సాయి వచనం:-
'ఏ కోరికా లేకుండా శిరిడీకి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు! వాళ్ళు నా అనుమతి అడగాల్సిన అవసరం లేదు!'

'అభయదాయి శ్రీసాయి సదా మనతో ఉన్నారన్న ఎఱుక మనలో ఉన్నంతకాలం మన జీవితాలు దీక్షిత్ ఇంటిలోని పనిపిల్లలా సదా ఆనందడోలికలలో సాగుతాయి' - శ్రీబాబూజీ.

గోపీనాథ్


1914వ సంవత్సరంలో గోపీనాథ్‌కు 11 సంవత్సరాల వయసున్నప్పుడు అతని తండ్రి కోపర్‌గాఁవ్ లోని పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్(పి.డబ్ల్యు.డి)లో పనిచేస్తుండేవాడు. ఒకరోజు తండ్రి తన కొడుకుని శిరిడీ తీసుకెళ్లి బాబా దర్శనం చేయించి, ఆయనకు నమస్కరింపజేద్దామని అనుకున్నాడు. బాబాకు అర్పించడానికి ఒక పూలదండ, కొబ్బరికాయ, కొన్ని నైవేద్యాలను తీసుకొని వాళ్ళు ఎడ్లబండిలో కోపర్‌గాఁవ్ నుండి బయలుదేరారు. ఆ ప్రయాణాన్ని గోపీనాథ్ ఎంతగానో ఆస్వాదించాడు. వాళ్ళు శిరిడీ చేరుకున్నాక చావడి ప్రక్కన ఉన్న ప్రదేశంలో బండి దిగి బాబా దర్శనం కోసం ద్వారకామాయి లోపలికి వెళ్లారు. ఆ సమయంలో బాబా లెండీబాగ్‌కు వెళ్లి ఉన్నారు. అందువలన వాళ్ళు సభామండపం వెలుపల నిలుచొని బాబా రాకకోసం వేచి ఉన్నారు. బాబా లెండీ నుండి ఊరేగింపుగా ద్వారకమాయి వద్దకు రావడం చూసి గోపీనాథ్ ఆశ్చర్యపోయాడు. భక్తులందరితోపాటు వాళ్ళు కూడా బాబాను అనుసరిస్తూ ద్వారకామాయిలోకి వెళ్లారు. ఆరోజు భక్తులు చాలా తక్కువగా ఉండటంతో త్వరగానే బాబా దర్శనానికి వెళ్లే అవకాశం వాళ్ళకి లభించింది. ముందుగా అతని తండ్రి బాబా ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత గోపీనాథ్ సాష్టాంగ నమస్కారం చేస్తుండగా బాబా పరుషమైన పదజాలంతో అరవడం మొదలుపెట్టారు. వాళ్ళిచ్చిన కొబ్బరికాయను విసిరికొట్టారు. తండ్రి వినయంగా నిలుచొని ఉండగా, గోపీనాథ్ మాత్రం భయపడి తండ్రి వెనుక దాక్కున్నాడు. తరువాత వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళబోతున్న సమయంలో అక్కడ కూర్చొని ఉన్న దీక్షిత్, మరికొంతమంది భక్తులు వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్లతో మాట్లాడారు. దీక్షిత్ వాళ్లతో, "బాబా ఎప్పుడూ తమ నిగ్రహాన్ని కోల్పోరు. ఆయన తమ కృపను, ఆశీర్వాదాలను కురిపించాలనుకున్నప్పుడు మాత్రమే తమ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తారు, అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తారు. మీరు, మీ కుమారుడు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఆ పదజాల రూపంలో ఆయన ఆశీస్సులు మీకు ఉన్నాయి. క్షణమాత్రమైనా వాటిని చెడు శకునంగా భావించకండి" అని చెప్పాడు. గోపీనాథ్ ఆ శిరిడీ సందర్శనాన్ని తన జీవితాంతం స్పష్టంగా గుర్తుపెట్టుకున్నాడు.

దీక్షిత్ చెప్పినట్లుగానే బాబా ఆశీస్సులు నిజమయ్యాయి. గోపీనాథ్ తల్వాల్కర్ తన అద్భుతమైన అకాడమిక్ కెరీర్‌తో పూణేలో ప్రసిద్ది చెందాడు. అతను పలు సబ్జెక్టులలో పి.హెచ్.డి లు సంపాదించి పూణే విశ్వవిద్యాలయంలో బోధకునిగా ఉంటూ తన విద్యార్థులకు అవసరమైన మార్గనిర్దేశం చేస్తూ సహాయం చేశాడు. అతను 'ఆనంద్' అనే పిల్లల పత్రికకు ఎడిటరుగా వ్యవహరించాడు. పూణే ఆకాశవాణిలో వచ్చే పిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. జీవితంలో తను సాధించిన విజయానికి కారణం శిరిడీ వెళ్ళిన ఆ అద్భుతమైన రోజున వింతైన రీతిలో బాబా ఇచ్చిన ఆశీస్సులేనని అతను చెప్పేవాడు.

సమాప్తం. 

రెఫ్: శ్రీ సాయిలీలా పత్రిక; వాల్యూమ్-67, నం-10, జనవరి 1989.
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.

4 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌸🥰🌺🤗🌹

    ReplyDelete
  2. సాయినాథ మా అనారోగ్యాలను రూపుమాపి నిర్మూలించి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి మీ గొప్ప మహిమలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకోడానికి మీ గొప్ప ఆశీస్సులు మాకు అందించండి సాయినాధ సేవ చేసుకుంటాం..

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo