USA నుండి సాయిబంధువు మీరా గారు ఒక సాయి లీలను ఇలా చెప్తున్నారు. సాయి భక్తుల అనుభవాలు ఇలా ఒకేచోట అందివ్వడం బాగుంది. వాటిని చదివి మన జీవితంలో కూడా అటువంటి బాబా దీవెనలు లభించాలనే ఆలోచన మనకు స్ఫూర్తినిస్తుంది, తద్వారా బాబాపై మనం ఇంకా శ్రద్ధాభక్తులు పెంచుకుంటాము. బాబా నుండి ఆశీర్వాదాలు మనకు అన్నివేళలా లభిస్తాయి, ఆ సమయంలో మనం అది తెలుసుకోలేకపోవచ్చు కాని తరవాత అది మనకు అనుభవమవుతుంది.
ఈ అనుభవం చాలా సంవత్సరాల క్రితం మా ఆంటీగారికి జరిగింది. ఆనాడు ఆమె నాతో చెప్పిన సాయి లీల మొత్తం గుర్తు తెచ్చుకుంటే బాబా తన బిడ్డలందరి పట్ల జాగ్రత్త వహిస్తారని నాకనిపిస్తూ ఉంటుంది. ఈ సంఘటన జరిగినప్పుడు నా వయసు 13-14 సంవత్సరాలు ఉంటాయి. మా కజిన్‌కి 7-8 సంవత్సరాల వయస్సు ఉండొచ్చు. మా కజిన్ చదివే స్కూల్‌లోనే మా ఆంటీ టీచర్‌గా పని చేసేవారు. ప్రతిరోజు వారు ఇరువురు చెంబూర్ నుండి విద్యావిహార్ స్టేషన్ వెనుక ఉన్న రోడ్ మార్గం ద్వారా స్కూల్‌కు వెళ్ళేవారు. వాళ్ళు విద్యావిహార్ నుండి స్కూల్‌కి ట్రైన్‌లో వెళ్ళేవారో లేక నేరుగా నడిచే వెళ్ళేవారో నాకు సరిగ్గా తెలియదు. కానీ వాళ్ళ ఇల్లు మాత్రం చెంబూర్ స్టేషన్ నుండి 30-50 నిమిషాల నడిచే దూరంలో ఉంటుంది.
ఏమైనప్పటికీ, ఒకసారి ఆంటీకి ఇంటి నుండి స్కూలుకి బయల్దేరడంలో కొంచెం ఆలస్యం అవడం వల్ల వేగంగా నడుస్తూ ఉన్నారు. కానీ మా కజిన్ అల్లరి అబ్బాయి అవడం చేత ఆమె ఎన్నిసార్లు త్వరగా నడవమని మందలించినా, వాడు ఆమె వెనుక నిదానంగా నడుస్తూ ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఆమె స్కూలుకి సమయానికి చేరాలనే తొందరలో నడుస్తూ ఉంది. ఒక్కసారిగా ఆమె తన కొడుకు వెనుక వస్తున్న అడుగుల శబ్దం కూడా వినిపించట్లేదేమిటి అని అనిపించి, ఆమె గట్టిగా అరిచి వాడిని తన ముందు నడవమని మందలించింది. వాడి నుండి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఆమె వెనక్కి తిరిగి చూసింది. పిల్లవాడి జాడ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్లి ఉంటాడా అని ఆమెకి భయంవేసి ఆందోళన పడసాగింది. వాడు ఎటైనా వెళ్ళడానికి అక్కడ కాలువ పైన ఒక చిన్న మార్గం మాత్రమే ఉంది, ఇంకొక మార్గం ఏదీ లేదు. ఇంతలో ఆ మురుగు కాలువ నీటిలో తన కొడుకు తల కొట్టుకోవడం కనిపించింది. ఏమి చేయాలో తోచక కాళ్లుచేతులు ఆడలేదు. కనుచూపు మేరలో ఎవరూ లేరు. లోతైన ఆ చిన్న కాలువ నుండి బాబుని ఎలా బయటకు తీయడమో అర్ధంకాక భయంతో ఆమెకి ఊపిరాడలేదు.
అకస్మాత్తుగా భిక్షగాడిలా ఉన్న ఒకతను అక్కడికి వచ్చాడు. రెప్పపాటు కాలంలో అతను కాలువలోకి దూకి ఈదుకుంటూ బాబు దగ్గరికి వెళ్లి, బాబుని ఒడ్డుకు తీసుకువచ్చాడు. దాదాపు 15 నిమిషాల సమయం పట్టింది అతనికి బాబుని రక్షించడానికి. మా ఆంటీ ఉన్న ఆదుర్దాలో అది చాలా ఎక్కువ సమయంలా అనిపించింది తనకి. బాబు ఒడ్డుకు రాగానే ఆమె బాబుతో మాట్లాడించడంలోనూ, తనని శుభ్రం చేయడంలోనూ నిమగ్నమైపోయింది. తనకి తెలిసిందంతా చేసి బాబు ముక్కు నుండి, నోటి నుండి లోపలికి పోయిన నీటిని బయటకి తీసే ప్రయత్నం చేసింది. ఆమెకి బాబుని చూసిన ఆనందంలో ఇంత సహాయం చేసిన ఆ మంచి మనిషికి కృతజ్ఞతలు చెప్పాలన్న స్పృహ కూడా లేదు. ఒక్కసారిగా ఆ విషయం గుర్తుకు వచ్చి అతని కోసం చూస్తే ఆశ్చర్యంగా అక్కడ ఎవరూ లేరు. అంత విశాలమైన స్థలంలో అతని జాడ ఎక్కడా కనపడనే లేదు. భిక్షగాడిలా కనిపించిన ఆ మంచి మనిషి ఎవరు? దేవుడు పంపిన దూతా? లేక సాక్షాత్తూ ఆ సాయినాథుడేనా!!!
ఆరోజు నుండి బాబు కొంచెం నత్తిగా మాట్లాడేవాడు. కొన్ని సంవత్సరాలకి ఆ సమస్య కూడా పరిష్కారం అయ్యింది. కానీ బాబు మాకు దక్కడం మాత్రం ఖచ్చితంగా సాయి లీలే. అది మాత్రం నిజం. ఆయనే గనుక అలా ఆ రూపంలో వచ్చి బాబుని కాపాడకుంటే మాకు బాబు దక్కేవాడు కాదు. ఆయనకు తన బిడ్డలపై ఎంతటి ప్రేమ! ఆ సమయంలో మా ఆంటీ కనీసం బాబాను తలుచుకోను కూడా లేదు, అయినప్పటికీ ఆయన తన కర్తవ్యాన్ని మరువకుండా వచ్చి బాబుని రక్షించారు. ఎంతటి శ్రద్ధ చూపారో చూడండి బాబా.
ఓం శ్రీ సాయి ఆపత్బాంధవాయ నమః
ReplyDeleteJai shiridi sai maharajuki jai
ReplyDelete🕉 సాయి రామ్
ReplyDelete