శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిబంధువులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు, సాయిరామ్.
హైదరాబాద్ నుండి ఒక సాయిబంధువు తమ అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు.
ఓం సాయిరామ్
మొన్న ఆదివారం రాత్రి, అనగా 2018 సెప్టెంబర్ 9వ తేదిన జరిగిన ఒక చిన్న అనుభవాన్ని ముందుగా మీతో పంచుకుంటాను.
నేను తరుచుగా ఊదీ మిరాకిల్ ఒకటి చూపించమని బాబాను అడుగుతూ ఉండేదాన్ని. అనుకోకుండా ఆదివారం రాత్రి బాబా నాకొక అద్భుతమైన ఊదీ మహిమను చూపించారు. ఆరోజు రాత్రి 11.40 గంటలకి అకస్మాత్తుగా నేను కడుపునొప్పి, ఎసిడిటీతో బాధపడ్డాను. ఆ నొప్పిని అస్సలు తట్టుకోలేక బాబా ముందు కూర్చుని ఏడుస్తూ ఈ బాధ నుండి ఉపశమనం కలిగించమని ప్రార్ధించాను. తరువాత నేను శిరిడి నుండి తెచ్చుకున్న ఊదీ ప్యాకెట్ ఓపెన్ చేసి కొంచం నా నుదిటి మీద, పొట్ట మీద రాసుకొని, మరికొంత నీటిలో కలిపి త్రాగాను. ఆశ్చర్యకరంగా 5 నిమిషాలలో నొప్పి తగ్గిపోయింది. చాలా చాలా ధన్యవాదాలు బాబా.
నేను మరో అనుభవాన్ని కూడా పంచుకోవాలనుకుంటున్నాను.
నేను నిత్యం ఏదో ఒక సాయి వ్రతాన్ని చేస్తూ ఉంటాను. 2013లో సాయి నవ గురువారం వ్రతం మొదలుపెట్టి ఇప్పటికి 6 సార్లు పూర్తి చేశాను. నేనెప్పుడూ వ్రతం మొదలుపెట్టినా ఒక కొబ్బరికాయ, 2 రూపాయి నాణేలు పూజలో ఉంచి వ్రతాన్ని ప్రారంభిస్తాను. తొమ్మిది వారాలు పూర్తయ్యే సమయానికి మా బంధువులుగాని, స్నేహితులుగాని, ఎవరో ఒకరు శిరిడీ వెళ్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా ఆ కొబ్బరికాయని శిరిడీ పంపే అవకాశం నాకు వస్తుంది. అలా నా పూజను బాబా ఆమోదిస్తున్నారని నాకు చాలా సంతోషంగా ఉండేది. ఒకసారి నేను 21 గురువారాల పూజ చేశాను. ఆశ్చర్యంగా చివరి గురువారానికి నేనే శిరిడీకి వెళ్ళాను. స్వయంగా నా చేతులతో ద్వారకామాయిలో బాబా కి కొబ్బరికాయ సమర్పించాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆరోజు వేకువ ఝామున ద్వారకామాయిలోనే కూర్చొని వ్రతానికి సంబందించిన పుస్తకం చదివి వ్రతాన్ని పూర్తి చేశాను. ఆ వ్రతాన్ని నేను జాబ్ విషయంగా చేశాను. వ్రతం నడుస్తూ ఉండగానే నాకు జాబ్ వచ్చింది. శిరిడి నుండి తిరిగి వచ్చిన వెంటనే నేను ఉద్యోగంలో చేరాను. కొబ్బరికాయ రూపంలో నా పూజను బాబా స్వీకరించినందుకు నేను చాలా చాలా ఆనందించాను. రీసెంట్ గా నేను 5 వారాల సాయి సత్యవ్రతం పూర్తి చేశాను. ఆ వారంలో ఒక వాట్సాప్ గ్రూపులో ఎవరైనా శిరిడీ వెళ్తున్నారా అని అడిగాను. బాబా దయవలన ఒక సాయిబంధువు శిరిడీ వెళ్తూ నా కొబ్బరికాయ, దక్షిణ తీసుకొని వెళ్ళడానికి అంగీకరించి, వాటిని తీసుకొని వెళ్లి ద్వారకామాయిలో ఇచ్చారు. ఆ మరుసటిరోజే నాకు ఒక కల వచ్చింది. కలలో నేను బాబా దర్శనం కోసం క్యూలో నిలబడి ఉన్నాను. ఆ కలలో కూడా నేను ఒక కొబ్బరికాయ, పళ్ళు తీసుకొని వెళ్తున్నాను. నేను బాబా దగ్గరకు చేరుకునేసరికి నిజంగానే బాబా సశరీరంతో కూర్చొని ఉన్నారు. అలా బాబాని చూసి నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. నేను కొబ్బరికాయ, పళ్ళు ఇస్తే బాబా తన చేతులతో తీసుకొని, నా చేతిలో కొంచం ఊదీ వేసి "పాపా నాశనః" అని అన్నారు. హఠాత్తుగా నాకు మెలుకువ వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. బాబా నా చిన్న చిన్న పాపాలను తొలగించారని భావించాను. ఏదేమైనా నాకు ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే కల. ఆయన మార్గాలు ఆయనకున్నాయి, అవి ప్రత్యేకమైనవి. నా అనుభవం చదివినందుకు అందరికీ ధన్యవాదాలు.
ఓం సాయిరామ్ ......
Omsairam Sai, it's only shradda that makes you happy all the time. That's Sai. May Sai Baba bless you always
ReplyDelete🕉 sai Ram
ReplyDelete