సాయిబాబా సర్వవ్యాపకుడు, సృష్టి అంతటా అణువణువునా నిండివున్నారు. తన భక్తుల విశ్వాసాన్ని దృఢపరచడానికి శ్రీసాయిసచ్చరిత్రలో వివరించిన లీలలను పునరావృతం చేస్తున్నారు. జూన్ 1982 నాటి శ్రీసాయిలీల మ్యాగజైన్‌లో వచ్చిన అటువంటి ఒక లీల గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను.
శ్రీసాయిసచ్చరిత్ర 40వ అధ్యాయంలో హోలీ పండుగనాడు ఉదయాన హేమడ్‌పంత్‌కు స్వప్నంలో బాబా దర్శనమిచ్చి, "ఈరోజు మధ్యాహ్నం భోజనానికి వస్తాన"ని సూచించారు. స్వప్నంలో సూచించినట్లే సరిగ్గా ఆరోజు మధ్యాహ్నం భోజన సమయానికి చిత్రపటం రూపంలో హేమాడ్‌పంత్ ఇంటికి వచ్చారు బాబా.
శ్రీసాయిసచ్చరిత్ర 25వ అధ్యాయంలో, "సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును, అవి మీకు ఆశను, నమ్మకమును కలిగించును. నేనేగాక నా సమాధి కూడా మాట్లాడును, కదులును. మనస్ఫూర్తిగా నన్ను శరణుజొచ్చిన వారితో మాట్లాడును. నేను మీవద్దనుండనేమోయని మీరాందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలుపొందెదరు" అని బాబా తమ భక్తులకు హామీ ఇచ్చారు.
1982, మార్చి 9, మంగళవారం హోలీ పండుగరోజు ఉదయాన్నే నాకొక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో ఒక అందమైన రంగురంగుల సాయిబాబా చిత్రం దర్శనమైంది. బాబా చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతిపుంజం ఉంది. క్రమంగా బాబా వెనుకగా ఒక దత్తాత్రేయ రూపం, ఆ రూపం చుట్టూ కూడా కాంతివలయం దర్శనమిచ్చాయి. ఆ కాంతి అన్ని దిక్కులకూ వ్యాపించింది. అంతటితో కల ముగిసింది. నిజానికి ఆరోజు సెలవుదినం, కానీ ఓవర్ టైమ్ చేయడానికి రోజూలాగే ఆఫీసుకు 10.40కి వెళ్ళాను. కొంతసేపటి తరువాత ఒక వ్యక్తిగత పనిమీద దాదర్ వెళ్లి, త్వరగా అక్కడ పని పూర్తిచేసుకొని తిరిగి ఆఫీసుకు వచ్చాను. నేను లేని సమయంలో నా స్నేహితుడు శ్రీహెచ్.వి.తెల్రెజా నన్ను చూడడానికి వచ్చి ఒక క్యాలండరును నాకోసం ఆఫీసులో ఇచ్చి వెళ్లారని తెలిసింది. వెంటనే ఆ క్యాలెండర్ తెరచి చూస్తే, కుడిచేతితో ఆశీర్వదిస్తున్న భంగిమలో రంగురంగుల ఆరు బాబా ఫోటోలు ఉన్నాయి. అలా బాబాని చూసి నా మనసుకెంతో ఆనందంగా అనిపించి మనసారా బాబాకి నమస్కరించుకున్నాను. క్యాలెండర్ రూపంలో బాబా ఆకస్మికరాక ఉదయం నాకు వచ్చిన కలకు నిదర్శనంగా అనిపించింది. ఇది ఇంతటితో ముగియలేదు.
ఆఫీసు నుండి నేను ఇంటికి వచ్చాక డాక్టర్ గజానన్‌రావు దభోల్కర్ నుండి వచ్చిన ఉత్తరం చూసి నేను చాలా ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. డాక్టర్ గజానన్ దభోల్కర్ సాయిభక్తులకు పవిత్రమైన శ్రీసాయిసచ్చరిత్ర రచించిన కీ.శే.శ్రీహేమాడ్‌పంత్ కుమారుడు. నేను ఇదివరకు ఒకసారెప్పుడో, "శ్రీసాయిబాబా స్వయంగా తమ స్వహస్తాలతో మీ తండ్రిగారికి ప్రసాదించిన ఊదీని నాకు కొంచెం పంపించ"మని డాక్టర్ గజానన్ గారిని అభ్యర్థిస్తూ ఒక ఉత్తరం వ్రాసి ఉన్నాను. అందుకు బదులుగా వారిప్పుడు, 'దీనిని ఎవరికీ పంపిణీ చేయకూడద'నే ఒక సూచనతో అత్యంత విలువైన బాబా ఊదీని పంపారు. హోలీ పండుగరోజు ఆ ఉత్తరం రావడం బాబా చేసిన లీల. ఈ ఊదీ రాకను ఉదయాన స్వప్నదర్శనం ద్వారా బాబా సూచించినట్లున్నారు. పైన బాబా ఇచ్చిన హామీ నాయందు ఋజువైంది.
ఎవరైతే బాబా ఇప్పుడు లేరని అంటారో, వాళ్ళు ఇప్పుడు పై లీల వెలుగులో చూసి చెప్పండి, బాబా ఇప్పటికీ మార్గదర్శకత్వం వహించడం లేదని చెప్పగలరా?
అనిల్ కేశవరావు
బొంబాయి - 400037.
మూలం: శ్రీసాయిలీల, జూన్ 1982