సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఆర్ధిక సమస్యల పరిష్కారం - మధురమైన శిరిడీ దర్శనం అనుభవాలు....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సుమ. మాది నెల్లూరు. నేను సాయిభక్తురాలినని చెప్పడంలో నాకు చాలా ఆనందం ఉంది. నేను నా అనుభవాలు సాయిబంధువులందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. బాబా! మీరే నా అనుభవాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అయేలాగా నాతో వ్రాయించండి. ఓం సాయిరాం!!!

గత కొద్దికాలంగా మా కుటుంబంలో ఆర్ధిక సమస్యలు ఎక్కువయ్యాయి. వాటి నుండి బయటపడటానికి మాకున్న ఒకే ఒక పరిష్కారమార్గం -  మా ఇంటిని అమ్మడం. కానీ, ప్రస్తుతం మేమున్న ఏరియాలో ధరలు చాలా తక్కువగా ఉండటం వలన మేమనుకున్న ధరకి అమ్మడం చాలా కష్టమైన పని. రోజూ నేను ఇదే విషయం గురించి, "బాబా! మా ఇల్లు మంచి ధరకు అమ్ముడయ్యేలా, మా సమస్యలు తీరేలా చూడండ"ని బాబాను ప్రార్థించేదాన్ని. మా కజిన్ ద్వారా 'నవ గురువారవ్రతం' గురించి తెలుసుకొని, ఇల్లు మంచి ధరకు అమ్మకం కావాలన్న సంకల్పంతో వ్రతాన్ని మొదలుపెట్టాను. దానితో పాటు 'స్తవనమంజరి' చదవడం కూడా ప్రారంభించాను. స్తవనమంజరి చదివిన మొదటిరోజే ఇల్లు కొనడానికి ముగ్గురు వచ్చారు, అయితే ధర విషయంలో కుదరక అది మేము ఒప్పుకోలేదు. ఆ సమయంలో, "బాబా! విజయదశమి లోపల ఎలాగైనా మా ఇల్లు మంచి ధరకి అమ్ముడై, మా ఆర్ధిక  సమస్యలు తీరిపోయి, మేము శిరిడీ వచ్చి మిమ్మల్ని చూడాలి" అని కూడా బాబాని ప్రార్థించాను. నవ గురువార వ్రతం 3 వారాలు పూర్తై, ఇంకా 6 వారాలు ఉంటుండగానే బాబా అద్భుతం చేసి నా కోరికను తీర్చేసారు. మా బంధువుల ద్వారా ఇల్లు మంచి ధరకి అమ్ముడయింది. వాళ్ళు మాకు రావాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ మొత్తం వచ్చేలా చేసారు. నిజంగా బాబానే వాళ్ళ రూపంలో మాకు సహాయం అందించారు. దానితో మా ఆర్థిక ఇబ్బందులు కూడా తీరడంతో మాకు చాలా సంతోషంగా అనిపించింది. "చాలా చాలా కృతఙ్ఞతలు బాబా! వ్రతంలో మిగతా 6 వారాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరే పూర్తయ్యేలా చూడండి బాబా!".

ఇంకో అద్భుతం ఏమిటంటే, నిజానికి మా ఇల్లు కొనుక్కుంటున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ మేము శిరిడీ నుంచి వచ్చిన తరువాత చేద్దామన్నారు. కానీ నాకు మాత్రం ఇల్లు అమ్మకం పూర్తి అయ్యాక ప్రశాంతంగా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలనిపించింది. బాబా చేసిన చమత్కారం చూడండి. మేము శిరిడీ వెళదామనుకున్న రోజు(2018 సెప్టెంబర్ 17) మధ్యాహ్నమే రిజిస్ట్రేషన్ పూర్తై, అదే రోజు సాయంత్రం మేము శిరిడీకి బయలుదేరాము. నిజంగా ఆరోజు నా సంతోషానికి అవధుల్లేవు. ఎందుకంటే బాబా నేను అనుకున్నట్లుగానే ఇంటి సమస్య తీర్చాకే మేము శిరిడీ ప్రయాణమయ్యేలా చేసారు.

