సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 326వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఆశీస్సులతో నెరవేరిన చిన్ననాటి కల
  2. బాబా నా కోరిక మన్నించారు

బాబా ఆశీస్సులతో నెరవేరిన చిన్ననాటి కల

పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను మధ్యప్రదేశ్‌లో నివాసముంటున్న ఒక చిన్న సాయిభక్తురాలిని. ఎంతోమంది సాయిభక్తుల అనుభవాలు చదివే అవకాశాన్ని కలిపిస్తూ బ్లాగ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ చాలా కృతజ్ఞతలు. ఈ సాయికుటుంబంలోని ప్రతి భక్తుణ్ణీ బాబా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

నా అనుభవం కేవలం ఒక అనుభవం మాత్రమే కాదు, బాబా ఆశీస్సులతో నెరవేరిన నా చిన్ననాటి కల. మాది మధ్యతరగతి కుటుంబం. మేము ఎప్పటికీ ఒక మంచి ఇంటిని కొనుగోలు చేయలేము. కానీ మాకూ సొంతిల్లు కావాలన్నది మా కల. మేము శిరిడీ వెళ్ళి వచ్చిన తరువాత బాబా కృపతో మా కల సార్థకమయ్యే ఒక ఒప్పదం చేశాము. అయితే అంత పెద్ద మొత్తాన్ని ఏర్పాటు చేయడం దాదాపు అసాధ్యం. కానీ ఆ విషయంలో కూడా బాబా మాకు మార్గం చూపించారు. బాబా ఆశీస్సులతో మాకు సరైన ఆఫర్ వచ్చింది. అయితే తరువాత అంత ప్రశాంతంగా సాగలేదు. అకస్మాత్తుగా నా తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. డబ్బంతా అందులో ఖర్చు అయిపోయింది. అది మా జీవితాలలో చాలా చెడు దశ. బహుశా బాబా మమ్మల్ని పరీక్షించారేమో! అంతలో ఇంటి ఒప్పందానికి సంబంధించిన చివరి తేదీ వచ్చింది. మేము డబ్బు ఏర్పాటు చేయలేకపోయాము. మేము పూర్తిగా ఆశను కోల్పోయాము. కానీ బాబాపై విశ్వాసాన్ని కోల్పోలేదు. ఒకవైపు మా ప్రయత్నాలు మేము చేస్తూ, మరోవైపు "సహాయం చేయమ"ని సాయిని ప్రార్థిస్తూ, సచ్చరిత్ర పారాయణ చేశాము. బాబా మమ్మల్ని నిరాశపరచలేదు. అంత డబ్బును ఏర్పాటు చేస్తామనే ఆశ ఏమాత్రం లేని దశలో మా బంధువులిద్దరి ద్వారా బాబా మాకు ఆర్థిక సహాయాన్ని అందించారు. వెంటవెంటనే మేము రిజిస్ట్రేషన్ పూర్తి చేశాము. "మా విధిలో లేనిదాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!" మా ఇంటికి 'సాయి కృప' అని పేరు పెట్టుకున్నాము. ఎందుకంటే, ఇది మాకు బాబా ప్రసాదం. తరువాత సంవత్సరంలోపు బాబా ఆశీస్సులతో మా బంధువుల రుణాన్ని తిరిగి చెల్లించగలిగాము. మరోసారి సాయితల్లికి నా ధన్యవాదాలు. "బాబా! దయచేసి మీ పిల్లలందరినీ ఇలాగే ఆశీర్వదించండి. మేము నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాము".

బాబా నా కోరిక మన్నించారు

ఓం శ్రీ సాయిరామ్! నా పేరు వల్లి. నేను విశాఖపట్నం నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు నా ప్రణామములు. బాబా నా జీవితంలో చాలా అద్భుతాలు చేస్తున్నారు. వాటిని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో చాలాసార్లు పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవాన్ని పంచుకుంటాను. మా సొంత ఊరిలో రామాలయ నిర్మాణం జరిగింది. దానికి విరాళంగా కొంత డబ్బు ఇవ్వాలనుకున్నప్పుడు బాబా ఎలా సహాయం చేశారో ఇంతకుముందు నా అనుభవంలో మీతో పంచుకున్నాను. బాబా దయవలన ఆ ఆలయ నిర్మాణం సజావుగా సాగి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం నిర్ణయించారు. ఆ కార్యక్రమానికి ఊరిలోని ఆడపడుచులందరినీ రమ్మని ఆహ్వానించారు. అయితే నెలసరి సమస్య కారణంగా నేను ఆ కార్యక్రమానికి వెళ్ళలేనేమోనని చాలా బాధపడ్డాను. ఆ స్థితిలో నేను బాబాతో, "సాయీ! ఈ సమస్యను మీకే వదిలేస్తున్నాను. ఎలాగైనా నేను ఆ కార్యక్రమానికి వెళ్లేలా అనుగ్రహించండి" అని చెప్పుకున్నాను. నా సాయి నన్ను నిరుత్సాహపరచలేదు. ఆయన నాకు నెలసరి సమస్య లేకుండా చేసి నేను కుటుంబంతోపాటు వెళ్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఎప్పుడూ ఇలాగే మీ ప్రేమ మా మీద ఉండాలని కోరుకుంటున్నాను".


2 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo