సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 321వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబా అనుగ్రహంతో కలల కంపెనీలో ఉద్యోగం

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను 25 ఏళ్ల మహిళను. నేనొక ఐటి సంస్థలో పనిచేస్తున్నాను. నేను చిన్నప్పటినుండి బాబాకు గొప్ప భక్తురాలిని. నన్ను నా కలల కంపెనీలో బాబా ఎలా చేర్చారో నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

నేను ఇంతకుముందు పనిచేస్తున్న సంస్థ నుండి బయటకొచ్చి వేరే సంస్థలో చేరాలని అనుకున్నాను. అందుకు తగ్గట్టు 2018 ప్రారంభం నుండి నేను వివిధ సంస్థలకు దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించాను. అయితే నాకొక కలల కంపెనీ ఉంది. అందులో ఉద్యోగం చేయాలని నాకు చాలా ఆశ. ఆ సంస్థకు సంబంధించిన ఉద్యోగ ప్రకటన చూసినప్పుడల్లా నేను దరఖాస్తు చేస్తూ ఉండేదాన్ని. కానీ ఒక్కసారి కూడా నాకు ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వచ్చేది కాదు. ఇలా కాదని ఒకసారి ఆ సంస్థ ఉద్యోగ ప్రకటన చూశాక నేను నేరుగా ఆ సంస్థ కార్యాలయానికి వెళ్ళాను. కానీ వాళ్ళు, 'రిక్రూటర్ వద్ద నుండి మెయిల్ నిర్ధారణ తప్పనిసరి' అని చెప్పి నన్ను లోపలికి కూడా అనుమతించలేదు. నేను నిరాశతో తిరిగి వచ్చాను. ఇదిలా ఉంటే, నేను నా ప్రయత్నాలలో వేరొక సంస్థ ఉద్యోగానికి ఎంపికయ్యాను. కానీ జీతం కారణంగా నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. ఇలా నేను అనుకున్నట్లు సంస్థ మారకుండానే సంవత్సరం గడిచిపోయింది.

2019 ఆరంభమవుతూనే నేను బాబా ఆశీస్సులతో మహాపారాయణ బృందంలో చేరాను. అప్పటినుండి ప్రతి గురువారం పారాయణ చేస్తున్నాను. 2019 ఫిబ్రవరిలో నేను ఒక సంస్థ ఇంటర్వ్యూకి వెళ్లాను. అందులో నేను ఎంపికయ్యాను. వాళ్ళు నాకు మంచి జీతం ఇస్తానని అన్నారు. అదేరోజు సాయంత్రం నా కలల కంపెనీ నుండి మరుసటిరోజు ఇంటర్వ్యూకి హాజరుకమ్మని ఫోన్ కాల్ వచ్చింది. నేను పట్టలేని ఆనందంతో ఇంటర్వ్యూకి హాజరయ్యాను. కానీ ఇంటర్వ్యూలో నేను సరిగా ఆన్సర్ చేయనందున ఎంపిక కాలేకపోయాను. ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కలల కంపెనీ ఇంటర్వ్యూలో అలా జరిగేసరికి నేను చాలా నిరాశ చెందాను. తరువాత నా చేతిలో వేరే కంపెనీ ఆఫర్ ఉన్నందున, నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాను. అయితే 3 నెలల నోటీసు పీరియడ్ ఉండటం వలన అక్కడే నా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాను.

