సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

దారి చూపుతూ జాగ్రత్తగా నన్ను హోటల్ కి చేర్చారు నా సాయి


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

అందరికీ నమస్కారం, ఓం సాయిరాం. నేను బ్లాగ్ కి కాస్త కొత్త. బ్లాగ్ లో అందరి అనుభవాలు చదివి, సాయి నాకు ఇచ్చిన అనుభవాన్ని కూడా అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. దారి తప్పిపోయిన నాకు, తలచిన వెంటనే సాయి చేసిన సహాయం మరువలేనిది. నేను గత సంవత్సరం బిజినెస్ పని మీద కౌలాలంపూర్ వెళ్ళినప్పుడు ఒకనాటి రాత్రి సాయి నాకు ఈ అనుభవం ఇచ్చారు. సాయి చేసిన సహాయానికి సదా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను.
నేను కౌలాలంపూర్ వెళ్ళినప్పుడు అక్కడ నొవోటెల్ హోటల్ లో రూమ్ తీసుకున్నాను. ఆ రాత్రి డిన్నర్ కోసం Bukit Bintang మాల్ కి వెళ్ళాను. డిన్నర్ అయ్యాక బయటకి వచ్చి చూసేసరికి సమయం రాత్రి పదిగంటలు అవుతోంది. నేను కంగారులో ఇంకో గేటు నుండి బయటకి వచ్చి దారి తప్పిపోయాను. ఆ ప్రదేశంలో నేను తప్ప ఎవరూ లేరు. నేను సహాయం కోసం అన్నివైపులా వెతికాను, కానీ ప్రయోజనం లేదు. కొంతసేపటికి ఒకరిద్దరు వ్యక్తులు కనిపించినా, వారు నాకు దారి చెప్పి సహాయం చేయలేకపోయారు. అప్పటికే చాలా ఆలస్యం అయినందువల్ల నాలో ఏదో తెలియని గాభరా, ఆందోళన మొదలయ్యింది.

మనసులోనే నేను హోటల్ కి జాగ్రత్తగా వెళ్ళడంలో సహాయం చేయమని నా సాయిని వేడుకున్నాను. ఇంక చేసేది లేక నేరుగా నడుస్తూ ముందుకు వెళ్తుండగా, మార్గంలో ఒక జనరల్ స్టోర్ ఎదురయింది. ఒక అందమయిన మధ్య వయసు గల మలేషియా స్త్రీ అక్కణ్ణించి నేరుగా నా వద్దకు వచ్చి, “మీరు నొవోటెల్ కోసం చూస్తున్నారా?” అని అడిగారు. నేను ఆశ్చర్యంగా  'అవున'ని బదులిచ్చాను. ఆమె స్వయంగా నన్ను హోటల్ కి తీసుకొని వెళ్తానని చెప్పారు. నాకంటే కాస్త ముందు ఆమె వడివడిగా నడుస్తూ వెళ్తున్నారు. నేను ఆమెను వెంబడించాను. ఆమె హోటల్ గేటు దాకా వచ్చారు. అప్పటిదాకా నాకు మార్గం చూపించి నాతోనే ఉన్నారు. నేను కాస్త అటు ఇటు చూసి ఆమెకి కృతజ్ఞతలు తెలుపుకుందామని చూసేసరికి, ఆవిడ అప్పటికే చాలా దూరం వెళ్ళి ఉన్నారు. అది ఏ మలుపులు, సందులు లేకుండా తిన్నగా ఉన్న రోడ్డు. కానీ అకస్మాత్తుగా ఆమె ఎక్కడా కనిపించలేదు. అలా ఎంతసేపు గమనించినా ఆమె జాడ ఎక్కడా కానరాలేదు. ఆ వచ్చిన స్త్రీ ఖచ్చితంగా నా సాయే. లేకుంటే నేను నొవోటెల్ హోటల్ కే వెళ్తున్నానని ఆమెకి ఎలా తెలుస్తుంది, నేరుగా వచ్చి నొవోటెల్ హోటల్ కోసం చూస్తున్నారా అని నన్ను అడగటానికి? ఆ రూపంలో వచ్చి హోటల్ వరకు నాకు మార్గం చూపి, నన్ను సురక్షితంగా హోటల్ చేర్చారు. తన భక్తులు ప్రపంచం ఏ మూలన ఉన్నా, వారు కష్టాలలో ఉంటే సాయి వాళ్ళకి సదా అండగా నిలుస్తారు. ఆనాడు సాయి నాకు దర్శనం ఇచ్చిన ఆ అందమైన మధ్యవయసు గల మలేషియా స్త్రీ రూపాన్ని నేను నా మదిలో పదిలంగా నిలుపుకున్నాను.

ఓం సాయిరాం!!!

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo