సాయిబంధువులందరికీ నమస్కారం నేను భువనేశ్వర్ నుండి మాధవి. ఈరోజు నేను చెప్పబోయే లీల అత్యద్భుతం, అనిర్వచనీయం. 2018, సెప్టెంబర్ 3, మొన్న శ్రావణమాసం ఆఖరి సోమవారంనాడు బాబా వైద్యనాథుని రూపంలో తన నిజధామం శిరిడీలో జరిపిన లీల. చాలామంది సాయిభక్తులకు సుపరిచితులైన చాగంటి సాయిబాబా గారు చెప్పిన అద్భుతమైన బాబా లీల యధాతథంగా మీకు అందిస్తున్నాను. ఈ లీల చదివాక ఆ సద్గురు సాయి చరణాలకు శరణు అనక తప్పదు.
మనం నారాయణ సూక్తంలో చదువుతాము, "సహస్రశీర్షం దేవం, విశ్వాక్షం విశ్వశంభువం" అని. అంటే, ఒకే దివ్యశక్తి అనేకచోట్ల, అనేకరూపాలలో, అనేక విధాలుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది అని అర్థం. అలాగే సాయినాథుడు కూడా అనేకచోట్ల ఒకే సమయంలో తన కర్తవ్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఒకే సమయంలో ఆరతులు, భజనలు, చావడియాత్రలు, పారాయణము ఎందరితోనో చేయిస్తున్నారు. మన దేశంలోనే కాదు, సప్తసముద్రాల అవతల దేశవిదేశాలలో కూడా చేయిస్తున్నారు. మనం సాయంత్రం అయ్యేసరికి సంధ్య ఆరతి చేస్తాము. అదే సమయంలో భూమికి అవతల ఉన్నవాళ్లు కాకడ ఆరతి చేస్తారు. దేనికి అదే నిజం. అలా విశ్వవ్యాప్తమైన సాయినాథుడు తన కర్మభూమి శిరిడీలో తననే నమ్ముకొని వున్న ఒక ప్రియభక్తుడిని ఎలా రక్షించారో ఇప్పుడు మీరు చదవండి.
పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వాడ సాయిమందిరం నుంచి 200 మంది భక్తులతో ఒక బృందం తమ 476వ సచ్చరిత్ర పారాయణ చేయడానికి గతవారం శిరిడీ చేరుకొని, ఆగస్ట్ 31వ తేది, శుక్రవారంనాడు పారాయణ మొదలుపెట్టారు. నాలుగురోజులు అద్భుతంగా పారాయణ సాగింది. నాలుగవరోజు 'పరీక్షా సమయం వచ్చిందా?' అన్నట్లు ఆరోజు పారాయణ తరువాత అందరూ మధ్యాహ్నం భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకొంటుండగా మధ్యాహ్నం 3గంటల సమయంలో ఆ బృందానికి అధ్యక్షుడైన శ్రీK.L.నరసింగరావు గారికి హఠాత్తుగా ఛాతీలో నొప్పి రావడం మొదలయ్యింది. ఎ.సి. గదిలో కూడా చెమటలు పట్టి శరీరమంతా తడిసిపోయింది. ఆయనతోపాటు ఆ గదిలో ప్రక్కనే ఉన్న చాగంటి సాయిబాబా గారు అతను పడే బాధని గమనించి, "ఏమైంది? డాక్టరు దగ్గరికి వెళదాం పదండ"ని డాక్టరు దగ్గరకు తీసుకొని వెళ్లారు. వాస్తవానికి అతనికి ముందునుంచి low షుగర్ వ్యాధి ఉంది. అందువలన ఎప్పుడైనా ఇబ్బందిగా ఉంటే తియ్యని పదార్థాలు ఎక్కువ తీసుకునేవారు. కానీ, ఆరోజు డాక్టరు పరీక్ష చేస్తే, షుగర్ 600 పాయింట్స్ ఉంది. అంటే చాలా ఎక్కువన్నమాట. అప్పుడు డాక్టరు, "మీకు గుండెలో ఏదైనా ప్రాబ్లెమ్ ఉండి ఉంటుంది, ఎందుకైనా మంచిది, వెంటనే సాయి సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ కు వెళ్ళండి" అని చెప్పారు. వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఈసీజీ చేసి, "గుండెలో మూడు బ్లాక్స్ ఉన్నాయి, వెంటనే ఆపరేషన్ చెయ్యాల"ని చెప్పారు. ఇంక అందరూ ఎంతో టెన్షన్ పడిపోయారు. ఈరాత్రి ఎలా గడుస్తుందో అని అంతా భయపడిపోయారు. అప్పుడు చాగంటి సాయిబాబా గారు పారాయణ బృందం వారితో, దాసగణు గారు వ్రాసిన ఆరతి పాట "రహమ్ నజర్ కరో అబ్ మోరె సాయి, తుమ్ బిన నహీ ముఝే మా బాప్ భాయి" పాడమని చెప్పారు. ఆ సాయినాథుని కృపాకటాక్షాల వలన వైద్య సదుపాయాలు వెంటనే అందాయి. వెంటనే ఆ రాత్రే రావుగారికి ఆంజియో ప్లాస్టి చేశారు. కానీ ఆరోజు రాత్రి రావుగారి ఆరోగ్యపరిస్థితి కాస్త విషమంగానే ఉంది. తరువాత సాయిబాబా గారు రావుగారి అమ్మాయిని కాకడ ఆరతి సమయానికి ద్వారకామాయికి తీసుకువెళ్లారు. కానీ బాబా చేసిన అద్భుతం తరువాతగాని వెలుగులోకి రాలేదు. అదెలాగంటే, ఆరోజు ఉదయాన హైదరాబాద్ లో ఉన్న కొందరు భక్తులు షిరిడీ నుండి బాబా దర్శనం ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉండగా బాబా స్టెతస్కోప్ మెడలో ధరించి వున్నట్లుగా కనిపించారట. "ఇదేమిటి, బాబా ఇలా దర్శనం ఇస్తున్నారు? కారణమేమై ఉంటుంది?" అనుకొని వాళ్ళు సాయిబాబా గారికి ఫోన్ చేసి, "ఏమిటి ఈరోజు బాబా మెడలో స్టెతస్కోప్ వేసుకొని డాక్టరులా దర్శనం ఇస్తున్నారు?" అని అడిగి ఆ ఫోటో కూడా పంపారు(క్రింద ఇవ్వబడిన ఫొటోలో మీరు కూడా గమనించవచ్చు). అందులో నిజంగానే బాబా మెడలో స్టెతస్కోప్ ఉన్నట్లుగా ఉంది. అప్పుడు, "బాబానే డాక్టర్ రూపంలో రావుగారికి వైద్యం చేశారు, అది తన భక్తులకు తెలియజేయడానికే ఇలా దర్శనం ఇచ్చార"ని అక్కడున్న అందరూ నిర్ధారించుకున్నారు. బాబా, "నా సమాధినుండే నా భక్తసంరక్షణ కోసం నేను వస్తాను" అన్న వాగ్దానాన్ని నిరూపించారు. వైద్యులకు వైద్యుడు సాయినాథుడు. తనను నమ్మి అంతదూరం పారాయణ కోసం వచ్చిన భక్తుని యోగక్షేమాలు బాబా చూడక మరి ఎవరు చూస్తారు?