మార్చిలో నా కలల కంపెనీ నుండి నాకు మళ్ళీ ఇంటర్వ్యూ కోసం కాల్ వచ్చింది. అయితే ఈసారి 'ప్రొడక్షన్ సపోర్ట్ రోల్' కోసం. ఈ ఉద్యోగానికి వేర్వేరు షిఫ్టుల్లో పనిచేయాలి. అంతేకాకుండా వారాంతంలో కూడా పనిచేయాలి. అందువలన మొదట నేను ఇంటర్వ్యూకి హాజరయ్యే విషయంలో సంశయించాను. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం నాకు ఇష్టంలేక ఇంటర్వ్యూకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్లుగానే నేను ఇంటర్వ్యూకి హాజరై బాబా స్మరణ చేస్తూ గడిపాను. ఈసారి నేను నా కలల కంపెనీలో అన్ని రౌండ్లు విజయవంతంగా పూర్తిచేశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా జీతానికి సంబంధించి హెచ్‌.ఆర్.తో చర్చ కోసం వేచి ఉండగా, ఆమె మరుసటిరోజు పిలుస్తానని సమాచారం ఇచ్చింది. అదేరోజు సాయంత్రం నేను బాబా మందిరానికి వెళ్లి, బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మరుసటిరోజు హెచ్‌.ఆర్. కాల్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూశాను, కానీ కాల్ రాలేదు. నేను మరో రెండురోజులు చూశాక మెయిల్స్ పంపించాను, దానికి కూడా స్పందన లేదు. గురువారంనాడు నేను నిరాశతో బాబా ముందు 'నాకీ కంపెనీలో ఉద్యోగం వస్తుందా, రాదా?' అని చీటీలు వేశాను. బాబా నుండి సమాధానంగా 'రాదు' అని వచ్చింది. నేను నిరాశకు గురయ్యాను. కానీ, నాకోసం బాబా ప్రణాళికలు వేరుగా ఉండవచ్చని అనుకున్నాను. ఆ తరువాత హెచ్.ఆర్ నాకు బదులుగా వేరే వ్యక్తిని తీసుకున్నామని సమాచారం ఇచ్చారు.

2019 ఏప్రిల్ చివరినాటికి నేను నా 3 నెలల నోటీసు పీరియడ్‌లోని చివరి రోజులలో ఉన్నాను. ఒక వారంలో కొత్త కంపెనీలో చేరబోతున్నాను. ఆశ్చర్యకరంగా ఆ సమయంలో నా కలల కంపెనీ నుండి మళ్ళీ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సాధారణంగా ఐటి పరిశ్రమలో వరుసగా మూడు నెలలు, అది కూడా రెండుసార్లు తిరస్కరించినవాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం చాలా అరుదు. ఇది బాబా చేసిన అద్భుతమని నేను గట్టిగా నమ్ముతాను. ఆ వారంలో చివరిసారిగా నేను మరోసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను అన్ని రౌండ్లు విజయవంతంగా పూర్తిచేశాను. జీతానికి సంబంధించిన చర్చ కూడా పూర్తయింది. తరువాత నేను బాబా ముందు 'ఈసారైనా నాకు నా కలల కంపెనీలో ఉద్యోగం వస్తుందా?' అని చీటీలు వేశాను. ఈసారి బాబా సమాధానం సానుకూలంగా వచ్చింది. తరువాత వారంలోపు చాలా మంచి జీతంతో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఆ క్షణాన నేను అంతులేని ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సాధారణంగా, ఈ సంస్థ ఆఫర్ లెటర్ విడుదల చేయడానికి 15 నుండి 30 రోజులు పడుతుంది. అలాంటిది నాకు వారంలోనే రావడం బాబా అనుగ్రహమే. ఈ సంఘటన నా జీవితంలో బాబా చేసిన అతి పెద్ద అద్భుతాలలో ఒకటి.

సరైన సమయంలో బాబా మన కోరికలు నెరవేరుస్తారని నాకు ఇప్పుడు అర్థమైంది. కొన్నిసార్లు మనకు కావలసింది లభించకపోయినా మనం నిరాశకు గురికాకూడదు. ఎందుకంటే, అది అనుగ్రహించేందుకు సరైన సమయమేదో బాబాకు తెలుసు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2549.html?m=0


2 comments:

  1. Sai baba! Bless me with Job in my dream company!🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹 🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo