శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
1978, మే 6న సిమ్లా (హిమాచల్ ప్రదేశ్ రాజధాని) నుండి నాకు మా సొంత ఊరు 'మండి' పట్టణానికి బదిలీ అయ్యింది. అప్పటివరకు నాకు గొప్ప మహాత్ముడైన సాయి గురించి చాలా కొంచెం తెలుసు. ప్రధానోపాధ్యాయుడు అయిన నా చిన్న సోదరుడు శ్రీ బి.సి.వైద్య శ్రీసాయిబాబాకు గొప్ప భక్తుడు. తను ఎప్పుడూ 'సాయిరామ్', 'ఓం సాయినాథ్', 'ఓ దేవా', 'నా బాబాజీ' మొదలైన నామాలతో బాబాని స్మరిస్తూ ఉంటాడు. తనే నాకు బాబా గురించి చాలా చక్కగా చెప్పాడు. అప్పటినుండి బాబా గురించి మరింత తెలుసుకోవాలని నాకు ఎంతో ఆసక్తిగా ఉండేది, కానీ నా కోరిక నెరవేరలేదు.
1979 జనవరి మొదటివారంలో నా సోదరుడు తన కుటుంబంతో కలిసి షిరిడీ, అక్కడనుండి కన్యాకుమారి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు. నేను నా సోదరుడితో, "నాకు కూడా మీతోపాటు వచ్చి సాయిబాబా దర్శనం చేసుకోవాలని కోరికగా ఉంది. కానీ నాకు ఆఫీసులో సెలవు దొరుకుతుందో లేదో తెలియదు" అని అన్నాను. దానికతను, "మీరు షిర్డీ రావడానికి అనుమతినిస్తారా లేదా అన్నది సాయిబాబా చేతిలో ఉంది" అన్నాడు. వాస్తవానికి నేను మాత్రం ఈ అవకాశాన్ని కోల్పోకూడదని, నా భార్యతో కలిసి బాబా దర్శనం చేసుకోవాలని చాలా ఆత్రుతతో ఉన్నాను. మేము 1979 జనవరి 7 సాయంత్రం వెళ్లవలసి ఉంది. 1979 జనవరి 4న నేను నా ఆఫీసర్ గదిలోకి వెళ్లి ఎల్.టి.సి. పై సెలవు పొందడానికి దరఖాస్తును సమర్పించాను. ఆఫీసర్ గారు ఏమీ చెప్పలేదు. సెలవు ఇస్తారో లేదో అని ఆందోళన పడుతూనే నేను వెనక్కి వచ్చేసాను. మరోవైపు నేను పూర్తి చేయాల్సిన ఇతర ఫార్మాలిటీలు అన్నీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మళ్ళీ జనవరి 5న నేను ఆఫీసర్ గారిని కలుసుకొని, నా సోదరుడి కుటుంబంతో కలిసి షిర్డీకి, కన్యాకుమారికి ఎల్.టి.సి. పై వెళ్ళాలని అనుకుంటున్నాను, దయచేసి సెలవు మంజూరు చేయవలసిందిగా అభ్యర్ధించాను. అతను కొన్ని అత్యవసర పనులు పూర్తి చేయమని చెప్పడం తప్ప సెలవు గురించి ఏమీ మాట్లాడలేదు. నిజానికి ముందుగానే నేను ఆ పనులు పూర్తి చేశాను. ఆ విషయమే నేను అతనితో చెప్పగా, అతను వెంటనే సెలవు మంజూరు చేసాడు. ఆశ్చర్యం! షిర్డీ సాయిబాబా మొదటిసారిగా నాపైన చూపిన అనుగ్రహానికి నేను మనస్సులోనే బాబాకు తలవంచి నమస్కరించుకున్నాను. ఖచ్చితంగా ఇది శ్రీసాయిబాబా కరుణగా భావించాను. "భక్తుడు తనంత తానుగా బాబా దర్శనం చేసుకుంటాను అంటే బాబా దర్శనం పొందలేడు. కాని బాబా తన భక్తుని తానే దర్శనానికి ఆహ్వానిస్తే భక్తుని కోరిక నెరవేరుతుంది". ప్రతి ఒక్కరికీ బాబా పవిత్ర దర్శనం లభించదు.
మేము షిరిడీకి చేరుకుని, జనవరి 14 నుండి జనవరి 16వ తేదీ వరకు మూడు రోజులు భక్తనివాస్ లో ఉన్నాము. అది నా సోదరుడి రెండవ షిర్డీ సందర్శన. అందువల్ల తను బాబా యొక్క ముఖ్యమైన ప్రదేశాలు - (1)ఖండోబా మందిరం (మహల్సాపతి బాబాని మొదటిసారి 'సాయి' అని పిలిచిన స్థలం), (2) లెండిబాగ్, (3) బాబా ఉపయోగించిన బావి, (4) చావడి, (5) ద్వారకామాయి (సాయిబాబా ఎన్నో సంవత్సరాలపాటు నివశించిన చోటు) మాకు చూపించాడు. మేము చాలా ఆనందించాము. ప్రతిరోజూ ఉదయం 5గంటల నుండి రాత్రి 10గంటల వరకు షిర్డీ సంస్థాన్ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు పూర్తి భక్తితో హాజరయ్యాము. నేను మొదటిసారి బాబా దర్బారులో ప్రవేశించినప్పుడు సాయిబాబా యొక్క గంభీరమైన తెల్లని పాలరాతి మూర్తిని చూసి పులకరించిపోయాను. భక్తితో ఆయనకు నమస్కరించుకున్నాను. అలా బాబాని చూస్తూనే నా హృదయం ద్రవించిపోయింది. "ఎన్నో జన్మల పుణ్యం వలన నాకు బాబా దర్శన భాగ్యం కలిగింది" అనిపించింది. ఎంతో అద్భుతమైన మూర్తి అది. మరోక్షణంలో నా ముందు సజీవంగా బాబా ఉన్నట్లు అనిపించింది. నేను బాబాతో మాట్లాడుతూ, "బాబా! నేను ఎన్నో పాపాలు చేశాను. ఎప్పుడూ మీకు ఎటువంటి సేవా చేయలేదు. మీకు నాయందు దయ ఉన్నట్లయితే నా పాపాలను పరిగణించకుండా నన్ను క్షమించండి. జీవితాంతం నేను మీకు శరణాగతి చెందుతాను. భవిష్యత్తులో మీరు నన్ను ఏ స్థితిలో ఎలా ఉంచినా నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఓ దేవా! మా అందరిపైన మీ కృపను చూపండి" అని చెప్పుకున్నాను. తరువాత "బాబా! 3 సంవత్సరాల క్రితం నేను వివాహం చేసుకున్నాను. కాని మాకు ఇప్పటివరకు పిల్లలు లేరు. మీరు నాకు సంతానాన్ని ప్రసాదించి మా కోరికను నెరవేర్చండి" అని వేడుకున్నాను. అదే రాత్రి నాకు ఒక కల వచ్చింది అందులో, నల్లటి గడ్డం, పొడవాటి జుట్టుతో, తలపై ఒక బుట్ట తీసుకొని నీటిలో నుండి ఒక సాధువు ప్రత్యక్షమై, ఆ బుట్ట నాకు ఇచ్చి అదృశ్యమైపోయారు. ఈ కల గురించి నేను నా కుటుంబంలో ఎవరికీ చెప్పలేదు. చివరిరోజు మేము బాబా అనుమతి తీసుకొని మా ప్రయాణం కొనసాగించాం. మా ప్రయాణమంతా చాలా సౌకర్యవంతంగా సాగింది. ఒక సంవత్సరం తరువాత, 27-5-1980 గురువారంనాడు సాయంత్రం, బాబా నా కోరిక నెరవేర్చారు. నా భార్య ఒక అందమైన శిశువుకు జన్మనిచ్చింది. నిస్సందేహంగా బాబా నాపై ప్రేమతో నాకు సంతానాన్ని అనుగ్రహించారని నేను భావించాను.
సాయిబాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి మేము మైసూరులో ఉన్నప్పుడు, ఒకరోజు ఉదయం సుమారు 10 లేదా 11 గంటలకు మేము మహారాజ్ జగ్మోహన్ గారి ప్రసిద్ధ ఆర్ట్ గ్యాలరీని చూడాలనుకున్నాము. ఇలాంటివి చూడాలంటే టిక్కెట్లను కొనవలసి ఉంటుంది, అది మాకు అదనపు భారం అవుతుందని మాట్లాడుకుంటున్నాం. అలా మాట్లాడుకుంటూ మేము గేట్ దగ్గరకు చేరుకుని డబ్బును తీయడానికి నా బ్యాక్ జేబులో చేయి పెట్టాను. ఇంతలో అకస్మాత్తుగా ఒక ఆంగ్లేయుడు, ఒక భారతీయ బాలుడు మమ్మల్ని పిలుస్తూ మా వద్దకు వచ్చారు. వాళ్ళు నా చేతిలో 8 టికెట్లను పెట్టి, "మేము దీనిని ఇదివరకే చూసేసాము, మీరు ఈ టికెట్లను తీసుకొని ఆర్ట్ గ్యాలరీని చూడండి" అని చెప్పారు. నేను వాళ్ళని డబ్బులు తీసుకోమని కోరాను. కానీ వాళ్ళు ఏమీ తీసుకోకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఇదంతా విచిత్రంగా లేదూ! టికెట్లను కొనుగోలు చేయటానికి మేము సందేహిస్తుంటే సాయిబాబా సరిగ్గా ఎనిమిది టికెట్లను మాకు అందించారు. వాళ్ళ రూపంలో మా ముందుకు వచ్చి బాబాయే మాకు టికెట్లు ఇచ్చారు. అక్కడనుండి మా మిగతా ప్రయాణమంతా బాబా మాతోపాటే ఉన్నట్లు అనుభూతి చెందాము.
ఇలాగే ప్రతి సంవత్సరం బాబా మాకు షిర్డీ సందర్శన భాగ్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను.
D.N. వైద్య
బంగ్లా మోహల్లా,
మండి - 175 001 (H. P)
(మూలం: శ్రీ సాయిలీల అక్టోబర్ 1980)
🕉 sai Ram
ReplyDelete