సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 313వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబా నుండి పొందిన షరతులు లేని ప్రేమ - రెండవ భాగం 

వివాహం - వైవాహిక జీవితంలో బాబా సహాయం

మధ్యతరగతి అమ్మాయిలందరిలానే నేను కూడా పెళ్ళీడులో చాలా భావోద్వేగాలకు లోనయ్యాను. తల్లిదండ్రుల నుండి ఎంతో ప్రేమను పొందే పిల్లలు, తమ తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లిచేసి స్థిరమైన జీవితం ఇవ్వడానికి బాధపడటం ఊహించడానికే కష్టమైనది. కులాన్ని బట్టి వివాహం చాలా ఖరీదైనదనే నిజం జీర్ణించుకోలేనిది. నాన్న ఆ సమయంలో వ్యాపారంలో భారీ నష్టాల్లో ఉన్నారు. అయితే బాబా కృపవలన నాన్న స్నేహితులలో ఒకరు వివాహసమయానికి కాస్త ముందుగా డబ్బు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అతనిపై నమ్మకంతో మేము నిశ్చితార్థం, వివాహం అన్నీ నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. హఠాత్తుగా అతనికి చాలా చేదు పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక అతనినుండి ఎటువంటి సహాయం పొందలేమని మేము అర్థం చేసుకున్నాము. నా తల్లిదండ్రులకు అది చాలా కష్టకాలం. పెళ్లితేదీ దగ్గరపడుతున్న సమయంలో అమ్మతో మాట్లాడుతూ నాన్న కన్నీళ్ళు పెట్టుకున్నారు. మొదటిసారి నేను ఆయన కళ్ళలో కన్నీళ్లు చూశాను. తట్టుకోలేక వెళ్లి బాబాముందు ఏడుస్తూ, "నా తల్లిదండ్రులు ఇటువంటి పరిస్థితిలో ఉండటం చూడలేకపోతున్నాను. వాళ్ళు దీనినుండి బయటపడేలా అనుగ్రహించండి బాబా" అని ప్రార్థించాను. తరువాత, నా తల్లిదండ్రులు ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే నేను ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ వున్నాను. రాత్రి 11 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దం. తలుపు తీసి చూస్తే నాన్న స్నేహితుడు! అతను నాన్నకు బ్యాగుతో డబ్బులు ఇస్తూ, "నేను మీకు వాగ్దానం చేసాను. ఇంతటి క్లిష్టపరిస్థితులలో ఉన్నప్పటికీ నేను నామాట ఎప్పటికీ తప్పను" అని నావైపు చూస్తూ, "నేను పెళ్లికి హాజరు కాకపోవచ్చు. కానీ, నా ఆశీస్సులు నీకు ఉంటాయమ్మా" అని చెప్పి వెళ్ళిపోయారు. 'అతని రూపంలో మాకు సహాయం చేస్తోంది బాబా తప్ప మరెవరో కాదు' అనుకున్నాను. 

అసలు కథ వివాహం తరువాతే మొదలవుతుంది. అత్తమామల ఇష్టప్రకారం మనల్ని మనం మార్చుకోవడం అంత సుళువేమీ కాదు. అప్పటివరకు జీవితంలో మనం విశ్వసించిన, ప్రేమించిన వ్యక్తులు అంటే తల్లిదండ్రులతో ఏమీ పంచుకోలేము, పంచుకుని వాళ్ళని బాధపెట్టలేము. అలాగే నేను నా చుట్టూ ఉన్న వ్యక్తులతో చాలా కలత చెందుతూ ఉండేదాన్ని. కనీసం ఒక పనిమనిషిని, జంతువును చూసినట్లు కూడా నన్ను చూసేవారు కాదు. నాలో నేనే కుమిలిపోతూ ఉండేదాన్ని. ఆ కష్టంలో బాబానే నాకు తోడుగా ఉంటూ, "మౌనంగా, ప్రశాంతంగా ఉండు, నీకు కావలసిందల్లా సహనం" అని బోధించారు. దాంతో నన్ను నేను కొన్ని సంవత్సరాలు చీకటిలో బంధించుకున్నాను. ఇప్పుడు కుటుంబంలో అందరూ నన్ను ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేను అదే కుటుంబంలో ఉంటూ వాళ్ళ ప్రేమను, గౌరవాన్ని పొందుతున్నాను. ఒకవేళ ఆ రోజుల్లో నేను కటువుగా స్పందించినట్లైతే ఎలా వుండేదన్నది నేను అస్సలు ఊహించలేను. నాలాంటి వేలాది అనుభవాలు ఉంటాయని నాకు తెలుసు. 'చేసేవాడు బాబానే' అని హృదయపూర్వకంగా మీరు నమ్మితే, అన్నీ లభిస్తాయి.

బాబా సూచన


ఒకరోజు ఉదయం నేను పనిలో హడావిడిగా ఉన్నాను. మావారు కూడా హడావిడిపడుతూ స్నానం చేయడానికి వెళ్లారు. నేను ఉప్మా తయారుచేసి స్టవ్ మీద నుండి వేడివేడి ఉప్మాను ఒక గిన్నెలో వేసి బాబాకు పెట్టాను. ఆ ఉప్మా నుండి వస్తున్న ఆవిరి కారణంగా బాబా విగ్రహం యొక్క ఎడమ పైభాగంలో నీటి బుడగలు ఏర్పడ్డాయి. అది చూసిన నేను, “అయ్యో.. బాబా! ఈ ఆవిరివల్ల మీకు గాయమైందా? అలా జరగకూడదే! ఎందుకంటే, ఉడుకుతున్న పాత్రలో మీరు చేతులుపెట్టి కలిపారు, అప్పుడు ఏమీ కాలేదు. అలాంటిది ఈ ఆవిరి కారణంగా ఎలా గాయమైంది?" అని బాబాతో మాట్లాడుతున్నాను. ఇంతలో మావారు స్నానం చేసి బాత్‌రూమ్ నుండి బయటకు వచ్చి, కంగారులో చాలా వేడినీటిని పోసుకున్నందున తీవ్రంగా గాయపడ్డానని నాతో చెప్తూ, తన ఎడమ భుజం పైభాగం చూపించారు. బాబా విగ్రహానికి ఏచోటయితే ఆవిరి బుడగలు కనిపించాయో అదేచోట మావారికి జరగడంతో నేను నిర్ఘాంతపోయాను. వెంటనే బాబా వద్దనుండి ఆ ఉప్మా గిన్నెను తీసేశాను. ప్రతి పరిస్థితిలో బాబా నాతో మాట్లాడుతున్నారంటే కాదనలేని నిజం! 'ఓం సాయిరామ్!' నా జీవితంలో ఇలా చాలా అనుభవాలు జరిగాయి. నిజంగా బాబా నన్ను ఆశీర్వదిస్తున్నారు. నేను ప్రతి అనుభవాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. బాబా స్ఫురింపజేసిన వాటిని నేను వ్రాస్తాను.

రేపటి భాగంలో నా అనుభవాలు మరికొన్ని పంచుకుంటాను ....


3 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo