శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
బాబా బిడ్డ ఏడు సంవత్సరాల ఇషాన్ తన అనుభవాలను మనకి ఇలా తెలియజేస్తున్నాడు.
నా పేరు ఇషాన్ పాణిగ్రాహి. నా వయస్సు ఏడు సంవత్సరాలు. నేను మా కుటుంబంతో ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ లో నివసిస్తున్నాను. నేను కటక్ లోని గురునానక్ పబ్లిక్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాను. నేను శిరిడీ సాయిబాబా భక్తుడిని. ఒకరోజు నా స్నేహితుడు తను ఒక కొత్తరకం మామిడిపండ్ల జ్యూస్ త్రాగానని నాతో చెప్పాడు. అప్పటినుండి నాకు కూడా ఆ జ్యూస్ త్రాగాలని ఆశగా ఉండేది. క్లాసురూమ్ లో ఉంటూనే ఒక గంటపాటు ఆ జ్యూస్ కోసం కలలుగన్నాను. ఆ తరువాత ఒకరోజు నేను, మా అక్క, మా అమ్మ ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళాము. అక్కడనుండి ఒక రెస్టారెంట్ కి కూడా వెళ్ళాము. అక్కడ షెల్ఫ్ లో నా ఫ్రెండ్ తాగిన ఆ జ్యూస్ ని చూసాను. అప్పుడు నేను మా అమ్మని ఆ జ్యూస్ కొనమని అడిగాను. అందుకు మా అమ్మ సరేనని జ్యూస్ కొని నాకు ఇచ్చారు, సంతోషంగా దానిని నేను త్రాగాను. నా కోరిక బాబా ఇలా తీర్చారని నాకు అనిపించింది.
🌸
ఒకరోజు స్కూల్లో టీచర్ పిల్లలందరినీ ఒక పద్యం నేర్చుకొని రమ్మని చెప్పారు. నేను స్కూలు నుండి ఇంటికి వచ్చాక ఆ విషయం మరచిపోయాను. ఇంతకుముందు ఆ పద్యాన్ని ఒకసారి మాత్రమే చదివి ఉన్నాను. మరుసటిరోజు స్కూల్లో టీచర్ అందరి ముందు ఆ పద్యాన్ని చదవమని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. కానీ టీచర్ ఎప్పుడైతే నన్ను ఆ పద్యం చదవమని చెప్పారో, వెంటనే అప్రయత్నంగా పద్యం నా నోటి నుండి దానంతట అదే వచ్చేసింది. టీచర్ ప్రేమగా నా భుజం తట్టారు.
ఒక డైరీ పెట్టుకొని దానిలో ప్రతిరోజూ “సాయి సాయి” అని సాయి నామాన్ని వ్రాయడం నాకు అలవాటు. ఒకరోజు నేను వ్రాయడం మరచిపోయాను. అమ్మ, "ఈరోజు సాయి నామం వ్రాసావా? లేదా?" అని అడిగింది. నేను డైరీ తెరిచేసరికి అందులో ఆరోజు నేను వ్రాయవలసినది ఆల్రెడీ వ్రాయబడి ఉంది. నేను ఆశ్చర్యపోయాను.
ఒకరోజు నా తొడ మీద ఇంజక్షన్ చేసారు. దానివలన నాకు చాలా నొప్పిగా ఉంది. అప్పుడు నేను మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నాను. నేను నిద్రలో ఉండగా బాబా నాకు కలలో కనిపించి, “మీ అమ్మమ్మ కి ఫ్రిజ్ లో నీళ్ళు పెట్టమని చెప్పు, ఐస్ తయారయ్యాక దానిని నీ తొడమీద నొప్పి ఉన్న చోట పెట్టుకో, రెండు రోజుల తరువాత నొప్పి మొత్తం తగ్గిపోతుంది” అని చెప్పారు. నేను నిద్ర లేచి మా అమ్మమ్మకి బాబా చెప్పినదంతా చెప్పాను. ఆమె ఆ విధంగానే చేసారు. దానితో బాబా చెప్పినట్లుగా నాకున్న నొప్పి రెండు రోజుల్లో తగ్గిపోయింది.
ఒకసారి నాకు చాలా చాక్లెట్స్ తినాలనిపించింది. కొద్దిరోజులకి మా అమ్మ ట్రైనింగ్ కి వేరే చోటకి వెళ్లారు. ఆమె తిరిగి వచ్చేటప్పుడు ఆమె ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తనకి చాలా చాక్లెట్స్ ఇచ్చారు. అవన్నీ తెచ్చి అమ్మ నాకిచ్చింది. కొన్నిరోజులపాటు అవి తిన్నాక విసుగు చెంది, “అమ్మా, చాక్లెట్స్ నాకింక చాలు, నేను తినలేను" అని చెప్పాను. ఆ మరుసటిరోజు చూస్తే చాలా చీమలు చాక్లెట్ బాక్స్ లోపలికి దూరి చాక్లెట్స్ తింటూ కనపడ్డాయి.
నేను 2011లో మొదటిసారి శిరిడీ వెళ్ళినపుడు బాబా మందిరం దగ్గర మా అంకుల్ నాకు doraemon కార్టూన్ teddy కొనిచ్చారు. నిజానికి అది నాకు ఇష్టమైన కార్టూన్ ప్రోగ్రాం. కానీ మా అమ్మ ఒకరోజు దానిని ఎవరికో బహుమతిగా ఇచ్చేసింది. నేను లోలోపల చాలా బాధపడ్డాను. కానీ మా అమ్మ doraemon ముద్ర వేసి ఉన్న piggy బ్యాంకు కొని ఇచ్చారు. బాబా నా బాధ అర్ధం చేసుకొని మళ్ళీ నాకు doraemon ని బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు నేను 'సాయి నవ గురువార వ్రతం' కూడా చేస్తున్నాను. ఇప్పటికే నేను 8 వారాలు పూర్తి చేశాను. నాతోనే ఎల్లపుడూ ఉండి నాకు సహాయం చేస్తూ ఉన్న బాబాకి నా కృతజ్ఞతలు.
ఓం సాయిరాం!!!
ఓం సాయిరాం!!!