మేము శిరిడీ వెళ్ళడానికి రాత్రి నెల్లూరు నుంచి హైదరాబాదుకు బస్సులో బయలుదేరి మరుసటి రోజు ఉదయానికి హైదరాబాదు చేరుకున్నాము. అక్కడ మాకు తెలిసిన వాళ్ళెవరూ లేకపోవడంతో హోటల్లో గది తీసుకుందామని అనుకున్నాము, ఎందుకంటే శిరిడీ బస్సు మళ్ళీ సాయంత్రానికి ఉంది. మాకు హైదరాబాదు కొత్త అవడంతో ఒక ఆటో అతని సహాయంతో మంచి రూమ్ తీసుకున్నాం. అతను మాకు చూపించిన హోటల్ పేరు కూడా సాయి రెసిడెన్సీ. ఆ బాబానే అతని రూపంలో మాకు అలా రూమ్ చూపించారేమో అనుకున్నాము. రాత్రి ప్రయాణమంతా కూర్చొని చేయడం వల్ల అమ్మకి బాగా మోకాళ్ళనొప్పులు వచ్చాయి, అందువల్ల ఆమె చాలా బాధపడుతూ ఉంది. మేము సాయంత్రం శిరిడీకి బుక్ చేసుకున్న బస్సు కూడా కూర్చొని వెళ్ళాల్సిన నార్మల్ బస్సు కావడంతో అమ్మ "ఈ మోకాళ్ళనొప్పులతో మళ్లీ అంతసేపు కూర్చోగలనా?" అని అనుకుంటూ చాలా ఆందోళన పడుతూ ఉంది. కానీ, "అన్నిటికీ బాబా ఉన్నారు, అంతా ఆయన చూసుకుంటార"ని అనుకున్నాము. సాయంత్రం వరకు రూమ్ లో ఉండి బస్సు బయలుదేరే సమయానికి బస్సు ఎక్కాల్సిన చోటుకి చేరుకున్నాము. అప్పుడు బాబా మాకు చాలా పెద్ద అద్భుతమే చూపించారు. మేము ఎక్కాల్సిన బస్సు ఏదో కారణం వలన రద్దయ్యింది. అందువల్ల మమ్మల్ని స్లీపర్ బస్సు ఎక్కించారు. అది కూడా మేము తీసుకున్న మాములు టికెట్ ధరకే! అమ్మ మోకాళ్ళనొప్పితో శిరిడీ వరకు ప్రయాణం చేయలేదని బాబా స్లీపర్ బస్సు ఏర్పాటు చేసారు. ఎంతో అద్భుతమైనది ఆయనకు మనపై ఉన్న ప్రేమ! మరుసటిరోజు శిరిడీ చేరుకునేటప్పటికి అమ్మ మోకాళ్ళనొప్పి చాలావరకు తగ్గిపోయింది. ముందురోజు అసలు నడవలేనంత నొప్పి భరించిన అమ్మ శిరిడీ చేరుకోగానే చాలా మాములుగా మాతోపాటు నడవగలిగింది. అంతా బాబా చేసిన లీల.

ముందుగా అక్కడి క్షేత్ర పాలకుడైన విష్ణుగణపతిస్వామి దర్శనం చేసుకొన్న తరువాత మధ్యాహ్న ఆరతి సమయానికి ఆరతి చూడాలని ఉచిత దర్శనం ద్వారా వెళ్ళాము. కానీ లోపలికి వెళ్ళేలోపే లైన్ ఆపేసారు. అందువలన ఆరతి సమయానికి మేము లైన్ లోనే ఉండాల్సి వచ్చింది. "ఏమిటి  బాబా, ఆరతి చూడాలని ఆరాటంగా వస్తే ఇలా అయ్యింది?" అని నేను చాలా బాధపడ్డాను. ఆరతి జరుగుతున్నంతసేపు సమాధి మందిరంలో బాబా ముందు ఆరతి పాడలేక పోయానని నాకు ఒకటే బాధ. క్యూ లైన్ లో కూర్చోవడానికి వీలుగా బెంచ్ లు ఉండడంతో అమ్మ కూర్చొని ఆరతి పాడుకుంది. ఆరతి అయ్యాక మేము సాయినాథుని దర్శనం చేసుకున్నాం. నిజంగా బాబా రూపాన్ని చూస్తుంటే, అలా బాబాని చూస్తూ ఉండి పోవాలనిపించింది. నేను బాబాకోసం రెండు పాలకోవా ప్యాకెట్లు తీసుకొని వెళ్ళాను కానీ, అక్కడ పూజార్లు తీసుకుంటారో లేదోనని ఆందోళన చెందాను. కానీ బాబా నేను ఇచ్చిన పాలకోవా స్వీకరించారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ బాబా ముందు ఆరతి పాడలేక పోయాననే లోటు అలాగే ఉండిపోయింది. అందుకే మరలా సాయంత్రం ఆరతికి నేను, నాన్న మాత్రమే ఫ్రీ టోకెన్ తీసుకొని వెళ్ళాం. బాబా నా ప్రార్థన విన్నారు. ఈసారి బాబా మమ్మల్ని ఆరతికి అనుమతించారు. నా కోరిక ప్రకారం బాబా ముందు ఆరతి పాడగలిగాను. ఆరతి అయ్యాక ఆలోచిస్తే అర్థమయ్యిందేమిటంటే ఆరతి సమయంలో అందరూ కూర్చోవలసి ఉంటుంది. అమ్మకి మోకాళ్ళ నొప్పులు, అందువలన ఆమె అంతసేపు పద్మాసనం వేసుకొని కూర్చోలేదని బాబాకి తెలుసు, అందుకే మధ్యాహ్నం నేను ఆరతి చూడాలని ఆరాటపడినా అమ్మ ఇబ్బంది దృష్ట్యా మమ్మల్ని క్యూలోనే ఉండేలా చేసారు. ఆయనకు మనపై ఎంతటి శ్రద్ధో! తరువాత నేను, నాన్న బాబా ప్రసన్నరూపాన్ని మరోమారు తృప్తిగా దర్శించుకున్నాము. థాంక్యూ సో మచ్ బాబా! బాబా ఏది చేసినా మన మంచికే చేస్తారు. దానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ మనం అవి అర్థం చేసుకోలేక బాబా మనం కోరుకున్నది ఇవ్వలేదని అనుకుంటాం. మనకి ఏది ఎప్పుడివ్వాలో బాబాకు బాగా తెలుసు. సమయం వచ్చినప్పుడు క్షణం ఆలస్యం కాకుండా అనుగ్రహిస్తారు.

తరువాత రోజు గురువారం కావడంతో నేను సమాధి మందిరం ఆవరణలో సచ్చరిత్ర పారాయణ చేసుకున్నాను. అలాగే స్తవనమంజరి కూడా చదివాను. ఆవిధంగా బాబా నా కోరికలన్నీ తీర్చి నన్ను అనుగ్రహించారు. మీ కృప నా మీద సదా ఉండాలి బాబా! మీ చల్లని చూపు, మీ కరుణ మీ భక్తుల యందు ఎల్లప్పుడూ ఉండాలి బాబా!

ఓం సాయిరామ్!!!

2 comments:

  1. sairam. Sai bandhuvulaku "Sai baba yokka janmadina shubhakankshalu". (september 28, 1835 naadu baba janminchaaru patri graamam lo. yee vivaralu sai swayanga pujya gurudevulu Ammula Sambasiva Rao gariki cheppadam jarigindi.. Om sairam)

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo