకుంటూ నా మనస్సులో ఎంతో సంతోషించాను. రోజూ సాయంత్రం ఎంతో కుతూహలంగా వాటిని చూసుకునేవాడిని. అవి నిన్న బుధవారం సాయంత్రానికి పూర్తిగా విచ్చుకున్నాయి. వాటిని తుంచి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాం అనుకున్నాను కానీ, మళ్ళీ ఎందుకులే ఇప్పుడు తీసేయడం, రేపు పొద్దునే తీసుకోవచ్చు అనుకొని అలాగే ఉంచాను. ఆ రెండు గులాబీలలో ఒకటి బాబాకి, ఇంకోటి దక్షిణామూర్తికి పెడదాము అనుకున్నాను. గురువారం రానే వచ్చింది. ఉదయాన్నే తొందరగా లేచి తోటలోకి వెళ్లి చూస్తే అసలు అక్కడ పువ్వులు లేవు. సోమవారం నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తే ఇప్పుడు పువ్వులు ఎక్కడకి పోయాయి? బహుశా బాబాకు ఇష్టం లేదేమో అనుకొని మనసులో చాలా బాధపడ్డాను. అంతేకదా, మనం మాములు మనుషులం, ముందు వెనక ఆలోచించకుండా బాధ పడిపోతాము. కానీ, "తాను ఒకటి తలచిన, దైవం ఇంకొకటి తలచును" అనే సామెత ప్రకారం దైవం ఆలోచన వేరేగా ఉంది. తరువాత నేను పూజ చేసుకుందామని పూజ గదిలోకి వెళ్ళాను. అక్కడ చూస్తే ఆ రెండు పసుపు గులాబీపూలు దక్షిణామూర్తికే పెట్టి ఉన్నాయి. బహుశా నా కోడలు వాటిని తెచ్చి పెట్టి ఆఫీసుకు వెళ్ళిపోయి ఉంటుందనుకున్నాను. కానీ మనసులో, "అయ్యో! బాబా, నేను మీకు ఒక్క గులాబీ కూడా సమర్పించుకోలేకపోయాను. ఇదే భారతదేశం అయివుంటే వెంటనే బజారుకు వెళ్లి మీకోసం పువ్వులు తెచ్చేవాడిని. కానీ నాకు ఇక్కడ ఏమీ తెలియదు. నన్ను క్షమించు బాబా" అనుకొని నా రోజువారీ పారాయణ మొదలుపెట్టాను. ఇంతలో ఆశ్చర్యం! దక్షిణామూర్తికి పెట్టిన పసుపు గులాబీ పూరేకులు రాలి నా సాయిచరిత్ర గ్రంథం మీద పడ్డాయి. ఆ సమయంలో గాలి కూడా లేదు. కానీ అవి వాటంతటవే రాలి పడడం నాకు ఏదో అద్భుతం జరిగినట్లుగా అనిపించింది. బాబా కృపకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఆయన చేసిన అసలు లీల చూడండి! పూజ అయిపోయాక నీళ్ళ కోసం వంటగదిలోకి వెళితే అక్కడ ఫ్రెష్ గా ఉన్న గులాబీ పూరేకులు బోలెడన్ని ఉన్నాయి. ఇంట్లో ఎవ్వరూ లేరు, అంతకుముందు నేను అక్కడ చూసినప్పుడు అవి లేవు. నేను పారాయణ పూర్తి చేసి వచ్చినంతలోనే అవి అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చి పెట్టారు? నాకంతా ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఆనందం పట్టలేకపోయాను. ఆ పూరేకులను తెచ్చి బాబా పాదాలకు సమర్పించుకున్నాను. బాబాకు గులాబీ సమర్పించలేకపోయానని బాధపడినందుకు బాబా చేసిన అద్భుతమిది. ఆయన చూపిన కరుణను పొగిడేందుకు నాకు మాటలు రావడంలేదు.

చెప్పుకుంటే చిన్న లీలే. కానీ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఒక భక్తుని హృదయంతరాళాల్లో ఉన్న చిన్న కోరికను బాబా తీర్చారు. అంటే ఆయనకు తన భక్తులపైన ఎంతటి కృపో!

2 comments:

  1. Sairam..Sai..This devoti is very happy.he will give more baba Leela's..Baba elaa eppudu neeku thoduga vuntaadu.

    ReplyDelete
    Replies
    1. అంతా బాబా దయ, అయన అనుగ్రహం ఆంటీ.

      Delete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo