శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు ఇలా చెప్తున్నారు:
అందరికీ షిర్డీ సాయిదీవెనలు అందాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరు నన్ను క్షమించాలి, ఇంత పెద్ద మేటర్ మీతో పంచుకుంటున్నందుకు. ఎంతగా ప్రయత్నించినా కుదించి వ్రాయలేకపోయాను.
1992 నుండి నేను సాయి భక్తుడిని. సాయి నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. నేను సమస్యను ఎదుర్కొంటున్నప్పుడల్లా నేను శ్రీసాయినే ప్రార్థిస్తాను. బాబా కూడా ప్రేమతో నన్ను సమస్యల నుండి బయటపడేస్తారు. తరువాత నేను ఆయనని మరచిపోతాను. ఇది నా సాధారణ అలవాటు. ఇప్పుడు బాబా నా ఆర్థిక సమస్యలను పరిష్కరించిన నా అనుభవాన్ని మీకు తెలియజేస్తాను.
1992 నుండి నేను సాయి భక్తుడిని. సాయి నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. నేను సమస్యను ఎదుర్కొంటున్నప్పుడల్లా నేను శ్రీసాయినే ప్రార్థిస్తాను. బాబా కూడా ప్రేమతో నన్ను సమస్యల నుండి బయటపడేస్తారు. తరువాత నేను ఆయనని మరచిపోతాను. ఇది నా సాధారణ అలవాటు. ఇప్పుడు బాబా నా ఆర్థిక సమస్యలను పరిష్కరించిన నా అనుభవాన్ని మీకు తెలియజేస్తాను.
నేను స్టాక్ మార్కెట్ ఉద్యోగిని. నాకు ఆ ఫీల్డ్ లో చాలా మంచి అనుభవం ఉంది. స్టాక్ మార్కెట్ లో పనిచేసే ఉద్యోగస్తులకు వాళ్ళు ట్రేడింగ్ చేయకూడదనే ఒక నియమం ఉంది. నేను అదే చాలా సంవత్సరాలపాటు అనుసరించాను. సంస్థ నుండి చాలా మంచి రివార్డులు కూడా పొందాను. కానీ 2012లో నాకు చెడు కాలం నడుస్తూ ఉంది. అటువంటి సమయంలో ఎవరైనా చెడు విషయాల వైపు ఎలా ఆకర్షించబడతారో అనడానికి నా జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఎవరూ డబ్బు సంపాదించలేరని నాకు చాలా బాగా తెలుసు. అలా చేసిన చాలామంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. మా సంస్థలో కొందరు అధిక పెట్టుబడి పెట్టిన ఖాతాదారులు ఉన్నారు. నేను వాళ్ళ ఖాతాను లాభం వచ్చేలా నిర్వహిస్తానని (నోటి)ఒప్పందాన్ని కలిగి ఉన్నాను. అంటే ప్రతినెలా వారికి లాభాన్ని ఇవ్వడం అన్నమాట. వారి ఖాతాలో 6 లక్షల డబ్బుంది. హామీ క్రింద నేను వారికి నా చెక్కులు ఇచ్చి ఉన్నాను.
నిజానికి నాకు రియల్ టైం వ్యాపార అనుభవం ఏమీ లేదు, నేను కేవలం ఒక సాంకేతిక ఉద్యోగిని మాత్రమే. కానీ ట్రేడింగ్ చేసి డబ్బు సంపాదించే కొంతమంది సిబ్బందిని నేను చూశాను. నేను కూడా అలా డబ్బు సంపాదించాలనే దురాశతో నేను నా క్లయింట్ ఖాతాలో ట్రేడింగ్ మొదలుపెట్టాను. కొన్ని వారాల్లో మొత్తం 6 లక్షలు పోగొట్టుకున్నాను. ఇక సమస్యలు మొదలయ్యాయి. నియమం ప్రకారం నేను ప్రతినెలా క్లయింట్ కి లాభం ఇవ్వాలి. అందువలన నేను నా క్రెడిట్ కార్డు ద్వారా, కొన్నిసార్లు నా జీతం నుండి వాళ్ళకి చెల్లించాను. కొన్నిరోజులకి వాళ్ళు తమ ఖాతాలో డబ్బు లేదని తెలుసుకుని, మొత్తాన్ని తిరిగి చెల్లించమని నాపై ఒత్తిడి తెచ్చారు. నేను, "మీ సొమ్ము మొత్తం తప్పకుండా చెల్లిస్తాను, చెల్లించడానికి కొంత సమయం కావాలి, నన్ను నమ్మండి" అని అభ్యర్ధించాను. వాళ్ళు సరేనన్నారు. కానీ, మొత్తం సొమ్ము మీద 20% వడ్డీ కావాలన్నారు. చర్చించిన మీదట మొత్తానికి 10 శాతానికి ఒప్పుకున్నారు. అంటే, నేను నెలకు 60,000 రూపాయలు చెల్లించాలి. నేను నా జీతం మొత్తం ఇచ్చేసినా కూడా ఇంకా 30% అమౌంట్ ఇవ్వవలసి ఉండేది. ఎందుకు సరిగ్గా వడ్డీ చెల్లించలేదని వారు కాల్స్ చేసి వేధించేవారు(డబ్బు మనుషుల మనస్సును మార్చేస్తుంది). దానితో నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ 30% క్లియర్ చేయడానికి ఇంకా వడ్డీకి అప్పులు తీసుకున్నాను. చాలా రోజులుగా అమౌంట్ కట్టని కారణంగా క్రెడిట్ కార్డు బ్యాలన్స్ కూడా క్లియర్ చేయాల్సి ఉంది. ఒక్కరోజులో వడ్డీ వ్యాపారస్తుల నుండి నా సెల్ ఫోన్ కు 50 కాల్స్ వచ్చేవి. ఇన్ని సమస్యలను నా భార్యతో సహా ఎవరికీ చెప్పకుండా నేను ఒక్కడినే భరించాను. కొన్నిరోజుల తరువాత ఆ క్లయింట్ అసలు మొత్తం చెల్లించమని పగలు రాత్రి తేడా లేకుండా కాల్స్ చేసి ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. నేను బ్యాంకు నుండి కూడా లోను తీసుకోవడానికి ప్రయత్నించాను కానీ క్రెడిట్ కార్డు రుణాల వల్ల నాకు లోను లభించలేదు. ఈ భయాందోళన పరిస్థితిలో మళ్ళీ ఒక లాయర్ వద్ద 2 లక్షల రూపాయలు 15 శాతం వడ్డీకి తీసుకున్నాను. నేను ఆ 2 లక్షలు క్లయింట్ కి ఇచ్చాను. కానీ, వాళ్ళు వెంటనే మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించాల్సిందిగా పట్టుబట్టారు. కానీ నేను బాబాను పూర్తిగా నమ్మినవాడిని కనుక ఈ పరిస్థితిలో నేను సాయిబాబాను మాత్రమే ప్రార్థించాను. నా చేతి వేళ్ళకు ఉన్న ఉంగరాలు, నా బైక్ ప్రతిదీ వడ్డీ వాళ్ళు తీసేసుకున్నారు. ఇలా రోజురోజుకీ పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయ్యింది. ప్రతిరోజూ వాళ్ళను ఎలా ఎదుర్కోవాలో, ఎలా సమాధానపరచాలో తెలిసేది కాదు. అయినప్పటికీ సాయినాథునిపైన నాకు పూర్తి నమ్మకం ఉండేది. ఈ సమయంలోనే నా నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకున్నాను.
ఎవరితోనైనా నా సమస్య గురించి పంచుకోవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. నాకు చాలా మంచి మిత్రుడు ఉన్నాడు. అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా సొంత ఊరిలో ఉంటాడు. మొత్తం పరిస్థితిని అతనికి వివరించాను. వెంటనే అతడు నన్ను రక్షించటానికి ఫ్లైట్ లో నేను ఉన్న ఊరికి వచ్చాడు. మేము హోటల్లో రెండు రూములు తీసుకుని ఫైనాన్సర్లు అందరినీ పిలిపించి మొత్తం సెటిల్ చేసాము(నా స్వంత సోదరుడు విదేశాలకు వెళ్లి చాలా మంచి స్థాయిలో ఉన్నాడు. తను నా స్నేహితుడికి ఆ మొత్తాన్ని తరువాత ఇచ్చేసాడు). నేను 5 లక్షల అప్పు గురించి మాత్రమే నా స్నేహితుడికి చెప్పాను, కానీ న్యాయవాది నుండి తీసుకున్న మొత్తం గురించి చెప్పలేదు. అప్పటికీ నా స్నేహితుడు ఇంకా ఏమైనా ఉంటే చెప్పు, పరిష్కరించేద్దామని 3, 4 సార్లు అడిగాడు, కాని నేను ఏమీ చెప్పలేదు. న్యాయవాదికి ఇవ్వవలసిన మొత్తాన్ని తెలియజేయడానికి నేను కాస్త సిగ్గుగా, ఇబ్బందిగా భావించాను. ఆ మొత్తాన్ని నేనే ఏదో ఒక విధంగా పరిష్కరించేద్దాం అనుకున్నాను. ఆ తరువాత నేను నా భార్యకి జరిగిందంతా చెప్పాను. ఆ విధంగా నేను ఇన్ని సమస్యల నుండి ఉపశమనం పొందడంతో చాలా ప్రశాంతంగా అనిపించింది. నా స్నేహితుడి రూపంలో బాబా వచ్చి నా సమస్యలను పరిష్కరించారు. నా బైక్, బంగారు ఉంగరాలు తిరిగి వచ్చాయి. క్లయింట్ కి ఇవ్వవలసింది క్లియర్ అయ్యింది. వడ్డీ వాళ్ళ సమస్య తీరింది, నా క్రెడిట్ కార్డు సమస్యలు పరిష్కరించబడ్డాయి. కేవలం న్యాయవాదికి ఇవ్వవలసినది మిగిలివుంది.
నేను నా జీతం నుండి న్యాయవాదికి చెల్లిస్తూ కాస్త ప్రశాంతంగా ఉన్నాను. కొన్ని నెలల నుండి నా భార్యకు పూర్తి జీతం ఇవ్వడం లేదు. ఆమె కూడా పని చేస్తూ ఉండటంతో, తన జీతం మరియు నా జీతంలో చిన్న మొత్తంతో మేము కుటుంబం నడుపుకుంటూ వస్తున్నాం. నాకున్న ఒక్క కొడుకు 2013లో తన స్కూల్ చదువు పూర్తి చేసి జూనియర్ కాలేజీకి వెళ్ళాడు. అప్పటినుండి నా స్నేహితుడు, "మీరు అక్కడ ఒంటరిగా ఉండటమెందుకు? జాయింట్ గా ఏదైనా బిజినెస్ చేసుకుందాం, స్వంత ఊరికి వచ్చేయ"మని నన్ను రిక్వెస్ట్ చేసేవాడు. కానీ నేను వచ్చే ఏడాది వచ్చేస్తానని చెప్తూ 2 సంవత్సరాలు అలాగే గడిపేసాను. ఈమధ్యలో నేను అప్పుడు చేస్తున్న సంస్థను నవంబర్ 2014లో విడిచిపెట్టి మంచి జీతం కోసం మరొక సంస్థలో చేరాను. అక్కడ మళ్ళీ మార్చి 2015లో కొన్ని సమస్యలను నేను ఎదుర్కొన్నాను. బాబా నుండి “తక్షణమే ఆ కంపెనీ విడిచిపెట్టు” అని సందేశం రావడంతో, నేను ఏ సమస్యా లేకుండా కంపెనీని విడిచిపెట్టాను. నేను కొన్ని నెలలు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాను. అయినప్పటికీ నేను న్యాయవాదికి వడ్డీని చెల్లిస్తూ వచ్చాను. తరువాత నేను నా మిత్రుడు కోరినట్లుగా బాబా ఆమోదంతో నా ఫ్యామిలీతోపాటు మా స్వంత ఊరికి వెళ్ళిపోయాను. న్యాయవాదికి సంబంధించి, అతను ప్రతినెలా 1వ తేదీన ఉదయం కాల్ చేయడం, నేను అదే రోజు సాయంత్రానికి వడ్డీ అతని అకౌంట్ లో వేయడం జరిగేది. మిగిలిన 29 రోజులు అతను నాకు కాల్ చేసేవాడు కాదు. అందువలన నేను ప్రశాంతంగా ఉండేవాడిని.
ఇలా 4 సంవత్సరాలు నడిచింది. నేను తీసుకున్న అప్పుకు 4 రెట్లు అధికంగా భారీ వడ్డీ చెల్లించాను. నేను నా స్నేహితుడి సంస్థలో చేరాను. మేము ఇద్దరం కలిసి ఆ సంస్థను ప్రారంభించాము. సంస్థ ప్రారంభదశలో ఉండటంతో మాకు ఎక్కువ రాబడి ఉండేది కాదు. అందువలన 2015 అక్టోబర్ నుండి న్యాయవాదికి నేను పూర్తి వడ్డీ చెల్లించలేక పోయేవాడిని. దానితో మళ్ళీ నాకు టెన్షన్ మొదలైంది. అతను రోజుకు 10సార్లు కాల్ చేయటం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని నెలలు గడిచిన తరువాత సమస్యను పరిష్కరించుకోవలసిన సమయం వచ్చింది. ఫోన్లో అతనిని ఎంత అభ్యర్థించినా అతను వినిపించుకోలేదు. అంతటి దుర్బర పరిస్థితులలో కూడా నేను ఎప్పుడూ నా మొబైల్ ఆఫ్ చేయలేదు, కాల్ ను ఎప్పుడూ కట్ చేయనూ లేదు. నాకు ఎవరినీ కష్టపెట్టడం ఇష్టం ఉండదు. ఇక నేను నా సాయిబాబానే నమ్ముకొని నన్ను ఈ సమస్యల నుండి బయటపడవేయమని గట్టిగా ఆయనకి ప్రార్థన చేసాను. ఒకసారి సప్తాహ పారాయణ, రెండుసార్లు సాయి దివ్య పూజ చేశాను. దానితో పాటు వెబ్ సైట్ లో సాయిభక్తుల అనుభవాలు చదువుతూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించేది. సాయిబాబా ప్రశ్నలు-జవాబులు అన్న సైట్ ను బ్రౌజ్ చేసి నా సమస్య గురించి అడిగేవాడిని. ప్రతిసారీ “సాయిబాబాయందు నమ్మకం ఉంచు, ఆయన తప్పకుండా సమస్యను పరిష్కరిస్తారు” అని వచ్చేది. ప్రతిసారీ నాకు సాయిబాబా నుండి ఇలాంటి సమాధానాలు వస్తూ ఉండేవి. మరోవైపు నేను న్యాయవాది నుండి చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను. రోజులు గడుస్తూ ఉన్నాయి. "దయచేసి ఈ సమస్యనుండి నన్ను బయటపడేయండి బాబా!" అని రోజూ బాబాని ప్రార్థిస్తూ ఉండేవాడిని. టెన్షన్ తో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాను. నవంబర్ నెలలో బాబా కృప వలన కుటుంబంతోపాటు షిర్డీకి వెళ్ళాను. అద్భుతమైన దర్శనం లభించింది. ప్రశాంతంగా బాబా సన్నిధిలో కొన్ని రోజులు గడిపాము. రిటర్న్ వచ్చేముందు, "నా పరిస్థితి అంతా మీకు తెలుసు, ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా నా సమస్యల నుండి నన్ను బయటపడవేయండి బాబా!" అని ప్రార్దించాను.
డిసెంబరు నెలలో నేను ప్రశ్నలు-జవాబుల వెబ్ సైట్ ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు, "నీవు త్వరలో నీ పాత స్నేహితుడిని కలుసుకుంటావు, అతను నీకు సహాయం చేస్తాడు. కానీ బాబాను గుర్తుపెట్టుకో" అని సమాధానం వచ్చింది. నిజంగానే కొన్ని రోజుల్లో నేను 35 సంవత్సరాల తర్వాత నా పాత స్నేహితుడిని కలుసుకున్నాను. అతను 7వ తరగతిలో నా తోటి విద్యార్థి. అతను ఫేస్ బుక్ ద్వారా చాలాసార్లు నన్ను సంప్రదించడానికి ప్రయత్నించాడు, కానీ నాకున్న టెన్సన్స్ కారణంగా నేనే స్పందించలేదు. కాని అతడు పట్టు వదలకుండా ట్రూ కాలర్ ద్వారా నా నెంబర్ తెలుసుకొని నన్ను సంప్రదించాడు. ఇది కేవలం శ్రీ సాయినాథుని అనుగ్రహం వలన మాత్రమే సాధ్యమైంది. అతను నాకు మంచి స్నేహితుడు. అతను మంచి పొజిషన్ లో ఉన్నాడు. తనతో కొన్నిసార్లు కలిసిన తర్వాత, మాటలలో నేను నా పరిస్థితిని అతనికి వివరించాను. అదే సమయంలో నేను న్యాయవాదికి నా పరిస్థితి వివరించి, "నేను ఇప్పటికే మీకు వడ్డీ రూపంలో చాలా చెల్లించాను, దయచేసి ఇప్పుడైనా సమస్యని సెటిల్ చేసుకుందామ"ని అభ్యర్ధించాను. కానీ అతను అంగీకరించలేదు సరికదా, అసలు మొత్తాన్ని వెంటనే క్లియర్ చేయమని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఫిబ్రవరి నెలలో నేను నా స్నేహితుని నుండి ఒక లక్ష తీసుకుని, న్యాయవాదికి చెల్లించాను. దానితో కొంచెం నేను, న్యాయవాది కూడా రిలాక్స్ అయ్యాం. కాని మళ్ళీ మరుసటినెల నుండి అతను అడగటం మొదలు పెట్టాడు. ఇక నేను నావల్ల కాదని, "అయినా నేను తీసుకున్న 2 లక్షల రూపాయలకి వడ్డీ రూపంలో 8 లక్షలు పైగా మీకు చెల్లించాను. నా రక్తాన్ని మీకు ఇచ్చాను. ఇంతకన్నా మీకు ఏమి కావాలి? ఇప్పటికైనా అర్థం చేసుకోండి" అని రిక్వెస్ట్ చేశాను. నేను అతను ఉన్న ఊరికి వ్యక్తిగతంగా వెళ్లి పరిస్థితిని వివరించాను. కాని అతను, "నువ్వు ఇచ్చిన చెక్కులు నా దగ్గర ఉన్నాయి, నేను కోర్టుకి వెళతాను" అన్నాడు.
ఇక చేసేది లేక నేను సాయిబాబాకే చెప్పుకున్నాను. గత 5 నెలలుగా నేను సాయిబాబాని ప్రార్ధన చేసిన ప్రతిసారీ, "ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. చింతించకు" అని సమాధానం వస్తూ ఉండేది. చివరకు బాబా దయవలన అతను కోర్టుకు వెళ్ళలేదు. నేను అంత మొత్తాన్ని ఎన్ని ఇబ్బందులు పడుతూ చెల్లించానో అర్థం చేసుకుని నాకు కాల్స్ చేయడం ఆపేసాడు. కేవలం ఇదంతా బాబా వల్ల మాత్రమే సాధ్యమైంది. బాబా "ఈ సమస్యను నేను పరిష్కరిస్తాన"ని చాలాసార్లు చెప్పినట్లుగానే మొత్తం సమస్యను పరిష్కరించారు. "నేనెప్పుడూ అబద్ధం ఆడను" అని వాగ్దానం చేసారు బాబా. ఆయన ఒకసారి ఏదైనా చెప్పారు అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. భక్తులమైన మనం ఆయనపై నిజమైన నమ్మకంతో సహనంగా ఉండటం అవసరం. బాబా నా స్నేహితుడు, నా సోదరుడు. ఇటీవలే కలుసుకున్న నా పాత స్నేహితుడి రూపంలో వచ్చి నాకు సహాయం చేసారు, నా సమస్యలను పరిష్కరించారు. చివరకు ఆయన న్యాయవాది మనసును కూడా మార్చేసి నన్ను కాపాడారు. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై!